స్ధల పురాణం
మంగళగిరిలో మూడు నరసింహస్వామి ఆలయాలున్నాయి. కొండ దిగువన వున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం , కొండపైన వున్న పానకాల స్వామి ఆలయం , కొండ శిఖరం మీద వున్న గండాల నరసింహస్వామి ఆలయం. కొండ దిగువన వున్న ఆలయంలో శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామిని భక్తులు దర్శించుకోగలరు.
హిరణ్యకశిపుని వధానంతరం శ్రీ నరసింహస్వామి చాలా భయంకర రూపంతో, రౌద్రంగా , అందరికీ భీతికొల్పుతూ వున్నారు. దేవతలంతా ఆ దేవదేవుని శాంతించమని ప్రార్ధించినా ఫలితం కనబడలేదు. శ్రీ లక్ష్మి ఇక్కడ తపస్సు చేసి స్వామికి అమృతము సమర్పించినది. దానిని గ్రహించి స్వామి శాంత స్వరూపులైనారు. ఈయనే మంగళాద్రిపై వెలసిన పానకాల లక్ష్మీ నరసింహస్వామి. ఈయనకి భక్తులు కృత యుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవునెయ్యిని , ద్వాపర యుగంలో ఆవు పాలను సమర్పించారు. కలియుగంలో బెల్లపు పానకాన్ని సమర్పిస్తున్నారు.
పానకాలస్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరచిన నోటితో దర్శన మిస్తుంది. భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని పూజారిగారు ఇక్కడ స్వామి నోట్లో పోస్తారు. పానకం సగం అవగానే గుటక వేసిన శబ్దం వస్తుంది. ఇంక పానకం పోయటం ఆపి , మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ పానకాన్ని కొండపైన పూజారులే తయారు చేస్తారు. ఇంత పానకం ఇక్కడ వినియోగమవుతున్నా , ఇక్కడ ఒక్క చీమ కూడా కనిపించక పోవటం విశేషం.
పానకాలస్వామి గుడి వెనుక కొంచెం ఎత్తులో శ్రీ లక్ష్మి ఆలయం వున్నది. దీనికి పక్కగా ఒక సొరంగం వుంటుంది. దాన్లోంచి వెళ్తే కృష్ణా తీరాన వున్న ఉండవల్లి గుహలకి వెళ్ళవచ్చంటారు. ఋషులు ఇదివరకు ఆ మార్గంగుండానే వెళ్ళి కృష్ణానదిలో స్నానం చేసివచ్చి స్వామిని సేవించేవారంటారు. ప్రస్తుతం ఆ మార్గం మూసుకుపోయింది.
సర్వ మంగళ స్వరూపిణి , సర్వ శుభదాయిని అయిన శ్రీ లక్ష్మి ఇక్కడ తపస్సు చేసింది కనుక ఈ పర్వతము మంగళగిరి అయినది. అంతకు ముందు ఈ కొండకు మూర్కొండ , మార్కొండ అనే పేర్లుండేవి.
పానకాల స్వామి మహత్యం గురించి ప్రచారంలో వున్న ఇంకొక కధ. స్వామి పానకం తాగటం ఎంతమటుకు నిజమో పరీక్షించటానికి అక్కడి జమీందారు వెంకటాద్రి నాయడు తన బావమరిది , శక్తి ఉపాసకులు అయిన యార్లగడ్డ అంకినీడుతో కలసి కొండపై స్వామివారి తెరిచివున్న నోట్లోకి తన కుడిచేతిని పోనిచ్చారుట. చెయ్యి కొంత దూరం వెళ్ళగానే నవులుతున్నట్లు విపరీతమైన బాధ కలిగిందిట. అంకినీడుగారికి తేళ్ళు, పాములు కరచినంత బాధ కలిగిందట. వెంకటాద్రి నాయుడుగారు చెయ్యి బయటకి తియ్యగా చెయ్యి రక్త మాంసములు లేక శల్యావశిష్టంగా వుండటం చూసి విస్మయం చెందారుట. అప్పుడు స్వామి మీద నమ్మకం కలిగి , స్వామికి తన శరీరం ఆహారమయిందని, తన జన్మ సార్ధకమయిందని ఆయన ఆలయ గోపురం నిర్మింపచేశారుట.
కొండ శిఖరానవున్న గండాల నరసింహస్వామి చిన్న మందిరంలో విగ్రహం వుండదు. తీరని ఆపదలు వచ్చిన భక్తులు, తమ గండాలు గడిచిపోతే అక్కడ నేతితోగానీ, నూనెతోగానీ దీపం పెడతామని మొక్కుకుని, గండం గడిచిపోగానే మొక్కుకున్న విధంగా అక్కడ దీపారాధన చేసి వస్తారు.
కొండకిందవున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని, మెట్ల మార్గంలో వున్న భ్రమరాంబా మల్లికార్జునస్వామి ఆలయంలో మూర్తులను, ద్వాపర యుగంలో పాండవులు ప్రతిష్టించారుట.
No comments:
Post a Comment