Tuesday, 19 July 2016

నివారణా చర్యలే జ్యోతిష ప్రయోజనం:

నివారణా చర్యలే జ్యోతిష ప్రయోజనం:


మన భారత దేశం కర్మ భూమి.అనాదిగా మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నవాళ్ళం. కర్మ సిద్ధాంతం ప్రకారం మానవులు అనుభవించాల్సిన కర్మ ఫలితం 3 రకాలుగా ఉంటుంది. 1) ప్రారబ్ధం: పూర్వ జన్మలలో మనం చేసిన కర్మలకు ఫలితంగా ఇప్పుడు అనుభవిస్తున్నది; 2) సంచితం: అనుభవంలోకి రాకుండా ఇంకా మిగిలి ఉన్నది; 3) ఆగామి: ఇప్పుడు చేస్తున్న కర్మలకు భవిష్యత్తులో లేదా మరు జన్మలలో అనుభవంలోకి వచ్చేది. ఇది రాబోయే కాలంలో అనుభవంలోకి వస్తుంది. ఈ 3 కర్మల వల్ల మానవుడు అనేక జన్మలు ఎత్తడం జరుగుతోంది. జ్యోతిషం మానవ జీవితంలో జరగాబోయే శుభాశుభ ఫలితాలను గూర్చి చెబుతుంది. దీనివల్ల ప్రయోజనం ఏంటి? బ్రహ్మ రాతను మార్చలేము గదా! అని వాదించే వారున్నారు. బ్రహ్మరాత మన పూర్వ జన్మ కర్మను అనుసరించే ఉంటుంది. ఆ పూర్వ కర్మ మనం చేసిందే, దాని మీద అధికారం కూడా మనదే. కర్మ సంకల్పం నుంచి పుడుతుంది.ఆ సంకల్పం కూడా మనదే కదా! సత్కర్మల ద్వారా దోషాన్ని ఎలా పరిహరించాలో జ్యోతిష శాస్త్రం తెలియేస్తుంది. పూర్వ జన్మలో చేసిన శుభ, పాప కర్మల యొక్క ఫలానుభవ కాలాన్ని జ్యోతిష శాస్త్రం సూచిస్తుంది. చీకటిలోని వస్తువులను దీపం యొక్క సహాయంతో చూసినట్లుగా జ్యోతిష శాస్త్ర సహాయంతో జీవితంలో జరుగబోయే శుభాశుభ సంఘటనలను ముందుగా గుర్తించి; తద్వారా మంత్ర, ఔషధ, జప, దాన, హోమ, రత్న ధారణాది శాంతి ప్రక్రియల ద్వారా వ్యతిరేక ఫలితాలను నివారించుకోవచ్చని వరాహమిహిరుల వారి సందేశం మనకు "లఘు జాతకం" అనే గ్రంథంలో కనిపిస్తున్నది. ఈ సందర్భంలో మనం పరమహంస యోగానంద వారు జ్యోతిష శాస్త్రంపై వ్యక్తపరిచిన అభిప్రాయాన్ని స్మరించుకోవడం ఎంతైనా అవసరం. "జ్యోతిషమనేది గ్రహాల కాంతి ప్రభావాలకు ప్రాణులలో కలిగే ప్రతిస్పందనలను వివరించే శాస్త్రం. నక్షత్రాలకు, గ్రహాలకు ఉద్దేశ పూరిత స్నేహ భావం కాని, ద్వేష భావం కాని ఉండవు. అవి కేవలం అనుకూల, ప్రతికూల కిరణాలను ప్రసరిస్తూ ఉంటాయి.వాటంతట అవి మానవులకు కీడు చేయవు, మేలూ చేయవు; కాని ప్రతి మనిషీ తాను గతంలో చేసిన కర్మలకు అనుగుణంగా అవసరమైన ఫలితాల అనుభవానికి అవి ఒక నియమబద్ధమైన మార్గాన్ని ఏర్పరుస్తాయి."

No comments:

Post a Comment