కదిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి కల్యాణం : చుట్టూ ఎత్తైన ప్రాకారాలు, నాలుగువైపులా సమున్నత గోపురాలతో అత్యంత వైభవంగా ఉంటుంది కదిరి నృసింహుని ఆలయ ప్రాంగణం. 'బేట్రాయి సామిదేవుడా! నన్నేలినోడ! కదిరి నరసింహుడా! కాటమరాయడా!' అంటూ జానపదులు ఈ స్వామిని గురించి పాడుకుంటారు. 'ఖ' అంటే విష్ణుపాదము. 'అద్రి' అంటే కొండ. అందుకే ఈ పట్టణానికి 'ఖద్రి' అనే పేరు వచ్చింది. కాలక్రమేణా కదిరిగా రూపాంతరం చెందిందని చెబుతారు. కదిరి పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో కొండపై కనిపించే పాదాల గుర్తులను విష్ణుపాదాలని చెబుతారు. ప్రధాన ఆలయంలో గర్భగుడి, అంతరాలయం, అర్థమంటపం, రంగమంటపాలు ఉన్నాయి. గర్భగుడిపై ఏకతల విమానాన్ని నాగర శైలిలో నిర్మించారు. ఆలయానికి పశ్చిమాస ఉన్న గోపురంలో వెనుక భాగంలో ఓ కోనేరు ఉంది. దాన్ని భృగుతీర్థమని పిలుస్తారు. కదిరి నృసింహుడు అమృతవల్లి, తాయారు, ప్రహ్లాదులతో కలిసి దర్శనమిస్తారు. ఏటా సంక్రాంతి తరవాత ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఫాల్గుణ మాసంలో బహుళ పంచమినాడు జరిగే రథోత్సవం సందర్శకుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. వైశాఖంలో నృసింహ జయంతితో పాటు, మల్లెపూల తిరుణాళ్ళు బాగా నిర్వహిస్తారు. అన్ని మతాలవారూ కదిరి నరసింహస్వామిని ఆరాధించడం విశేషం. మార్చి 20న స్వామి కల్యాణోత్సవం జరుగుతుంది.
No comments:
Post a Comment