.
ఆ అడవిలో కాలుపెట్టే సందులేనంతగా అల్లుకొనిపోయి ఉన్నాయి వృక్షాలు,లతలు .దానికి తోడు పురుగులు ఈలవేసుకుంటూ చేసే ధ్వని!అత్యంత కర్ణకఠోరంగా అరిచే వివిధరకాల జంతువులు ,క్రూరమృగాలు ,
సామాన్యుడి గుండె జలదరించేటట్లున్నదా వనము .
.మహర్షిని కుతూహలంతో అడిగాడు!రాముడు! ఏమిటిది ? ఈవిధంగా ఎందుకున్నది? అని
.రామా ,పూర్వము ఇది రెండు దేశముల సముదాయము
అవి ఒకటి మలదము,రెండు కరూశము .
.ఈ రెండు దేశాల ప్రజలు సుఖశాంతులతో ,ధనధాన్యసమృద్ధితో హాయిగా జీవనంసాగించేవారు..
.మహర్షీ ఈ దేశాల పేర్లు వింతగా ఉన్నవేమిటి? మలదము,కరూశమా? ఆ పేర్లెట్లా వచ్చినవి? అని రాముడు ప్రశ్నించాడు.
.రామా ! పూర్వము వృత్రాసుర వధ అయిన పిదప ఇంద్రుడికి బ్రహ్మహత్యాపాతకము చుట్టుకున్నది .
అతనిని తీవ్రమైన ఆకలి బాధించింది! ,శరీరమంతా మలినమయై అసహ్యకరంగా మారిపోయాడు!.
అప్పుడు సకలమునిసంఘాలు,దేవతలు ఆయన శరీరమలాన్ని కడిగివేసి మలాన్ని తొలగించారు ,అదేవిధంగా ఆకలిని (కారుశాన్నికూడా) తొలగించారు.
. ఆతని మలాన్ని ,ఆకలిని స్వీకరించిన భూమి కావున మలాదము,కరూశము అని పేర్లు ఈ ప్రాంతానికి!.
.దేవేంద్రుడు సంతోషంతో ఈ ప్రాంత ప్రజలు సుఖంగా ఉండేటట్లు వరమిచ్చాడు!.
.కొంతకాలానికి ఒక యక్షిణి ,స్వేచ్ఛారూపధారిణి, వేయి ఏనుగుల బలమున్నది,తాటక నామధేయురాలు ఈ ప్రాంతంలో జనులను పీడిస్తూ వారిని భయభ్రాంతులను చేస్తూ స్వేచ్ఛగా సంచరిస్తున్నది.
.దాని భర్త సుందుడు ,కొడుకు మారీచుడు! కొడుకు కూడా తల్లివలెనే మహాబలవంతుడు వాడి బారినపడి బాధపడని వాడు లేడు! .
.తల్లీ కొడుకులంటే ఉన్నభయం చేత ఈ ప్రాంతంలో అడుగు మోపే సాహసం ఎవ్వరూ చేయటంలేదు. మనమున్న ప్రదేశం నుండి ఒకటిన్నర ఆమడల దూరంలో దాని నివాస స్థానం !
.రామా ! అలాంటి ఘోరతాటకను నీవు వధించాలి! అని విశ్వామిత్రుడు పలికాడు!.
.రాముడప్పుడు వినయంగా, మహర్షీ యక్షులకు ఇంతటి బలములేదని విన్నాను ఈవిడకింత బలమెక్కడిది? అని ప్రశ్నించాడు! .
.నీవన్నది నిజమే రామా ! ఇది సుకేతుడు అనే గొప్పయక్షునకు బ్రహ్మ వరప్రసాదం వల్ల జన్మించింది.
వేయిఏనుగుల బలంపొందింది.
.దీని భర్త సుందుడు అగస్త్య మహర్షికి చేసిన అపచారం వల్ల ఆయన శాపానికి గురి అయి మరణించాడు.
.అందుకు ఆగ్రహించి తల్లీకొడుకులు ఇరువురూ ఆయనను భక్షించబోగా ఇరువురినీ రాక్షసులు కమ్మని శపించాడు !
.అప్పటినుండి అది ఈ ప్రదేశాన్ని నాశనంచేస్తూ వస్తున్నది!
ఈ ప్రదేశం ఒకప్పుడు అగస్త్యుడు నివసించినప్రాంతం!
.రామా !నీవు తప్ప ముల్లోకాలలో దానిని వధింప సమర్ధుడు లేడు!
.సర్వేజనా సుఖినో భవంతు
No comments:
Post a Comment