వెన్న, పాలు, పెరుగు అంటే కృష్ణుడికి చాలా ఇష్టం. గోపికలు ఇంట్లో లేని సమయం చూసి, ఇంట్లోకి జొరబడి ఉట్టి మీది పాలనూ, పెరుగునూ, వెన్ననూ జుర్రుకునేవాడు. ఎత్తులో ఉన్న ఉట్టె అందకపోతే రోకలితో దానిని కొట్టి కుండలు పగిలి పాలూ, పెరుగూ కిందికి ధారగా పడితే నోరుపట్టి తాగేవాడు.
గోపికలు వస్తే అందకుండా పరిగెత్తి పారిపోయేవాడు. కోపంతో వారు యశోద మీద మూకుమ్మడిగా దండెత్తి కృష్ణుడి అల్లరిని కథలు కథలుగా చెప్పేవారు.
బాలకృష్ణుడి మీద పితూరీలను వినలేకపోయేది యశోద. చెవులు మూసుకునేది. ‘ఇక ముందు ఇలా జరగదులే’ అని నచ్చచెప్పి కృష్ణుడు కనిపిస్తే కొడదామని అనుకునేది.
తల్లి కేకేసి పిలిస్తే పలికేవాడు కాదు. ఎక్కడ దాగున్నాడో ఏమో! ఎవరికీ తెలిసేది కాదు. ఆమె కోపం తగ్గేంత వరకూ వచ్చేవాడు కాదు.
అమ్మ కోపం తగ్గిందని అనుకున్నాక ఆకలి అంటూ వచ్చి యశోదను పెనవేసుకుపోయేవాడు.
గోపికలు తన మీద తల్లికి చెప్పే చాడీలన్నీ అబద్ధాలని నిరూపించాలను కున్నాడు కృష్ణుడు.
అందుకని ఒక రోజు దొంగతనం చేస్తూ కావాలనే గోపికలకి దొరికిపోయాడు. కృష్ణుడు నాకు దొరికాడంటే నాకు దొరికాడంటూ దొరికిన కృష్ణుణ్ణి వెంటబెట్టుకుని గోపికలు యశోదను కలిశారు.
తీరా చూస్తే యశోద దగ్గర కూడా ఓ కృష్ణుడు ఉన్నాడు. బుద్ధిగా వెన్నముద్దలు తింటున్నాడు. ఏం చెప్పి నమ్మించాలి యశోదను? నీ కొడుకు ఈ అల్లరి చేశాడు, ఆ అల్లరి చేశాడు, ఇదిగో వెంటబెట్టుకుని వచ్చాం, చూడంటే ఏడీ కృష్ణుడు? అనేక రూపాల్లో ఉన్న కృష్ణుడు అంతర్థానమై ఒక్కడై బిక్కుబిక్కుమంటూ తల్లిచాటున ఉండడం చూసిన గోపికలు అయోమయానికి లోనయ్యారు.
అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరించి, నిష్క్రమించారు.
కృష్ణుడు ఒకసారి ఆడుకుంటూ ఆడుకుంటూ బోర్లాపడ్డాడు. అలాపడటంతో పెదవులకు మన్ను అంటింది. అంటిన మన్నును చప్పరించి చూశాడు. అదోరకం రుచితో బాగుంది. మన్నును గుప్పెడు తీసుకుని తినసాగాడు. అది అన్నయ్య రాముడు చూశాడు. వద్దని చెప్పాడు. కృష్ణుడు వినలేదు. గోపబాలకులు కూడా కల్పించుకుని వద్దన్నారు.
వినకుండా మరో గుప్పెడు అందుకున్నాడు కృష్ణుడు. తల్లిని సమీపించాడు రాముడు. గోపబాలకులు కూడా అతన్ని అనుసరించారు.
“అమ్మా, అమ్మా! తమ్ముడు కృష్ణుడు మన్ను తింటున్నాడే!” అన్నాడు.
“అవునమ్మా! గుప్పెళ్ళకొద్దీ తీసుకుని తింటున్నాడు. వద్దని చెప్పినా వినిపించుకోవడం లేదు” అన్నారు గోపబాలకులు.
కోపంతో “కృష్ణుడెక్కడ?” అని అడిగింది యశోద.
“అక్కడ !” అంటూ చూపించారు.
అక్కడకి పరుగుదీసింది యశోద. మన్ను తిన్న కృష్ణుడిని దండించాల్సిందే అనుకున్నది యశోద.
“కృష్ణా!” గట్టిగా అరచింది. చేతిలోని మన్నుని విసిరేసి, చేతిని దులుపుకుని అమాయకంగా చూశాడు కృష్ణుడు.
“మన్ను తినకూడదని, తింటే అనారోగ్యం అని నీకెన్నిసార్లు చెప్పాన్రా? విన్నావా? ఎందుకు వింటావు? నువ్వు వినవు. నీకెలా చెప్పాలో నాకు తెలుసు, పద చెబుతాను” అంటూ కృష్ణుణ్ణి రెక్కపట్టి లాగింది యశోద. ఏడుపు ముఖం పెట్టాడు కృష్ణుడు. మన్ను తినలేదన్నాడు.
“నా మాట నమ్మట్లేదుకదా, సరే, నా నోరు చూడు, నీకే తెలుస్తుంది” అంటూ ముందు చిన్నగా తెరచి, తర్వాత ఓ గుహలా బాగా విప్పార్చి నోరు చూపించాడు కృష్ణుడు.
ఆ నోటి లోకి చూసి యశోద విస్తుపోయింది.
భూమి, ఆకాశం, పర్వతాలు, సముద్రాలు, సూర్యచంద్ర గ్రహాలు, నక్షత్రాలు, సకల చరాచర భూత జాలం, సమస్త లోకాలు, తను నివసిస్తున్న గోకులం కూడా కృష్ణుని నోటిలో కనిపించాయి.
యశోదకు దిగ్ర్భాంతితో నోట మాటలేదు.
ఏమిటిదంతా? చిన్నికృష్ణుడి నోటిలో సమస్తలోకాలూ కనిపించడం ఏమిటి? ఇది కలా? నిజమా? యశోదకు కళ్ళు మూతలు పడ్డాయి. మాయకు లోనయింది. అప్పుడు ఆమెకు అన్నిటా అంతటా తనేనన్న శ్రీహరి గొంతు వినవస్తోంటే యశోద రెండు చేతులూ జోడించి, కృష్ణుడికి నమస్కరించి సమస్తానికీ ఆధారభూతుడయిన శ్రీమన్నారాయణుని శరణువేడింది.
శరణువేడిన మరుక్షణం మాయ వీడిపోయింది. విశ్వరూపాన్ని ఉపసంహరించాడు కృష్ణుడు. నోరు మూసేశాడు. మామూలు పిల్లాడయిపోయాడు. ఏడుపు నటించాడు. యశోద తల్లిహృదయం తల్లడిల్లింది. కృష్ణుణ్ణి దగ్గరగా తీసుకున్నదామె. లాలించింది. ముద్దు చేసింది.
No comments:
Post a Comment