Sunday 19 July 2020

శ్రావణమాసము విశిష్టత




శ్రావణ మాసము తెలుగు సంవత్సరంలో ఐదవ నెల. పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రము (అనగా చంద్రుడు శ్రవణం నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఆ నెల శ్రావణము. ప్రస్తుతం వాడుకలో ఉన్న గ్రెగొరీయన్ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం జూలై, ఆగష్టు నెలల్లో వచ్చును. వర్షఋతువు మూలంగా విరివిగా వర్షాలు పడతాయి.
శ్రావణ శుక్రవారం ఆంధ్రప్రదేశ్/తెలంగాణలో స్త్రీలు వ్రతాలు చేస్తారు. ముఖ్యంగా శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. అదే విధంగా ఈమాసంలోనే మంగళవారం నాడు మంగళ గౌరీ వ్రతం కూడా చాలా మంది పాటిస్తారు. 

సకలదేవతలకు ప్రీతికరమైనది శ్రావణమాసం. ప్రతిరోజూ పండుగలా ఆడపడుచులు సంతోషంగా ఉండే మాసం. కలియుగదైవం శ్రీవేంకటేశ్వరుడు జన్మించిన శ్రావణా నక్షత్రం పేరులో ఉచ్చే ఈ మాసమంటే శ్రీమహావిష్ణువుకి ఎంతో ఇష్టం. వరలక్ష్మి, గౌరీ, సుబ్రమణ్య, రాఘవేంద్ర , వృషభాది దేవతలకు కూడా అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వాటి వైశిష్ట్యం చాలా ఉంది. లక్ష్మీ దేవికి ఇష్టమైన ఈ నెలలో రోజూ ఉదయం, సాయంత్రం మహిళలు దీపారాధన చేస్తే దీర్ఘసుమంగళీయోగం, అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతారు. తిథులతో సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో కూడా పండుగలు, పూజలు చేసే అత్యంత శుభప్రదమైన మాసం ఇదే.

శ్రావణ మాసం అంటే శుభమాసం. దీనిని నభో మాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్ధం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ మాసంలోని ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగ చతుర్థి , గరుడ పంచమి పుత్రాదా ఏకాదశి, దామోదర ద్వాదశి, వరహ జయంతి ఇలా అనేక పండుగలు వస్తాయి.
అత్యంత పవిత్రంగా భావించే శ్రావణమాసంలో ఇల్లు, ఆలయాలు భగవన్నామస్మరణతో మారు మోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది. వివాహాలు, నోములు, వ్రతాలు, పూజలు, శుభకార్యాలతో సందడిగా ఉంటుంది. ఈ మాసంలోని ప్రతి శుక్రవారం మహిళలు మహాలక్ష్మిలా అలంకరించుకుని తమకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని సముద్ర తనయకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
పురాణాల ప్రకారం పాలసముద్ర మథనంలో ఉద్భవించిన హలాహలాన్ని పరమ శివుడు శ్రావణమాసంలోనే సేవించి నీలకంఠుడిగా లోకాన్ని ఉద్ధరించాడు. ఈ మాసంలో ఒక్కోరోజు ఒక్కో దేవతను పూజిస్తారు. సోమవారాల్లో శివుడికి అభిషేకాలు, మంగళవారం గౌరీ వ్రతం, బుధవారం విఠలుడికి పూజలు, గురువారం గురుదేవుని ఆరాధన, శుక్రవారం లక్ష్మీ, తులసి పూజలు, శనివారం హనుమంతుడు, వేంకటేశ్వరుడు, శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. వీటితోపాటు గరుడ పంచమి, పుత్రదైకాదశి, వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి, రుషి పంచమి, గోవత్సబహుళ, సీతల సప్తమి, శ్రీకృష్ణాష్టమి, పోలాల అమావాస్య లాంటి పండుగలు ఈ మాసంలోనే వస్తాయి.
శివుడికి శ్రావణమాసం అత్యంత ప్రీతికరమైంది. ఈ మాసంలో వచ్చే సోమవారం నాడు ఆవుపాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, తేనె లాంటి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. బిల్వ పత్రాలు, ఉమ్మెత్తు, కలువ, తుమ్మి లాంటి ఇష్టమైన పుష్పాలతో ఈశ్వరారాధన చేస్తారు.
శుభ మంగళాలు పలికే మంగళవారానికి ప్రత్యేకత ఉంది. ఈ రోజున గౌరీదేవిని పూజిస్తారు. పసుపు ముద్దను తయారు చేసి కుంకుమ, పూలు అక్షింతలతో పూజలు నిర్వహిస్తారు. కొత్తగా వివాహమైన మహిళలు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. మంచి భర్త లభించాలని అవివాహితులు, తమ వైవాహిక బంధం సజావుగా సాగాలని వివాహితులు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు.
శ్రావణమాసం మొదలైన నాలుగో రోజునే వచ్చే పండుగ నాగపంచమి. శివుడి ఆభరణమైన నాగేంద్రుడిని పూజించడం హైందవ ఆచారం. పాలు, మిర్యాలు, పూలతో నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, రాతి, చెక్కలతో చేసిన నాగ పడగలకు భక్తులు అభిషేకం చేస్తారు.
సంతానం లేని వారు భక్తి శ్రద్ధలతో శ్రావణ శుక్ల ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు చేసి, ఉపవాసం ఉంటే మంచి సంతానం కలుగుతుంది. అందుకే దీన్ని పుత్రదై ఏకాదశి అన్నారు.
శ్రావణ మాసంలోని పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు. నవ వధువులతో తొలి శ్రావణంలో ఈ వ్రతాన్ని తప్పనిసరిగా చేయిస్తారు. వరాలిచ్చే దేవత వరలక్ష్మీ వ్రతం వల్ల భర్తలకు ఆరోగ్యం, పరిపూర్ణ ఆయుష్షు కలుగుతాయని విశ్వాసం. పురాణాల ప్రకారం చారుమతి దేవి అనే భక్తురాలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అష్టైశ్వర్యాలను పొందింది.
శ్రావణం చంద్రుడి మాసంకూడా. చంద్రుడు మనఃకారకుడు. అంటే సంపూర్ణంగా మనస్సు మీద ప్రభావం చూపే మాసం. ఈ మాసంలో రవి సంచరించే నక్షత్రాల ప్రభావం చంద్రుని మూలంగా మన మీద ప్రభావం చూపుతాయి. చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించి, మంచి కలిగించడానికి, ధర్మాచరణాలను పండుగగా ఆచరించడం నియమం. మనస్సు మీద మంచి ప్రభావం ప్రసరించి పరమార్ధం వైపు మళ్లించి మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి వల్ల కలిగే అస్తవ్యస్త అనారోగ్యాల నుంచి తప్పించుకోవడానికి, మంచి ఆరోగ్యాన్ని పొందడమే శ్రావణ మాసంలో వచ్చే పండుగలలోని ఆచారాల ముఖ్యోద్దేశం.

No comments:

Post a Comment