Sunday 31 July 2016

శివునికి ఏ అభిషేకం వలన ఏమి ఫలం



రాత్రి వ్రతములు కొన్ని ఉంటాయి. దివావ్రతములు కొన్ని ఉంటాయి. మహాశివరాత్రి అహోరాత్ర వ్రతము. శివరాత్రి అనడంలోనే రాత్రి పాధాన్యం గురించి చెప్పబడుతున్నది. పైగా అమ్మవారికి కూడా మనం నవరాత్రులు అని మనం చేస్తాం. రాత్రి అంతర్ముఖ స్థితికి సంకేతం. ఆ సమయంలో చేసే ఆరాధనలు ధ్యానానికి, జ్ఞానానికి ప్రధానమైనవి. కర్మకు ప్రధానమైన వ్రతాలు పగటియందు చేస్తారు. 

లింగోద్భవ కాలం, తురీయ సంధ్యాకాలంలో ఒక మహాగ్ని లింగంగా తన ఆదిమద్యాంతరహితమైన తత్త్వాన్ని ప్రకటించాడు గనుక ఆ రాత్రికి ప్రాధాన్యమున్నది. అది జరిగినది మాఘబహుళ చతుర్దశి అర్థరాత్రి సమయం గనుక ఈ రాత్రిని మనం శివరాత్రి వ్రతంగా చేస్తున్నాం. ప్రతి ఆరాధనకీ ఉన్న నియమాలే శివారాధనలో కూడా ఉన్నాయి. వాటితో పాటు మరికొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఏ ఆరాధనకైనా ముందు ఉండవలసినది శుచి. దానినే సదాచారం అంటాం. "ఆచారహీనం నపునంతి వేదాః" అని శాస్త్రం. 

ఎంత వేదపండితుడైనా ఆచారపాలన లేనప్పుడు వాడు తరించడు. "ఆచార ప్రభవో ధర్మః ధర్మస్య ప్రభురచ్యుతః" అని విష్ణుసహస్రనామం చెబుతున్నది. సూర్యోదయాత్పూర్వం నిద్రలేవడం, బ్రాహ్మీ ముహూర్తంలో ధ్యానం చేయడం, స్నానసంధ్యాది నిత్యకృత్యముల తర్వాత శివారాధన చేయాలి. శివారాధనలో ప్రధానమైనది శివధర్మములు కొన్ని చెప్పబడుతున్నాయి. శివధర్మములు అనగా శివుని ఉద్దేశించి చేసే కర్మలు. పూర్ణిమ, అమావాస్యలయందు సముద్రం ఎలా వృద్ధిచెందుతుందో అలా ఆ కర్మలు వృద్ధిచెందే కాలం శివరాత్రి. అలాగే శివధర్మములు కొద్దిపాటి చేసినప్పటికీ గొప్ప ఫలితాలుంటాయి. శివాభిషేకం, నామస్మరణ ఇత్యాదులు. 

మహాశివరాత్రి నాడు ఆ కర్మలు చేస్తే కొద్దిపాటి చేసినప్పటికీ అధికఫలాన్నిస్తాయి పర్వకాల సమయంలో సముద్రం వలె అని పరమేశ్వరుడు చెప్పినట్లుగా శివపురాణంలోని వాక్యం. స్నానం శరీరానికి కేవలం బాహ్యశుద్ధిని మాత్రమే కలిగిస్తుంది. పూర్ణశుద్ధి కావాలి అంటే భస్మధారణవల్ల శుద్ధి అవుతున్నది. అందువల్ల త్రిపుండ్రములుగా నుదుటియందు, కంఠమునందు, భుజములయందు, చేతులయందు, వక్షస్థలములయందు భస్మాన్ని ధరించాలి అని శాస్త్రం. భస్మధారణ, రుద్రాక్షధారణ, పంచాక్షరీ మంత్రాన్ని జపించడం ఈమూడూ శివధర్మానికి ప్రధాన నియమాలు. స్వామికి ఇష్టమైన బిల్వదళములు, తుమ్మిపూవులు, ద్రోణ కుసుమములు(ఉమ్మెత్త పువ్వులు), వాటితో ఆరాధన చేయాలి. పంచబిల్వములు - తులసి, మారేడు, ఉసిరి, నిర్గుండి(వావిలి), నిమ్మ వీటితో అర్చించడం పరమేశ్వరునికి ప్రీతి. షట్కాల శివపూజ అని నాలుగు గంటలకొకమారు అభిషేకాదులు చేయాలి. అభిషేకప్రియః శివః అని అభిషేకానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. 

అర్హులు మంత్రసహితంగా, తెలియని వారు శివాయ నమః అనే నామం అంటూ అభిషేకం చేసినా చాలు. భక్తికి పరవశించే స్వామి పంచాక్షరితో చేసే పూజకే చాలా సంతోషిస్తాడట. వివిధ ద్రవ్యాలతో శివభిషేకం: భగవదుపచారములలో ఒక్కొక్క ఉపచారానికీ ఒక్కొక్క ఫలితాన్ని చెప్పారు. పరమేశ్వరునికి అభిషేకం అత్యంత ప్రీతిపాత్రమైనది. "అభిషేకాత్ ఆత్మశుద్ధిః" అని శాస్త్రం చెబుతోంది. అభిషేకం వల్ల ఆత్మశుద్ధి కలుగుతుంది. 

ఆత్మ అనగా చిత్తము. అంతఃకరణం శుద్ధికావాలి. చిత్త శుద్ధి లేని శివపూజ లేలరా? తో పాటుగా శివపూజ లేనిదే చిత్తశుద్ధి రాదయా అని కూడా ఉంది. అందుకని చిత్తశుద్ధి కోసం శివపూజ చేయాలి. తరువాత చిత్తశుద్ధితో శివపూజ చేయాలి. శుద్ధికి గొప్ప సాధనం అభిషేకం. 

ప్రతిదానికీ ప్రధాన, అవాంతర ప్రయోజనాలు లభిస్తాయి. ప్రధానమైనది ఆత్మశుద్ధి. అవాంతర ప్రయోజనాలు - ఐశ్వర్యం లభించడం, రోగాలు పోవడం, జ్ఞానం రావడం, మొ!!వి. పరమేశ్వరుడు త్రిగుణాతీతుడు, శుద్ధ సత్త్వ స్వరూపుడు. అందువల్ల ఆరాధనలో సాత్త్విక పదార్థాలను వినియోగించాలి. వాటిలో క్షీరము ప్రధానమైనది. 

శుద్ధజలం క్షీరం కంటే ప్రధానమైనది. శుద్ధజలంతో అభిషేకం చేయడం ఆయనకి అత్యంత ప్రీతిపాత్రం. గోక్షీరమే అభిషేకానికి వినియోగించాలి. వేరేవాటిలో గోక్షీరం కలపడం కూడదు. కొందరు ఆవుపాల ప్యాకెట్లు చించి నేరుగా అభిషేకం చేస్తారు. అలా చేయరాదు. మరికొందరు కొబ్బరికాయ కొట్టి నేరుగా అభిషేకం చేస్తారు. అది కూడా మహాదోషం. వాటిని వేరే పాత్రలోకి తీసుకొని అభిషేకం చేయాలి. క్షీరాభిషేకం వెండి పాత్రలోనే చేయాలి. రాగి, కంచు ఇత్యాది పాత్రలలో చేయరాదు. రాగి, కంచు పాత్రలతో తీర్థాన్ని కూడా పుచ్చుకోరాదు. అలా చేయడం వల్ల కల్లుపుచ్చుకున్న దోషం వస్తుంది. క్షీరంతో అభిషేకం చేస్తే అమృతంతో చేసిన గొప్ప ఫలం వస్తుంది. అపమృత్యు వంటి దోషాలు పోతాయి. క్షీరజన్యమైన దధితో అభిషేకం చేయడం కూడా ముఖ్యమైన అంశం. ఇది కూడా అమృతత్వాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. గోఘృతం (ఆవునెయ్యి)తో అభిషేకం చేయడం వలన యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది. తేనెతో అభిషేకం చేయడం వల్ల వాక్శక్తి, జ్ఞానశక్తి లభిస్తాయి. 

శుద్ధజలాభిషేకం ఆత్మశుద్ధికి హేతువవుతుంది. పైగా గంగాజలంతో అభిషేకం చేయడం ప్రత్యేకమైన విధి. గంగాజలంతో అభిషేకం చేయడంవల్ల తత్త్వజ్ఞానం లభిస్తుంది. భస్మంతో అభిషేకం మోక్షహేతువు. వివిధ ఫలరసములతో అభిషేకం అభీష్టసిద్ధినిస్తుంది. పసుపునీటితో అభిషేకం అమంగళములను తొలగించి మంగళములను, శుభాలను కలిగిస్తుంది. కుశజలం (దర్భలు ముంచిన నీరు), మారేడు తులసీదళములు నీటిలో వేసి ఆనీటితో అభిషేకం చేయవచ్చు. ఈ దళములను వేయడం వల్ల ఆజలము ఔషధంగా మారి అన్ని రోగాలను పోగొట్టగలుగుతుంది. వీటితో అభిషేకం చేయడం వల్ల ఒక కల్పవృక్షం ఎలా కోరికలు తీరుస్తుందో అలాంటి ఫలితములొస్తాయి. ఐశ్వర్యాలొస్తాయి. సుగంధద్రవ్యములు కలిపిన జలం, వట్టి వేళ్ళు కలిపిన జలముతో అభిషేకం తాపహరం, రోగహరం.

No comments:

Post a Comment