Sunday, 10 March 2024

☘️ఫాల్గుణ మాస ప్రాశస్త్యం☘️

 


 ఫాల్గుణ మాసం ప్రారంభం , ఫాల్గుణ మాసం  విశిష్టత🚩

ఫాల్గుణం... విష్ణు ప్రీతికరం అంటోంది భాగవతం. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి పన్నెండు రోజులు "పయోవ్రతం" ఆచరించి విష్ణుదేవుడికి క్షీరాన్నం నివేదిస్తే అభీష్టం సిద్ధి కలుగుతోందని భాగవత పురాణం వివరిస్తోంది. అదితి పయోవ్రతం ఆచరించి వామనుడిని పుత్రుడిగా పొందింది. ఫాల్గుణంలో గోదానం , ధనదానం , వస్త్రదానం , గోవిందుడికి ప్రీతి కలిగిస్తాయని శాస్త్రవచనం. చైత్రాది మాసాల క్రమంలో చిట్ట చివరిది ఫాల్గుణం. ఇంతకు ముందు పదకొండు నెలల్లో చేసిన దేవతా పూజలు , వ్రతాలు ఈ చివరి మాసంలో ఇంకోసారి కనిపించడం విశేషం. సర్వదేవతావ్రత సమాహారంగా , సర్వవ్రత సింహావలోకనంగా ఇది కనిపిస్తుంది.

వసంత పంచమి నుంచి ఫాల్గుణ పూర్ణిమ వరకు ప్రకృతి రోజుకో రంగును సంతరించుకుంటుంది. చిలుకలు వాలిన జామచెట్టులా ఉండే ప్రకృతి పంచవన్నెల రామచిలకలా కనువిందు చేస్తుంది. చలి పూర్తిగా తగ్గదు. నులివెచ్చదనం ప్రాణానికి హాయి కలిగిస్తుంటుంది. ఫాల్గుణ బహుళ పాడ్యమినాడే రావణుడితో యుద్ధానికి వానర సైన్యాన్ని వెంటబెట్టుకొని శ్రీరాముడు లంకకు వెళ్లాడు. ఫాల్గుణ బహుళ ఏకాదశినాడు రావణ కుమారుడు ఇంద్రజిత్తు , లక్ష్మణుడు మధ్య ప్రారంభమైన సమరం త్రయోదశి దాకా కొనసాగింది. రావణబ్రహ్మను శ్రీరాముడు అమావాస్య రోజు వధించాడు. అంతేకాదు కురుపాండవుల్లో కొందరు ఫాల్గుణ మాసంలో జన్మించినట్లు చెబుతారు.

హరిహరసుతుడు అయ్యప్పస్వామి ,  పాలకడలి నుంచి లక్ష్మీదేవి ఇదే మాసంలో జన్మించారు. ఇక మహాత్ములైన శ్రీకృష్ణ చైతన్యులు , రామకృష్ణ పరమహంస , స్వామి దయానంద సరస్వతిలు జననం కూడా ఈ మాసంలోనే జరిగింది. అర్జునుడి జన్మ నక్షత్రం కూడా ఇదే కాబట్టి ‘ఫల్గుణ’ అనే పేరుంది. ఫాల్గుణ బహుళ అష్టమినాడు ధర్మరాజు , ఫాల్గుణ శుద్ధ త్రయోదశి రోజున భీముడు , దుర్యోధనుడు , దుశ్శాసనులు జన్మించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి.

☘️ఫాల్గుణ మాసం శ్రీ మహావిష్ణువు ఆరాధన☘️

శ్లో || నరాడోలా గతం దృష్ట్యా గోవిందం         పురుషోత్తమం ! 

ఫాల్గుణ్యాం ప్రయతో భూత్వా గోవిందస్య పురం వ్రజేత్ !!

శ్రీమహావిష్ణువుకు ఇష్టమైన మాసాల్లో ఫాల్గుణం ఒకటి. పూర్ణిమ తిథిలో చంద్రుడు పూర్వ ఫల్గుణి లేదా ఉత్తర ఫల్గుణి నక్షత్ర సమీపంలో సంచరిస్తే , ఆ మాసాన్ని ‘ఫాల్గుణి’ గా పరిగణిస్తారు. గోవింద వ్రతాలను విరివిగా చేస్తుంటారు. విష్ణుపూజకు ‘పయోవ్రతం’ విశిష్టమైంది. దీన్ని శుద్ధ పాడ్యమినాడు ప్రారంభించి పన్నెండు రోజుల పాటు కొనసాగిస్తారు.

సమీపంలోని నదుల్లో స్నానమాచరించి , సూర్యుడికి అర్ఘ్యమిచ్చి , విష్ణువును షోడశోపచారాలతో పూజించి , పాలను నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. పయస్సు అంటే పాలు. అదితి ఈ వ్రతం ఫలితం వల్లే వామనుడు జన్మించాడట. లక్ష్మీనారాయణులు , పార్వతీ పరమేశ్వరుల్ని శుద్ధ తదియనాడు పూజించి నైవేద్యం సమర్పిస్తారు. 

ఈ మాసంలో రెండు రోజులు వినాయకుణ్ని ఆరాధిస్తారు. కాశీ , ద్రాక్షారామంలో వెలసిన డుండి గణపతికి సంబంధించిన పూజ ఇది. శుక్ల పాడ్యమి , చతుర్థినాడు అవిఘ్న , పుత్ర గణపతి వ్రతాల్ని ఆచరిస్తారు. శుద్ధ ద్వాదశి పయోవ్రతానికి చివరిరోజు.

ఈ రోజున నరసింహస్వామిని పూజిస్తారు. దివ్యౌషధంగా భావించే ఉసిరిని శుద్ధ ఏకాదశినాడు పూజించి , ఆ చెట్టు వద్దనే ‘అమలక ఏకాదశి’ వ్రతం నిర్వర్తిస్తారు. దీన్ని ‘అమృత ఏకాదశి’ గా పరిగణిస్తారు. మదురైలోని మీనాక్షీ సుందరేశ్వరుల కల్యాణం రోజు ఇది. అందుకే శివపూజ చేస్తారు. ఈ నెలలో విష్ణుపూజకు ప్రాధాన్యత ఉంటుంది. ఫాల్గుణ మాసంలో అతి ముఖ్యమైంది వసంతోత్సవం. ఇది కాముని పండుగ , హోలికా పూర్ణిమ , కామ దహనం పేరుతో ప్రఖ్యాతి చెందింది. శుద్ధ త్రయోదశి - కాముని పండుగగా ప్రసిద్ధి చెందింది. ఈ పర్వదినాన శివుడు , మన్మథుడు , కృష్ణుడు , లక్ష్మీదేవి పూజలందుకుంటారు.

ఫాల్గుణమాసంలో ప్రతి తిథికీ ఒక ప్రత్యేకత ఉంది. చవితినాడు ‘సంకట గణేశ’ వ్రతం ఆచరిస్తారు. బహుళ అష్టమినాడు సీతాదేవి భూమి నుంచి ఆవిర్భవించింది. అందుకే ఆ రోజున రామాయణాన్ని చదివి , సీతారాముల్ని కొలుస్తారు. బహుళ అమావాస్యనాడు పితృదేవతలకు పిండప్రదానం చేసి , అన్నదానం చేస్తారు.

పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తర ఫల్గుణి నక్షత్రయుక్తుడై ఉదయించే మాసం ఫాల్గుణ మాసం. సంవత్సరంలో చివరి మాసం అయినప్పటికీ అధిక ప్రత్యేకతలు కలిగిన మాసం. సంవత్సరంలో మిగిలిన పదకొండు నెలలలో చేసిన పూజలు , పండుగలూ , ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంక్షిప్తరూపం ఈ మాసం.

ఈ మాసాధిపతి గోవిందుడు కావున , ఈ మాసంలో విశేషించి విష్ణుమూర్తి ఆరాధన చేయడం శ్రేయస్కరం. గోః – వేదాలు , గోవులు విందః – రక్షించేవాడు గోవిందుడు , అంటే ఈ సమస్త జీవకోటికీ పూజనీయమైన వేదాలను , గోవులను రక్షించేవాడు అంతేకాకుండా మనలని రక్షించి ఆత్మతత్త్వాన్ని తెలియచేసేవాడు. ఈ మాసంలో అచ్యుత , అనంత , గోవింద అనే నామస్మరణ ఎంతో శుభఫలితాన్ని ఇస్తుంది. వసంతఋతువు ఆగమనానికి ముందు వచ్చే ఈ మాసంలో ప్రతీ దినమూ ప్రత్యేకమే. ఈ మాసంలో ఆచరించే కొన్ని ప్రత్యేకమైన వ్రతాలు , పర్వ దినాలూ , విశేషమైన రోజుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఫాల్గుణ శుద్ధ పాడ్యమి మొదలు ఫాల్గుణ శుద్ధ ద్వాదశి వరకూ పయోవ్రతం ఆచరిస్తారు. భాగవతం అష్టమ స్కందం ప్రకారం , బలిచక్రవర్తి చేతిలో తన కుమారులు అయిన ఇంద్రాది దేవతలు పరాజయం పాలవడం భరించలేని అదితి , కశ్యపుణ్ణి బలి గర్వం అణచే కుమారుణ్ణి ప్రసాదించమని వేడుకొనగా , కశ్యపుడు ఈ పయో వ్రతాన్ని ఆమెకు ఉపదేశించాడు. ఆమె దాన్ని పాటించి వామనుడిని కుమారుడిగా పొందింది. ఈ వ్రతంలో ఫాల్గుణ శుద్ధ పాడ్యమి మొదలు ద్వాదశి వరకూ లక్ష్మీ నారాయణులని షోడశోపచారాలతో పూజించి , కేవలం వారికి నివేదించిన పాలు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తారు. ఆ పన్నెండు రోజుల అనంతరం హోమం చేసి , బ్రాహ్మణులను పూజించి సమారాధన చేస్తారు. ఈ రోజులలో గో , వస్త్ర , ధన , దానాలు శక్తి కొలదీ చేస్తారు.

ఫాల్గుణ మాసం శుద్ధ విదియ నుండీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

ఫాల్గుణ శుద్ధ చవితి రోజు వినాయకుడిని పూజించే అవిఘ్నవ్రతం లేదా పుత్రగణపతి వ్రతం చేస్తారు. ఆ రోజున ఉపవాసం ఉండి , సాయంకాలం స్వామిని షోడశోపచారాలతో పూజించి , ప్రసాదం స్వీకరిస్తారు. ఈ వ్రతం చేయడం ద్వారా వారికి ఉన్న ఆటంకాలు తొలగుతాయి మరియు పుత్ర సంతానం కాంక్షిస్తూ చేసేవారికి స్వామి పుత్ర సంతానం ప్రసాదిస్తాడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి.

ప్రతీ ఏటా తిరుమలలో ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకూ ఐదు రోజుల పాటు స్వామివారి తెప్పోత్సవం నిర్వహిస్తారు. మొదటి రెండు రోజులూ స్వామివారికి శ్రీరాముడు , శ్రీకృష్ణుడి అవతారంలో తెప్పోత్సవం నిర్వహిస్తే తరువాత మూడురోజులూ శ్రీదేవీ భూదేవీ సమేత మలయప్పస్వామికి నిర్వహిస్తారు.

ఫాల్గుణ శుద్ధ నవమి నాడు మధ్వులు ఆరాధించే రాఘవేంద్ర స్వామి వారి జన్మదినం.

అమలక ఏకాదశి ఫాల్గుణ శుద్ధ ఏకాదశిని అమలక ఏకాదశి అంటారు. అమలక లేదా ధాత్రీ ఫలం గా పిలుచుకునే ఉసిరిని విష్ణుస్వరూపంగా భావించి ఈనాడు ఉసిరివృక్షం క్రింద శ్రీమహావిష్ణువుని భక్తిశ్రద్ధలతో పూజించిన వారికి విశేషమైన పుణ్యఫలం కలుగుతుందని ఋషివాక్యం. ఈరోజు ఏకాదశీ వ్రతం ఆచరించి , విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభపలితాన్నిస్తుంది.

ఫాల్గుణ శుద్ధ ద్వాదశినే గోవింద ద్వాదశి , నృసింహ ద్వాదశి అంటారు. ఈ నాడు గంగాస్నానం పవిత్రం. కుదరని వారు సమీపం లోని ఏదైనా నది వద్దకు వెళ్లి , గంగను స్మరిస్తూ నదీస్నానం చేయాలి. నృసింహకరావలంబ స్తోత్రంతో కానీ లేక మరేదైనా నృసింహస్వామి స్తోత్రంతో కానీ స్వామిని ఆరాధించాలి.

ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ మహా పూర్ణిమ , హోళికా పూర్ణిమ , డోలా పూర్ణిమ , కామదహనోత్సవంగా వ్యవహరిస్తారు. ఉత్తర భారత దేశంలో హోళికా పూర్ణిమ ప్రధానంగా జరుపుకుంటారు.

దక్షిణ భారత దేశంలో కామదహనోత్సవాన్ని జరుపుతారు. శివకళ్యాణం అనే మహత్తరకార్యం కోసం తపోదీక్షలో ఉన్న శివుని తపస్సుని భంగం చేసిన మన్మధుణ్ణి , తన మూడో నేత్రంతో భస్మం చేసిందీ ఈనాడే మరియు మన్మధుని భార్య రతీదేవి కోరిక మేరకు ఆమెకొక్కదానికే అతడు కనిపించేలాగా వరము ఇచ్చాడు శివుడు. మనలో ఉన్న కామక్రోధాదులనే అరిషడ్వర్గాలని దహనం చేసి , ప్రశాంతమైన జీవనం సాగించాలని కోరుతూ , శివుని ప్రార్థిస్తూ చేసే ఉత్సవమే ఈ కామదహనోత్సవం. అంతేగాకుండా రాబోయే వసంతాగమనాన్ని పురస్కరించుకుని కూడా ఉత్సవం చేస్తారు.

ఈ ఉత్సవం వెనుక ఒక కథ ఉంది. ఒకసారి పార్వతి తన ప్రభావం చేత శివుని కళ్ళు మూతపడేటట్లు చేసింది. శివుని కళ్ళు మూతపడినందు వల్ల జగమంతా అంధకారబంధురమైంది. శివుడు కోపగించు కోవడంతో , అలిగిన పార్వతీదేవి కాంచీపురానికి వచ్చి , తిరిగి శివుని అభిమానాన్ని పొందేందుకు ఒక మామిడి చెట్టు కింద కూర్చుని తపస్సు చేయడం ప్రారంభించింది.

ఒకానొక పాల్గుణపూర్ణిమనాడు మామిడి చెట్టు కింద పార్వతీదేవి ప్రాయశ్చిత్త కర్మకాండను పూర్తిచేసింది. అప్పుడు సంతసించిన శివుడు పార్వతిని అనుగ్రహించాడు. అప్పటినుంచి కాంచీపురంలో ఫాల్గుణ పూర్ణిమ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఫాల్గుణ మాసములో ఈ విధమైన పూజలను , దానాలను చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రవచనం.

ఉత్తర భారతదేశంలో హిరణ్యకశిపుడి చెల్లెలైన హోళిక , విష్ణుభక్తుడైన ప్రహ్లాదుణ్ణి చంపబోయి తానే దగ్ధమైన సంఘటనకి గుర్తుగా , చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకుంటారు. ఆ రోజు సాయంకాలం మంటల్లో హోళికని దగ్ధం చేసే కార్యక్రమం జరిపి మరునాడు ఒకరిపై ఒకరు రంగులు చల్లుతూ మిఠాయిలు పంచుతూ ఆనందంగా కాలం గడుపుతారు. హోలికా పూర్ణిమ రోజు చందనంతో కూడిన మామిడి పూత (చూత కుసుమ భక్షణం) ను స్వీకరించాలని శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి.

ఈ రోజు శ్రీకృష్ణుని ఊయలలో వేసి ఆరాధించే ఉత్సవంగా డోలా పూర్ణిమ చేస్తారు. తమిళనాడులోని మధురైలో మీనాక్షీ సుందరేశ్వరుల కళ్యాణం జరిగిన రోజు కనుక కళ్యాణ పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజు మధురైలో అమ్మవారి అయ్యవార్ల కళ్యాణం జరుపుతారు.

ఫాల్గుణ బహుళ విదియనాడు లక్ష్మీదేవి పాలకడలి నుండి ఉద్భవించిందని చెప్పబడింది. ఆరోజు కనకధారా స్తవం చదువుకోవడం సత్ఫలితాలనిస్తుంది.

ఫాల్గుణ బహుళ అష్టమి

రోజునే సీతాదేవి జనకునికి నాగేటి చాలులో దొరికిందని కావున ఆనాడు సీతాదేవి జన్మదినంగా కూడా జరుపుకుంటారు. ఫాల్గుణ మాసంలోనే రామరావణ యుద్ధం జరిగింది. మహాభారతంలో కూడా అతిరథ మహారథులైన అనేకమంది వీరులు ఫాల్గుణ మాసంలోనే జన్మించారు.

ఫాల్గుణ బహుళ అమావాస్య రోజును కొత్త అమావాస్య అంటారు. ఆ రోజు కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. ఆ రోజు పితృ దేవతలకి తర్పణాలు ఇస్తారు.

ఇలా ఎన్నో విశిష్టతలను పొందుపరచుకున్న ఫాల్గుణ మాసంలో , భక్తితత్పరతలతో ఆ భగవానుని సేవించి ఆయన కృపకు పాత్రులమవుదాము.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment