.విశ్వామిత్ర మహర్షి చెప్పే కధలతో రోజొక క్షణంలా గడచిపోతున్నది రామలక్ష్మణులకు.
గంగావతరణం,క్షీరసాగరమధనం లాంటి కధలెన్నో చెప్పారు మహర్షి! .
.గంగను దాటి నడుచుకుంటూ మిధిలానగరసమీపానికి వస్తూ ఉండగా వారి దృష్టిని ఒక ఆశ్రమము ఆకర్షించింది.
.అది అత్యంత పురాతనమైనది,అయినా అందంగా ఉన్నది!
చిత్రంగా అక్కడ మనుష్య సంచారం లేదు! శూన్యమావరించినట్లుగా ఉన్నది!.
.మహర్షీ ఈ ఆశ్రమము ఎవరిది? ఎప్పటిలానే రాముడు ప్రశ్నించాడు!.
.రాముడికి కధలు చెప్పటం అంటే విశేషమైన ఆసక్తి కనబరుస్తున్న మహర్షి రాముడు అడిగిన వెంటనే చెప్పసాగాడు.
.రామా ! ఇది గౌతమ మహాముని ఆశ్రమము ! ఆ ముని గొప్ప తపఃసంపన్నుడు ! ఆయన భార్య అహల్య! అతిలోక సౌందర్యరాశి! .
.ఆవిడ మీద ఇంద్రుడి కన్నుపడ్డది ! ఒక రోజు గౌతమ మహర్షిలేని సమయంలో గౌతముడి రూపం ధరించి అహల్యచెంతచేరాడు .
ఆవిడ పొందుగోరాడు ! వచ్చిన వాడు ఎవరో అహల్యకు తెలుసు! అయినా ఆతనితో సుఖించింది! ..ఇంద్రుడు తిరిగి వెడుతుండగా గౌతముడి కంటపడ్డాడు శాపానికి గురి అయినాడు..
.భార్యను కూడా శపించాడు ! వేల సంవత్సరాల పాటు నీవిచ్చటనే ఎవరికీ కనపడకుండా భస్మములో పడియుండి ,కేవల వాయు భక్షణము మాత్రమే చేస్తూ తపస్సు చేస్తూ ఇక్కడే పడి వుండు ,శ్రీరాముడు వచ్చినప్పుడు నీవు పరిశుద్ధురాలవై నన్ను చేరెదవు !అని శపించి తాను వెళ్ళి పోయాడు.
.ఇదిగో! అదే ఆ ఆశ్రమము! అని చెపుతూ ఆ ఆశ్రమ ప్రాంగణంలో కాలు మోపుతుండగా! ఒక అద్భుతం జరిగింది!.
.ఒక్కసారిగా ఆశ్రమ ప్రాంగణం ఏదో కొత్తదనం సంతరించుకుంది!
నిద్రాణమైన వస్తువులన్నీ మరల చేతనత్వం పొందాయి .తిరిగి నెమ్మదిగా జీవకళను సంతరించుకుంటున్నాయి!.
.దూరంగా బూడిదకుప్పలో ఏదో కదలిక వచ్చినట్లుగా ఉన్నది.
.ప్రభుమేనిగాలి పైవచ్చినంతనంతనే పాషాణమొకటికి స్పర్శ వచ్చే!
ప్రభు కాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్క దానికి చెవులుకలిగే!
ప్రభుమేని నెత్తావి పరిమళించినతోనె యశ్మమొకటి ఘ్రాణేంద్రియము చెందే!
ప్రభునీలరత్నతోరణ మంజులాంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగే.
.శ్రీ రామచంద్రుడి శరీరం మీది గాలి సోకగనే ఒక రాయికి స్పర్సకలిగిందట,ఆయన కాలిసవ్వడి విని చెవులు పనిచేయటం మొదలుపెట్టినవట! ఆయన శరీర సుగంధము వ్యాపించినంతనే ఒకరాయికి వాసనలు తెలుస్తున్నవట! నీలమేఘశ్యాముని రూపం కనవచ్చి రాతికి కన్నులు పనిచేయటం మొదలు పెట్టినవట .
చివరిగా ఆ శిల అహల్య ఆకారాన్ని సంతరించుకొన్నది!.
.ఇంతలో గౌతమ మహర్షి కూడా వచ్చి చేరాడు వారిని .
.అహల్య పట్టరాని ఆనందంతో ప్రభువు రూపాన్ని చూస్తూ అలాగే శిలలాగ నిలుచండి ఆనందపారవశ్యంలో మునిగి పోయింది.
.మునిదంపతుల ఆతిధ్యం స్వీకరించి మిధిలలో కాలుమోపాడు కోదండపాణి.
.N.B.
. పైపద్యం విశ్వనాధవారి కల్పవృక్షం లోనిది!
.ఈ వృత్తాంతం సహజమయిన మానవ బలహీనతలు మనలను తప్పు చేయించినప్పటికీ ! ప్రాయశ్చిత్తం చేసుకొని,ఆ తప్పు చేయటం వలన కలిగిన అపరాధభావనలు ధ్యానం, తపస్సు ద్వారా తుడిచివేసుకొని మరల అంతరంగం పరిశుద్ధమైనదయితే చాలు అని చెపుతున్నది.
.ఒక తప్పు జరిగిన వెంటనే మనిషిజీవితం నాశనం కారాదు !ప్రాయశ్చిత్తం చేసుకున్న భార్యను స్వీకరించటంలోనే గౌతమమహర్షి యొక్క విశాల హృదయం మనకు తెలుస్తున్నది.
.సర్వేజనా సుఖినో భవంతు
No comments:
Post a Comment