Monday 19 February 2024

మాఘ పురాణం - 1️⃣1️⃣ వ అధ్యాయము

 



భీముని ఏకాదశివ్రతము

సంవత్సరములో వచ్చు పన్నెండు మాసములలోనూ మాఘమాసము అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసములో నదిలోగాని , నదిలేనిచోట తటాకమందుగాని , తటాకము కూడా అందుబాటులో లేనియెడల నూతివద్దగానీ స్నానము చేసినచో పాపములన్నియు హరించిపోవును. పూర్వం అనంతుడను విప్రపుంగవుడు యమునానదీ తీరమందున్న అగ్రహారములో నివసించుచుండెను. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు , తపశ్శాలురు , దానధర్మములు చేసి కీర్తి పొందినవారై యున్నారు.

అతడు చిన్నతనములో గడుసరి , పెంకివాడు , అతడు తల్లితండ్రుల భయభక్తులవలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకొనెను. దుష్టసహవాసమును చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యెను. మద్యమాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొను చుండెను. అలా సంపాదించి ధనవంతుడయ్యెను. కొంతకాలానికి వృద్దుడయ్యెను , తనకున్న ధనమును తాను తినడు , ఇతరులకు పెట్టడు , ఒకనాటి రాత్రి పరుండబోవునపుడిట్లు ఆలోచించెను. "అయ్యో ! నేనెంతటి పాత్ముడనైతిని ధనము , శరీరబలము వున్నదను మనోగర్వముతో జీవితాంతమూ ముక్తినిచ్చే పుణ్యకార్యమొక్కటియు చేయలేక పోయినానుగదా" అని పశ్చాత్తాపము నొందుతూ నిద్రపోయెను. అన్ని రోజులు ఒకే విధముగా నుండవు కదా ! ఆ నాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనమూ , బంగారమూ యెత్తుకొని పోయిరి.

అనంతుడు నిద్రనుండి లేచి చూడగా , అతని సంపదంతా అపహరింపబడినది అన్యాయముగా ఆర్జించిన ధనము. అన్యాక్రాంతము అయ్యెనని రోదన చేసినాడు. ఆ సమయమున పెద్దలనీతులు జ్ఞప్తికి వచ్చినవి తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము కోరసాగెను. ఆ సమయముననే మాఘమాసము నడచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను. అందువలన అతనికి మాఘమాస నదీస్నాన ఫలముదక్కెను. నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డునకు వచ్చెను. చలికి గడగడ వణికి బిర్రబిగసిపోవుచూ 'నారాయణా' అని ప్రాణములు విడచినాడు. ఆ ఒక్క దివ్యమైన నదిలో స్నానము చేయుట వలన అతడు చేసియున్న పాపములన్నియు నశించిపోయి వైకుంఠ వాసుడయ్యెను , అని వశిష్టుడు తెలియజేసెను.

పాండవులలో ద్వితీయుడు భీముడు అతడు మహాబలుడు , భోజనప్రియుడు , ఆకలికి యేమాత్రమూ ఆగలేనివాడు బండెడన్నమయినను చాలదు. అటువంటి భీమునకు ఏకాదశీ వ్రతము చేయవలయునని కుతూహలము పుట్టినది. కాని ఒక విషయములో బెంగతోయుండెను. అదేమందువా ! "ఏకాదశీనాడు భోజనము చేయకూడదు కదా ! భోజనము చేసినచో ఫలము దక్కదుకదా ! అని విచారించి , తన పురోహితుని కడకు బోయి , ఓయీ పురోహితుడా అన్ని దినములకంటే ఏకాదశి పరమ పుణ్యదినమని అనెదరుగదా దాని విశిష్టత యేమి" , అని భీముడు అడిగెను.

అందుకు పాండవ పురోహితుడు ధౌమ్యుడు "అవును భీమసేనా ! ఆరోజు అన్ని దినములకంటెను ప్రశస్తమైనది. శ్రీ మహా విష్ణువుకు ప్రీతికరమైనది. కనుక , అన్ని జాతులవారును ఏకాదశీ వ్రతము చేయవచ్చును" అని పలికెను. సరే నేను అటులనే చేయుదును. గాని , "విప్రోత్తమా ! నేను భోజన ప్రియుడునన్న సంగతి జగధ్విదితమే గదా ! ఒక ఘడియ ఆలస్యమైననూ నేను ఆకలికి తాళజాలను , కనుక , ఏకాదశినాడు ఉపవాసముండుట ఎటులా అని విచారించుచున్నాను. ఉపవాసమున్న దినముననే ఆకలి యెక్కువగా నుండెను. కావున ఆకలి దాహము తీరులాగున , ఏకాదశి వ్రతఫలము దక్కులాగున నాకు సలహానీయుము" , అని భీముడు పలికెను.

భీమసేనుని పలుకులకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి "రాజా ! ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము దీక్షతోనేకార్యము చేసినను కష్టము కనిపించదు , కాన , నీవు దీక్ష బూనినచో ఆకలి కలుగదు. రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ద ఏకాదశి మహాశ్రేష్ఠమైనది , దానిని మించిన పర్వదినము మరియొకటి లేదు. ఒక్కొక్క సమయములో మాఘ ఏకాదశిరోజు పుష్యమి నక్షత్రముతో కూడినదైయుండును. అటువంటి ఏకాదశీ సమాన మగునది మరి ఏమియులేదు. సంవత్సరమునందు వచ్చు ఇరువదినాలుగు ఏకాదశులలో మాఘశుద్ద ఏకాదశి మహాపర్వదినముగాన , ఆ దినము ఏకాదశీ వ్రతము చేసిన గొప్ప ఫలితము కలుగును. ఇందు యేమాత్రమును సంశయములేదు. కాన , ఓ భీమ సేనా ! నీవు తప్పక మాఘశుద్ద ఏకాదశి వ్రతము నాచరింపుము. ఆకలి గురించి దిగులు పడకుము , దీక్షతోనున్న యెడల ఆకలి యేమాత్రమునూ కలుగదు , నియమము తప్పకూడదు" అని వివరించెను.

ధౌమ్యుని వలన తన సంశయము తీరినట్లగుటలో భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతినిష్టతో వ్రతము చేసి ఉపవాసముండెను. అందులకే మాఘశుద్ధ ఏకాదశిని "భీమ ఏకాదశి" అని పిలుతురు. అంతియేగాక , ఓ దిలీప మహారాజా ! పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమందే వచ్చును. కాన మహాశివరాత్రి మహత్మ్యమును గురించి కూడా వివరించెదను. శ్రద్ధాళువువై ఆలకింపుము అని వశిష్టులవారు దిలీపమహారాజుతో నిటులపలికిరి. ఏకాదశి మహావిష్ణువునకు యెటుల ప్రీతికరమైన దినమో , అదేవిధముగా మాఘ చతుర్దశి అనగా , శివచతుర్దశి. దీనినే 'శివరాత్రీ యని అందురు. అది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము మాఘమాసమందలి అమావాస్యకు ముందురోజున వచ్చెడి దీనినే "మహాశివరాత్రి" అని అందరూ పిలిచెదరు. ఇది మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశినాడు వచ్చును. ప్రతి మాసమందువచ్చు మాస శివరాత్రి కన్నా మాఘ మాస కృష్ణపక్షములో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. ఆ రోజు నదిలోగాని , తటాకమందుగాని లేక నూతివద్దగాని స్నానము చేసి శంకరుని పూజించవలెను. పరమేశ్వరుని అష్ఠోత్తర శతనామావళి సహితముగా బిల్వపత్రములతో పూజించవలయును. అటుల పూజించి , అమావాస్య స్నానము కూడా చేసినయెడల యెంతటి పాపములు కలిగియున్ననూ , అవన్నియు వెంటనే హరించిపోయి , కైలాసప్రాప్తి కలుగును. శివపూజా విధానములో శివరాత్రి కంటె మించినది మరియొకటి లేదు. కనుక మాఘమాసపు కృష్ణపక్షములో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది. కాన శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతిభేదముతో నిమిత్తము లేక , అందరూ శివరాత్రి వ్రతమాచరించి జాగరణ చేయవలయును.

మున్ను శబరీ నదీ తీరమందున్న అరణ్యములో కులీనుడను బోయవాడు తన భార్యా బిడ్డలతో నివసించుచుండెను. అతను వేట తప్ప మరొక ఆలోచన లేని కడు మూర్ఖుడు వేటకు బోవుట , జంతువులను చంపి , వానిని కాల్చి , తాను తిని తన భార్యా బిడ్డలకు తినిపించుట తప్ప మరేదియు తెలియదు. జంతువులను వేటాడుటలో నేర్పు గలవాడు క్రూరమృగములు సైతం ఆ బోయవానిని చూచి భయపడి పారిపోయేడివి , అందుచేత అతడు వనమంతా నిర్భయముగా తిరిగేవాడు. ప్రతిదినము వలెనే ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులేమియు కంటబడలేదు. సాయంకాలమగుచున్నది. వట్టి చేతులతో యింటికి వెళ్ళుటకు మనస్సంగీకరించనందున ప్రొద్దుకృంగిపోయినన అక్కడున్న మారేడుచెట్టుపైకెక్కి జంతువులకొరకు యెదురు చూచుచుండెను. తెల్లవారుతున్నకొలదీ చలి ఎక్కువై మంచుకురుస్తున్నందున కొమ్మలను దగ్గరకులాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనుచుండెను. ఆ కొమ్మలకున్న యెండుటాకులు రాలి చెట్టుక్రింద ఉన్న శివలింగము మీద పడినవి. ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు పగలంతా తిండితినక రాత్రంతా జాగరణతో వున్నాడు. తనకు తెలియక పోయిననూ మారేడు పత్రములు శివలింగముపై పడినవి. ఇంకేమున్నది శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను. మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ , పైగా శివలింగముపై బిల్వపత్రములు పడుట , తిండిలేక ఉపవాసముండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి.

జరామరణములకు హెచ్చుతగ్గులుగాని , శిశువృద్ధ భేదములుగాని లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములనుబట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే , మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యము కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను. వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసికొనిపోవుచుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమధూతల చేతిలోనున్న బోయవానిని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు పోయిరి. యమభటులు చేయునదిలేక యమునితో చెప్పిరి. యముడు కొంత తడవు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను. శివుడు - పార్వతి , గణపతి , కుమారస్వామి , తుంబుర , నారదాది గణములతో కొలువుతీరియున్న సమయములో యముడు వచ్చి ఆయనకు నమస్కరించెను. ఉమాపతి యముని దీవించి , ఉచితాసనమిచ్చి కుశలప్రశ్నలడిగి వచ్చిన కారణమేమని ప్రశ్నించెను. అంతట యముడు , "మహేశా ! చాలా దినములకు మీ దర్శనభాగ్యము కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను. మీ దర్శనకారణమేమనగా , ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి , క్రూరుడు , దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి వున్నాడు. ఒకదినమున అనగా మహాశివరాత్రినాడు తాను యాదృచ్చికముగా జంతువులు దొరకనందున తిండితినలేదు. జంతువులను వేటాడుటకు ఆ రాత్రి యంతయు మెలకువగానున్నాడేగాని , చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు కనుక అతనిని కైలాసమునకు తీసుకువచ్చుట భావ్యమా అంతమాత్రమున అతనికి కైవల్యము దొరకునా" అని యముడు విన్నవించుకున్నాడు. "యమధర్మరాజా ! నాకు ప్రీతికరమగు మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నాపై వేసి తిండిలేక జాగరణతోనున్న ఈ బోయవాడుకూడా పాప ముక్తుడు కాగలడు. ఏ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసినవే గనుక , ఈ బోయవాడు పాపాత్ముడైనను , ఆనాటి శివరాత్రి మహిమవలన నా సాయుజ్యము ప్రాప్తమైనది" అని పరమేశ్వరుదు వివరించెను.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment