..
ఆ విషయం ఎరుక పరచటానికే తాను వచ్చినాడు ,అదే విషయం వాల్మీకి మునిపుంగవుడడిగినాడు! .
.వాల్మీకి ముని ప్రశ్న విని ,నీలాకాశంలో పండువెన్నెల పరచుకున్నంత హాయిగా ఒక చిరునవ్వు వెలయించారు నారద మహర్షి! అవును ! ఆ మహాపురుషుడిగురించి ఆలోచించగనే ఎవరి హృదయం వికసించదు!
(.రమయతీ ఇతి రామః రాముడి గురించిన తలపురాగానే హృదయకవాటాలు భేదించుకొని ఆనందం బహిర్గతమవుతుంది)
.తాను బ్రహ్మగారి వద్దనుండి తెలుసుకొన్న విషయాన్ని వాల్మీకి మహర్షికి విశదపరుస్తున్నారు విశ్వసంచారి!.
.ఓ మహర్షీ నీవు అడిగిన గుణములతో కూడిన ఒకే ఒక మహాపురుషుని గురించి నీకు తెలియచేస్తాను! సావధానచిత్తంతో వినవయ్యా!
.ఇక్ష్వాకు వంశ ప్రభవో రామోనామ జనైః శ్రుతః
నియతాత్మా మహవీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ!
.ఇక్ష్వాకు వంశ ప్రభువులలో "రాముడు " అనే పేరుగల మహాపురుషుడున్నాడని జనులంతా విని ఉన్నారు!
ఆయన కాంతిమంతము,శక్తివంతమూ అయిన శరీరం కలిగి అన్ని ఇంద్రియములను తన వశంలో ఉంచుకొన్నవాడు!.
.ఆయన బుద్ధిమంతుడు,నీతిమంతుడు,సర్వశాస్త్రపాండిత్యము ,
మహదైశ్వర్యము గలవాడు!
ఆయన రూపం చూడచక్కనిది మనోహరమయినటువంటిది
ఏ శరీర భాగం ఎంత ఉండాలో అంత కొలిచి నట్లుగా సృష్టించాడు బ్రహ్మ!
ఉన్నతమైన మూపులు (వాటి ఎముకలు బయటకు కనపడవు)ఎంత పెద్ద విల్లునయినా మోయగల మూపులువి!,
.బాగా బలిసి మోకాళ్ళవరకు వ్రేలాడే బాహువులు,శంఖం వంటి కంఠము, ఎత్తైన చెక్కిళ్ళు,
.విశాలము, కఠినము అయిన వక్షస్థలము, సర్వ లక్షణ శోభితమైన శిరస్సు !
.చూడగనే ఆకర్షించి చూపులు కట్టిపడవేయగల మనోహర సుందర రూపము!.
.ఆయన అరిందముడు! అంతర్గతశత్రువులను ,బాహ్యశత్రువులను మర్దించినవాడు.
( కామ,క్రోధ,లోభ,మద,మోహ,మాత్సర్యము లు అంతర్గత శత్రువులు).
.రక్షితా జీవలోకస్య ధర్మస్యపరిరక్షితా! ...సమస్త ప్రాణికోటిని కాపాడుతూ ధర్మాన్ని పరిరక్షించేవాడాయన!.
.వేదవేదాంగ రహస్యములు ,ధనుర్వేదము ఆయనకు కరతలామలకము!.
.తల్లి కౌసల్య ఆనందాన్ని పెంపొందించేవాడు ,సముద్రమంత గాంభీర్యము కలవాడు హిమాలయాలంత ధైర్యము కలవాడు!.
.లోకంలోని నదులన్నీ ఏవిధంగా అయితే సముద్రాన్ని చేరటానికి ఆరాటపడుతూ పరుగులు పెడుతుంటాయో అదే విధంగా లోకంలోనిసమస్తమునిసంఘాలు,జానపదులూ,నాగరికులు,
సమస్తప్రాణికోటి ఆ మనోహర సౌందర్యమూర్తిని కనులారా దర్శించి తరించాలని ఆయన ఉన్న చోటికి ఉరుకులు పరుగుల మీద వెడుతుంటారు!
.ఆయన శ్రీ రాముడు!
.
No comments:
Post a Comment