Tuesday, 25 August 2020

వీరభద్ర జయంతి

 

శివ మహా పురాణం లో వీరభద్రుని ప్రస్తావన :

అథ ఏకవింశో%ధ్యాయః

భద్రగణములు దక్షయజ్ఞములో బీభత్సమును సృష్టించుట

వాయురువాచ |

తతస్త్రి దశముఖ్యాస్తే విష్ణుశక్రపురోగమాః | సర్వే భయపరిత్రస్తా దుద్రువుర్భయవిహ్వలాః || 1

నిజైరదూషితైరంగైర్దృష్ట్వా దేవానపద్రుతాన్‌ | దండ్యానదండితాన్మత్వా చుకోప గణపుంగవః || 2

తతస్త్రి శూలమాదాయ శర్వశక్తినిబర్హణమ్‌ | ఊర్ధ్వదృష్టిర్మహాబాహుర్ముఖాజ్జ్వాలాస్సముత్సృజన్‌ || 3

అమరానపి దుద్రావ ద్విరదానివ కేసరీ | తానభిద్రవతస్తస్య గమనం సుమనోహరమ్‌ || 4

వారణస్యేవ మత్తస్య జగామ ప్రేక్షణీయతామ్‌ | తతస్తత్‌ క్షోభయామాస మహత్సురబలం బలీ || 5

మహాసరోవరం యద్వన్మత్తో వారణయూధపః | వికుర్వన్‌ బహుధా వర్ణాన్నీలపాండరలోహితాన్‌ || 6

బిభ్రద్వ్యాఘ్రాజినం వాసో హేమప్రవరతారకమ్‌ | ఛిందన్‌ భిందన్నుద క్లిందన్‌ దారయన్‌ ప్రమథన్నపి || 7

వ్యచరద్దేవసంఘోషు భద్రో %గ్నిరివ కక్షగః | తత్ర తత్ర మహావేగాచ్చరంతం శూలధారిణమ్‌ || 8

తమేకం త్రిదశాస్సర్వే సహస్రమివ మేనిరే | భద్రకాలీ చ సంక్రుద్ధా యుద్ధవృద్ధమదోద్ధతా || 9

ముక్తజ్వాలేన శూలేన నిర్బిభేద రణ సురాన్‌ | సతయా రురుచే భద్రో రుద్రకోపసముద్భవః || 10

ప్రభ##యేవ యుగాంతాగ్నిశ్చలయా ధూమధూమ్రయా | భద్రకాలీ తదా యుద్ధే విద్రుతత్రిదశా బభౌ || 11

కల్పే శేషానలజ్వాలాదగ్ధవిశ్వజగద్యథా | తదా సవాజినం సూర్యం రుద్రాన్‌ రుద్రగణాగ్రణీః || 12

భద్రో మూర్ధ్ని జఘానాశు వామపాదేన లీలయా | ఆసిభిః పావకం భద్రః పట్టిశైస్తు యమం యమీ || 13

వాయువు ఇట్లు పలికెను -

అపుడు విష్ణువు, ఇంద్రుడు మొదలైన ఆ దేవప్రముఖులు అందరు భయభీతులై కంగారుపడి పారిపోయిరి (1). తమ అవయవమలు ఏవియు చెక్కు చెదరకుండగనే దేవతలు పారపోవుచుండుటను గాంచి, గణాధ్యక్షుడగు వీరభద్రుడు శిక్షార్హులకు శిక్ష పడుట లేదని భావించి, కోపించెను (2). అపుడు గొప్ప బాహువులు గల వీరభద్రుడు సర్వలయకరుడగు రుద్రుని శక్తిని ప్రతిఫలించే త్రిశూలమును తీసుకొని, పైకి చూస్తూ నోటినుండి నిప్పులను గ్రక్కుచూ (3), సింహము ఏనుగులను వలె దేవతలను తరిమి గొట్టెను. పారిపోవుచున్న వారి వెనుక పరుగెత్తుచున్న ఆ వీరభద్రుని పరుగు మదించిన ఏనుగుయొక్క పరుగు వలె చాల సుందరముగా, మనోహరముగా నుండెను. తరువాత బలశాలియగు వీరభద్రుడు నీలము బూడిద రంగు మరియు ఎరుపు రంగుల కాంతులను వెదజల్లుతూ, ఏనుగుల గుంపునకు నాయకుడగు మహాగజము పెద్ద సరస్సును వలె, ఆ విశాలమైన దేవసైన్యమును కల్లోలపరచెను. బంగారముతో మరియు ముత్యములతో ప్రకాశించే పెద్దపులి చర్మమును వస్త్రముగా ధరించియున్న వీరభద్రుడు దేవతల గుంపులయందు నరుకుతూ, పగులగొడుతూ, రక్తధారలతో తడుపుతూ, చీల్చుచూ, పచ్చడి చేయుచూ, ఎండుగడ్డిని తగులబెట్టే అగ్నిహోత్రము వలె సంచరించెను. శూలమును చేతబట్టి అక్కడక్కడ మహావేగముతో సంచరించుచున్న వీరభద్రుడు ఒక్కడే అయిననూ, దేవతలకు వేయిమంది వీరభద్రులు ఉన్నట్లుగా కన్పట్టెను. అతిశయించిన బలగర్వముచే యుద్ధము కొరకు ఉరుకులు పెట్టుచున్న భద్రకాళి కూడ నిప్పులు గ్రక్కే శూలముతో యుద్దమునందు దేవతలను చీల్చి చెండాడెను. రుద్రుని కోపమునుండి పుట్టిన వీరభద్రుడు భద్రకాళితో గూడి, చంచలము మరిము పొగతో కప్పబడి బూడిద రంగును కలిగియున్నది అగు జ్వాలతో ప్రకాశించే ప్రళయకాలాగ్ని వలె శోభిల్లెను. ఆ సమయములో యుద్ధములో దేవతలను తరిమి గొట్టిన భద్రకాళి కల్పాంతమునందు జగత్తునంతనూ తగులబెట్టే ఆదిశేషుని విషాగ్నిజ్వాలవలె ప్రకాశించెను. రుద్రగణములలో అగ్రేసరుడగు వీరభద్రుడు ఆ సమయములో గుర్రములతో సహా సూర్యుని మరియు రుద్రులను శీఘ్రముగా ఎడమకాలితో అవలీలగా తన్నెను. జితేంద్రియుడగు వీరభద్రుడు కత్తలతో అగ్నిని, పట్టిశములతో యముని కొట్టెను (4 -13).

రుద్రాన్‌ దృఢేన శూలేన ముద్గరైర్వరుణం దృఢైః | పరిఘైర్నిరృతం వాయుం టంకైష్టంకధరస్స్వయమ్‌ || 14

నిర్బిభేద రణ వీరో లీలయైవ గణశ్వరః | సర్వాన్‌ దేవగణాన్‌ సద్యో మునీన్‌ శంభోర్విరోధినః || 15

తతో దేవస్సరస్వత్యా నాసికాగ్రం సుశోభనమ్‌ | చిచ్ఛేద కరజాగ్రేణ దేవమాతుస్తథైవ చ || 16

చిచ్ఛేద చ కుఠారేణ బాహుదండం విభావసోః | అగ్రతో ద్వ్యంగులాం జిహ్వాం మాతుర్దేవ్యా లులావ చ || 17

స్వాహాదేవ్యాస్తథా దేవో దక్షిణం నాసికాపుటమ్‌ | చకర్త కరజాగ్రేణ వామం చ న్తనచూచుకమ్‌ || 18

భగస్య విపులే నేత్రే శతపత్రసమప్రభే | ప్రసహ్యోత్పాటయామాస భద్రః పరమవేగవాన్‌ || 19

పూష్ణో దశనరేఖాం చ దీప్తాం ముక్తావలీమివ | జఘాన ధనుషః కోట్యా స తేనాస్పష్టవాగభూత్‌ || 20

తతశ్చంద్రమసం దేవః పాదాంగుష్ఠేన లీలయా | క్షణం కృమివదా క్రమ్య ఘర్షయామాస భూతలే || 21

శిరశ్చిచ్ఛేద దక్షస్య భద్రః పరమకోపతః | క్రోశంత్యామేవ వీరిణ్యాం భద్రకాల్యై దదౌ చ తత్‌ || 22

తత్ర్పహృష్టా సమాదాయ శిరస్తాలఫలోపమమ్‌ | సా దేవీ కందుకక్రీడాం చకార సమరాంగణ || 23

ఆయన గట్టి శూలముతో రుద్రులను, గట్టి ముద్గరములతో వరుణుని, పరిఘలతో నిరృతిని, స్వయముగా గొడ్డళ్లను చేతపట్టి వాటితో వరుణుని కొట్టెను (14). వీరుడగు ఆ గణాధ్యక్షుడు యుద్ధములో సమస్తదేవతాగణములను మరియు శంభునకు విరోధులగు మునులను వెనువెంటనే అవలీలగా దనుమాడెను (15). ఇంతేగాక, తరువాత ఆ వీరభద్రదేవుడు దేవతలకు తల్లియగు సరస్వతియొక్క మిక్కిలి అందమైన ముక్కు కొనను వ్రేలిగోటితో త్రుంచి వేసెను (16). అతడు అగ్నియొక్క దండమువంటి చేతిని గొడ్డలితో నరికెను. దేవమాతయగు అదితియొక్క నాలుకను కొనలో రెండు అంగుళములను అతడు త్రుంచివేసెను (17). ఇంతే గాక, ఆ వీరభద్రదేవుడు స్వాహాదేవియొక్క కుడి ముక్కుపుటమును, ఎడమ స్తనాగ్రమును వ్రేలిగోటితో దునిమి వేసెను (19). ఆయన పూషమొక్క ముత్యాల వరుస వలె ప్రకాశించే దంతముల వరుసను ధనస్సుయొక్క అగ్రభాగముతో పగులగొట్టగా, ఆ కారణముగా అతని పలుకులలో స్పష్టత లోపించెను (20). తరువాత వీరభద్రదేవుడు కాలి బొటన వ్రేలితో అవలీలగాక్షణకాలముతో చంద్రుని పురుగును వలె తొక్కి పెట్టి నేలపై రాపాడించెను (21) వీరిణి (దక్షుని భార్య) ఆక్రోశించుచుండగా, వీరభద్రుడు మహాకోపముతో దక్షుని తలను దునుమాడి, దానిని భద్రకాళికిచ్చెను (22). ఆ దేవి మహానందముతో తాటిపండువంటి ఆ తలను తీసుకొని యుద్ధరంగములో బంతులాటను ఆడెను (23).

తతో దక్షస్య యజ్ఞస్త్రీ కుశీలా భర్తృభిర్యథా | పాదాభ్యాం చైవ హస్తాభ్యాం హన్యతేస్మ గణశ్వరైః || 24

అరిష్టనేమినం సోమం ధర్మం చైవ ప్రజాపతిమ్‌ | బహుపుత్రం చాంగిరసం కృశాశ్వం కాశ్యపం తథా || 25

గలే ప్రగృహ్య బలినో గణపాస్సింహవిక్రమాః | భర్త్సమంతో భృశం వాగ్భిర్నిజఘ్నుర్మూర్ధ్ని ముష్టిభిః || 26

ధర్షితా భూతవేతాలైర్దారాస్సుతపరిగ్రహాః | యథా కలియుగే జారైర్బలేన కులయోషితః || 27

తచ్చ విధ్వస్తకలశం భగ్నయూపం గతోత్సవమ్‌ | ప్రదీపితమహాశాలం ప్రభిన్నద్వారతోరణమ్‌ || 28

ఉత్పాటితసురానీకం హన్యమానతపోధనమ్‌ | ప్రశాంతబ్రహ్మనిర్ఘోషం ప్రక్షీణ జనసంచయమ్‌ || 29

క్రందమానాతురస్త్రీ కం హతాశేషపరిచ్ఛదమ్‌ | శూన్యారణ్య నిభం జజ్ఞే యజ్ఞవాటం తదా ర్దితమ్‌ || 30

శూలవేగప్రరుగ్ణాశ్చ భిన్నబాహూరువక్షసః | వినికృత్తోత్తమాంగాశ్చ పేతురుర్వ్యాం సురోత్తమాః || 31

హతేషు తేషు దేవేషు పతితేషు సహస్రశః | ప్రవివేశ గణశానః క్షణాదాహవనీయకమ్‌ || 32

తరువాత దక్షుని భార్యయగు సోమిదేవమ్మను, దుష్టమగు శీలము గలభార్యలను భర్తలు వలె, గణాధ్యక్షులు కాళ్లతో మరియు చేతులతో కొట్టిరి (24). బలవంతులు, సంహము యొక్క పరాక్రమము గలవారు నగు గణాధ్యక్షులు అరిష్టనేమిని, చంద్రుని, ధర్మప్రజాపతిని, అనేక పుత్రులు గల అంగిరసుని, కృశాశ్వుని మరియు కాశ్యపుని కంఠమునందు పట్టుకొని లాగి పరుషమగు వాక్కులతో భయపెడుతూ, తలపై పిడికిళ్లతో మోదిరి (25). కలియుగమునందు విటులు కులస్త్రీలను బలాత్కరించు విధముగనే, భూతములు మరియు వేతాళములు భార్యలను మరియు కోడళ్లను బలాత్కరించిరి (26). పగులగొట్టబడిన కలశమలు గలది, విరుగగొట్ట బడిన యూపములు గలది, నశించిన పండుగ వాతావరణము గలది, తగులబెట్టబడిన ప్రధానశాల గలది, విరుగగొట్టబడిన ద్వారములు ఆర్చీలు గలది, పెకిలంచి వేయబడిన దేవబృందములు గలది, చితకగొట్టబడిన తపశ్శాలురు గలది, సద్దు మణిగిన వేదఘోషలు గలది, చల్లారిన జనసమ్మర్దము గలది, పీడింపబడుచున్న స్త్రీల ఆక్రందనలతో నిండినది, పాడుచేయబడిన సకలసామగ్రి గలది అగు ఆ యజ్ఞవాటిక పీడకు గురియై అరణ్యము వలె శూన్యముగా నుండెను (27-30). శూలముచే వేగముగా పొడువబడిన నరుకబడిన చేతులు మరియు వక్షఃస్థలములు గలవారు, పెరికివేయబడిన తలలు గలవారు అగు దేవశ్రేష్ఠులు నేలపై పడియుండిరి (31). ఆ దేవతలు వేల సంఖ్యలో సంహరించబడి నేలపై బడియుండగా, క్షణకాలములో గణాధ్యక్షుడగు వీరభద్రుడు ఆహవనీయాగ్ని (హోమములను ప్రధానముగా చేసే అగ్ని; మూడు అగ్నులలో ఒకటి) వద్దకు వచ్చెను (32).

ప్రవిష్టమథ తం దృష్ట్వా భద్రం కాలాగ్నిసన్నిభమ్‌ | దుద్రావ మరణాద్భీతో యజ్ఞో మృగవపుర్ధరః || 33

స విస్ఫార్య మహచ్చాపం దృఢజ్యాఘోషభీషణమ్‌ | భద్రస్తమభిదుద్రావ విక్షిపన్నేవ సాయకాన్‌ || 34

ఆకర్ణపూర్ణమాకృష్టం ధనురంబుదసన్నిభమ్‌ | నాదయామాస చ జ్యాం ద్యాం ఖం చ భూమిం చ సర్వశః || 35

తముపశ్రుత్య సన్నాదం హతో%స్మీత్యేవ విహ్వలమ్‌ | శరణార్ధేన వక్రేణ స వీరో ధ్వరపూరుషమ్‌ || 36

మహాభయస్ఖలత్పాదం వేపంతం విగతత్విషమ్‌ | మృగరూపేణ ధావంతం విశిరస్కం తదా %కరోత్‌ || 37

తమీదృశమవజ్ఞాతం దృష్ట్వావై సూర్యసంభవమ్‌ | విష్ణుః పరమసంక్రుద్ధో యుద్ధాయాభవదుద్యతః || 38

తమువాహ మహావేగాత్‌ స్కంధేన నతసంధినా | సర్వేషాం వయసాం రాజా గరుడః పన్నగాశనః || 39

దేవాశ్చ హతశిష్టా యే దేవరాజపురోగమాః | ప్రచక్రుస్తస్య సాహాయ్యం ప్రాణాంస్త్యక్తుమివోద్యతాః || 40

విష్ణునా సహితాన్‌ దేవాన్‌ మృగేంద్రః క్రోష్టుకానివ | దృష్ట్వా జహాస భూతేంద్రో మృగేంద్ర ఇవ వివ్యథః || 41

ఇది శ్రీ శివమహాపురాణ వాయవీయసంహితాయాం పూర్వభాగే దేవదండవర్ణనం నామ ఏకవింశో%ధ్యాయః (21).

యజ్ఞశాలలో ప్రవేశించిన ప్రళయకాలాగ్నిని బోలియున్న ఆ వీరభద్రుని చూచి మరణము వలన భయపడిన యజ్ఞపురుషుడు మృగదేహమును ధరించి పరుగెత్తెను (33). ఆ వీరభద్రుడు దృఢమైన నారిత్రాటియొక్క ధ్వనిచే భయమును కలిగించుచున్న పెద్ద ధనస్సును టంకారము చేయుచూ, పారిపోవుచున్న ఆ యజ్ఞపురుషుని వెనుక బాణములను ప్రయోగిస్తూనే పరుగెత్తెను (34). చెవి వరకు పూర్తిగా నారిత్రాటిని లాగి విడిచినప్పుడు ఆ ధనస్సు చేయు ధ్వని మేఘగర్జనను పోలియున్నది. నారిత్రాడు స్వర్గలోకము ఆకాశము మరియు భూమి అంతటా కంపించునట్లు చేయుచుండెను. (35). ఆ పెద్ద ధ్వనిని విని తాను మరణించినాననియే తొట్రుపాటు పడుచున్న పాదములు గలవాడై వణికి పోతూ, కాంతిని కోల్పోయి లేడి రూపములో పరుగిడుతున్న ఆ యజ్ఞపురుషుని తలను వీరభద్రుడు నరికి వేసెను (37). సూర్యునినుండి పుట్టిన యజ్ఞపురుషుడు ఈ విధముగా అవమానింబడుటను గాంచిన విష్ణువు మహాకోపమును పొందినవాడై యుద్ధమునకు సన్నద్ధుడాయెను (38). సకలపక్షలకు రాజు, పాములను భక్షించువాడు అగు గరుడుడు వంగిన సంధి గల భుజముతో విష్ణువును మహావేగముగా మోయుచుండెను (39). దేవతలలో మరణించగా మిగిలిన వారు ఇంద్రుని ముందిడుకొని ప్రాణములను వీడుటకు సంసిద్ధులైనారా యన్నట్లు ఆ విష్ణువునకు సహాయపడుచుండిరి (40). రుద్రగణములకు అధిపతి, సింహము వంటి వాడు అగు వీరభ్రదుడు విష్ణువుతో కూడియున్న దేవతలను చూచి, నక్కలను చూచిన సింహమువలె భయము లేనివాడై, నవ్వెను (41).

శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు పూర్వభాగములో వీరభద్రుడు దేవతలను శిక్షించుటను వర్ణించే ఇరువది ఒకటవ అధ్యాయము ముగిసినది .



వీరభద్రుడు:



మన దేశంలో చాలాచోట్ల వీరభద్రుని ఆలయాలు కనిపిస్తాయి. ఏ గ్రామంలో చూసినా వీరభద్రుని పురాతన విగ్రహాలు దర్శనమిస్తాయి. చాలామంది ఈ వీరభద్రుడు ఎవరో గ్రామదేవత అనుకుంటూ ఉంటారు. మరికొందరేమో ఈయనను పరమశివుని కుమారునిగా భావిస్తారు. ఇంతకీ ఈ వీరభద్రుడు ఎవరు? శివునితో ఈయనకు ఉన్న అనుబంధం ఏమిటి?

 

దక్షయజ్ఞం

శివునికి సంబంధించిన గాథలలో దక్షయజ్ఞానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకించి వివరించాల్సిన అవసరం లేదు. వీరభద్రుని ఆవిర్భావం గురించి చెప్పుకోవాలంటే ఈ దక్షయజ్ఞాన్ని తలుచుకోవలసిందే! దక్షునికి మొదటినుంచీ పరమేశ్వరుని పొడ గిట్టేది కాదు. కానీ ఆయన కుమార్తె సతీదేవి మనసు మాత్రం శివుని మీదే లగ్నమై ఉండేది. ఆమెను శివునికి తప్ప వేరెవ్వరికైనా కట్టబెట్టేందుకు దక్షుడు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆఖరికి సతీదేవి వివాహం చేసేందుకు, శివుని తప్ప మిగతా దేవతలందరినీ స్వయంవరానికి పిలిచాడు దక్షుడు. కానీ అక్కడ శివుని శిల్పం మెడలోనే తన పూలహారాన్ని వేసి, తన మనసులో శివునికి తప్ప అన్యులకు స్థానం లేదని చెప్పకనే చెప్పింది సతీదేవి. ఇక దక్షునికి కుమార్తె మనసుని ఆలకించడం మినహా వేరే గత్యంతరం లేకపోయింది.

ఘోర అవమానం

శివుని తన అల్లునిగా చేసుకున్నప్పటికీ, అతనని ఎలాగైనా అవమానించాలన్న సంకత్పంతో రగిలిపోయాడు దక్షుడు. అందుకోసం ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టాడు. ఆ యజ్ఞానికి సమస్త దేవతలనూ ఆహ్వానించాడు- ఒక్క శివుని తప్ప! శివునికి దక్షుని మనసులో ఉన్న ద్వేషం అర్థం కావడంతో ఆ యజ్ఞానికి తాను కూడా దూరంగా ఉన్నాడు. కానీ సతీదేవికి మాత్రం తన తండ్రి అంగరంగవైభవంగా తలపెట్టిన యజ్ఞంలో పాలుపంచుకోవాలన్న కోరిక కలిగింది. శివుడు ఎంతగా వారించినా వినకుండా ఆ యజ్ఞవాటికను చేరుకుంది. అక్కడ శివుడు ఊహించిందే జరిగింది. దక్షుడు శివుని అనరాని మాటలూ అనడం మొదలుపెట్టాడు. ఆ మాటలకు అవమానం చెందిన సతీదేవి తనను తాను అగ్నికి ఆహుతి చేసుకుంది.
వీరభద్రుని అవతారం

 

సతీదేవి ఆత్మాహుతి గురించి విన్న పరమేశ్వరుడు క్రోధంతో రగిలిపోయాడు. తన కేశాన్ని పెరికి నేలకేసి కొట్టాడు. అప్పుడు ఉద్భవించిన ఉగ్రరూపమే వీరభద్రుడు. ఆకాశమంత ఎత్తున, కారుమేఘపు చాయతో, పదులకొద్దీ ఆయుధాలను ధరించిన చేతులతో ఆవిర్భవించాడు వీరభద్రడు. ఆ వీరభద్రునికి తోడుగా అవతరించిన శక్తి స్వరూపమే భద్రాకాళి. దక్షవాటికను ధ్వంసం చేయమంటూ వారిని అజ్ఞాపించిడమే ఆలస్యం... ప్రమథగణాలతో కలిసి వారిరువురూ విధ్వంసాన్ని సృష్టించారు.

దక్షుని రాజ్యంలో వీరభద్రుడు వేసిన వీరంగం అంతాఇంతా కాదు. అడ్డువచ్చిన వారికి ఘోర అవమానమే ఎదురైంది. చంద్రుడు, అగ్ని, పూషుడు... ఎవ్వరూ వీరభద్రుని ఆపలేకపోయారు. మెడలో కపాలమాలతో వీరభద్రడు, నిప్పులను చిమ్ముతూ భద్రకాళి ఆ రాజ్యం యావత్తునూ రణరంగంగా మార్చేశారు. చివరికి దక్షుని కాపాడేందుకు ఆ విష్ణుమూర్తే వీరభద్రుని ఎదుర్కోవలసి వచ్చింది. ఎదురుగా సాక్షాత్తూ ఆ నారాయణుడే నిలిచినా, వీరభద్రుని నిలువరించడం సాధ్యం కాలేదు. ఇరువురి మధ్యా ఘోర సమరం జరిగింది. ఆ పోరు ధాటికి ముల్లోకాలూ కంపించిపోయాయే కానీ, వారిరువురిలో ఏ ఒక్కరూ వెనక్కి తగ్గలేదు. ఇక విష్ణుమూర్తి తన ఆఖరి ఆస్త్రంగా సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆశ్చర్యం! వీరభద్రుడు ఆ సుదర్శన చక్రాన్ని కూడా మింగివేసి ముందుకురికాడు. ధర్మాగ్రహంతో ప్రళయకారునిలా విజృంభిస్తున్న వీరభద్రుని నిలువరించడం ఎవ్వరి తరమూ కాదని తేలిపోవడంతో, ముక్కోటి దేవతలూ తప్పుకున్నారు. దక్షుని మీ వీరభద్రుడు పగని తీర్చుకునేందుకు అవకాశాన్నిచ్చారు. అంతట వీరభద్రుడు కసితీరా దక్షుని సంహరించి విజయగర్వంతో కైలాసానికి బయల్దేరాడు.

ఇదీ వీరభద్రుని విజయగాథ! శివుని ఉగ్ర స్వరూపంగా ఈ వీరభద్రుని భక్తులు కొలుచుకుంటారు. దేశమంతా ఈ వీరభద్రుని ఆలయాలు ఉన్నప్పటికీ, దక్షిణభారతంలో మాత్రం గ్రామగ్రామానా ఈ స్వామి దర్శనమిస్తుంటాడు. కోరిన వరాలను తీర్చే కల్పతరువుగా, అడ్డంకులను తొలగించే నాథునిగా, నిరాడంబరమైన పూజకు లొంగిపోయే భోళా శంకరునిగా... భక్తుల మనసుని నిలిచి ఉంటాడు.


వీరభద్రురుడు పేరు వినగానే పురాణాలలో పేర్కొనబడిన దక్ష యజ్ఞ ధ్వంసం గుర్తుకు వస్తుంది ... దక్ష ప్రజాపతి సంహారం కళ్ళ ముందర కదలాడుతుంది. దక్ష ప్రజాపతి తాను తలపెట్టిన 'బృహస్పతి సవనం' అనే యాగానికి అల్లుడైన శివుడికి మినహా అందరికీ ఆహ్వానం పంపుతాడు. ఈ విషయమై తండ్రిని నిలదీసిన సతీదేవి, మనసు గాయపడటంతో అక్కడే అగ్నికి ఆహుతి అవుతుంది.

జరిగింది గ్రహించిన శివుడు ... ఆగ్రహావేశాలకు లోనవుతాడు. శివుడి కోపాగ్నిలో నుంచి దశ భుజాలతో ... మెడలో కపాలాలతో ... పర్వతాకారంలో 'వీరభద్రుడు' ఉద్భవించాడు. ఆదిదేవుడి అంశతో అవతరించిన 'వీరభద్రుడు' దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయడమే కాకుండా, దక్షుడి తల తీసేస్తాడు. ఈ కారణంగా అవతరించిన 'వీరభద్రుడు' వివిధ క్షేత్రాలలో, యుద్ధ వీరభద్రుడిగా ... అగ్ని వీరభద్రుడిగా ... నృత్య వీరభద్రుడిగా పూజలు అందుకుంటున్నాడు.

ఈ స్వామిని కొలవడం వలన పాపాలు తొలగిపోతాయనీ, కార్యానుకూలత లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శివాంశతో అవతరించడం వలన సోమవారం రోజున దర్శించుకోవడం మంచిదని అంటారు. ఆయనకి ఎంతో ఇష్టమైన పులిహోర ... పొంగలి ... శనగలను భక్తులు నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఆయనను శాంతింప జేయడానికంటూ నిమ్మకాయల దండలను సమర్పించే ఆచారం కూడా కనిపిస్తుంది.

No comments:

Post a Comment