మహా శివరాత్రి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు
వేలుపు లైన లావులు సెడి వేదన బొందుచు నా విషానల,
జ్వాలలు సోకినంతటన చత్తురు, నేడిదేమి చోద్య? మా,
భీలవిషాగ్ని హేతిచయపీడకు నోర్చియు గ్రమ్మరంగ నీ,
బాలుడు మతృణాశతము భగ్నముగా వెస ద్రొక్కియాడెన్,""
ప్రాయోపవేశదీక్షలో యున్న పరీక్షిత్తు శ్రీ శుకులను కాళింది మడుగు గురించి అడుగగా,
ఓ మహారాజా వినవయ్యా! రమణకద్వీపములో కాళీయుడనేవాడు తన భార్యలతో నివసిస్తున్నాడు. ద్వాపరయుగంలో సర్పాలకి నైవేద్యాలు పెట్టి పూజలు చేసేవారు.అక్కడయున్న సర్పాలు ఆ నైవేద్యాలలో కొంత భాగము గరుత్మంతునికి వదిలి మిగతావి సర్పాలు భుజించేవి. ఈ పద్ధతికి ఈ కాళీయుడు వ్యతిరేకించి గరుత్మంతుని భాగముకూడ తానే తినివేయసాగాడు.దానితో గరుత్మంత కాళీయులకి భయంకరమైన యుద్ధము జరగగా,దానిలో కాళీయుడు తన కోరలు కోల్పోయి కాళింది మడుగులో దాక్కొన్నాడు.
ఓ రాజా పూర్వము సౌబరి అనేమహర్షి ఈ కాళీయమడుగులో తపస్సు చేసుకునేవాడు.ఆ మడుగులో కొన్ని వేల చేపలు నివసించేవి. ఒకరోజు గరుత్మంతుడు ఈ చేపల రాజుని పట్టుకొని భక్షించాడు.చేపలు తమ గోడును సౌబరి మహర్షికి చెప్పుకొనగా మహర్షి కోపగించి ఈనాటి నుండి గరుత్మంతునితోసహా ఏ ఇతర పక్షులు ఈ సరస్సుకడకు వచ్చినా మరణిస్తాయని శాపమిచ్చాడు.అప్పటినుండి గరుత్మంతునికి భయపడి కాళీయుడు ఈ సరస్సులో నివసిస్తున్నాడు. కానీ కాళీయుడు తన కోరలలోని విషముతో ఆ సరస్సుని విషమయము చేయగా కొన్ని గోవులు ఆ నీరు త్రాగి మరణించాయి.అందువల్ల కృష్ణుడు ఆ కాళీయమడుగులో దూకి కాళీయుని మద మడిచి అతని పడగలపై నిలిచి నాట్యమాడదాగాడు.
ఆ సందర్భముగ కాళీయుడు పై విధముగ వగచుచున్నాడు.నా కోరలనుండి వచ్చు విషాగ్నికి దేవతలే భయపడిపారిపోతారు.ఎవరైన నా విషముసోకితేనే మరణిస్తారు.కానీ ఇదేమి చోద్యము? ఈ చిన్ని బాలుడు నా కోరలలోని విషాన్ని క్రక్కించి నా పడగలపై నాట్యమాడుతున్నాడని ఆశ్చర్యపోతు బాధపడుతుండగ,
కాళీయుని భార్యల అభ్యర్థనతో స్వామి కాళీయుని క్షమించి
ఓ కాళీయా? నీ పడగలపై నా కాలి ముద్రలు యున్నవి. కాన నీకు గరుత్మంతునివల్ల భయములేదు గోవులు నీరు త్రాగే ఈ సరస్సుని వదిలి సముద్రములో నివసించమని చెప్పి కాళీయునికి ప్రాణబిక్ష ప్రసాదించాడు.
హరయే నమః శ్రీకృష్ణాయ నమః.
సర్వేజనా సుఖినో భవంతు
No comments:
Post a Comment