పుణ్యక్షేత్రములలో మాఘస్నానము
ఈవిధంగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను మాఘమాస స్నాన ఫల మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరించగా “మహర్షీ! మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడనైతిని. కాని మరొక సంశయం నాకు గలదు. అది ఏమనగా మాఘమాసమందు ఏయే తీర్థములు దర్శింపవలెనో సెలవిండనీ వినమ్రుడై కోరగా వశిష్ఠుల వారు మరల యిట్లనెను.
దిలీప మహారాజా! మాఘ స్నానములు చేయుటయందు ఆసక్తి గలవారలకు ముఖ్యమగు తీర్థ మహిమల గురించి వివరించెను. శ్రద్ధగా ఆలకింపుము.
మాఘమాసంలో నదీస్నానం ముఖ్యమైనది. మాఘ స్నానము చేయక తీర్థములు సేవించిన చాలునని అనుకొనుట అవివేకం. ఎందుకు అనగా మాఘమాసంలో ఏ నదిలోని నీరైనను గంగనీటితో సమానము. అందుచేత మాఘమాసంలో నదీస్నానం సర్వ పాపహరమైనది ఆవశ్యకమైనది కూడాను.అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం. ఈ భరత ఖండములో అతి ప్రధానమైన గంగానది సముద్రంలో కలియుచోట మాఘ స్నాన మాచరించిన ఏడు జన్మలలోని పాపములు సహితం హరించును. మాఘమాసంలో నదీస్నానంతో బాటు విష్ణు దేవాలయములు, మహేశ్వరాలయములు మొదలగు మూడువందల అరవై పుణ్యక్షేత్రములు దర్శించిన యెడల గొప్ప ఫలం కల్గుటయే గాక మరల జన్మ అనేది కలుగదు.
ఇక త్రయంబకమను నొక ముఖ్యమైన క్షేత్రం కలదు. అది పడమటి కనుమల దగ్గరున్నది. అచటనే పవిత్ర గోదావరీనది జన్మించినది. గౌతముడు తన గోహత్యా దోషమును పోగొట్టుకొనుటకు ఈశ్వరుని గురించి ఘోరతపస్సు చేసి, గోదావరిని గోహత్య జరిగిన ప్రాంతమునకు ప్రవహింపజేసినాడు. అదియునుగాక మాఘమాసంలో గోడావరియండు స్నానం చేసినయెడల సకలపాపములు తక్షణం హరించి పోవుటయే గాక ఇహమందు పరమందు సుఖపడుదురు. గౌతమీనదిలో మరికొన్ని ప్రసిద్ధములగు ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాతృత్వమును చాటుచున్నవి. అటులనే ‘పరంతప’ అను ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారముగా వెలసి వున్నాడు. దానికి ఆవలగా ప్రభావం అను క్షేత్రం గలదు. ఆ క్షేత్రం బ్రహ్మ హత్యా మహాపాపములను సహితం పోగొట్టగలదు. ఇందుకొక ఇతివృత్తము గలడు. సావధానుడవై ఆలకింపుము.
విష్ణుమూర్తి నాభికమలమున బుట్టిన బ్రహ్మకు ఈశ్వరునికి ఐదేసి తలలు ఉండేవి. ఈశ్వరునకు పంచవక్త్రుడు, త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు కదా! బ్రహ్మదేవుడు నాకు అయిదు తలలున్నవి, నేనే గొప్పవాడని అనగా నాకు ఐదు వలలున్నవి నేనే గొప్ప వాదనని శివుడు వాదించాడు. ఇద్దరూ గర్వముతో వ్యవహరించినందున చిలికి చిలికి గాలివాన వలె వారిద్దరిమధ్య కలహము పెద్దదయ్యెను. కడకు ఇద్దరూ యుద్ధముచేయగా శివుడు బ్రహ్మయొక్క ఐదవ తలను నరికివేసెను. వెంటనే శివునకు బ్రహ్మ హత్యాపాతము చుట్టుకున్నది.
శివుడు భయపడి నరికిన బ్రహ్మ తలను చేతితో పట్టుకొని ముల్లోకాలు తిరుగుతుండగా క్రమముగా చేతిలో ఉన్న బ్రహ్మ తల ఎండిపోయి పుర్రెగా అయినది. ఈశ్వరుడు ఆ పుర్రెతోనే భిక్షమడుగుచూ భూలోకానికి వచ్చాడు. ఈశ్వరుడు సహజంగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి ‘భిక్షాందేహి’యని అనగా గృహిణులు భిక్షపట్టుకొని గుమ్మము కడకు రాగా శివుని మోహనాకారమును చూచి మోహితులై భిక్షవేసి శివుని వెంట పోవుచుండిరి. ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి, కోపం కలవారై తమ భార్యలు శివుని వెంట పోవుట సహించలేక, ఈతనికి పురుశాత్వము నశించుగాక అని శపించెను.
ఈశ్వరుడు చేయునది లేక జారి క్రిందపడిపోయిన ఆ లింగమునందే ఐక్యమైపోయినాడు. అటుల లింగాకారంగా మారినందువలన ఎనలేని తేజస్సుతో ఆ లింగము ప్రకాశించుచుండెను. కోటి సూర్యుల తేజస్సు కలిగి ప్రళయం సంభవించునా? యన్నట్లు భయంకరంగా నుండెను. అప్పుడు బ్రహ్మ, విష్ణువు శివుని వద్దకు వచ్చి వానినోదార్చి ప్రయాగ క్షేత్రం వచ్చిపోయి అచ్చట శివునికున్న బ్రహ్మహత్యాది పాపములు పోయి ఆ విధంగా భూలోకమునకు వచ్చిన శివుడు అప్పటినుండీ లింగాకారంగా మారినందున భక్తులు ఆ లింగమునే పూజించుచు శివసాన్నిధ్యము పొందగలుగుచున్నారు.
No comments:
Post a Comment