శివ అంటే శుభప్రదం
శివునికి మరోపేరు అశుతోష్. అశు అంటే త్వరగా; తోష్ అంటే సంతోషం
ఎవరైతే త్వరగా సంతోషిస్తారో, ఆనందిస్తారో అతని పేరు అశుతోష్ (అతనే శివుడు).
శివునికి గంగతో అభిషేకం, బిల్వపత్రం సమర్పిస్తే చాలు శివుడు ఎంతో సంతోషిస్తారు.
శివునికి, కృష్ణునికి మధ్య సంబంధం గురించి బ్రహ్మ సంహితలో బ్రహ్మ ఇలా వివరిస్తారు. ఎలాగైతే పాలు పెరుగులాగా మారుతాయో, అదేవిధంగా విష్ణుమూర్తి శివుడిలా మారుతారు.అంటే పాలకు, పెరుగుకు తేడా లేదు. పాలలో ఏదైతే ఉందో అదే పెరుగులా మారుతుంది. కానీ, పెరుగు పాలులాగా మారదు. పాలకు ఉండే గుణాలు వేరు, పెరుగులో ఉండే గుణాలు వేరు. పెరుగులో ఉన్నదంతా పాలలో ఉన్న దాని నుండి వచ్చింది. అదేవిధంగా శివుడు విష్ణుమూర్తి నుండి వస్తారు. కానీ, శివుడు యొక్క గుణాలు, తత్త్వము వేరు అలాగే కృష్ణుడు యొక్క గుణాలు, తత్త్వము వేరు.
నిమ్న-గానాం యథా గంగా
దేవానాం అచ్యుతో యథా
వైష్ణవానాం యథా శంభు:
పురాణానాం ఇదం తథా
(శ్రీమద్భాగవతం 12.13.16)
నదులలో గంగానది ఘనమైనట్లు, దేవతలలో అచ్యుతుడు పరమ దైవతమైనట్లు, వైష్ణవులలో శంభువు (శివుడు) ఘనుడైనట్లు శ్రీమద్భాగవతము పురాణములలో శ్రేష్ఠమై యున్నది.
శివుడు వైష్ణవులలో శుద్ధ భక్తుడు. ఆయన ఎప్పుడూ సమాధిలో ఉంటారు. (విష్ణువుపై ధ్యానిస్తూ ఉంటారు).
స్వయంగా శివుడు పార్వతితో 2 విషయాలు చెబుతారు.
1.అన్ని ఆరాధనలో కెల్లా శ్రేష్ఠమైన ఆరాధన విష్ణు ఆరాధన. అంతకంటే గొప్ప ఆరాధన ఇంకేమైనా ఉందా అంటే, విష్ణు యొక్క భక్తులను, వైష్ణవులను పూజించడం.
2. శ్రీరామ రామ రామేతి
రమే రామే మనోరమే,
సహస్ర నామతత్తుల్యం
రామనామ వరాననే
వెయ్యి విష్ణు నామాలు ఒక రామ నామంతో సమానం. రామ నామం చాలా సులువైనది. విష్ణువుకి, రాముడికి తేడా లేదు. అటువంటి రామ నామాన్ని శివుడు ఎల్లప్పుడూ పఠిస్తూ ఉంటారు.
శివుడి మనోభావం గురించి, శివతత్త్వము గురించి అర్థం చేసుకోవాలి అంటే భాగవతం చదవాలి.
అటువంటి శివుడిని భక్తితో ఇలా ప్రార్థించాలి.
ఓ శివా! నన్ను మీరు ఆశీర్వదించండి. తద్వారా నేను కృష్ణ భక్తిలో ఎదగాలి, ముందుకెళ్లాలి అని.
No comments:
Post a Comment