Friday, 22 July 2016

శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం



శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం 

 


నమస్తేస్తు మహామాయే! శ్రీపేఠే సురపూజితే!
శంఖచక్రగదాహస్తే ! మహాలక్ష్మీ ! నమోస్తుతే ||

అమ్మా ! శ్రీపీఠనివాసిని ! మహామాయారూపిణీ ! దేవతలచే పూజించబడుతల్లీ ! గదాశంఖచక్రాలను ధరించినదేవీ ! మహాలక్ష్మీ ! నీకు అనేక నమస్కారములు. 

వివరణ : సృష్టిస్తితిలయాలకు మూలకారణమైన శక్తికి మహామాయ అనిపేరు.  ఆమెయే శ్రీచక్రారూడ. సకలదేవతలుని ఆమెనే పూజిస్తుంటారు.  ఆమె శంఖచక్రగదాహస్త అయి, వైష్ణవీరూపంతో మహాలక్ష్మిగా, విష్ణుపత్నిగా జగద్రక్షణ చేస్తూంది. లక్ష్మి అంటే సర్వాన్నీ చూచేది అని ఒక వ్యుత్పత్తి. కనుకనే సర్వాన్నీ రక్షించేదీ అయింది.  విష్ణుపత్ని గనుక విష్ణువు ధరించే ఆయుధాలు లక్ష్మికీ వర్తించాయి.  ఇది వైష్ణవీరూపం  ఇందలి అయుదిసంబోధనలూ అమ్మవారిపంచప్రకృత్యాత్మకశక్తికి  సంకేతాలు.
నమస్తే గరుఢారూఢేః ! కోలాసురభయంకరి!
సర్వపాపహరే! దేవి! మహాలక్ష్మి! నమోస్తుతే ||

గరుత్మంతునిపై కూర్చుండి పయనించే తల్లీ ! కోలుడు అనే రాక్షసునికి భయం కల్గించిన దేవీ! సకలపాపహారిణి ! మహాలక్ష్మీ ! నీకు నమస్కారములు.

వివరణ : విష్ణుదేవుని అర్ధాంగి గనుక మహాలక్ష్మికూడా గరుడవాహనయే ! లక్ష్మీసహస్రనామస్తోత్రం 65వ శ్లోకం లో "గరుడో పరిసంస్థితా" అని ఉంది. గరుత్మంతుడు వేదమూర్తి కనుక భగవానుడు అతనిపై సంచరిస్తాడు. అంటే వేదాలపై విహరిస్తాడు.  జగన్మాత అయిన లక్ష్మీదేవి కూడా వేదారూఢయే ! అమ్మవారు వేదమాత, కోలా విధ్వంశులనేవాళ్ళు స్వారొచిషమనువు కాలంవాళ్ళు.  ఆకాలంలో చైత్రవంశీయుడైన 'సురధుడు' అనే రాజును కోలావిధ్వంశులనేవాళ్ళు జయించి, అతనికి శత్రువులయ్య్యారు.  కోలుడు, విధ్వంశుడు అనే ఈ రాక్షసుల్ని అమ్మవారు లక్ష్మీ రూపంతో సమ్హరించింది.  కనుక కోలాసుర భయంకరి అయింది.  ఈ విషయం దేవీసప్తశతిప్రధమాధ్యాయం ఐదవశ్లోకంలో సూచితం. భగవతీనామస్మరణం సర్వపాపాల్నీ నశింపజేస్తుంది.
సర్వజ్ఞే ! సర్వవరదే ! సర్వదుష్ట భయంకరి!
సర్వదుఃఖహరే! దేవి! మహాలక్ష్మి ! నమోస్తుతే ||

సర్వజ్ఞురాలా ! సకలవరాలు ప్రసాదించే దయామయీ! సర్వదుష్టశక్తుల్నీ తోలగించేపరాశక్తీ! అన్ని దుఃఖాలనూ హరించే లక్ష్మీదేవీ! నీకు నమస్కారములు

వివరణ :  అమ్మవారు జగన్నాయకి. విష్ణుపత్ని కనుక ఆమెకు తెలియని విషయం ఉండదు. ఎవరికి ఏ సుఖం కల్గినా అది శ్రీదేవియొక్క అనుగ్రహవిశేషమే ! అమ్మ 'సర్వజ్ఞ కనుక సర్వ దుష్టశక్తుల్నీ,దుఃఖాలనీ తొలగించి, అందరికీ సుఖశాంతుల్ని ప్రసాదిస్తూంది.  బాహ్యాంతశ్శత్రువులు నశిస్తేనే జీవునికి నిజమైన ఆనందం కల్గుతుంది. ఇందుకు లక్ష్మీదేవియొక్క అనుగ్రహం చాలా ముఖ్యం.
 సిద్ధిబుద్ధిప్రదే! దేవి! భుక్తిముక్తిప్రదాయిని !
మంత్రమూర్తే ! సదాదేవె ! మహాలక్ష్మి! నమోస్తుతే ||

సిద్ధినీ  బుద్ధినీ   ప్రసాదించేతల్లీ ! భుక్తిని, ముక్తిని అనుగ్రహించే దేవీ! మంత్రమూర్తీ! దివ్యకాంతిమయీ ! మహాలక్ష్మీ నీకు నమస్కారము. 

వివరణ : అమ్మవారు కార్యసిద్ధిని, అందుకు అవసరమైన బుద్ధిని ప్రసాదిస్తుంది. ఇహపరసౌఖ్యాలు అనుగ్రహిస్తుంది .  అమ్మ మంత్రమూర్తి కనుక ఎవరు ఎలా భావించి, పూజిస్తే వారివారికి తగినట్లుగా రక్షణ ఇస్తూంటుంది.  కార్యసిద్ధీ, కార్యనిర్వహణబుద్ధీ, భుక్తీ, ముక్తీ ఇలా జీవికి అవసరమైన అన్ని దంద్వాలనూ ప్రసాదించడం అమ్మ ప్రత్యేకత.  అన్ని మంత్రాలూ 'శ్రీం' బీజ మయాలే ! కనుక అమ్మ మంత్ర స్వరూపిణి.
ఆద్యంతరహితే ! దేవి! ఆద్యశక్తి ! మహేశ్వరి !
యోగజే ! యోగసంభూతే ! మహాలక్ష్మి ! నమోస్తుతే ||

ఆద్యంతాలు లేనిదేవీ ! ఆదిశక్తీ ! మహేశ్వరీ ! యోగం వల్ల జన్మించిన తల్లీ ! ధ్యానంలో గోచరించే జగన్మాతా ! మహాలక్ష్మి ! నీకు నమస్కారము.

వివరణ :  అమ్మ ఆదిశక్తి. సృష్ఠిస్తితిలయాలకు కారణమైనది.  ఈ తల్లికి మొదలు, తుది అనేవిలేవు.  సర్వకాల, సర్వావస్థలలో అమ్మ చైతన్యరూపిణియై ఉంటుంది.  అమ్మ 'యోగం' వల్ల సంభవించింది.  'యోగ'మంటే ధ్యానం.  ధ్యానంలో మాత్రమే అమ్మ సాక్షాత్కారం కల్గుతుంది. కనుక అమ్మ "యోగజ", "యోగసంభూత" అయింది. అనగా పరమాత్మరూపిణి, జగత్ప్రభువగు విష్ణుదేవుని భార్య కనుక అమ్మ "మహేశ్వరి" అనగా జ్ఞానస్వరూపిణి.
 స్థూలసూక్ష్మ మహారౌద్రే ! మహాశక్తి ! మహోదరే !
మహాపాపహరే ! దేవి ! మహాలక్ష్మి ! నమోస్తుతే ||

స్థూలరూపంతోనూ, సూక్ష్మ రూపంతోనూ, మహారౌద్రరూపంతోనూ కనిపించేతల్లీ ! మహాశక్తిస్వరూపిణీ ! గొప్ప ఉదరం గల జగజ్జననీ ! మహాపాపాల్ని హరించేదేవీ ! మహాలక్ష్మీ ! నీకు నమస్కారము.

వివరణ : లక్ష్మీదేవి రజోగుణస్వరూపిణి.  హిరణ్యవర్ణ. కనుకనే ఆమె రౌద్ర, స్థూల, సూక్ష్మ రూపాలతో ఆయా సందర్భాలలో వ్యక్తమవుతూ ఉంటుంది.  భౌతికంగా భక్తులు కోరికలకై పూజించేరూపం స్థూలం.  ఇది రజోగుణాత్మకం.  యోగులు నిస్కాములై ధ్యానించేరూపం సూక్ష్మం! ఇది సర్వగుణాత్మకం.  ఇక శత్రుసమ్హారం కావించేరూపం తామసం.  ఇది రౌద్రం.  ఇలా త్రివిధరూపాలతో శిష్టరక్షణ, దుష్టశిక్షణ చేస్తూ, అమ్మవారు విష్ణుదేవుణ్ణి అనుసరించి వుంటుంది.  ఆమె మహాశక్తి.  ఆమె గర్భంలో సమస్త బ్రహ్మాండాలూ ఉన్నాయి.  అమ్మ పాపసమ్హారిణి. సకలలోకజనని.

పద్మాసనస్థితే ! దేవి ! పరబ్రహ్మ స్వరూపిణి !
పరమేశి ! జగన్మాత ! మహాలక్ష్మి ! నమోస్తుతే ||

పద్మాసనభంగిమలో కూర్చొని ఉండేదేవీ ! పరబ్రహ్మ స్వరూపిణీ ! పరమేశ్వరీ ! జగజ్జననీ ! మహాలక్ష్మీ ! నీకు నమస్కారము.

వివరణ : లక్ష్మి పద్మం నుండి జనించింది.  పద్మంలోనే నివసిన్స్తుంది.  పద్మాన్నే ధరిస్తుంది. పద్మం పైనే కూర్చుంటుంది.  నిల్చుంటుంది. ఇలా ఆమేసర్వమూ పద్మమే ! పద్మమంటే ఇందు లక్ష్మి ఉంటుంది. పద్యతే అత్ర లక్ష్మీః  అని వ్యుత్పత్తి. అమ్మ నివసించడంవల్లనే పద్మాలకు అంతటి శోభ, మృదుత్వం, ప్రశస్తీ వచాయి.  పద్మాసన - పద్మాన్నే ఆసనంగా కల్గి ఉండేది.  అయ్య పరబ్రహ్మ కనుక ఆయన అర్ధాంగి యగు లక్ష్మి యు పరబ్రహ్మమే ! లక్ష్మి మహానాయకురాలు. సృష్ఠి స్థితి లయాలకు ఆమె కారణం.  మాత అంటే గర్భం తనలో ఇమిడియుండునది అని వ్యుత్పత్తి.  అమ్మ సకలలోకాలనూ తన గర్భం లో ధరించి సృష్ఠి చేస్తుంది. కనుక జగజ్జనని.

శ్వేతాంబరధరే! దేవి ! నానాలంకారభూషితే !
జగత్ స్థితే ! జగన్మాత ! మహాలక్ష్మి ! నమోస్తుతే ||

తెల్లనివస్త్రములు ధరించిన దేవీ ! అనేకాలయిన అలంకారాలు దాల్చినతల్లీ ! లోకస్థితికి కారణమైన విష్ణుపత్నీ ! జగన్మాతా ! మహాలక్ష్మి ! నీకు నమస్కారము. 

వివరణ : మహాలక్ష్మిని శ్వేతాంబరధారిణిగా వర్ణించుట ఇందలి విశేషం.  సాధారణంగా సరస్వతిని శ్వేతాంబరధారిణి గా నుతిస్తారు. ఇచ్చట లక్ష్మిని విద్యాలక్ష్మి గా భావించినపుడు ఆమె సరస్వతీ స్వరూపిణి అని భక్తులు భావించి ఆ రూపంతో దర్శించాలి.  అష్టవిధలక్ష్ములలో విద్యా లక్ష్మి నానాలంకారభూషితురాలు.  ఆభరణాలన్నీ సువర్ణరత్నమయమైనవే !  అమ్మ జగత్తునందలి చరాచర వస్తువు లన్నింటా నిల్చి వాటిల్ని శక్తిమంతాలుగా చేస్తుంది.  అది అమ్మవారి విభూతి అనగా ఐశ్వర్యం, లోక్స్థితి కి అమ్మవారే కారణం !

ఫలశ్రుతి

మహాలక్ష్మ్యష్టకస్తోత్రం యః పఠేత్ భక్తిమాన్నరః |
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ||

ఏకకాలే పఠేన్నిత్యం మహాపాపవినాశనం |
ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః ||

త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రువినాశనం |
మహాలక్ష్మీ ర్భవే నిత్యం ప్రసన్నా వరదా శుభా ||

ఇంద్రకృతం శ్రీ మహాక్ష్మ్యస్టకం సంపూర్ణం ||

ఇంద్రుడు గావించిన ఈ మహాలక్ష్మీ స్తోత్రాన్ని నిత్యం భక్తి ప్రపత్తులతో పఠించేవాళ్ళు రాజ్యాధికారం మొదలు సకలాభ్యుదయాలూ పొందుదురు.  రోజుకు ఒకమారు ఉదయం మాత్రమే పఠించేవారు మహాపాపాలనుండి విముక్తులవుతారు.  రోజూ ఉదయం, సాయంకాలం రెండు సార్లూ పఠించేవాళ్ళు ధనధాన్య సమృద్ధి కలవారవుతారు. మూడుకాలాల్లో ఉదయం, మధ్యాన్నం, సాయంకాలం - పఠించేవాళ్ళు సకల శత్రుబాధల్నీ తొలగించుకొని సుఖిస్తారు.  అట్టివారికి మహాలక్ష్మి ప్రసన్నురాలై కోరిన వరాలు ఇస్తుంది.  శుభాలు కల్గిస్తుంది.

వివరణ ఏ స్తోత్రాన్ని పఠించి ఫలం పొందాలన్నా, భక్తి ముఖ్యం.  భక్తి లేని పారాయణం, చిల్లులు పడిన కుండలోపోసిన నీళ్ళవలె వృధా అవుతుంది.  సర్వం మహాలక్ష్మీ ఆధీనం.  ఆ తల్లి అనుగ్రహిస్తే సకల జీవులు ఇహ పర సుఖ జీవనులై ఉంటారు.  కామక్రోధాధులైన అరిషడ్వర్గమే మహా శత్రువులు.  వాళ్ళు నశిస్తేనే మానవులు శుద్ధాంతఃకరణులవుతారు. భగవదనుగ్రహపాత్రులవుతారు. అట్టివారిని మహాలక్ష్మి తన బిడ్డలుగా ఆదరించి రక్షిస్తుంది.  అంతఃశత్రువుల్ని కూల్చాలంటే మహాలక్ష్మిని భక్తిశ్రద్ధలతో స్తుతించి, పూజించాలి.  త్రిలోకాధిపతియగు ఇంద్రుడు గావించిన ఈ దివ్య శ్తోత్రాన్ని మహర్షులు మనకు అనుగ్రహించారు.  

 

No comments:

Post a Comment