Tuesday 30 June 2020

జూలై 1, 2020 పంచాంగం



ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
జూలై 1, 2020
శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం శుక్ల పక్షం
తిధి:ఏకాదశి సా5.00 తదుపరి ద్వాదశి
వారం :బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం:విశాఖ రా2.45 తదుపరి అనూరాధ
యోగం:సిద్ధం ఊ11.59 తదుపరి సాధ్యం
కరణం:వణిజ ఉ6.10 తదుపరి భద్ర/విష్ఠి సా5.00 ఆ తదుపరి బవ తె3.54
వర్జ్యం :ఉ9.28 - 10.58
దుర్ముహూర్తం :ఉ11.36 - 12.29
అమృతకాలం :సా6.29 - 7.59
రాహుకాలం :మ12.00 - 1.30
యమగండం/కేతుకాలం:ఉ7.30 - 9.00
సూర్యరాశి :మిథునం
చంద్రరాశి :తుల
సూర్యోదయం :5.32
సూర్యాస్తమయం :6.34
తొలి ఏకాదశి
చాతుర్మాస్య వ్రతారంభం
సర్వే జనాః సుఖినో భవంతు
శుభమస్తు


Monday 29 June 2020

తొలి ఏకాదశి , శయన ఏకాదశి , గోపద్మ వ్రతారంభం , చతుర్మాస వ్రతారంభం , వ్రత విశేషం...ఎలా, ఏం చేయాలి ?




ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే *"శయన ఏకాదశి , పెద్ద ఏకాదశి"* అని కూడా అంటారు. ఈ రోజు నుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శయనిస్తాడు. కనుక దీన్ని *"శయన ఏకాదశి"* అంటారు. నిజానికి ఒకరకంగా పరిశీలిస్తే , ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు , సూర్య చంద్రులు , గ్రహాలు పరస్పర సంబంధాన్నీ , వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు.
ఐతే , మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు , ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతేగాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని , కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని మన పురాణాలు చెబుతున్నాయి.
మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత , అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. మహాసాధ్వీ సతీ సక్కుభాయి ఈ వ్రతాన్నే ఆచరించి మోక్ష సిద్ధి పొందటం జరిగింది.
వ్రతంలోని ప్రధాన నియమాలు ఉపవాస ఫలితాలు తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని ఆచరించదలచిన వారు
1.దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి.
2. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి.
3. అసత్యమాడరాదు.
4. స్త్రీ సాంగత్యం పనికి రాదు. కాని పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు.
5. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి.
6. మర్నాడు అనగా ద్వాదశినాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి.
7.అన్నదానం చేయడం చాలా మంచిది.
*ఏకాదశి వ్రతమాచరించేవారు తినగూడనివి*
ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి.
ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని మన పురాణాలు చెబుతున్నాయి.
ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. ఐతే, ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించారు. అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొన్నారు. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు.
తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు.
*తొలి ఏకాదశి రోజున హరిని పూజిస్తే*
ప్రతినెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ముఖ్యంగా ఆషాఢమాసం వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోంచేసి, శేషశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం.
ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి.

ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేస్తారు.
ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి , మాంసాహారం , పుచ్చకాయ , గుమ్మడి కాయ , చింతపండు , ఉసిరి , ఉలవలు , మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని అంటారు.

గోపద్మ వ్రతము


గోపద్మ వ్రతము అనేది చాతుర్మాస సమయంలో గోవులను పూజించటానికి ఏర్పాటు చేసుకున్న వ్రతము. దీనిని సుమంగళి స్త్రీలు ఆషాడ శుక్ల ఏకాదశి రోజు ప్రారంభించి కార్తీక శుక్ల ద్వాదశి వరకు కొనసాగిస్తారు.
గోపద్మ వ్రతంలో భాగంగా గోవులను పూజించటమే కాక పశువుల పాకలను / కొట్టాలను శుభ్ర పరచి , వాటిలో అందమైన ముగ్గులు వేసి అలంకరిస్తారు. ఈ ముగ్గుల్లో భాగంగా ఆవునూ మరియు దూడను గీసి వాటిని 33 పద్మాలతో నింపుతారు. పూజలో భాగంగా ముగ్గు చుట్టూ 33 ప్రదక్షిణాలు చేస్తారు , 33 సార్లు అర్ఘ్యం ఇస్తారు , మరియు 33 స్వీట్లు దానం చేస్తారు. పశువుల పాక అందుబాటులో లేనివారు ఇంట్లోనే ముగ్గువేసి పూజా కార్యక్రమం చేస్తారు. ఈ గోపద్మ వ్రతాన్ని అయిదు సంవత్సరాల పాటు మాత్రమే కొనసాగించి ఆ తర్వాత ముగిస్తారు.
హిందూ మతంలో ఆవును పవిత్రతకు చిహ్నంగా పరిగణిస్తారు. ఆవును పూజించటం అనేది వైదిక సంస్కృతిలో ఒక భాగం. సమస్త దేవతలు ఆవులో కొలువై ఉంటారని భావిస్తారు.
*గోపద్మ వ్రత విధానము*
వేసిన ముగ్గుకు పుష్పార్చన జరిపి , చెక్కెర / స్వీటును నైవేద్యంగా పెట్టాలి.
వాటిచుట్టూ 33 ప్రదక్షిణలు చేసి 33 సార్లు నమస్కరించాలి.
తర్వాత ఆవు శరీరంపై ఆరు మోహినీ దేవతలకు ప్రతిగా వేసిన ఆరు పద్మాలకు ఆరు సార్లు నమస్కరించాలి.
హారతిని ఇచ్చి 33 మంది దేవతలకు 33 సార్లు అర్ఘ్యమివ్వాలి.
మళ్ళీ ఆరుగురు మోహినీ దేవతలకు ఆరు సార్లు వేరుగా అర్ఘ్యమివ్వాలి.
తరువాత గోపద్మ వ్రత కథను చదివి , అక్షతలు వేసి పూజలో ఏమైనా అపరాధం జరిగి ఉంటే క్షమింపమని కోరాలి. స్వీట్లు మొదట సోదరులకు , తర్వాత ఇతరులకు దానమివ్వాలి.
ఈ వ్రతమును నాలుగు నెలల పాటు క్రమం తప్పకుండా చేయాలి. ఎప్పుడైనా అనివార్య పరిస్థితుల వల్ల ఒకటి రెండు రోజులు తప్పిపోయినా , ఆ తర్వాత రోజు పూజను కొనసాగించి అపరాధాన్ని క్షమింపమని కోరాలి. ఒకవేళ వరుసగా ఏడు రోజులు తప్పిపోతే ఆ సంవత్సరానికి వ్రత భగ్నం జరిగినట్లుగా భావించి ఇక కొనసాగింపకూడదు. ఈ మధ్య కాలములో సమయాభావము వలన చాలామంది గోపద్మ వ్రతాన్ని వారానికి 1-2 సార్లు మాత్రమే ఆచరిస్తున్నారు.
*గోపద్మ వ్రత కథ*
ఒకసారి దేవసభలో అప్సర రంభ నాట్య ప్రదర్శన చేస్తుంది. మనోహరంగా వాయిస్తున్న సంగీత వాద్యముల నడుమ ఆమె అద్భుత నాట్యం కొనసాగుతుండగా , ఒక తబలా పగిలి అపస్వరం రావటంతో కార్యక్రమం ఆగిపోయింది. దానికి ఇంద్రుడు నొచ్చుకుని వెంటనే యమ్ముణ్ని పిలిచి భూలోకంలో వ్రతమాచరించని వారి చర్మం తెచ్చి తబలాను బాగుచేయవలసిందిగా కోరతాడు. దానికి యముడు , భూలోకములో అటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకుని రమ్మని తన భటుల్ని పంపిస్తాడు. ఆ భటులు లోకమంతా తిరిగి వచ్చి యమునికి ఇలా నివేదిస్తారు. గౌరి , సావిత్రి , అనసూయ , ద్రౌపది , అరుంధతి మరియు సరస్వతి ఇలా అందరూ ముగ్గులు వేసి పూజిస్తున్నారు. ఒక్క శ్రీకృష్ణుని సోదరి అయిన సుభద్ర ఇంటివద్ద మాత్రం ముగ్గులేదు అని తెలియచేసారు. దానికి యముడు వారిని ఆమె చర్మాన్ని తీసుకుని వచ్చి ఆ తబలాకు బిగించవలసిందిగా ఆదేశిస్తాడు.
ఈ సమాచారాన్ని నారదుడు శ్రీకృష్ణునికి చేరవేస్తాడు. విషయం తెలిసిన శ్రీకృష్ణుడు ఉదయం నిద్రలేచిన వెంటనే సుభద్ర దగ్గరకు వెళ్లి ఆమెను ఇంటివద్ద ముగ్గు ఎందుకు లేదు మరియు వ్రతాన్ని ఎందుకు ఆచరించటం లేదు అని ప్రశ్నించగా , దానికి సుభద్ర నాకు సూర్య , చంద్రుల వంటి ఇద్దరు సోదరులు , మహావీరుడైన అర్జునుని వంటి భర్త , దేవకీ వసుదేవుల వంటి తల్లిదండ్రులు ఉండగా నేను దేనికోసం వ్రతం చేయాలి అని ఎదురు ప్రశ్నిస్తుంది.
దానికి శ్రీకృష్ణుడు అన్నీ ఉన్నాగానీ భవిష్యత్తు కోసం వ్రతం చేయాలని ఆమెను ఒప్పించి ఆమెకు వ్రత విధానాన్ని ఇలా వివరిస్తాడు. గద్ద , విష్ణు పాదము , శంఖము , చక్రము , గద , పద్మము , స్వస్తిక , బృందావన , వేణువు , వీణ , తబలా , ఆవు , దూడ , 33 పద్మములు , రాముని ఊయల , సీత చీర అంచు , తులసి ఆకు , ఏనుగు మరియు భటుడులను ముగ్గుతో నదులు , చెరువులు మరియు దేవుని చిత్రాలతో కలిపి గీయాలి అని చెబుతాడు. అప్పుడు సుభద్ర రాతి పొడిని ముత్యములు మరియు పగడములతో కలిపి ముగ్గు వేసింది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు తెలిపిన విధంగా గోపద్మ వ్రతాన్ని ఆచరించింది.
ఆ విధంగా సుభద్ర గోపద్మ వ్రతం ఆచరించి , యమభటుల నుండి తప్పించుకోగలిగింది. అప్పటినుండి ఈ వ్రతం ప్రాచుర్యం పొందింది. యమభటులు ఉత్తరానికి తల పెట్టి పడుకుని ఉన్న ఒక ఏనుగు నుండి చర్మము సంగ్రహించి తబలా బాగుచేసుకున్నారు.

శ్రీ విధాత పీఠం తరఫున 108 రోజుల విశ్వశాంతి యజ్ఞం



కరోనా విష వ్యాధి covid19 నివారణకై 108 రోజుల విశ్వశాంతి యజ్ఞం, సంపూర్ణ శ్రీమద్రామాయణ పారాయణం శ్రీ విధాత పీఠం తరఫున గురు పౌర్ణమి నాడు ( జులై 5 ఆదివారం 2020) ప్రారంభించ తలపెట్టాము.

కావున ఈ విశ్వశాంతి మహా యజ్ఞం లో పాల్గొనదలచిన వారు మీ పేర్లను , గోత్రనామాలను వెంటనే పంపండి. వీలైనంత ఎక్కవ మంది ఈ మహా యజ్ఞం లో పాల్గొనేలా అందరికి షేర్ చేసి తెలియచేయండి. తద్వారా ఈ కరోనా విషవ్యాధిని తరిమికొడదాము . ఏ ఊరి వారైనా ఏ ప్రాంతం వారైనా తమ గోత్ర నామాలు ఇచ్చి ఈ మహా యజ్ఞం లో పాల్గొన వచ్చు
ఇతర వివరములకు 9666602371 ఫోన్ నెంబరు నందు సంప్రదించగలరు .

శ్రీ విధాత పీఠం
ఎల్ బి నగర్
హైదరాబాద్
ఫోన్ : 9666602371
మెయిల్ : vidhatha .an @ gmail.com