మనం రకరకాల పేర్లతో పిలిచే ప్రతి గ్రామదేవత పేరు వెనుక ఒక పరమార్ధం ఉంది.
1. ఊరిని విడిచి పొరుగూరు వెళ్ళే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ వూరి పొలిమేరలో వుండేతల్లి "పొలిమేరమ్మ" క్రమముగా "పోలేరమ్మ" అయింది.
2. 'ఎల్ల' అంటే సరిహద్దు అని అర్దము. అందుకే 'ఎల్లమ్మ' కూడా ఈ పనిని చేసేదన్నమాట.
3. ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోషించే తల్లి 'పోచ+అమ్మ=పోచమ్మ' అన్నమాట. ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేదైతే, 'పోచమ్మ' పోషణ కలిగిస్తుంది.
4. ప్రతి వ్యక్తికీ ఇంతకాలము జీవించాలనే ఓ కట్ట (అవధి) ఏదుందో ఆ కట్టని మేయగల (ఆ అవధినించి రక్షించగల) అమ్మే 'కట్టమేయ+అమ్మ=కట్టమేసేయమ్మ - కాలక్రమములో "కట్టమైసమ్మ" అయింది.
5. స్వచ్ఛమైన అమ్మ అనే అర్దములో అచ్చ (స్వచ్ఛమని) సు+అచ్చ=స్వచ్ఛ అనే రెండు పదాలు కలిపి "అచ్చమ్మ" గా అయ్యింది.
6. సాధారణముగా 15 వూళ్ళకో దేవత వుంటుంది. 'మా వూళ్ళన్నింటికీ అమ్మ' అనే అర్దములో ఆమెను "మావూళ్ళమ్మ" అని పిలుస్తూంటే క్రమముగా అది "మావుళ్ళమ్మ" అయింది.
7. ప్రజల మనసులో పుట్టి ఏ కోర్కె ఏదైనా అది మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోర్కెని తీర్చే బాధ్యతని స్వీకరంచి భక్తులకు అండగా నిలిచే తల్లి "తలుపులమ్మ". 'తలపు' అంటే ఆలోచన. ఆ తలపులను తీర్చే తల్లి "తలపులమ్మ" క్రమముగా ఈమె "తలుపులమ్మ" గా మారింది. ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటపుడు తల్లికి లేదా భార్యకి ఎలా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రార్థించి వెళ్ళడం చేస్తారు.
8. శంకరునితో కలసి అర్దనారీశ్వర రూపముతో అమ్మవారుండేది. ఆకారణముగా శంకరుని మెడమీద (గళము) మచ్చ (అంకం) కారణముగా "అంకగళమ్మ", "అంకాళమ్మ" గా మారిపోయింది.
9. పొలిమేరలో వుండే మరొక తల్లి "శీతలాంబ". ఈమె చేతుల్లో చీపురు, చేట ఉంటాయి. తన గ్రామములోని ప్రజలకు వ్యాదులను కలిగించే క్రిమి కీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత పిచాచ గణాలను గ్రామములోనికి రాకుండా వూడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈదేవతే.
10. పాములు బాగా సంచరించే చోటులో వుండే దేవత తల్లి "పుట్టమ్మ". ఈమె గుడిలో అనేక పుట్టలుంటాయి. అక్కడే సుబ్రహ్మణ్య షష్టికి అందరూ పుట్టలో పాలు పోస్తారు. ఈ తల్లికే "నాగేశ్వరమ్మ" అని కూడా అంటారు. పాప (అంటే పాము)+అమ్మ=పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లికి "పాపమ్మ" అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు పేరుమీదే "సుబ్బ+అమ్మ= "సుబ్బమ్మ" కూడా దైవముగా ఉంది.
11. బతుకుకి కావలసిన వర్షాన్ని పంటలనూ ఇచ్చే తల్లి "బతుకమ్మ".
12. గ్రామప్రజల మంచిని చూసే (కనే) అమ్మ "కన్నమ్మ"గా ఎప్పుడూ సత్యాన్ని (నిదర్శనాలని) చూస్తూవుండే తల్లి సత్య+అమ్మ= "సత్తెమ్మ".
13. అలాగే పుల్ల (వికసించిన కళ్ళున్న) అమ్మ "పుల్లమ్మ". ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూస్తుంది కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది.
14. ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకొనే చోటవున్న తల్లి అర్పణ+అమ్మ = "అర్పణలమ్మ" క్రమముగా "అప్పలమ్మ" అయినది.
15. బెల్లము బాగా వున్న ప్రాంతాలలో ఈ తల్లికి అప్పాలు బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్పాల+అమ్మ= "అప్పలమ్మ" అన్నారు.
16. అమ్మవార్ల వూరేగింపులో అన్నిటికన్న చిన్నది బాలా త్రిపుర సుందరి విగ్రహానికి సమమైన వుజ్జీ అయినదీ పెంటి (బాల)+అమ్మ= "పెంటమ్మ".
17. భోజనాన్ని అందించగల తల్లి అనే అర్థములో బోనముల (భోజనమనే పదానికి వికృతి)+అమ్మ= "బోనాలమ్మ".
18. అయ్య అయిన శంకరునికి అమ్మ (భార్య) కాబట్టి ఈమెను "అయ్యమ్మ" ని కొన్ని చోట్ల పిలుస్తారు.
19. లలితాంబ భండాసురుణ్ణి చంపేందుకు గుర్రాలమీద కూర్చొన్న స్త్రీ సైనికుల సైన్యముతో వెళ్ళినది కాబట్టి గుర్రాల+అమ్మ= "గుర్రాలమ్మ" అయినది.
20. ఊరు పేరుని బట్టి పిల్చుకొనే దేవతలు కొందరున్నారు. సోమప్రోలు+అంబ="సోమపోలమాంబ" అన్నారు. సోమప్రోలు అనే గ్రామము ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట.
21. సీతాదేవి వనవాసం చేసిన సమయంలో గౌతమీ నదిలో స్నానం చేసి వనదేవతలను పూజించగా ఆమె ప్రత్యక్షమైనదని అప్పటినుంచి కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా పూజలు అందుకుంటుందని ప్రసిద్ధికెక్కిన తల్లి తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలోని వానపల్లి అనే గ్రామంలో ఉన్న "పళ్ళాలమ్మ" "పళ్లమాంబిక". ఇక్కడ వెలసిన అమ్మవారిని ఈ గ్రామస్తులు కాళికా దేవి అవతారంగా భావించి పూజిస్తారు. ఈ ఆలయంలో అమ్మవారు కాలుపై కాలు వేసుకుని భక్తులకు దర్శనమిస్తారు. ఈ అమ్మవారి పాదాల కింద నక్కను తొక్కి ఉండటం విశేషం. ఆంధ్రప్రదేశ్ లోని పలు గ్రామాలలో ఈ అమ్మవారి విగ్రహం ఉండడం విశేషం...
No comments:
Post a Comment