Saturday, 16 July 2016

జ్ఞానం ఆవిర్భవించిన బాసర

జ్ఞానం ఆవిర్భవించిన బాసర

నమోస్తు సర్వపాపసంహారికాయై
నమోస్తు యోగియోగినీగణసంసేవితాయై
నమోస్తు సకల కల్యాణశుభదాయై
నమోస్తు బాసరక్షేత్రే విలసితాయై

బాసర ఆంధ్ర ప్రదేశ్ లోని అదిలాబాద్ జిల్లాలో వున్నది. గోదావరి బాసరలో సరస్వతీ ఆలయానికి కొంచెం దూరంలో వుంటుంది. ఆటోలలో వెళ్ళి రావచ్చు. మరి స్నానం చేశారుకదా. పదండి. కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళి ఆ జ్ఞాన ప్రదాయినిని దర్శించుకుందాము.బడికి, గుడికి చాలా అవినాభావ సంబంధం ఉన్నదంటారు. విద్యార్జన కోసం బడికి వెళ్ళినా, ఆ విద్యలో ఏకాగ్రత కుదిరి ప్రావీణ్యత సంపాదించాలంటే చదువుల తల్లి శరణు కోరక తప్పదు. భారత దేశంలో విద్యావంతులూ, విజ్ఞానవంతులూ ఎందరో వున్నా జ్ఞాన ప్రదాయిని అయిన ఆ సరస్వతీ ఆలయాలు మాత్రం తక్కువగా వున్నాయి. వీటిలో పురాణకాలంనుంచీ వున్నవిగా చెప్పబడుతున్న సరస్వతీ ఆలయాలు కాశ్మీరులోనిదీ, బాసరలోనిదీ. మహాలక్ష్మి, మహాకాళి, మహా సరస్వతి ఈ ముగ్గురు అమ్మలూ శక్తి త్రయం. ఈ శక్తి త్రయానికి ప్రఖ్యాతిగాంచిన ఆలయాలు అనేకం. అయితే వాటిలో ప్రముఖమైనవి శ్రీ మహాలక్ష్మికి మహారాష్ట్రలోని కొల్హాపూరు, శ్రీ మహాకాళికి మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయిని, శ్రీ మహా సరస్వతికి మన రాష్ట్రంలోని బాసర. ఈ ముగ్గురమ్మలూ కలిసి ఏక పీఠంపై వెలసిన క్షేత్రం జమ్మూలోని వైష్ణోదేవి. ప్రస్తుతం మన రాష్ట్రంలో కొలువు తీరిన మహా శక్తి స్వరూపిణి శ్రీ సరస్వతీ దేవి గురించి, ఆమె పూజలందుకుంటున్న బాసర క్షేత్ర వైభవం గురించీ తెలుసుకుందాం.

పూర్వం కురుక్షేత్ర యుధ్ధం తర్వాత వ్యాస మహర్షి, ఆయన శిష్యులు, శుక మహాముని ఒక ప్రశాంత వాతావరణంలో కొంతకాలం గడపదలచి దండకారణ్యంలో వున్న ఈ ప్రాంతం అనువుగా భావించి కొన్నాళ్ళిక్కడ వున్నారు. వ్యాస మహర్షి ప్రతిరోజూ గోదావరిలో స్నానం చేసి మూడు గుప్పెళ్ళ ఇసుక తీసుకువచ్చి మూడు కుప్పలుగా పోయగా అవి కొన్నాళ్ళకి మహలక్ష్మి, మహా సరస్వతి, మహాకాళి విగ్రహాలుగా రూపొందాయనీ, సరస్వతీ దేవి జ్ఞాన సరస్వతీదేవిగా ఆవిర్భవించిందనీ పురాణాల్లో వున్నది. ప్రస్తుతం ఈ విగ్రహాలకి పసుపు అలది వుంటుంది. ఈ పసుపు కొంచెమైనా లోపలకి ప్రసాదంగా తీసుకుంటే తెలివి తేటలు, జ్ఞానం అభివృధ్ధి చెందుతాయని భక్తుల నమ్మకం.విగ్రహానికి జీవం పోయడం కోసం తగిన శక్తి కలిగేందుకు సరస్వతి దేవి వ్యాస మహర్షికి జ్ఞానబీజాన్ని ఉపదేశించింది. అలా జ్ఞానానికి పుట్టుక బాసరలో జరిగినందున బాసర జ్ఞానక్షేత్రంగా వెలుగొందు తోంది. వ్యాసుడు ఇక్కడ వంద సంవత్సరాలు తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడు అయ్యాడన్నది పురాణ కథనం. ఆ తరువాతే ఆయన వేద, శాస్త్రాలనుపురాణాలను రాసినట్టు కూడా పురాణ కథనం వ్యాసుడు ఇక్కడ చాలాకాలం గడపటంతో ఈ ప్రాంతం వాసరగా ప్రసిధ్ధికెక్కి కాలక్రమేణా బాసరగా మారింది.ఆలయ సమీపంలో వ్యాస గుహ వున్నది. ఇక్కడ వ్యాస మహర్షి తపస్సు చేసేవారంటారు. ఇక్కడ వ్యాస భగవానుని విగ్రహం, శివలింగం వున్నాయి. ఈ భూగృహానికి సన్నని మెట్ల దోవ వున్నది. ప్రవేశ రుసుముకూడా వున్నది. ఈ ప్రాంతమంతా ప్రకృతి సౌందర్యంతో కనులవిందు చేస్తూ వుంటుంది.

సరస్వతీదేవి జ్ఞాన ప్రదాత. విద్యా ప్రదాయిని. తమ బిడ్డలు చదువు సంధ్యలలో ఆరితేరాలనీ, విజ్ఞానంలో ముందంజలో వుండాలనీ ఆశించే తల్లిదండ్రులు తమ బిడ్డల అక్షరాభ్యాసం ఈ చల్లని తల్లి కనుసన్నలలో చేయటానికి ఉబలాటపడతారు. అలాగే చదువుకుంటున్న తమ పిల్లలని ఈ తల్లి ఆశీస్సులకోసం తీసుకువచ్చేవారెందరో. ఇక్కడవున్న ముగ్గురమ్మలు వ్యాస ప్రతిష్ట అవటంవలన తమ కోర్కెలు తీర్చే చల్లని తల్లులుగా భక్తులు వీరిన కొలుస్తారు. ఈ దేవి అనుగ్రహం పొందాలనుకునేవారిలో కొందరు ఇక్కడ నియమ నిష్టలతో 11, 21 లేదా 41 రోజులు దీక్షతో గురూపదేశ మంత్రం అనుష్టానం చేస్తూ మధ్యాహ్నం గ్రామంలోకి వెళ్ళి భిక్ష స్వీకరించి దేవికి నమస్కరించి భుజిస్తారు. దీనినే మధూకరమంటారు. అలా చేస్తే అనతికాలంలోనే స్వప్నంలో ఆ తల్లి దర్శనమిచ్చి కామితార్ధాలు ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. గర్భగుడి ముందు మండపంలోకి అడుగు పెడుతూనే ప్రశాంత దృక్కులతో, చిరునవ్వుతో కనిపించే అమ్మవారిని చూసి తన్మయత్వం చెందుతాం. గర్భగుడిలో సరస్వతీ దేవి పక్కనే మహలక్ష్మ విగ్రహం వుంటుంది. మహాకాళికి చిన్న ఆలయం సరస్వతీ ఆలయం వెలుపల పశ్చిమంవైపు వుంటుంది. ఇంకా ఆలయానికి తూర్వు వైపున ఔదుంబర వృక్ష ఛాయలో దత్త మందిరం, దత్త పాదుకలు వున్నాయి. మందిరానికి దగ్గరలో వేదవతి గుండు లేదా ధనపు గుండు అని పిలవబడే శిల వున్నది. ఈ శిలపై తడితే ఒక్కో వైపు ఒక్కో శబ్దం వస్తుంది. దానిలో సీతమ్మవారి నగలు వున్నాయంటారు.
ఈ క్షేత్రం గురించి వినబడే రకరకాల కధనాలు: బ్రహ్మాండ పురాణం ప్రకారం వాల్మీకి ఇక్కడ సరస్వతిని ప్రతిష్టించి రామాయణాన్ని ఇక్కడే రాశాడు. ఆలయం సమీపంలో వాల్మీకి విగ్రహం, సమాధి చూడవచ్చు. జీరా గోదావరీ నదీతీరాన అష్టకూటులు నిర్మించిన మూడు ఆలయాలలో ఇది ఒకటని కొందరంటారు. చారిత్రకాధారాలవలన నందగిరినేలిన కర్ణాటకరాజయిన బిజియలుడు 6వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించాడు. పూర్వం ఇమామ్ షాహి, కుతుబ్ షాహీ సుల్తానుల పరిపాలనలో ( స్వార్థపరులు ధర్మద్వేషులు సనాతన ధర్మ విధ్వంసకులైన కొందరు దుండగులు పరమ పవిత్రమైన వ్యాసనిర్మిత మందిరాన్ని, మహాలక్ష్మీ విగ్రహాన్ని, పరిసర దేవాలయాన్ని ధ్వంసం చేశారు. ఆ మూకలు ప్రజల ధన మాన ప్రాణ నష్టం గావిస్తుండగా, శూరాగ్రేసరుడగు మక్కాజీ పటేలు. కొందరు యువకుల సహాయంతో ఆ దుండగులను తరిమివేసి శ్రీ సరస్వతీ మందిరాన్ని పునర్నిర్మించారు. శ్రీ విద్యారణ్య భారతీస్వామి (సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం) పునఃప్రతిష్టించారు. బాసర ఆంధ్ర ప్రదేశ్ లోని అదిలాబాద్ జిల్లాలో వున్నది. ఈ ప్రాంతాన్ని పూర్వం వెలమగోండ్లు, ముస్లిం ప్రభువులు పాలించారు. పూర్వం అదిలాబాదును ఎడ్లవాడ అని పిలిచేవారు. 1906లో నిజాం ఈ జిల్లాకు అదిల్ అని పేరు పెట్టారు. అప్పటినుంచి అది అదిలాబాద్ అయింది.

No comments:

Post a Comment