Thursday 21 March 2019

ఫాల్గుణ శుధ్ధ పూర్ణిమ


ఫాల్గుణ శుధ్ధ పూర్ణిమ విశేష శక్తితో కూడినది.
ఈ దినాన రాక్షస పీడ పోయేందుకు "హోళికా" అనే ఒక విధమైన శక్తిని ఆరాధిస్తారు.
ఆమె ప్రీతి కోసం అందరూ కలిసి గానాలు చేయడం, పరిహాసాలాడడం చేస్తారు. హోలికాగ్నిని రగిల్చి ఆరాధించే సంప్రదాయం ఇప్పుడు తగ్గిపోయి పరిహాసాది క్రియలే మిగిలాయి.
శ్రీమహాలక్ష్మి క్షీరసాగరం ను౦డి ఆవిర్భవించిందని పురాణ కథ.
ఈ ఏడాది పూర్ణిమ, ఉత్తర ఫల్గుణి కలిసి వచ్చాయి.
కనుక ఈ దినాన భక్తి శ్రధ్ధలతో మహాలక్ష్మిని షోడశోపచారములతో చక్కగా ఆరాధించి లక్ష్మీ అష్టోత్తర శతనామాలు, కనకధారాస్తోత్రం, వంటివి పారాయణ చేయడం మంచిది.
ఈరోజున లక్ష్మిని శ్రద్ధగా అర్చించే వారికి సమస్త ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.
ఈరోజుననే శ్రీకృష్ణుని ఉయ్యాలలో వేసి ఆరాధించాలి.
దీని ’డోలోత్సవం’ అని అంటారు.... ధర్మపురి లో డోలా పూర్ణిమ పేరుతో ఇప్పటికీ దీనిని ఆచరిస్తారు...
నరాడోలాగతం దృష్ట్వా గోవిందం పురుషోత్తమం!
ఫాల్గుణ్యాం ప్రయతో భూత్వా గోవిందస్య పురంవ్రజేత్!!...
ఉయ్యాలలో అర్చింపబడిన పురుషోత్తముడైన గోవిందుని ఈరోజున దర్శించిన వారికి వైకుంఠలోకం ప్రాప్తిస్తుందని ధర్మశాస్త్రాల వాక్యం.
ఉదయాన్నే ఎండుకట్టెలు, పిడకలు రాశిగా పోసి అగ్నిని రగిల్చి దానియందు రాక్షస పీడా పోయేందుకు హోళికా అనే ఒక విధమైన శక్తిని ఆవహింపజేసి
“శ్రీ హోళికాయై నమః’ అని పూజించి మూడు సార్లు అగ్నికి ప్రదక్షిణ చేస్తూ ‘వందితాసి సురెంద్రేణ బ్రహ్మణా శంకరేణ చ; అతస్త్వాం పాహినో దేవి భూతే భూతిప్రదో భవ’ అని చదవాలి.
ఆబాలగోపాలం అనేక రంగులను పిచికారీలతో చల్లుకోవడం నృత్యగీతవాద్యాలతో మహోత్సవం జరుపుకోవాలని కూడా శాస్త్రంలో చెప్పబడింది.
బాలకృష్ణుని లేదా రాధాకృష్ణులను ఊయలలో వేసి ఆరాధించాలి.
దీనిని చేయడం వైకుంఠప్రాప్తిని కలుగజేస్తుంది. “నరాః డోలాగతం దృష్ట్వా గోవిందం పురుషోత్తమం;
ఫాల్గుణ్యాం ప్రియతో భూత్వా గోవిన్దస్య పురం వ్రజేత్’.
మధురైలో శ్రీమీనాక్షీ సుందరేశ్వారుల కళ్యాణం ఈ రోజున చేస్తారు. తమిళనాడులో అనేక దేవాలయాలలో శివపార్వతుల కళ్యాణాలను చేస్తారు.

No comments:

Post a Comment