Sunday 24 July 2016

రాశుల ప్రాదుర్భావము

రాశుల ప్రాదుర్భావము


మనము నివసిస్తున్న భూమి ఈ విశ్వములోని అనేక పాలపుంతలలో ఒక చిన్న పాలపుంతయొక్క అంతర్భాగము. దానిమీద నివసిస్తున్న మనకు దానిచుట్టు మన కన్నులకు కనబడునంత మేరయందు విభిన్న ఖగోళపిండములు కనిపిస్తాయి. అలా కనిపించే వాటిలో కొన్నింటిని మనము గ్రహములని మరికొన్నింటిని తారలని అంటాము. తారాసమూహములకు నక్షత్రములని పేరు.
అనంతమయిన విశ్వములో మనకు సంబంధించిన విశ్వమునకు కొన్ని హద్దులున్నాయి. మనకు కనిపిస్తున్న సూర్యునియొక్క కిరణములు ఎంతవరకూ ప్రసరిస్తాయో అదే మన విశ్వము. మనకు కనిపించే ఖగోళపిండముల దూరాలను బట్టి కొన్ని స్పష్టముగా కనిపిస్తే కొన్ని మసకగా కనిపిస్తాయి. మన కండ్లయొక్క పరిమితిని బట్టి దూరాలు వేరైనా ఆ ఖగోళపిండములు మనకు ఒకే స్థానములో కనిపిస్తాయి. అవీ భూమిచుట్టూ వృత్తాకారమార్గములో ఉన్నట్లు కనబడతాయి. వృత్తాకారములో ఉన్నాయా లేదా అన్నది ప్రశ్న కాదు. మన కండ్లయొక్క శక్తి ప్రకారము అలా ఒక ప్రదేశములో భూమి చుట్టూ కనబడతాయన్నది సారాంశము. అలా కనిపిస్తున్న వాటిలో స్వయంప్రకాశకపిండములను తారలని, అటువంటి కొన్ని కొన్ని తారల సమూహములను నక్షత్రములని వ్యవహరిస్తున్నాము. ఆ నక్షత్రములకు చలనము లేదు. నక్షత్రమను శబ్దమునకు కూడ అర్థమదే. వాటి వాటి స్వరూప స్వభావములను బట్టి వానికి పేర్లు పెట్టబడినవి. వైదికవాఙ్మయములో ఏ వర్ణనైతే లభిస్తున్నదో అది వాస్తవమునకు నిదర్శనమన్నమాట.
ఆ విధముగ నక్షత్రాదులు మనకు కనిపించే ఆ వృత్తాకారపు మార్గమునకే క్రాంతివృత్తము లేక భచక్రము లేక రాశి చక్రము లేక నక్షత్రచక్రమని పేరు. ఆ క్రాంతి వృత్తములో నక్షత్రములను లేక వానిద్వారా ఏర్పడు రాశులను లేక వానియందలి గ్రహములను గుర్తించుటకు ఏదేని మార్గము అవసరము. ఆ వసరమును తీర్చునదే గోళీయరేఖాగణితము. ఆ క్రాంతివృత్తములో ఒక ఖగోళీయపిండము ఎంత వేగముతో ప్రయాణిస్తుందో లేక ఎన్ని కిలోమీటర్లు లేక యోజనముల దూరము ప్రయాణముచేసినదో అన్న విషయములను యంత్రసహాయములేకుండ తెలుసుకొనుట సాధ్యము కాదు. ఖగోళీయపిండములు భిన్న భిన్న దూరములలో ఉండుటచే అటువంటి యోజనాత్మకవిలువలవలన మనకు ప్రయోజనము ఉండదు.
అందువలన మేథోవంతులయిన మన పూర్వీకులు ఆ ఖగోళపిడములు భూకేంద్రములో ఏర్పరచు కోణము ఆధారముగ గణించుపద్ధతిని అనుసరించారు. ఖగోళీయపిండముల ఈ కోణీయస్థితియే సిద్ధాంతజ్యోతిషమునకు ఆధారము. సిద్ధాంతజ్యోతిషమే జన్మపత్రికవ్రాయుటకు అవసరమయిన గ్రహనక్షత్రాదుల స్థితులను అందిస్తుంది.
రాశిచక్రము
ఆ కోణీయస్థితులను మరియు గతులను గణించుటకు ఆధారమయిన ఆ క్రాంతివృత్తము 360 అంశలు కలది. ఆ అంశలనే మనము నేడు డిగ్రీలనుచున్నాము. దానిని 27 భాగములుగ విభజించినారు. ఒక్కొక్క భాగమునకు నక్షత్రమని పేరు. ఒక్కొక్క నక్షత్రమును నాలుగు సమానభాగములుగ చేసి వానిని నక్షత్రచరణములు లేక పాదములన్నారు. అవి మొత్తము 108.
ఈ విధముగ –
రాశిచక్రమునందలి మొత్తము భాగములు లేక అంశలు : 360 (3+6+0=9)
నక్షత్రములు : 27 (2+7=9)
నక్షత్రపాదములు : 108 (1+0+8=9)
ఒక నక్షత్రప్రమాణము : 130 201 (7+2+0=9)
ఒక రాశియందలి కలలు : 1800 (1+8+0+0)
రాశిచక్రమునందలి కలలు : 21600 (2+1+6+0+0)
ఈ తొమ్మిది సంఖ్య చాలా మహత్త్వపూర్ణమైనది. మనమనుసరించే చాలా సంఖ్యల మొత్తము తొమ్మదే ఈ విధముగ జ్యోతిషమునకు ఆధారమయిన ఈ 27 నక్షత్రముల గూర్చిన విస్తృత చర్చయే మనకు ప్రాచీనసాహిత్యమునందు కనిపించును. వేదములయందు ఈ నక్షత్రములు మరియు వాని దేవతలకు సంబంధించిన వివరములు అనేకము. వేదవాఙ్మయమును వర్ణించిన కొందరు మహానుభావులయితే వేదవాఙ్మయమంతా ఖగోళవర్ణన మరియు నక్షత్రవర్ణనే యున్నదని మరీ వక్కాణించి చెప్పితిరి.
ఈ నక్షత్రచక్రమును 12 సమానభాగములుగ జేసి ఒక్కొక్క భాగమునకు రాశియని పేరు పెట్టినారు. రాశియనగ సమూహమని అర్థము. ఒక్కొక్కరాశియందు తొమ్మిది నక్షత్రచరణములు ఉండును. ప్రతీ నక్షత్ర చరణమునకూ ఒక అక్షరము చెప్పబడినది. ఆ అక్షరము ఆధారముగ పుట్టినవానికి నామకరణము చేయుట అనాదిగ వస్తున్న సంప్రదాయము. ఈ అక్షరముల పుట్టుక స్వరశాస్త్రానికి సంబంధించినది మరియు అత్యంత గంభీరమయినది.

No comments:

Post a Comment