శ్రీ గురుభ్యోన్నమః
జీవితంపై సంపూర్ణ అవగాహనను ఇచ్చే మహోన్నతమైన శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం.
మనిషి మనుగడకు అవసరమైన స్థైర్యాన్ని, భవిష్యత్తుపై నమ్మకాన్ని ఇస్తుంది. . ఆకాశంలో ఆసక్తిని రేకెత్తించే తారలను గమనించటంతో ఆరంభమైన జ్యోతిష శాస్త్రం నేడు శాఖోపశాఖలుగా విస్తరించి, అనునిత్యం అన్ని అంశాలలో మనిషి మనుగడకు సహాయపడుతున్నది. జ్యోతిష శాస్త్రం ప్రధానంగా మూడు విభాగాలలో విస్తరించింది. సిద్ధాంత, సంహిత, హోరా విభాగాలు. సిద్ధాంత స్కంధాన్ని గణిత స్కంధం అని కూడా అంటారు. దీనిలో గ్రహ గణితానికి సంబంధించిన ముఖ్య విషయాలు ఉంటాయి. గ్రహాల మధ్యమ స్థితి, స్పష్ట స్థితి, సంవత్సర-ఆయన-మాసాది కాలనిర్ణయం, గ్రహణాదులు మొదలైన గణితాధార విషయాలను వివరిస్తుంది. దీనిలో మూడు విభాగాలుంటాయి.
1) కల్పారంభం నుంచి గ్రహగణితం కలిగిన దానిని సిద్ధాంతమని,
2) ఒక మహాయుగం నుంచి గ్రహగణితం కలిగిన దానిని తంత్రమని,
3) ఒక శక సంవత్సరం నుంచి గ్రహ గణితం కల దానిని కరణమని అంటారు.
సంహిత విభాగములో ఖగోళములో గ్రహభ్రమణాలు, తోకచుక్కలు, ఉల్కాపాతాలు,గ్రహణాలు మొదలైన వాటివలన ప్రపంచానికి జరిగే శుభాశుభాలకు సంబంధించిన విషయాలు, ముహూర్త సంబంధ విషయాలు ఉంటాయి. హోరా విభాగం మనిషి జన్మ సమయాన్ని ఆధారంగా చేసుకొని అతని జీవితంలో జరిగే శుభాశుభాలను వివరిస్తుంది. దీనికే జాతక స్కంధం అని పేరు. దీని ద్వారా మనిషి జన్మించిన సమయం , ప్రదేశం ఆధారంగా అతని జాతకచక్రాన్ని లిఖించి అయా గ్రహ, భావ, యోగాల అధారముగా అతని జీవితములో జరిగే శుభాశుభ ఫలాల్ని విశ్లేషించటం జరుగుతుంది. ముందుగా జ్యోతిషాధ్యయనం చేయాలనుకునే వారు కలిగి ఉండవలసిన లక్షణాలు ఒక సారి చూద్దాం. జ్యోతిషం మనిషి జీవితాన్ని ప్రభావితం చేసే శాస్త్రం. ఇది ఎవరు పడితే వారు దీనిని అధ్యయనం చేసే అర్హత లేదు. దీనిని అధ్యయనం చేసి, జ్యోతిష ఫలితాలను చెప్పాలనుకునేవారు తప్పనిసరిగా కలిగి ఉండవలసిన లక్షణాలను మన జ్యోతిష శాస్త్ర గ్రంథాలలో పొందుపరచారు.
జ్యోతిష్కుడు ఎలా ఉండాలో మన శాస్త్రాలు ఈ విధంగా నిర్దేశిస్తున్నాయి.
శ్లో.1. అద్వేషీ నిత్యసంతుష్టః గణితాగమ పారగః।
ముహూర్తగుణ దోషజ్ఞో వాగ్మీ కుశలబుద్దిమాన్ ।।
2. శాంతశ్చామృతవాక్సౌమ్యః త్రికాలజ్ఞో జితేంద్రియః ।
నిత్యకర్మరతో యో వై స దైవజ్ఞః ప్రకీర్తితః ।।
జ్యోతిష్కుడు ద్వేషము లేనివాడు, ప్రతినిత్యం జీవితాన్ని సంతోషముతో గడిపేవాడు, గణిత శాస్త్రంపై సంపూర్ణ అవగాహన కలవాడు, ముహూర్తము యొక్క గుణదోషాలను తెలిసియున్నవాడు, మంచి సంభాషణానైపుణ్యం కలవాడు, సూక్ష్మబుద్ధికలవాడు అయి ఉండాలి. ఎల్లప్పుడు ప్రశాంతమైన మనస్సు కలిగి ఉండాలి. ఎదుటివారిని నొప్పించని మృదువైన సంభాషించే చతురత కలిగి ఉండాలి. భూత, భవిష్యత్ వర్తమానాలపైన మంచి అవగాహన కలిగి ఉండాలి. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. వారికి నిర్దేశించిన నిత్యకర్మలను ప్రతినిత్యం ఆచరించేవాడై ఉండాలి. ఇటువంటివి నిరంతరం ఆచరిస్తూ జ్యోతిషం అభ్యసించే వారిని జ్యోతిష శాస్త్ర అధిదేవత అయిన ఆ వాగ్దేవి అన్ని రకాలుగా కాపాడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో గల ఆసక్తికర అంశాలను పాఠాల ద్వారా తెలుసుకుందాం.ప్రతి పాఠాన్ని సమగ్రంగా అనుసరిచి మీరూ జ్యోతిష శాస్త్రాన్ని అభ్యసించండి. మీయొక్క అమూల్య సలహాలు , సూచనలు ఆహ్వానిస్తున్నాము.
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
No comments:
Post a Comment