పుష్య మాసానికి చివరిరోజైన అమావాస్యని చొల్లంగి అమావాస్య అంటారు. కాకినాడ నగరం నుంచి యానాం వెళ్లేదారిలో జగన్నాథపురం వంతెనకు 4 కిలోమీటర్ల దూరంలో చొల్లంగి గ్రామం ఉంది. అక్కడే గోదావరీ నది ఏడుపాయల్లో ఒకటైన తుల్యభాగ సముద్రంలో కలుస్తుంది. ఏడు గోదావరి పాయల్లో ఈ పాయను తుల్యభాగ మహర్షి తీసుకువచ్చాడు. సప్తసాగరయాత్ర చేసేవారు చొల్లంగి అమావాస్య నుంచి ప్రారంభిస్తారు. గోదావరి ఏడుపాయలూ సముద్రంలో కలిసే ప్రాంతాల్లో స్నానం చేస్తూ పదిహేను రోజుల తరువాత వచ్చే పౌర్ణమినాడు అంతర్వేది వద్ద స్నానం చేస్తారు. ఆరోజు మాఘపౌర్ణమి అంతర్వేది తీర్థం నిర్వహిస్తారు. పుష్య అమావాస్యకు చొల్లంగి తీర్థంలో అప్పన్న ఎద్దుల్ని ఊరేగిస్తారు. ఇదే రోజు పరమశివుడు నందీశ్వరుడికి మోక్షం ప్రసాదించాడు. బంగారులేడి రూపంలోని మారీచుణ్ణి తరుముకుంటూ వచ్చిన రాముడు వేసిన బాణం చొల్లంగిలో పడిందని జానపదులు చెప్పుకుంటారు. చొల్లంగిలో వందేళ్లక్రితం నిర్మించిన శ్రీబాల త్రిపురసుందరీ సమేత సంగమేశ్వర స్వామి దేవస్థానం ఉంది. పుణ్యస్నానాలు చేసే వేలాది భక్తులతో చొల్లంగి తీర్థం ఈ అమావాస్యకు కళకళలాడుతుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 9న చొల్లంగి తీర్థం జరుగుతుంది.
No comments:
Post a Comment