బ్రాహ్మణబాలునకు గర్భాష్ణమాల్లో ఉపనయనం జరిపించాలి. అంటే జననాది ఏడు సంవత్సరముల ఏడు నెలల వయస్సు తరువాత అన్నమాట. క్షత్రియనకు పన్నెండేళ్ళకు, వైశ్యబాలునకు పదహారేళ్ళ వయస్సులో ఉపనయనం చేయవచ్చు. బ్రాహ్మణునికి ఉపనయనపు గరిష్ట వయోపరిమి పదహారేళ్ళ అంటే ఎనిమిదేళ్ళు అవకాశమిచ్చారన్నమాట. ఆశ్చర్యంగా అంత దీర్ఘవ్యవధి కూడా సరిపోవడం లేదు. పదహారేళ్ళ లోపుగా ఉపనయనం చేయకపోతే పాపమని చెప్పబడింది. ఉపనయనము ఉత్తరాయణకాలంలోనే జరగాలి. అందులో మాఘమాసం శ్రేష్టంగా ఎంచబడింది. ఎట్టి పరిస్థితులలోను దక్షిణాయనకాలంలో జరగరాదు. ఒకవేళ అలా చేయవలసి వస్తే ఉత్తరాయణ కాలంలో మళ్ళీ ఉపనయనం చేసుకోవాలని నా ఉద్దేశం.
ఈ రోజుల్లో వివాహోపనయనాలు ఎంతో జాప్యం చేయబడి, మార్గశిర మాసం మినహాయించి మిగతా మాసాలలోనూ అనుష్టించబడుతున్నాయి. దుష్ఫలితాలు మనకు కనబడుతూనే ఉన్నాయి. అయినా అసలు వివాహమనే ఒక కార్యక్రమం లాంఛనప్రాయంగానైనా జరుగుతోంది కదా అని సంతోషించాల్సిన విషయం వచ్చేసింది. వివాహానికైనా కొంత సరిపెట్టుకోవచ్చు కానీ, ఉపనయనం మాత్రం ఉత్తరాయణంలో జరగవలసిందే!
చిఱుతప్రాయంలోనే ఎందుకు చేయాలి?
కామం మనస్సులోనికి జొరబడటానికి ముందే బాలుడు గాయత్రీ మంత్రము చేత ప్రభావితుడు కావాలి. ఉపనయన లక్ష్యం గాయత్రీ మంత్రం అనుష్టించి మంత్రశక్తిని అభివృద్ధి పరుచుకోవడం, వేదవేదాంగములను చక్కగా అధ్యయనం చేయడం వంటివి కదా! కామం చేత జయించబడితే మనస్సు లక్ష్యం నుండి ప్రక్కకు మరలించబడుతుంది. అప్పటికే సంపాదించిన కొద్దో గొప్పో మంత్రశక్తి కూడా నశించిపోతుంది. చదువు వెనకంజ వేస్తుంది.
చిఱుతప్రాయంలోనే గాయత్రీ మంత్రోపదేశం పొందిన బాలుడు కామోద్భవం జరిగే వయస్సు వచ్చేనాటికి గాయత్రీ మంత్ర పురశ్చరణ చేత నిరుష్టతను పొందగలుగుతాడు. విద్యలో కొంత స్థాయిని చేరతాడు. గాయత్రి నిండిన మనస్సులో కామానికి చోటుండదు. పదహారేళ్ళ వయస్సులో ఉపనయనమయినవారికి ఇది సాధ్యపడదు.
లక్ష్యసాధనలో ఒక మెట్టెక్కితే పదిమెట్లు దిగజారతాడు. అందువల్లనే ఉపనయనం జరగవలసిన వయస్సు ఎనిమిదిగా నిర్ణయించబడింది.
ఈ రోజుల్లో మనం సంస్కారాలను ముఖ్యంగా పరిగణించడం లేదు. అలాగని పూర్తిగా వదిలిపెట్టేసినా ఆశ్చర్యమూ లేదు. ఏదోవిధంగా పూర్తి చేశామనిపించుకొని సంతృప్తిని కొని తెచ్చుకొంటారు. దీనికన్నా నాస్తికుడు నయమనిపిస్తుంది. వానికి కనీసం కొన్ని దృఢమైన అభిప్రాయాలు, నిర్ణయాలు ఉంటాయి. తదనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటాడు.
గాయత్రీ మంత్రజపము బాలునికి మానసిక ధృడత్వాన్ని తేజస్సునీ, దైహికమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. మేధకు పదను పెట్టి ఏకాగ్రతను వృద్ధిపరుస్తుంది. కామవాంఛ అతని దరి చేరదు. వినయాన్ని భగవద్భక్తినీ, ఆత్మ విషయములో ఆసక్తిని ఇనుమడింప చేస్తుంది. ఇంతటి మహోపకారమైన నిధిని తల్లితండ్రులు అకారణంగా తమ పిల్లలకు నిరాకరించడం న్యాయమా!
ఈరోజుల్లో గాయత్రీ జపాన్ని ఉపనయనం రోజున పొరపాటున పదిసార్లు చేస్తారేమో, తరువాత చేయడం మానివేస్తున్నారు. తల్లితండ్రులీ విషయంలో తమ బాధ్యతను పూర్తిగా విస్మరిస్తున్నారు. ప్రాతస్సాయం సంధ్యలలో నిద్రో, క్రికెట్టు పోటీలో, సినిమాలో అంటూ పిల్లలు సమయాన్ని దుర్వినియోగం చేయకుండా సమయానికి సంధ్యావందనానికి కూర్చోపెట్టే బాధ్యత తల్లితండ్రులకున్నది. ఈరోజుల్లో వారే ఆ సమయాలలో ప్రొద్దునైతే మేల్కొని ఉండరు. సాయంకాలం క్లబ్బులకు రేసులకు పోతారు. వారి ఆత్మౌన్నత్యం కన్న క్షణికానందాలు ఎక్కువైపోతున్నాయి. కొడుకులను సన్మార్గవర్తులుగా చేయగల నైతికబలం వీరికేదీ? వారి జీవనశైలి ప్రయోజన శూన్యమని అనిపించి బహుశః పిల్లల్నైనా సన్మార్గంలో నడపాలని వారికే తోస్తే, ఒకవేళ పిల్లలను సంధ్యావందనం చేయమని చెబుతారేమో! కానీ అప్పడు పిల్లలు వారి మాట వింటారా? నువ్వు చక్కగా రేసులకు వెళుతుంటే నేనెందుకు సంధ్యావందనం చేయాలని అడిగే అవకాశం లేకపోలేదు.
ఉపనయనం అయిన పిల్లలు నిత్యమూ సంధ్యావందనం చేయించేభాద్యత తల్లిదండ్రులది
No comments:
Post a Comment