మార్కండేయుని వృత్తాంతము
వశిష్టుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహము, మృకండుని జననము, కావిశ్వనాధుని దర్శనము, విస్వనాధుని వరంవలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతములను వివరించి "మహారాజా! ఇక మార్కండేయుని గురించి వివరింతును, శ్రద్దగా ఆలకింపుమని యీ విధముగా చెప్పదొడంగిరి. మార్కండేయుని ఆయువు పదహారు సంవత్సరాలు మాత్రమే రోజులు గడచుచున్నకొలది తల్లిదండ్రులకు దిగులు యెక్కువగుచుండెను. అయిదేళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నిటిని పూర్తి చేసిరి. ఆరవయేడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రివలెనే అచిరకాలములో సకలశాశ్త్రములు, వేదాంత పురాణేతిహాసములు, స్మృతులు పథించి గుణవంతుడని ప్రశంసలనందెను. అయిననూ మరుద్వతీ మృకండులు నిత్యమును మార్కండాఎయునకు "కుమారా! నీవు పసితనమునందే సకలశాస్త్రములు అభ్యసించి నీ బుద్దికుశలతచే అందరిమన్నలను పొందుచున్నావు. అందులకు మేమెంతయో ఆనందించుచున్నాము. అయినను గురువులయెడ,పెద్దలయెడ, బ్రాహ్మణులయెడ మరింత భక్తిభావముతో మెలగవలయును. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును గాన, నీవట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధీగును" అని చెప్పుచుండెడివారు. అటుల పదిహేను సంవత్సరములు గడిచిపోయినది. రోజు రోజుకు తల్లిదండౄల ఆందోళన, భయము ఎక్కువగానున్నవి. పరమశివుని వరప్రసాదమగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలెనని తలచి, మహాఋషులందరుకును ఆహ్వానము పంపినారు, మునీశ్వరులు, గురువర్యులు మొదలగువారందరు మృకండుని ఆశ్రమమునకు వచ్చిరి. అందుకు మృకండుడానందమొంది అతిధిసత్కారములు చేసెను. మార్కండేయుడు వచ్చి పెద్దలందరుకూ నమస్కరించినాడు. అటులనే వశిష్ఠునకు నమస్కరించగా, ఆయన మార్కండేయుని వారించినారు, అటుల చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి మహానుభావా! మీరిట్ళు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించెను.అంత వశిష్ఠుల వారు ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడవుకమ్ము అని దీవించితిరి గదా! అదెటుల అగును. ఇతని ఆయుర్దాయము పదహారెండ్లే గదా? ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవము జరుపుచున్నారు. పరమేశ్వరుదిచ్చిన వరము ప్రకారము యీతడు ఇంకోక సంవత్సరము మాత్రమే జీవించును అని చెప్పెను.
అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించిరి. 'చిరంజీవివై వర్ధిల్లు' మని దీవించినందున వారి వాక్కులసత్యములగునని బాధపడి దీనికి మార్గాంతరము లేదా? యని వశిష్టుల వారినే ప్రశ్నించిరి, వశిష్టులు కొంతసేపాలోచించి "మునిసత్తములారా! మనమందరమునూ ఈ మార్కండేయుని వెంటబెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు పోవుదమురండు" అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడ్కొనిపోయిరి. మునీశ్వరుల యాగమునకు బ్రహ్మ్హ సంతసించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ 'చిరంజీవిగా జీవించు నాయనా' అని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తంతమును బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరబాటునకు విచారము వెల్లబుచ్చి కొతతడవాగి "భయపడకు"మని మార్కండేయుని దగ్గరకు చేరదీసి "పరమేశ్వరుడు యీ బాలుని దీర్ఘాయుష్మంతునిగా జేయునుగాక" యని తన మనస్సులో శివుని ధ్యానించెను. అంతట మునుల వంక చూచి "ఓ మునులారా! మీరు పోయిరండు ఇతనికి యే ప్రమాదమునూ జరుగనేరదు" అని పలికి వత్సా మర్కండేయా! నీవు కాశీ క్షేత్రమునకు పోయి, విశ్వనాధుని సదా సేవించుచుండుము. నీకే ప్రమాదమూ కలుగదని ధైర్యము చెప్పి పంపి వేసెను.
మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి, 'కాశీనాధుని సేవించి వచ్చెదను అనుజ్ఞ ' నిమ్మని కోరగా మృకండుడు నాతని భార్యయు కొడుకు యొక్క యెడబాటునకు కడుంగడు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక, కుమారుని విడిచిపెట్టి యుండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరిరి. మృకండుడు కుటుంబ సహితముగా కాశీకి పోయి .విశ్వేస్వరాలయ సమీపమందొక ఆశ్రమము నిర్మించెను. మార్కండేయుడు శివధ్యానపరుడై రాత్రింబవళ్ళు శివలింగము కడనేయుండసాగెను.
క్రమముగా నాతడు పదహారవయేట ప్రవేశించెను. మరణ సమయ మాసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు గొనితెమ్మని చెప్పగా ఆ నిమిత్తమై వారు శివసన్నిధితో ధ్యానము చేసుకొనుదున్న మార్కండేయుని కడకు వచ్చుసరికి, ఆ సమీపమందు నిలువలేకపోయిరి. కాలపాశము విసురుటకు చేతుల నెత్తలేకపోయిరి. మార్కండేయుని చుట్టూ మహాతేజస్సు ఆవరించింది. ఆ తేజస్సు యమభటులను అగ్నికణములవలె బాధించెను. ఆ బాధ కోర్వలేక భటులుపోయి జరిగిన వృత్తాంతమును యముని కెరిగించగా యముడాశ్చర్యపడి తానే స్వయముగా వచ్చి మార్కండేయునిపై కాలపాశమును విసిరెను. మార్కండేయుడు కన్నులు తెరచి చూచుసరికి యముడతని ప్రాణములను తీసుకొనిపోవసిద్దముగా నుండగా, నాతడు భయపడి, శివలింగమును కౌగిలించుకొని ధ్యానించుసరికి కైలాసవాసుడగు పార్వతీపతి తన భక్తుని ఆక్రందనను విని మహారౌద్రాకారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి, మార్కండేయుని రక్షించెను.
యముడు చనిపోవుటచే అష్టదిక్పాలురు బ్రహ్మాదిదేవతలు వచ్చి శివుని అనేక విధముల ప్రార్థించిరి, కోపముచల్లార్చుకో మహేశా! యముడు తన కర్తవ్యమును నెర వేర్చినాడు. తమరు వరప్రసాదుడగు మార్కండేయునికి పదహారేండ్లు మాత్రమే ఆయువు నిచ్చితిరిగదా! అతని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. తమరు మార్కండేయుని చిరంజీవిగా జేసితిరి. అందుకు మేమెంతయో ఆనందిచుచున్నాము. కాని, ధర్మపాలన నిమిత్తము యముడు లేకుండుట లోటుకదా గాన, మరల యముని బ్రతికించుడని వేడుకొనిరి. అంతట నీశ్వరుడు యముని బ్రతికించి యమా నీవు నా భక్తులదరికి రావలదు సుమా! అని హెచ్చరించి అంతర్ధానమయ్యెను. పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడు అయినందులకు మృకండుడు మిక్కిలి సంతసించి, తాను చేసిన మాఘమాస వ్రతఫలమే తన కుమారుని కాపాడినదని నమ్మి యీ మాఘమాస ప్రభావమును లోకులందరకు చెప్పుచుండెను.
No comments:
Post a Comment