""నల్లని వాడు, పద్మనయనంబులవాడు, కృపారసంబు పై,
జల్లెడివాడు, మౌళిపరిసర్పితపింఛమువాడు,నవ్వు రా,
జిల్లెడుమోమువాడొకడు చెల్వలమానధనంబు దెచ్చె, నో,
మల్లియలార! మీపొదలమాటున లేడు గదమ్మ చెప్పరే? ,""
స్వామి ""రాసలీల""లు ప్రారంభించారు.మానవులు పాకుడు బండలపై జారిపడినట్లు సాధకులు ఈ రాసలీల విషయములో పొరబడుతుంటారు. మనము గమనించాల్సింది రాసలీల- కామలీల కాదు.రాస యనునది రసశబ్దమునుండి ఉద్భవించినది.
మనందరికి తెలిసిన విషయము కామలీలల్లో స్త్రీలు గోప్యతకు ప్రాధాన్యతనిస్తారు.కానీ ఇక్కడ గోపికలు రాసలీలలో త్రివర్గాలను త్యజించారు.త్రివర్గాలనగా, ధర్మం,అర్థం, కామం.అర్థపరమైన అలంకరణ యందు వారికి ఆసక్తి లేదు. కామపరమైన ఆసక్తి యుంటే గోప్యత పాటించేవారు.
స్వామి వేణు నాదం వినగానే పసిపిల్లలకి పాలు డుతున్న విషయము మరచి ధర్మాన్ని పాటించకుండగా పసివారిని వదలి వచ్చేసారు.పాలు పితుకుతు పాల కుండను క్రిందపడవేసి వచ్చారు.అత్తమామలకి సేవచేస్తున్న ఒక గోపిక వారు పిలుస్తున్నా ఉన్మాదిలా కన్నయ్య వేణుగానము విని పరుగున వచ్చారు.
కానీ కాత్యాయనీ వ్రతానికి సామూహికముగ వచ్చిన గోపికలు రాసలీలలకి మాత్రము ఎవరికివారు మరొకరిని కలుపుకొని రావాలనే ధ్యాస లేకుండగ వచ్చారు. పరమాత్మ వారి అంతఃకరణ గమనించారు.అదే ""స్వసుఖాభిలాష"". ఆ స్వార్థాన్ని స్వామి సహించడు. అందుకనే గోపికలందరు రాగానే పరమాత్మ కనబడకుండగ అంతర్థానమయ్యారు.
ఆ సమయములో గోపికలు స్వామిని సంఘటితముగ వెదుకుచు పై విధముగా "" మారేడు నల్లనివాడు, కమలములవంటి కన్నులవాడు, కరుణారసము అపారముగ యున్నవాడు.మోము పై చిరునవ్వు యున్నవాడు,ఆ చిన్ని గోపాలుడు మా మానధనములు కొల్లగొట్టి వచ్చాడు. మీ పొదలమాటున ఏమన్నా దాక్కున్నాడా ? చెప్పండమ్మా"" యని ప్రాధేయపడుతున్నారు. గోపికలలో సౌభస అహంకారము వదిలేవరకు పరమాత్మ దర్శనము లభించదు.
హరయే నమః శ్రీకృష్ణాయనమః.
No comments:
Post a Comment