Sunday, 18 February 2024

మాఘపురాణం -9వ అధ్యాయము


 MAAGHA PURANAM -- 9

పుష్కరుని వృత్తాంతము

ఈవిధంగా ఆ ముగ్గురు కన్యలు పునర్జీవుతులైన వృత్తాంతమును దిలీపునకు వివరించగా దిలీపుడు శ్రద్ధగా విని తర్వాత తనకు కలిగిన సంశయమును గురువర్యులను వశిష్ఠుల వారిని –

“పూజ్యులైన ఓ మహర్షీ! ఈ భూలోకమునకు, యమలోకమునకు దూరమెంత?” చనిపోయిన ఆ ముగ్గురు కన్యల ప్రాణములు ఎంత కాలములో వెళ్ళి వచ్చినవి?” అని ప్రశ్నించాడు.

వశిష్ఠుల వారు దీర్ఘముగా ఆలోచించి “మాహారాజా! అందరు తెలుసుకోదగిన ప్రశ్ననే అడిగావు. శ్రద్ధగా వినుము. భక్తి మార్గమునకు మించినది మరొకటి లేదు. చనిపోయిన ముగ్గురు కన్యలూ పుణ్యవతులు. వారొకసారి మాఘమాసములో స్నానమాచరించి ఉన్నందున వారికి కలిగిన పుణ్యఫలం వలననే మరల బ్రతుక గలిగినారు.

దీనికి ఒక ఉదాహరణ వివరింతును ఆలకించు. ఒకప్పుడు పుష్కరుడను విప్రుడు ఈ కన్యల వలే యమకింకరులచే యమలోకానికి పోయి తిరిగి భూలోకమునకు వచ్చెను. ఆ వృత్తాంతం కడు చిత్రమైనది.

పుష్కరుడను ఒక బ్రాహ్మణుడు మంచి జ్ఞానవంతుడు. సకల జీవులయందు దయగలవాడు. పరోపకారము చేయుటయే తన ప్రధాన ధ్యేయం. అతడు ప్రతి మాఘమాసమందునూ, నిష్ఠతో స్నాన జపములు మొదలగు పుణ్యకార్యములు విడువకుండ చేయు దీక్షావంతుడు. సదా భగవంతుని నామ సంకీర్తనలు పాడుచు, భజించుచు జీవితమును గడుపుతున్న పరమభక్తుడు.

ఒకనాడు యముడు పుష్కరుని ప్రాణములు తోడ్కొని రండని తన భటులకు ఆజ్ఞాపించినాడు. యమభటులు వెంటనే పోయి యా విప్రపుంగవుని ప్రాణములు తీసి యమునివద్ద నిలబెట్టారు. ఆ సమయములో యముడు చిత్రగుప్తునితో దీర్ఘాలోచనా నిమగ్నుడై ఉండెను. భటులు తోడ్కొని వచ్చిన పుష్కరునివైపు చూడగా పుష్కరుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించుచుండెను.

యమధర్మరాజునకు ఏదో భయము ఆవరించినట్లయింది. వెంటనే పుష్కరుని తన ప్రక్కనున్న ఆసనముపై కూర్చోవలసినదని కోరెను.

యముడు భటుల వంక కోపంగా చూచి – “ఓరీ భటులారా! పుష్కరుడను పేరుగలవాడు ఆ గ్రామమందే ఇంకొకడు ఉన్నాడు. వానిని తీసుకుని రాకుండా ఈ ఉత్తముని ఏల తీసుకు వచ్చారు?” అని గర్జించే సరికి వారు గడగడ వణికిపోయిరి.

యమధర్మరాజు పుష్కరుని వైపు జూచి నమస్కరించి జరిగిన పొరపాటుకు క్షమించమని కోరి భూలోకమునకు వెళ్ళుడు” అని చెప్పెను. జరిగిన పొరపాటునకు పుష్కరుడు కూడా విచారించి, సరే వచ్చిన వాడను ఈ యమలోకమును కూడా చూచి వెళతాన”ని అనగా యమలోకమును చూచుటకు పుష్కరునకు అనుమతించాడు .

పుష్కరుడు ఒక్కొక్క దిశకు పోయి నరుల పడుతున్న నరక బాధలను, జీవులు వారు చేసుకున్న పనులను బట్టి అనేక విధముల శిక్షలను అనుభవించుచుండుట పుష్కరుడు కనులారా చూసాడు.

అతనికి అమితమగు భయము కలిగింది. తన భయం బోవుటకు బిగ్గరగా హరినామ స్మరణ చేయసాగెను. వారి నామస్మరణ విన్న ఆ పాపజీవులు తమతమ పాపములను పోగొట్టుకొనుచుండిరి. వారి శిక్షలు ఆపు చేయడమైనది. యమలోకమంతయు చూచిన తరువాత పుష్కరుడు తిరిగి భూలోకమునకు వచ్చాడు. పాపులు అనుభవించుచున్న నరక బాధలను చూచి వచ్చినందున పుష్కరుడు మరింత జ్ఞానముతో భగవంతుని స్మరిస్తు ఉండేవాడు.

ఈ ప్రకారముగా కొంతమంది పుణ్యాత్ములు యమలోకము వెళ్ళి తిరిగివచ్చిన వారు ఉన్నారు ఇది నిజము.

పూర్వము శ్రీరామచంద్రుడు పరిపాలించు సమయమున ఒక విప్రకుమారుడు చనిపోయినాడు. ఆ వార్త విని రామచంద్రుడు యముని ప్రార్థించగా యముడు ఆ బ్రాహ్మణ బాలుని తిరిగి బ్రతికించినాడు. శ్రీకృష్ణుడు తనకు విద్యగరపిన గురువుగారి కుమారుడు చనిపోగా తన మహిమ వలన తిరిగి బ్రతికించెను.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment