Wednesday 27 July 2016

ఆలయాల తరలింపుకీ పద్ధతులుంటాయి

ఆలయాల తరలింపుకీ పద్ధతులుంటాయి


  హిందువులకు ప్రధానమైన పుష్కరాల పర్వం రానుండగా, దానికి  ముందు సౌకర్యాలు ఏర్పరుస్తున్న నేపధ్యంలో కొన్ని  దేవాలయాలను కూలదోశారు అధికారులు.రాత్రికి రాత్రి చెప్పా పెట్టకుండా చేసిన ఈ కార్యం – ఒకనాటి మతోన్మాదపాలకుల దౌర్జన్యాలను గుర్తుచేసింది.

రోడ్ల విస్తరణ, ప్రజాసౌకర్యాల కోసం నిర్మాణాలు, పెరుగుతున్న జనాభా – సాంకేతిక ప్రగతిని పురస్కరించుకొని మార్పులు చేయడాలు అనివార్యాలే. అందులో భాగంగా రోడ్ల నడుమనో, నిర్మాంచాలనుకున్న రోడ్లకు అడ్డంకి అనో కొన్ని గుడులను తొలగించాలని అనుకోవడం తప్పు కాకపోవచ్చు.

కానీ ఆ పనిచేసేముందు హిందూమత విజ్ఞులైన ధర్మవేత్తలను సంప్రదించి – ‘ఇది చేయవచ్చా? చేస్తే ఎలా చేయాలి?’ అని ప్రశ్నించి తదనుగుణంగా చేస్తే బాగుంటుంది.
హిందూ దేవాలయాల నిర్మాణం వెనుక – అది ఎంత చిన్నదైనాగానీ – ఒక శాస్త్ర పధ్ధతి ఉంది. ఒక దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి యంత్ర, హోమ, విగ్రహాధివాసాది క్రియలు చేస్తారు. వాటిద్వారా కళాన్యాసం చేస్తారు. ఆలయాన్ని మరమ్మత్తులు చేయదలచుకున్నా, చోటు మార్చి మరోచోట ప్రతిష్ఠచేయాలన్నా ఆ కళలను మంత్రపద్ధతిలో కలశంలోకి ఆవాహన చేస్తారు. తిరిగి వాటిని ప్రతిష్ఠించేటప్పుడు మళ్ళీ శాస్త్రోక్త పద్ధతిలో పునఃన్యాసం చేస్తారు. తొలగించే అధికారులకు ఈ శాస్త్ర పద్ధతులు తెలియకపోవచ్చు – వాటిపై విశ్వాసం లేకపోవచ్చు. కానీ ఆ గుడులను కట్టించుకున్న భక్తులకా శ్రద్ధ ఉంటుంది కదా! వీటిని పరిగణించకుండా – ఆ ఆలయాలను కూలదోసి, విగ్రహాలను రోడ్డున పడేయడం అమానుషం. కళాన్యాసంతో ఉన్న దేవతామూర్తులలోని దైవశక్తి క్షోభిస్తుంది.

ఎంతచిన్న మందిరాన్నైనా తొలగించేముందు తత్సంబంధితులను, శాస్త్రవేత్తలను కలిసి ఈ న్యాసాది ప్రక్రియల ద్వారా విగ్రహాలను సురక్షితంగా మరోచోట భద్రపరచుకోవడానికి అవకాశం కల్పించాలి.తరువాత మార్గాల అభివృద్దో మరొకటో చేయవచ్చు. ఎంత ప్రత్యామ్నాయ స్థలాలనిచ్చినా కొన్ని పెద్ద మందిరాలను కూలదోయడం తప్పే. చారిత్రకంగా ప్రసిద్ధి చెందినా నిర్మాణాలను నిలుపుకోవలసిన బాధ్యతా మతంవారికే కాదు, ప్రభుత్వానికీ ఉంటుంది.

అభివృద్ధి ఎంత అవసరమో, చరిత్రను కాపాడుకోవలసిన బాధ్యతా కూడా నాగరిక దేశాలకు అంత ఆవశ్యకం. వందేళ్ళు దాటిన ఏ కట్టడాన్ని అయినా చారిత్రిక సంపదగా భద్రపరచే విధానాలు విదేశాలలో ఉన్నాయి.
నాగరిక ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో చరిత్రలను ధ్వంసం చేసుకోవడమే కాక, హిందూధర్మం పట్ల ఈ
 ప్రవర్తన విచారకరం.

వందలఏళ్ళ క్రితం ద్వేషంతో హిందూ మందిరాలను ధ్వంసం చేసిన దుర్మార్గులున్నారు. ఇతరుల మతవిషయాల్లో జోక్యం చేసుకోని న్యాయస్థానాలు – ముందూ వెనకా ఆలోచించకుండా, హిందూ  పరంపరలకు విరుద్ధంగా తీర్పులిస్తాయి.ఇతరుల మత కేంద్రాలను కదల్చలేని  ప్రభుత్వాధికారులు వందలఏళ్ళ పవిత్రహిందూ మందిరాలను ఏ సంప్రదింపులూ లేకుండానే పునాదులతో సహా కూలదోస్తారు.

అయితే మతాధిపతులు ఒప్పుకున్నా, వందల ఏళ్ళ చరిత్ర ఉన్న మందిరాలను మాత్రం కదిలించకుండా, మరోవిధంగా అభివృద్ధులు చేసుకోవాలి. హిందూమతాధిపతులు అభివృద్ధికీ, ప్రగతికీ విరోధులు కారు. పైగా, అందుకు సహకరించే వారూ వున్నారు! వారితో సమస్య వివరిస్తే, ఉభయతారకంగా, శాస్త్రసమ్మతమైన పరిష్కారాలతో మరొకచోటికి భద్రంగా తరలించడానికి సహకరిస్తారు.

No comments:

Post a Comment