.గౌతమ మహర్షి ఆతిధ్యం స్వీకరించిన పిదప విశ్వామిత్ర మహర్షి ఈశాన్యదిక్కుగా ప్రయాణమయినాడు.
అన్నదమ్ములిరువురూ ఆయనను అనుసరించినారు.
.జనకుడి యజ్ఞ శాల ప్రవేశించారు మహర్షి!.
.మహాత్ముడు అయిన విశ్వామిత్ర మహర్షి రాక తెలిసికొని జనకమహారాజు తన పురోహితుడైన శతానందులవారిని వెంట నిడుకొని అతిశీఘ్రముగా ఆయన వద్దకు చేరి అర్ఘ్యపాద్యాదులొసగి ఆ మహానుభావుని తగురీతిని సత్కరించి అంజలి ఘటించి నిలుచున్నాడు.
.జనకుడిని యజ్ఞము ఏవిధముగా జరుగుతున్నదో అడిగి తెలుసుకున్నారు మహర్షి.
.అప్పుడు జనకుడి మదిలో ఒక ఉత్సాహమేర్పడి ,
మహర్షివెంట ఉన్న ధనుర్ధారులైన రాకుమారులెవరో తెలుసుకోవాలని కోరిక కలిగింది.
.మహర్షీ వీరిరువురూ ఎవరు?
పద్మపత్రాల వంటి కన్నులు,
అశ్వినీ దేవతల సౌందర్యం,
దేవతాసమానపరాక్రమము,
గజ సింహ సమానమయిన నడక ,
చూడగానే దేవతలవలే కనపడే ఈ బాలురెవ్వరు?
ఎవరివారు? నీతో కాలి నడకనే ఇచ్చటికి వచ్చినారెందుకు?
. జనకుడి ప్రశ్నల పరంపరకు చిరునవ్వుతో మహర్షి ఇలా సమాధాన మిచ్చారు.
.వీరు అయోధ్యా పురాధీశుడు దశరధమహారాజు కుమారులు రామలక్ష్మణులు! ..... అని చెప్పి!.
.తాటకద్రుంచి వైచి యతిదర్పితుడైన సుబాహుసాయకోత్పాటితు చేసి
గీటడిచి ధర్మ మెలర్పన్ అహల్య శాపముచ్ఛాటన
మొందజేసి కడు సమ్మద మారగ నీగృహంబునం
జాటగనున్న శంకరుని చాపము జూడగ వచ్చిరి ఏర్పడన్
.తాటకను చంపినవారు వీరే ,
సుబాహుడిని మృత్యువు కౌగిటిలోకి తోసినది వీరే ,
అహల్య శాపవిమోచనము గావించినవారు వీరే !
నీ ఇంట వున్న శివధనుస్సును చూడటానికి ఇప్పుడు ఇక్జడికి వచ్చారు.
.ఇది వింటున్న శతానందులవారు ఆనందంతో ఎగిరి గంతువేసి ఏమిటి మహర్షీ? మా అమ్మ అహల్యకు శాపవిమోచనమయినదా ? అని ఆత్రుతతో ప్రశ్నించాడు.
.శతానందులవారు అహల్యాగౌతముల కుమారుడు.
.N.B..
పై పద్యం భాస్కర రామాయణంలోనిది
No comments:
Post a Comment