అంతర్వేది లక్ష్మీనృసింహ స్వామి క్షేత్రం సుప్రసిద్ధం. ఏటా మాఘమాసంలో అంతర్వేది తీర్థం జరుగుతుంది. రథసప్తమి నుంచి బహుళ పాడ్యమి వరకూ స్వామి కల్యాణోత్సవ, బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. వివిధ వాహన సేవలతో పాటుగా రథోత్సవం కనులవిందు చేస్తుంది. పదిరోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు తెప్పోత్సవంతో పూర్తి అవుతాయి. అంతర్వేది నృసింహుడు పశ్చిమాభిముఖుడై దర్శనమిస్తాడు. వీరత్వానికి చిహ్నంగా కోరమీసాలతో కనిపించే అంతర్వేది నృసింహుని దర్శనం సకలార్ధసాధకం. అంతర్వేది గర్భాలయంలో నృసింహమూర్తితో పాటు శ్రీహరి మరో అవతారమైన శ్రీకూర్మం సాలిగ్రామ శిలామూర్తిగా పూజలందుకుంటోంది. పూర్వం రక్తకుల్యా నదిలో ఒక బెస్తవాడు వేసిన వలలో పదేపదే వస్తున్న రాయిని చూసి కోపంగా నేలకేసి కొట్టగా దానినుంచి రక్తం వచ్చింది. ఆ శిల కూర్మ సాలిగ్రామం అని, అంతర్వేది ఆలయంలో నృసింహునితో పాటు అభిషేకాలు జరిపించమని అశరీరవాణి ద్వారా తెలియవచ్చింది. నేటికీ అభిషేక సమయంలో గర్భాలయంలోని కూర్మ సాలిగ్రామాన్ని దర్శించవచ్చు. ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే మనకు రాజ్యలక్ష్మీ తాయారు దర్శనం లభిస్తుంది. అంతర్వేది ఆలయంలో లక్ష్మీనృసింహుని సన్నిధానంతో పాటు అనేక ఉపాలయాలు ఉన్నాయి. గరుడాళ్వార్ సన్నిధితోపాటు ఆంజనేయస్వామి, కేశవస్వామి, సంతాన వేణుగోపాల స్వామి, కోదండరామాలయం వీటిలో ప్రధానమైనవి. మాఘమాసంలో జరిగే నృసింహస్వామి వారి కల్యాణ, బ్రహ్మోత్సవాలు ప్రాచుర్యం పొందాయి. అంతర్వేది తీర్థం అంటే గోదావరి ప్రాంత ప్రజలు పెద్దసంఖ్యలో తరలివస్తారు. అంతర్వేది నృసింహుని రథోత్సవం వీక్షించినవారికి పునర్జన్మ ఉండదని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.
No comments:
Post a Comment