Tuesday 19 July 2016

జ్యోతిష్యం అంటే ఏమిటి? దానికున్న ప్రాముఖ్యత

జ్యోతిష్యం అంటే ఏమిటి? దానికున్న ప్రాముఖ్యత


జ్యోతిషం అనే పదం మన నిత్య జీవితంలో తరుచుగా వినే మాటే! జ్యోతి అనే పదానికి వెలుగు లేదా కాంతి అని అర్థం. కాంతి గోళాలైన నక్షత్రాలు, గ్రహాలు, సూర్య, చంద్రులు భూ వాతావరణంపై, ప్రాణులపై చూపించే ప్రభావాలను, మానవ జీవితంతో వాటికున్న సంబంధాలను అధ్యయనం చేసేదే జ్యోతిష శాస్త్రం. అయితే ఈ కాంతి 2 రకాలుగా ఉంది. 1) నక్షత్రాలు, సూర్య,చంద్రులకు సంబంధించిన బయటి కాంతి; 2) ఆత్మకు సంబంధించిన లోపలి కాంతి. బయటి కాంతి స్పష్టం అవుతున్న కొద్దీ లోపలి జ్యోతి స్వరూపమైన ఆత్మ తత్వం అర్థమౌతుంది. కాబట్టి జ్యోతిష శాస్త్ర ముఖ్య లక్ష్యం భవిష్యత్తును గూర్చి తెలుసుకోవడమే కాక మానవుల ఆధ్యాత్మిక పరిణామం కోసమని కూడా తెలుస్తున్నది. అందుకే జ్యోతిష శాస్త్రాన్ని 'వేద చక్షువు' అంటారు. అంటే జ్ఞాన నేత్రం అని అర్థం. ఇంత ముఖ్య శాస్త్రం కాబట్టే వేదం యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి 6 శాస్త్రాలలో నిష్ణాతుడై ఉండాలి. వాటిలో జ్యోతిష్య శాస్త్రం కూడా ఒకటి. (మిగిలిన 5 శాస్త్రాలు శీక్ష, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, కల్పం).

భూమి గుండ్రంగా ఉందని గ్రీకు శాస్త్రవేత్త టాలెమి(Ptolemy) కనిపెట్టడానికి ఎన్నో వేల సంవత్సరాల పూర్వం నుండే మన దేశంలో 'ఖగోళం' అనే పదం వాడుకలో ఉంది. జ్యోతిష శాస్త్రం పూర్తిగా భారతీయ విద్య. గ్రీకులు, బాబిలోనియా వారు భారతదేశంలో జ్యోతిష శాస్త్రాన్ని ప్రవేశపెట్టారనే విదేశీయుల వాదన పూర్తిగా సత్య దూరమైనది. ఆయా దేశాలు కళ్ళు తెరవక ముందే ఋగ్వేద, యజుర్వేద, సామ, అథర్వణ వేదాదులలో జ్యోతిష శాస్త్ర విషయాలు, రహస్యాలు అనేక చోట్ల ప్రస్తావించడం జరిగింది.

ఇంతటి విశేష ఖ్యాతి వహించిన జ్యోతిష శాస్త్రం బ్రహ్మ దేవునిచే నిర్మింపబడినదిగా తెలుస్తున్నది. అటు తరువాత ఈ శాస్త్రానికి సూర్యుడు , నారదుడు, అత్రి, కశ్యప, గర్గ, మరీచి, మనువు, ఆంగీరస, పౌలిష, చ్యవన, శౌనక, వశిష్ఠుడు, పరాశరుడు, వ్యాసుడు మొదలైన గురు తుల్యులైన మహర్షి పరంపర ప్రవర్తుకులుగా చెప్పబడ్డారు. ప్రవర్తకులు అంటే శాస్త్రం యొక్క విషయాలను నిత్య జీవితంలో ఆచరణ స్థానాన్ని కల్పించి ప్రజా బాహుళ్యానికి అందుబాటులో ఉంచినవారు అని అర్థం. అటు తరువాత ఋషి విజ్ఞానాన్ని అంది పుచ్చుకుంటూ వరహమిహిరుడు బృహజ్జాతకము; కళ్యాణ వర్మ సారావళి; మంత్రేశ్వరుడు ఫల దీపిక; కాళిదాస మహాకవి కాలామృతం; వైద్యనాథ దీక్షితులు జాతక పారిజాతం; వేంకటేశ దైవజ్ఞులు సర్వార్థ చింతామణి; మొదలైన గ్రంథాలు దేవ నాగరి లిపిలో(సంస్కృతం) రచించారు. వీరి గ్రంథాలను B.V.రామన్,మధురా కృష్ణ మూర్తి శాస్త్రి,కంభంపాటి రామగోపాల కృష్ణ మూర్తి, వడ్డాది వీర్రాజు సిద్ధాంతి గార్ల వంటి వారు నేటి ఆధునిక కాలానికి తగిన రీతిలో జ్యోతిష శాస్త్రాన్ని సులభమైన భాషలో అందరికి అందించారు.

No comments:

Post a Comment