Sunday 24 March 2019

జాతకచక్ర పరిశీలనలో “దగ్ధరాశి”



జాతకచక్రాన్ని పరిశీలన చెసేటప్పుడు,ప్రశ్నచక్రాన్ని పరిశీలన చేసేటప్పుడు దగ్ధరాశిని పరిశిలించటం ఎంతో ముఖ్యం.ముందుగా జాతకచక్రంలో జన్మతిధిని గాని,ప్రశ్నచక్రంలో ప్రశ్నదినపు తిధిని గాని గుర్తించాలి.ప్రతి తిధికి కొన్ని రాశులు దగ్ధ రాశులగును.దగ్ధ రాశులలో పడిన భావములు తమ కారకత్వాలను పోగొట్టుకొనును.అలాగే దగ్ధ రాశులలో ఉన్న గ్రహలు కూడ తమ కారకత్వాలను ఇవ్వజాలవు.

ఉదా;-జాతకచక్రంలో గాని ప్రశ్నచక్రం లో గాని జన్మతిధి లేక ప్రశ్నదినపు తిధి పాడ్యమి అనుకుంటే పాడ్యమి తిధికి దగ్ధరాశులు తులారాశి ,మకరరాసులు అవుతాయి.

జన్మలగ్నం గాని ప్రశ్నలగ్నం గాని మేష లగ్నం అయితే తులారాశి సప్తమ బావం,మకర రాశి దశమ బావ కారకత్వాలను ఇవ్వజాలవు,సప్తమ,దశమ బావాలలో ఉన్న గ్రహాలు కూడా తమ కారకత్వాలను ఇవ్వజాలవు.

సప్తమ బావ కారకత్వాలు:-వైవాహిక జీవితం,వ్యాపార బాగస్వామ్యం,సామాజిక సంబందాలు మొదలగు ముఖ్యమైన కారకత్వాలను దగ్ధరాశి కావటంవలన ఆయా కారకత్వాలను ఇవ్వజాలవు.

దశమ బావ కారకత్వాలు:-వృత్తి,కీర్తి ప్రతిష్ఠలు ,తండ్రి ద్వారా వచ్చే వారసత్వ సంపద మొదలగు ముఖ్యమైన కారకత్వాలను దగ్ధరాశి కావటంవలన ఆయా కారకత్వాలను ఇవ్వజాలవు.ఒక్కొక్కసారి జాతకచక్రంలో బావం,గ్రహం బలంగా ఉన్న పలితం రాకపోవటానికి కారణం దగ్ధరాశి ప్రభావం కూడ ఉంటుంది.

దగ్ధ రాశులలో ఉన్న గ్రహాలు కూడ తమ బావకారకత్వాలను ఇవ్వజాలవు.జాతకచక్రాన్ని పరిశీలించేటప్పుడు తప్పనిసరిగా దగ్ధరాశిని పరిశీలించకుండా పలిత విశ్లేషణ చేయరాదు.

గురు చండాల యోగ నివారణకు "ఏనుగు వెంట్రుక రింగ్ మరియు కంకణం"




జాతకంలో గురు, రాహువుల కలయిక వలన వచ్చే గురు చండాల యోగ నివారణకు ఏనుగు వెంట్రుకతో చేసిన రింగ్ ని గాని కడియాన్ని గాని ధరించవచ్చు. ఇవి ధరించటం వలన నరదృష్టి ప్రభావాల నుండి కూడా విముక్తి కలుగుతుంది. రింగ్ గాని, కడియం గాని మొదటి సారి ధరించే వారు గురువారం రోజు ఉదయం సూర్యోదయంలో గాని, ఆదివారం రాహు కాలం లో గాని ధరించటం వలన గురు చండాల యోగం వలన కలిగే చెడు ఫలితాల నుండి ఉపశమనం కలుగుతుంది.

గురు, రాహువుల కలయికను గురు, రాహు దోషం అని, కేంద్ర స్ధానాలైన 1, 4, 7, 10 బావాలలో గురు, రాహువులు కలసినప్పుడు దానిని గురు చండాలయోగం గాను పిలుస్తారు. మిగతా స్ధానాలలో కంటే కేంద్ర భావాలలో రాహు, గురుల కలయిక ఎక్కువ పాప ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే కేంద్ర స్ధానాలలో పాపగ్రహాలు పాప ఫలితాలను, శుభ గ్రహాలు శుభ ఫలితాలను ఇస్తాయి. అయితే గురు, రాహువులు 10 డిగ్రీల లోపు ఉంటేనే వారి ఇద్దరి మధ్య సంయోగం ఏర్పడి గురు చండాల యోగ ఫలితాలను పొందుతారు. గురు, రాహువుల మధ్య 10 డిగ్రీల కంటే ఎక్కువ దూరంలో ఉన్నప్పుడు గురు, రాహువులు భావంలో ఉంటే భావ ఫలితాలను గురు చండాల యోగ ఫలితాలను ఇవ్వలేరు.  

లగ్న, పంచమ, నవమ స్ధానాలు బలంగా ఉంటే గురు చండాల యోగం ఉన్న చిన్న చిన్న పరిహారాల ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చునుగురు, రాహువులు ఉన్న భావం శుభార్గళం పొందిన పాప ఫలితాలను ఇవ్వలేవు. గురు, రాహువులు ఉన్న రాశికి ఇరువైపుల పాప గ్రహాలు ఉన్నప్పుడు పాపార్గళం పొందటం వలన గురు చండాల యోగం యొక్క అధిక చెడు ఫలితాలను అనుభవిస్తారు. దశ అంతర్ధశలలో గురు, రాహువుల యొక్క దశలలోను పాప ఫలితాలనే ఇస్తారు. గోచారంలోను గురు, రాహువులు కలసి ఉన్న లేదా రాశి చక్రంలో గురు, రాహువులు ఉన్న బావాలలో గోచార గురు రాహువుల సంచారం జరుగుతున్న చెడు ఫలితాలను ఇస్తారు. పూర్వజన్మలో గురువులను నిందించటం, పెద్దలను ఎదిరించటం, తల్లిదండ్రులను సరిగా చూసుకోలేక పోవటం వంటి మనం చేసిన కొన్ని చెడు కర్మలు ద్వారా జాతకంలో గురు, రాహువుల యొక్క కలయిక జరుగుతుంది.  

చర లగ్నాలైన మేషం, కర్కాటకం, తుల, మకర లగ్నాలకు లాభ స్ధానమైన బాధక స్ధానాలలో గురు, రాహువులు కలసి ఉన్న, స్ధిర లగ్నాలైన వృషభం, సింహం, వృశ్చికం, కుంభ లగ్నాలకు నవమ స్ధానమైన బాధక స్ధానాలలో  గురు, రాహువులు కలసి ఉన్న, ద్విస్వభావ లగ్నాలైన మిధున, కన్య, ధనస్సు, మీన లగ్నాలకు సప్తమ స్ధానమైన బాధక స్ధానాలలో గురు, రాహువులు కలసి ఉన్న పాప ఫలితాలను ఎక్కువగా ఇస్తారు. వీటిపైన శుభగ్రహ దృష్టి ఉన్న, స్వ, ఉచ్చ, మిత్ర క్షేత్రాలలో ఉన్న పాప ఫలితాలను తక్కువగా ఇస్తారు.

లగ్నంలో గురు, రాహువులు కలసినప్పుడు తమను తాము గొప్పవాళ్లుగా ఊహించుకుంటారు. ఇతరులు తన గురించి తప్పుగా భావించటం, ఏదో జరుగుతుందని ముందుగానే ఊహించుకొని భయపడటం, ఎప్పుడూ ఊహల్లో విహరిస్తూ ఉండటం, ఎప్పుడూ నెగిటివ్ గా ఆలోచించటం, చెడు వ్యామోహాలకు ఈజీగా లొంగిపోవటం జరుగుతుంది.

ద్వితీయం స్ధానంలో గురు, రాహువులు కలసినప్పుడు గుప్త సంపాదన కలగి ఉండటం. చెడు ఆహారపు అలవాట్లు ఉండటం. ఇంటి తిండి కంటే బయట తిండికి ఎక్కువగా ఆసక్తి చూపటం. చెడు మార్గాల ద్వారా ఐన సంపాదించి గొప్పవారు కావాలని కోరుకోవటం. కుటుంబంలో మాటకు విలువ లేకపోవటం జరుగుతుంది. చేతిలో డబ్బులు నిలవవు. కుటుంబంలో కలతలు ఉంటాయి.

తృతీయం స్ధానంలో గురు, రాహువులు కలసినప్పుడు ఇతరులను ఈజీగా కమ్యూనికేషన్ చేసి తమ ఆదీనంలోకి తెచ్చుకుంటారు. ఏదైనా ఆశించి మాత్రమే ఇతరులకు సహకరిస్తారు. సోదర, సోదరిల మధ్య తరచుగా గొడవలు లేదా కొంత ఎడబాటు ఉంటుంది. సోదరుల మధ్య ఆస్తి తగాదాలు రావటం జరుగుతుంది. రచనలు చేయగలిగే సామర్ధ్యాన్ని కలగి ఉంటారు. కుటుంబంలో తన తరువాత ఎవరు లేకపోవటం జరుగుతుంది.

చతుర్ధ స్ధానంలో గురు, రాహువులు కలసినప్పుడు చదువుపై ఆసక్తి ఉంటుంది కానీ శ్రద్ధగా చదవలేరు. స్ధాన బలం తక్కువ ఉండటం వలన పుట్టిన ఊరుకి దూరంగా ఉంటారు. తల్లితో విభేదాలు గాని వారికి దూరంగా ఉండటం గాని జరగచ్చు. స్ధిరాస్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండవలెను. తరచుగా మార్పులు చెందుతుంటారు. బందు మిత్రులతో విభేదాలు ఉండటం జరుగుతుంది

పంచమ స్ధానంలో గురు, రాహువులు కలసినప్పుడు సంతాన దోషం ఉంటుంది. సాంప్రదాయానికి విరుద్ధంగా ఆలోచిస్తారు. పంచమంలో రాహువు ఉండటం వలన నాగదోషం ఏర్పడి సంతానం తొందరగా కలగకపోవటం, పిల్లలపై శ్రద్ధ లేకపోవటం, స్త్రీలకు గర్భ సంబంధ సమస్యలు ఉండటం జరుగుతుంది. ప్రేమ వివాహం చేసుకుంటారు.

షష్టమ స్ధానంలో గురు, రాహువులు కలసినప్పుడు ఇతరులపై విజయం సాధిస్తారు. ప్రతి పనిలోనూ స్వార్ధపూరిత పోటీతత్వాన్ని కల్పించుకొని విజయం సాధిస్తారు. ఉద్యోగం చేసే చోట శతృత్వాన్ని పెంచుకుంటారు. తెలివిగా ఋణాలను పొందుతారు. కోర్టు వివాదాలలో ఇతరులను ముప్ప తిప్పలు పెట్టటంలో సమర్ధులు. ఎటువంటి రోగం లేకపోయిన మానసిక రోగులుగా ఇబ్బంది పడతారు.

సప్తమ స్ధానంలో గురు, రాహువులు కలసినప్పుడు వైవాహిక జీవితంలో అపోహలు ఉంటాయి. వివాహంపై విముఖత ప్రదర్శిస్తారు. ఇతరులను ఈజీగా తమ మాటలతో తమ ఆదీనంలోకి తెచ్చుకోవటం జరుగుతుంది. ఇతర కులస్ధులతో వివాహం జరగచ్చు. భార్య భర్తల మధ్య సఖ్యత లేకపోవటం జరుగుతుంది. వ్యాపార భాగస్వామితో విభేదాలు లేదా మోసపోవటం జరగచ్చు. వివాహ విషయంలో తొందరగా ఒక నిర్ణయానికి రాకపోవటం జరుగుతుంది.

అష్టమ స్ధానంలో గురు, రాహువులు కలసినప్పుడు గుప్త శత్రువుల వలన నష్టపోవటం జరుగుతుంది. ఆయుర్ధాయ స్ధానం కావటం వలన అనారోగ్య సమస్యలు ఎదుర్కోవటం జరుగుతుంది. ప్రతి పనిలోనూ ఆటంకాలు కలగటం జరుగుతుంది. ఊహించని పరిణామాలు ఉంటాయి. పిత్రార్జితాన్ని కోల్పోవటం, తండ్రికి పరువు నష్టాన్ని కలిగించటం జరుగుతుంది.  

నవమ స్ధానంలో  గురు, రాహువులు కలసినప్పుడు పితృదోషం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక భావనలు లేకపోవటం. సరైన గురువు లభించకపోవటం. తండ్రికి తలవంపులు తీసుకురావటం. తండ్రితో విభేధాలు కలగటం జరుగుతుంది. ఊహించిన ఆలోచనలను కార్యరూపంలో పెట్టలేరు. విదేశాలకు తరచుగా తిరగటం. పెద్ద చదువు చదివిన గుర్తింపు లేకపోవటం. తన విజ్ఞానాన్ని ప్రదర్శించలేకపోవటం జరుగుతుంది.

దశమ స్ధానంలో గురు, రాహువులు కలసినప్పుడు పిత్రార్జితాన్ని పాడుచేసుకోవటం చేస్తారు. ఎప్పుడు తిరిగే వృత్తిలో ఉంటారు. రహస్య వృత్తుల ద్వారా ఆదాయ మార్గాలు అన్వేషించటం. వృత్తి, ఉద్యోగాలలో ఎంత కష్టపడిన గుర్తింపు లేకపోవటం. ఇతరులు చేసిన తప్పులు తనమీద పడి పరువుపోవటం జరుగుతుంది.

లాభ స్ధానంలో గురు, రాహువులు కలసినప్పుడు కష్టపడకుండా సంపాదించాలనికోరుకోవటం. స్నేహితుల విషయంలో మోసపోవటం లేదా వారికి తన వలన లాభం చేకూరటం జరుగుతుంది. ముందే తెలిసిన వ్యక్తిని గాని లేదా స్నేహితులమధ్య వివాహం జరగటం గాని జరగచ్చు. తనకంటే పెద్ద సోదర, సోదరి విషయంలో విభేదాలు ఉండటం లేదా వారికి దూరంగా ఉండటం జరుగుతుంది.

వ్యయ స్ధానంలో గురు, రాహువులు కలసినప్పుడు కుటుంబానికి దూరంగా జీవిస్తారు. బందన యోగం వలన శ్మశాన దర్శనాలు, జైలు దర్శనాలు కలగటం. అనవసరమైన ఖర్చులు ఉండటం. సమయాన్ని వృధా చేయటం. హాస్పటల్ ఖర్చులు అనుకోకుండా రావటం. విదేశాలకు వెళ్ళటం జరుగుతుంది.