MAAGHA PURANAM -- 11
మార్కండేయుని వృత్తాంతము
వశిష్ఠుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహం, మృకండు జననం, కాశీవిశ్వనాథుని దర్శనం, విశ్వనాధుని వరము వలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతమును వివరించి –
మహారాజా! ఇక మార్కండేయుని గురించి వివరిస్తాను శ్రద్ధగా ఆలకించుమని వశిష్ఠుల వారు చెప్పసాగారు. మార్కండేయుని ఆయువు పదహారు సంవత్సరములు మాత్రమే. రోజులు గడుచుచున్న కొద్దీ తల్లిదండ్రులకు దిగులు ఎక్కువ అవుతున్నది. అయిదేళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తిచేసి ఆరవయేడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభము చేసారు. అతడు తన తండ్రివలెనే అచిరకాలములోనే సకల శాస్త్రములు, వేదాంత, పురాణ, ఇతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలను పొందాడు.తల్లి తండ్రులు “కుమారా! నీవు పసితనమందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్ననలను పొందుతున్నావు. అందులకు మేము చాలా సంతోషము పొందుతున్నాము. గురువులయెడ పెద్దలయెడ బ్రాహ్మణులయెడ మరింత భక్తిభావంతో మెలగవలయును. వారి ఆశీస్సులు నీకు మంగళకరములు. నీవట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధియగును” అని చెప్పారు.
పదిహేను సంవత్సరములు గడిచిపోయినది. రోజురోజుకి తల్లిదండ్రుల ఆందోళన, భయం ఎక్కువ అవుతున్నది. పరమశివుని వరప్రసాదుడగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలెనని తలచి ఋషులందరకి ఆహ్వానములు పంపించారు. మునీశ్వరులు గురువర్యులు మొదలగు వారందరూ మృకండుని ఆశ్రమానికి వచ్చారు. అందుకు మృకండుడు ఆనందముతో అతిథి సత్కారములు చేసాడు. మార్కండేయుడు వచ్చిన పెద్దలందరకు నమస్కరించాడు. అటులనే వశిష్ఠునకు నమస్కరించగా అతడు మార్కండేయుని వారించాడు. అలా చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి “మహానుభావా! మీరు వారించుటకు కారణమేమి?” అని ప్రశ్నించారు.
వశిష్ఠుల వారు “ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఇతనిని “చిరంజీవివై వర్ధిల్లు” అని దీవించారు. ఇతని ఆయుర్దాయము పదహారేండ్లే ! ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవము జరుపుతున్నారు. పరమేశ్వరుదు ఇచ్చిన వరము ప్రకారము ఇతడు ఒక్క సంవత్సరమే జీవిస్తాడు” అనగా అంతవరకూ మార్కండేయుని దీవించిన మునీశ్వరులు అందరు చాలా విచారించి “చిరంజీవివై వర్ధిల్లు”మని దీవించినందున వారి వాక్కు అమంగళమగునని బాధపడి “దీనికి మార్గాంతరము లేదా? అని వశిష్ఠుల వారినే ప్రశ్నించారు. వశిష్ఠుడు కొంతసేపు ఆలోచించి “మునిసత్తములారా! మనము ఈ మార్కండేయుని వెంటబెట్టుకొని బ్రహదేవుని వద్దకు వెళదామ” ని పలికి మార్కండేయుని బ్రహ్మదేవుని వద్దకు తీసుకుని వెళ్ళారు.
మునీశ్వరుల ఆగమనమునకు బ్రహ్మదేవుడు సంతోషించాడు. మునులందరితో పాటు మా ర్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ “చిరంజీవిగా జీవించు నాయనా” అని దీవించాడు. వశిష్ఠమహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును వివరించగా బ్రహ్మదేవుడు కూడా జరిగిన పొరపాటుకు విచారపడి కొంతసేపు ఆగి “భయపడకు” అని మార్కండేయుని దగ్గరకు చేరదీసి “పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా చేయును గాక” అని తన మనస్సులో శివుని ధ్యానించాడు. మునులవంక జూచి ఓ మునులారా! మీరు వెళ్లి రండి. ఇతనికి ఏ ప్రమాదము జరుగదని పలికి, వత్సా! మార్కండేయా! నువ్వు కాశీక్షేత్రమునకు వెళ్ళి సదా విశ్వనాథుని సేవిస్తు ఉండు. నీకు ఏ ఆపదకలుగదని పంపించాడు.
మార్కండేయుడు ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీవిశ్వనాథుని సేవించి వస్తాను. అనుజ్ఞ ఇమ్మని కోరగా మృకండుడు అతని భార్య కొడుకుయొక్క ఎడబాటునకు ఎంతో దుఃఖించిరి. చివరికి మార్కండేయుని దీక్షను కాదనలేక కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరారు.
కుటుంబ సహితముగా కాశీవెళ్ళి మృకండుడు కాశీవిశ్వేశ్వరాలయ సమీపమందు ఒక ఆశ్రమము నిర్మించాడు. మార్కండేయుడు సదా శివధ్యానపరుడై రాత్రింబవళ్ళు శివలింగము వద్దనే ఉండేవాడు. పదహారవయేడు ప్రవేశించెను. మరణ సమయమము ఆసన్నమైనది. “మార్కండేయుని ప్రాణములు తెమ్మని” ఆజ్ఞాపించిన యముని ఆజ్ఞ మేరకు భటులు మార్కండేయుని ప్రాణములు తీసుకునిపోవుటకు శివసన్నిధిని ధ్యానము చేసుకొనుచున్న మార్కండేయుని వద్దకు వచ్చారు కానీ భటులు అతని సమీపమున నిలువలేకపోయారు. కాలపాశము విసరుటకు చేతులు ఎత్తలేకపోయారు. మార్కండేయుని చుట్టూ మహాతేజస్సు ఆవరించి ఉన్నది. ఆ తేజస్సు యమభటులను అగ్నిలా బాధించినది. ఆ బాధ ఓర్చుకోలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమును యమునకు చెప్పగా యముడు ఆశ్చర్యపడి తానే స్వయముగా మార్కండేయునిపై కాలపాశము విసిరాడు. మార్కండేయుడు కన్నులు తెరచి చూసేసరికి యముడు తన ప్రాణమును తీసుకుపోవ సిద్ధముగా ఉండుటము చూసి భయపడి శివలింగమును కౌగలించుకొని ధ్యానించాడు. పార్వతీపతి తన భక్తుని ఆక్రందన విని మహా రౌద్రాకారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి మార్కండేయుని రక్షించాడు.
యముడు చనిపోవుటకు అష్టదిక్పాలకులు, బ్రహ్మాది దేవతలు వచ్చి శివుని అనేక విధముల ప్రార్థించి జటాధారి కోపము చల్లార్చి “ మహేశా! యముడు తన కర్తవ్యమును నెరవేర్చాడు. మీరు వరప్రసాదుడగు మార్కండేయునికి పదహారేండ్లు మాత్రమే ఆయువును ఇచ్చారు గదా! అతనిని ఆయువునిండిన వెనుకనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చాడు. మీరు మార్కండేయుని చిరంజీవిగా చేసినందుకు మేము ఎంతో ఆనందిస్తున్నాము. ధర్మ పాలన నిమిత్తం వచ్చిన యముడు మరణించుట లోకములకు లోటుకదా! మరల యముని బ్రతికించమని వేడుకొన్నారు. ఈశ్వరుడు యముని బ్రతికించి “యమా! నీవు నా భక్తుల దరికి రావద్దుసుమా!” అని పలికి అంతర్ధానమయ్యాడు. పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడయినందులకు మృకండుడు ఎంతో సంతోషించాడు. తాను చేసిన మాఘమాస వ్రతఫలమే తన కుమారుని కాపాడిందని మాఘమాస ప్రభావం లోకులందరకు చెపుతూ ఉండేవాడు.
సర్వేజనా సుఖినో భవంతు
No comments:
Post a Comment