మహీధరాయ
ద్వాపరయుగం అంత్య దశలో భూలోకంలో దుష్టుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఆ దుర్మార్గుల అరాచకాన్ని, భారాన్ని మోయలేక భూదేవి తల్లడిల్లి పోయినది.
దేవతల సహాయం ఆశించి భూదేవి గో రూపం లో బ్రహ్మ వద్దకి వెళ్ళి ప్రార్ధించినది.
అప్పుడు బ్రహ్మదేవుడు "భూమి భారాన్ని తగ్గించే శక్తి మహావిష్ణువుకే వుంది" అని గో రూపంలోని భూదేవిని, దేవతలని తన వెంట రమ్మని పాలకడలి వెళ్ళాడు. అక్కడ ఆదిశేషునిపైన పవళించిన మహావిష్ణువు దగ్గర భూదేవి బాధలను బ్రహ్మదేవుడు దేవతలు వినిపించి భూభారం తగ్గించి అనుగ్రహించమని ప్రార్ధించారు.
అప్పుడు మహావిష్ణువు "భూదేవి.. భయపడకు! గో రూపంలో వచ్చి ప్రార్ధన చేసిన నీకు గోవులను కాసే గోపాలునిగా అవతరించి నీ బాధలు తీర్చి ధర్మరక్షణ చేస్తాను!" అని వాగ్దానం చేశాడు.
ఆవిధంగానే మహావిష్ణువు కృష్ణుని గా అవతరించి కంసుని, శిశుపాలుని, దంతవక్త్రుని, జరాసంధుడిని, కౌరవులను, నరకాసురుని మొదలైన అనేకమంది దుష్టులను సంహరించాడు. భూమి భారాన్ని తగ్గించి తిరిగి వైకుంఠానికి వెళ్ళాడు.
శ్రీ కృష్ణుడు తన అవతారం చాలించి వెళ్ళినంతనే భూలోకంలో ద్వాపరయుగం గతించి కలియుగం ఆరంభమైనది.
కలి ప్రభావంతో తిరిగి దుర్మార్గాలు అధికమయ్యాయి. ద్వాపరయుగంలో కన్నా కలియుగంలో దుర్మార్గాలు మరింత ఎక్కువగా అయ్యాయి. అది చూసి మహావిష్ణువు మహాలక్ష్మితో... "దేవీ భూమి మీద దుర్మార్గుల దౌర్జన్యాలు మితిమీరిపోయాయి.ఇప్పుడు మరల నేను అవతారం దాల్చి దుర్మార్గాన్ని మొత్తంగా అణచివేసే సమయం ఆసన్నమయింది!" అని అన్నాడు.
అందుకు మహాలక్ష్మి…"స్వామీ ..మీరు అవతారం దాల్చి దుష్టులను నిర్మూలిస్తే భూలోకంలో ఎనభైశాతం ప్రజలను నిర్మూలించవలసి వుంటుంది. కొంచెం ఆలోచించండి. ఈ కార్యానికి ఈసారి మీకు బదులుగా ఆ బాధ్యతను ఆదిశేషువు కు అప్పగించండి!” అని సలహా ఇచ్చింది.
”ఆదిశేషువు మాత్రం వెళ్ళి భూలోకంలో దుర్జన నిర్మూలన చేసి భూభారం తగ్గించగలడా?" అని అడిగాడు మహావిష్ణువు.
అందుకు మహాలక్ష్మి"స్వామీ.. దుష్టులు పెరగడం భూమికి భారం కానీ సజ్జనులు భూమికి భారంకాదు. కృష్ణావతారంలో దుష్టులను మాత్రం సంహరించి భూదేవి భారం తగ్గించారు. కాని కలియుగం లో అది అసాధ్యం. అందువలన ఆదిశేషువుని ఒక ఆచార్యునిగా అవతరింపచేసి ఆయన ద్వారా లోకానికి మంచి ఉపదేశాలను బోధించి దుర్మార్గులనందరిని సన్మార్గంలో పెట్టడానికి తీవ్రంగా కృషిచేస్తే, ప్రజలంతా సజ్జనులై సన్మార్గ మార్గాన జీవిస్తే భూమికి భారం తగ్గినట్లే!" అన్నది మహాలక్ష్మి.
"పాటించ తగిన ఆలోచన" అని ఆదిశేవుని పిలిచి.. “నీవు భూలోకంలో అవతరించి సకల వేద, ధర్మ శాస్త్రాలను, ఉపనిషత్తులను పామరులకు కూడా అర్ధమయ్యేలాగ ఉపదేశించి, ప్రజలను సన్మార్గులుగా తీర్చిదిద్ది రమ్మని ఆదేశించాడు మహావిష్ణువు.
పరమాత్మ ఆజ్ఞానుబద్దుడై ఆదిశేషువు రామానుజాచార్యులుగా అవతరించి వేదార్ధ, ఉపనిషత్తుల సారాంశాన్ని ధర్మనిరతిని పాటిస్తూ పామరులకు కూడా అర్ధమయ్యేలాగా ఉపదేశించి అనేకమందిని సజ్జనులుగాను, పండితులుగాను, ఆధ్యాత్మికా తత్పరులుగానూ మార్చగలిగాడు. అందువలన భూమికి కొంత భారం తగ్గినది.
రామానుజుల వారి అవతారం గురించి, ఆ ఆచార్యుని బోధలు కలియుగంలో మంచి మార్పులు తెస్తుందని ‘మణవాళ మాముని’ ముందుగానే సూచించారు.
ఈవిధంగా మహావిష్ణువు తానో లేక, ఆదిశేషువు వంటి తన భక్తదాసుల ద్వారానో, భూభారాన్ని తగ్గిస్తూ భూమిని కాపాడుతున్నందున నారాయణుడు "మహీధరః" పిలువబడుతున్నాడు.
ఈ నామమే అనంతుని వేయినామాలలో 371వ నామము.
"మహీధరాయ నమః"
నిత్యం జపించే భక్తులను కాపాడుతూ రజో,తమోగుణ ప్రధానులైన దుర్మార్గులను మహావిష్ణువు నిర్మూలించి అనుగ్రహం ప్రసాదిస్తాడు...
సర్వేజనా సుఖినో భవంతు
Ph: 9666602371
No comments:
Post a Comment