Thursday, 1 February 2024

రామాయణం. 4

 



రామకధ మొత్తం వాల్మీకి మహర్షికి వివరంగా చెప్పి ఆయన చేత పూజలందుకొని ఆకాశమార్గాన దేవలోకం చేరుకున్నారు నారద మహర్షి .

.వాల్మీకి మౌని హృదయం అవధులులేని ఆనందంతో పొంగిపొర్లిపోయింది.

. అవును !!!!!

అతడే ఆనందం ! అతడే పరబ్రహ్మము ! ఆనందమే పరబ్రహ్మము ! 

ఆ రామ బ్రహ్మము గూర్చి విన్న ఎవరి మనసు మాత్రము ఆనందంతో నిండిపోదు! ఆనంద స్వరూపుడుగదా ఆయన! .

.శిష్యులతో కలసి ప్రాతఃసంద్యావందనమాచరించడానికి 

తమసానదీ తీరం చేరుకున్నారు మహర్షి వాల్మీకి! 

.ఆ నదీ తీరం మనోహరంగా ఉన్నది! సమున్నతంగా పెరిగిన ఎన్నో జాతుల ఫలవృక్షాలు ,

వాటి మీద స్థిరనివాసమేర్పరచుకొన్న రకరకాల పక్షిజాతులు అవి చేసే కిలకిలారావాలు కడు రమణీయంగా ఉన్నది ఆ ప్రదేశం! 

.ప్రకృతికాంత ఎన్నో హొయలు ఒలకబోస్తున్నదక్కడ!

.నిర్మలంగా, స్ఫటికమంతస్వచ్ఛమైన నీటిప్రవాహంతో కనులకింపుగా ఉన్నది తమసా నదీ ప్రవాహం!

.తమస ఎలా ఉన్నదంటే.

.అకర్దమిదం తీర్దం భరద్వాజ నిశామయ

రమణీయం ప్రసన్నామ్బు సన్మనుష్యమనో యధా

.ఒక మంచి వాడి మనస్సు స్వచ్ఛంగా నిర్మలంగా ఏ కల్మషమూ లేకుండా ఎలా ఉంటుందో అలాగే ఏ మాత్రమూ బురదలేకుండా నిర్మలమనోహరంగా ఉన్నవట!  తమసాజలాలు!

.అత్యంత రమణీయంగా కనపడుతున్న ఆప్రదేశంలో స్నానమాచరించాలని నిశ్చయించుకొన్నారు మహర్షి 

.అలా రేవులో దిగి చుట్టూ చూస్తున్నారాయన !

. ఒక చెట్టుమీద రెండు క్రౌంచపక్షులు ప్రపంచాన్ని మరచి క్రీడిస్తున్నాయి సరససల్లాపాలలో మునిగి తేలుతున్నాయవి ! 

.ఆ సమయంలో ఎక్కడనుండి వచ్చిందో రివ్వున  ఒకబాణం వచ్చివచ్చి మగపక్షి గుండెల్లో సర్రున దిగబడింది .

అంతే!అప్పటిదాకాఉన్న వాటి 

ఆనందం క్షణాల్లో మటుమాయమయిపోయింది . మగపక్షి రక్తపుమడుగులో పడి విలవిలా తన్నుకుంటూ ప్రాణం విడిచింది .

. మగని శరీరం చుట్టూతిరుగుతూ హృదయ విదారకంగా రోదిస్తున్నది ఆడపక్షి!.

.ఆ దృశ్యం మహర్షి మనస్సును తీవ్రంగా కలచివేసింది ! చుట్టూ చూశారాయన ఒక బోయవాడు విల్లమ్ములు చేతబూని ఏదోసాధించిన వానిలా విజయగర్వంతో వస్తూ కనపడ్డాడు !

.అప్రయత్నంగా మహర్షి నోటి వెంట ఒక శ్లోకం వెలువడ్డది!

.మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః

యత్ క్రౌఞ్చమిథునాదేకమ్ అవధీః కామ మోహితమ్

.రతిసమయంలోఆనందంగా కూడి ఉన్న పక్షుల జంటను విడదీసి నీవు శాశ్వతమైన అప్రదిష్ట మూటకట్టుకున్నావు !

(అని అర్ధము.)

.అప్రయత్నంగా తన నోటినుండి వెలువడిన ఆ పదముల కూర్పునకు మహర్షి ఆశ్చర్యచకితులయ్యారు!

ఆ కూర్పును ఒక సారి పరిశీలించారు!

.అవి నాలుగు పాదములతో కూర్చబడి వున్నాయి!

వీణపై కూర్చి నృత్యగీతవాద్యాదులతో పాడటానికి ఒక క్రమపద్ధతిలో లయబద్ధంగా కూడా ఉన్నాయి! 

.ఆ విషాద ఘటన మదిలో కదలాడుతూ ఉండగా భారమైన మనస్సుతో ఆశ్రమం చేరుకున్నారు మహర్షి!

.ఆయన అలా వేదన లో ఉండగానే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయినారు!

. బ్రహ్మదేవునకు నమస్కరించి అర్ఘ్యపాద్యాదులొసగి ఒక ఆసనముపై ఆయనను కూర్చుండబెట్టి వినయముగా ఆయన చెంతన మహర్షి నిలుచున్నారు.

.ఈ పనులన్నీ చేస్తున్నా కూడా ఆయన మనసులో క్రౌంచపక్షులను బోయవాడుకొట్టిన ఉదంతం ,తానుపలికిన పలుకులు మెదులుతూ వున్నాయి .

అన్యమనస్కంగా వున్నారు మహర్షి.

.ఆయన అవస్థ గమనించిన విరించి చిరునవ్వు నవ్వుతూ మహర్షీ నీ నోటినుండి వెలువడినది శ్లోకమే! సందేహములేదు!  అది నా ఇచ్ఛవలననే నీ నోటినుండి వెలువడినది! 

.ఆ శ్లోకం ఉన్న రీతిలోనే నీవు రామకధను రచియించవయ్యా! ........

అని చెపుతున్నారు చతుర్ముఖుడు!

.సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment