Sunday 27 September 2020

జ్యోతిష పాఠములు 02- జ్యోతిషము – కల్పము:



వేదపురుషునికి జ్యోతిషం కన్ను, జ్యోతిష సంహితలు వ్రాసిన ఋషులలో గర్గుడు, నారదుడూ, పరాశరుడూ ముఖ్యలు, సూర్యసిద్ధాంతం అనే జ్యోతిషం ఒకటి ఉంది. సూర్యుడు ఈ సిద్ధాంతాన్ని దానవశిల్పి ఐన మయునికి ఉపదేశించాడట, జ్యోతిషానికి మూడు స్కంధాలు. ఒకటి సిద్ధాంతస్కంధం, రెండు హోరాస్కంధం, మూడు సంహితాస్కంధం. ఈరీతిగా జ్యోతిషం స్కంధత్రయాత్మకం. ఆంగ్లంలోని అరిత్ మెటిక్ ఆల్జిబ్రా ట్రిగ్నామెట్రీ జామెట్రీ అనబడే గణితశాస్త్రాలన్నీ యించుమించు సిద్ధాంతస్కంధంలో అంతర్గతాలు. అరిత్ మెటిక్ వ్యక్తగణితం. దీనిలో కూడిక తీసివేత హెచ్చవేత భాగహారం ఉంటవి. ఆల్ జిబ్రా బీజగణితం. ఇది అవ్యక్తగణితం. అవ్యక్తాక్షర సంజ్ఞలవల్ల ఇది ఫలం గణిస్తుంది. ఇది అవ్యక్తాక్షర కుటాలను సమపరచి వ్యక్తాన్ని కనుక్కోవడమే సమీకరణం లేక ఈక్వేషన్. జామెట్రీ క్షేత్రగణితం.

కర్మానుష్ఠాన విధులను తెల్పేవి కల్పసూత్రాలు. వీనికి సిద్ధాంతస్కంధంఆధారం. ఆపస్తంబసూత్రాలూ, ఆశ్వలాయనసూత్రాలూ, శుల్బసూత్రలూఇవన్నీ కల్పసూత్రాలు, వీనిని మహరులు చెప్పారు.

ఆపస్తంబ సూత్రాలలో క్లిష్టమైన సమీకరణం ఒకటి ఉండేది. దాదాపు అరవైయేండ్ల క్రిందటివరకూ ఈముడి వేడలేదు. పాశ్చాత్య గణితంకూడా దీనికి సహాయపడలేదు. ఈ మధ్యనే దీనిని నిరూపింపగలిగారు. ఇంకా కనిపెట్టవలసిన సూత్రాలెన్నో ఉన్నవి. ఈ సమీకరణముల నిరూపణ సిద్ధాంత స్కంధ సహాయ్యంతో జరగాలి.

దాదాపు ఎనిమిదివందల సంవత్సరాలక్రితం భాస్కరాచార్యులు తమపుత్రిక పేరిట ఒక గణితశాస్త్రం వ్రాశారు. దాని పేరు 'లీలావతి', గ్రహాలస్థితిగతుల నిర్ణయానికై సిద్ధాంతశిరోమణి అనే మరోగ్రంథంకూడా ఆయన వ్రాశారు. ఘూర్జర దేశపురాజు'సింగన' అనే ఆయన బాస్కరాచార్యులవారిప్రచారం కోసం మాన్య మొకటి ఇచ్చారని 'ప్రాచీనలేఖమాల' అనే పుస్తకంలోని ఒకశాసనంలో కానవస్తూంది. నవీనగణితం యూక్లిడ్లో సప్తమ, అష్టమ, నవమ దశమ భాగాలు కానరావు. సంస్కృతములోగూడా పండ్రెండు పుస్తకాలు అలభ్యంగా ఉన్నవి. ఆర్యభట్టు ఆర్యభట్టీయం వ్రాశాడు. ఈనాటి వాక్యగణితం ఆర్యభట్టీయానుసారియే. తెనుగువారి పంచాంగాలు సూర్యసిద్ధాంతాన్ని అనుసరించిఉంటవి. గణితశాస్త్రాలు గ్రహనక్షత్రస్థితిగతులను తెల్పుతవి. గ్రహములుఏడు. రాహు, కేతువులను ఛాయాగ్రహాలని అంటారు. వారిది సూర్యచంద్రులకు విరుద్ధగతి సూర్యచంద్రుల విపరీతగణనమే రాహుకేతు గణనం. జ్యోతిషంలో గణనం ఎంత సూక్ష్మంగా చేస్తే ఫలితములు అంతనిష్కరగా చెప్పడానికివీలు. మినుకుమినుకుమంటూ ఉండేవి నక్షత్రాలు. స్థిరంగా ప్రకాశిచేవి గ్రహాలు. సూర్యుడు, నక్షత్రాలు స్వయంప్రకాశాలు, గురుశుక్రులు పెద్దనక్షత్రాలవలె ఉంటారు. సూర్యునికి సప్తాశ్వుడనే దొకపేరు. సూర్యునికి ఏడు గుఱ్ఱాలు ఉన్నవి కాని అశ్వపదానికి కిరణమని అర్థం. 'ఎకో అశ్వోభవతి సప్తనామా' ఒకేకిరణం ఏడుకిరణాలైనవి.
నవగ్రహాల స్థితులు ఎట్లా మారుతున్నవో మనుష్యుల జీవస్థితులున్నూ అట్లు మారుతున్నవి. కష్టం సుఖం ఒక రోజు; సంతోషం మరొకరోజు; దుఃఖం మనోవ్యాకులత, పదవూలలో పైకిపోవడమూ-క్రిందికిరావడమూ-ఇట్లు లోకంలో ప్రతి జీవికి ఎగుడుదిగుడు లున్నవి. అంతరిక్షంలో అవిరామంగా ప్రయాణం చేసే గ్రహాలకున్నూ, మాఱి మాఱి వస్తున్న కష్టసుఖాలను అనుభవిస్తున్న మనుష్యులకున్నూ సంబంధం ఉన్నదని ఎఱిగియే మహరులు ఒక్కొక్కగ్రహము ఇచ్చే ఫలితాన్ని నిరూపించి ఉంచారు. దీన్ని హోరాస్కంధం విశదీకరిస్తుంది. జననకాలాన్ని ఆరంభంగా తీసుకొని సుఖదుఃఖాలను శాస్త్రమూలంగా తెలిసికోగలుగుతున్నాము. ఐతే మన సుఖదుఃఖాలకు ఒక గ్రహాలేనా కారణం? వేరే కారణాలుండరాదా? వైద్యుడిదగ్గరకు వెడితే ధాతువ్యత్యాసం అందుచే వ్యాధి అని అంటున్నాడు. ధర్మశాస్త్రం చదివినవాడు అంతా పూర్వకర్మఫలం ఆదిఫలాన్ని ఇవ్వడం ప్రారంభించింది అంటున్నాడు. మనశ్శాస్త్రంవాడు అన్నిటికీ మనస్సే కారణము ఈకష్టాలకు కారణం మనోభీతితప్ప వేరే ఏదీకాదు అని సెలవిస్తున్నాడు. విషయం ఒక్కటే, కాని ఒక్కొక్కరు ఒక్కొక్కకారణం చెపుతున్నారు. ఇందులో ఏదినిజం? కొన్ని సమయాలలో మనం అనుభవించే కష్టసుఖాలకు మన పాపపుణ్యాలేకాక ఇతరుల పాపపుణ్యాలే కారణమని చెప్పటం కద్దు. ఒకబిడ్డకు జబ్బుచేస్తుంది. తల్లిదండ్రులు చేసిన పాపానికి ఈనోరులేని బిడ్డ బాధపడుతున్నది అని జాలిపడటమూ కద్దు. సమక్షంలోనే ఉంటూ ఆ శిశువుకు ఏవిధమైన ఉపచారమూ చేయలేక చేతులు పిసుక్కొంటూ మనోవ్యాకులతతో ఆ తల్లిదండ్రులు పడే తత్తరపాటు చూస్తే అది సమంజసమే అని తోస్తుంది. మనకు కల్గే అపాయాదులు శత్రువుల ఉపాయాల మూలంగానేకాక మనం చేసికొన్న పాపపుణ్యాల ఫలం అని కూడా అనుకోవచ్చు. అట్లే మానవుల సుఖదుఃఖాలకు ఇతరుల పాపపుణ్యాలు కారణం అని చెప్పటంలో విరోధ మేమీలేదు. అంతా చిహ్నమాత్రంగా ఉన్నది. మనం గుర్తించాలనే కాబోలు సర్వమూ ఏకమై వివిధానుభూతుల నిస్తుంది. కాన ఒక్కొక్కరు ఏదో ఒక్క కారణాన్నే చూడగల్గుతారు. అదే నిజమని అంటున్నారు. వరాకాలంలో వానపురుగులు అసంఖ్యాకంగాపుట్టి ఆక్షణంలోనే నశిస్తున్నవి. కప్పల సందడి చెప్పనలవికాదు. ఇవన్నీ వరానికి చిహ్నం. అట్లే కర్మఫలానికిన్నీ అనేక సూచనలు, అనేక చిహ్నాలు. ఈప్రపంచంతో సంబంధంలేని వస్తువు ఏదీ లేదు. అట్లే గ్రహగతుల ననుసరించి వ్యాధులూ మనశ్చాంచల్యము పిశాచాదులపీడా ఇవన్నీ కలుగుతున్నవి. అన్నీ కర్మఫలితములే. వానిని తెలుసుకోటానికి మార్గాలు ఎన్నో, అందులో జ్యోతిషం ఒకటి.

సంహితాస్కంధంలో ఎన్నో అద్భుతమైన విషయాలున్నవి. భూగర్భంలో దాగుకొని ఉండే ఊటబావులు, అంతర్లీనంగా ప్రవహించే నదులు ఉన్నాయని తెలుసుకోడానికి భూమి ఉపరితలంపై ఎలాంటి చిహ్నాలుంటవో సంహిత చెపుతూంది. వాసనాద్రవ్యాలను చేసేవిధానాలూ, గృహనిర్మాణం, శకుననిమిత్తములూ ఈలాంటి విషయాలను సంహితలో చూడవచ్చు. పక్షులమూలంగా ఏర్పడే నిమిత్తాలను శకునాలని చెప్తారు. మనం ఉద్దేశించిన కార్యాలకున్నూ ఈశకునాలకున్నూ ఏమి సంబంధం అని ప్రశ్నిస్తే. ప్రపంచంలో సంబంధంలేని వస్తువు ఏదిన్నీ లేదనియే జవాబివ్వవలసి వస్తుంది. విశ్వంలో జరిగే ప్రతిఒక్కటీ ఆవిశ్వేశ్వరుని ఆజ్ఞాబద్ధంగా నడుస్తున్నది. ఇందు లెక్కలేనిది లేదు. అన్ని లెక్కగానే నడుస్తున్నవి. ఒకటి తెలిస్తే మరొకటి అర్థం అవుతుంది.
ఆకాశంలో గ్రహాలన్నీ పడకుండా ఎలా నిలచిఉన్నాయి? భూమ్యాకరణసిద్ధాంతాన్ని ఒక్క న్యూటనే కనిపెట్టాడని మనలో పలువురి విశ్వాసం. కాని న్యూటనుకు ఎన్నో ఏండ్ల క్రితమే సూర్యసిద్ధాంత గ్రంథారంభలో భూమి పడకుండా ఉండటానికి కారణం ఆకరణశక్తి అని వ్రాయబడినది. ఆకరణ అంటే క్రిందికిలాగటం. ఒకవస్తువును, పైకిఎగురవేస్తే అది క్రిందికి చప్పున వస్తుంది. ఇది ఆకరణశక్తి. ప్రాణంపైకి పోతుంది. ఆపానం కిందికి దిగుతుంది. క్రిందికి లాగే శక్తిని అపానశక్తి అని అంటారు. భగవత్పాదులవారు భాష్యం వ్రాస్తూ పృథివికి అపానశక్తి ఉందని ఒకచోట సెలవిచ్చినారు. ఇలాంటి గొప్పవిషయాలు మన శాస్త్రాలలో ఎన్నో ఉన్నా తెలియనితనంచేత దేశాంతరీయశాస్త్రాలకే అవి తెలుసునని మనం అమితగౌరవం ఇస్తుంటాం.
కల్పాదిని గ్రహాలన్నీ వరుసగా ఉండేవి. కాలం గడిచిన కొద్దీ గ్రహస్థితులు కొద్దికొద్దిగా మారుతూవచ్చినవి.

మరోకల్పం అయ్యేసరికి ఈగ్రహాలన్నీ మళ్ళీ ఒకే వరుసలోకి వస్తవి. ఏమీలేని ఆకాశంనుండి విద్యుచ్ఛక్తి పుట్టి ఎన్నో కార్యాలనుచేస్తుంది. ఇట్లే ఒకచైతన్యశక్తి నుండి ఉత్పాదశక్తి యొకటి ఉద్భవిస్తుంది. మిగతా సమయాలలో ఆ చైతన్యం నిద్రాణమై ఉంటుంది. నిర్గుణమైన వస్తువునుండి పుట్టిన ఒక సృజనాత్మకశక్తియే బ్రహ్మ; ఆయన అనంతమైన వేదాలను వల్లిస్తూ ఈ అనంతవిశ్వాన్ని సృష్టిస్తున్నాడు.

బ్రహ్మ పుట్టీపుట్టడంతోనే ఆయనహృదయంలో వేదశబ్దములుస్పందించినవి. బ్రహ్మకు వేదమంత్రము స్ఫురించినట్లే ఋషులకున్నూ అపూర్వమంత్రములు స్ఫురించినవి. వారికి దివ్యమైన శ్రవణీంద్రియాలు ఉన్నవి. మానసాకాశాన్ని మహాకాశంతో ఏకీకృతం చేస్తే మహాకాశశబ్దములన్నీ మానసాకాశంలో వినబడతవని యోగశాస్త్రం చెప్పుతున్నది. అభేదస్థితిలో ఉన్న మహాత్ములకీ ఆశబ్దాలు విననౌతవి. బ్రహ్మ సృష్టికర్త, ఆయన వయస్సు నూరుఏండ్లు. అవి గడిస్తేమరొక శతవరకాలం ప్రపంచం నిద్రపోతుంది.

బ్రహ్మసృష్టికర్త ఐతే ప్రళయోత్పాదకుడు రుద్రుడు. మనకు రాత్రులు సుఖమా? పగళ్ళు సుఖమా? పగలు పని. రాత్రి విశ్రాంతి. రాత్రి విశ్రమిస్తేకాని మరుసనాడు మనకోసం వేచియున్న కర్మసంచయాన్ని కదలించడం కష్టం. అట్లే కర్మ ఫలంనుండి కొంత విరామం ఉంటేకాని ఆత్మలకు మళ్ళా కర్మఫలం అనుభవించడానికి కావలసినశక్తి ఉండదు. లోకాంతర శ్రమలనుండి విశ్రాంతి ఏర్పడితే ఆనందానుభూతి కల్గుతున్నది. మోక్షసాధనాలైన కార్యాలు చేయకపోతే సకలజీవులకూ ప్రళయకాలంలో ఆ ఆనందాన్ని రుద్రుడు ప్రసాదిస్తున్నాడు.

బ్రహ్మ బ్రతికే నూరేండ్లకు పర మనిపేరు. అందులో సగముపదార్థము సంఖ్యలోకెల్లా చిన్నది ఒకటి. మిక్కిలి పెద్దది పదార్థము ''ఏకాది పరార్థసర్యంతమ్'' అన్న మాట ఒకటివున్నది. పదునెనిమిదవస్థానం పరార్థం. ఇప్పటి బ్రహ్మకు సగం వయస్సు చెల్లిపోయింది. అతడు ద్విదేయపరార్థంలో ఉన్నాడు. ఆయనకు మొత్తం ఏడుకల్పాల వయస్సు. మూడు కల్పాలు గడచి నాలుగవది గడుస్తున్నది. ఇప్పుడునడిచే కల్పానికి ''శ్వేతవరాహకల్ప'' మనిపేరు. గడచినది లక్ష్మికల్పం. 43,20,000 ఏండ్లు చతుర్యుగము. పది కలియుగాలు కలిసి ఒక చతుర్యుగం, కలికి రెండు రెట్లు ద్వాపరం. త్రేతాయుగం కలికి మూడురెట్లు. కృతయుగం కలికి నాలుగురెట్లు. వేయి చతుర్యుగాలు అనగా 4,32,00,00,000 ఏండ్లు బ్రహ్మకు ఒకపగలు. మరొక వేయి చతుర్యుగాలు ఆయనకు ఒక రాత్రి. అనగా 8,64,00,00,000 ఏండ్లు ఆయన కొక దినం. ఇట్టిదినాలు 365 ఐతే ఒక సంవత్సరం. బ్రహ్మవయస్సు ఈ లెక్కలో నూరు ఏళ్ళు. ప్రపంచమూ అన్నియేళ్ళే ఉంటుంది.
బ్రహ్మయొక్క ప్రతిరాత్రీ అవాంతరప్రళయాలు కల్గుతూ ఉంటవి. ఈ అవాంతరప్రళయాలు భూర్, భువస్సువర్లోకాలను బాధిస్తవి. మహాప్రళయంలో బ్రహ్మకు నిర్యాణం. బ్రహ్మ పగటిలో పదునాల్గు మన్వంతరాలున్నవి. ఒక్కొక్క మన్వంతరానికీ ఒక్కొక్క మనువు అధికారి. ప్రస్తుతం ఏడవ మనువు పరిపాలిస్తున్నాడు. ఈ ఏడవమనువే సూర్యవంశంలో మొదటి వాడైన వైవస్వతమనువు.

సూర్యమండలంనుంచే సూర్యకిరిణాలద్వారా ప్రకాశమూ, ఉష్ణమూ కల్గుతున్నది. సూర్యకిరణాలకు ఉష్ణం క్రమేణ క్షిణిస్తూవస్తున్నదనీ, సూర్యుడు పూర్తిగా చల్లబడిపోయే కాలంకూడా రావచ్చుననీ ఈ కాలపు పరిశోధకులు లెక్కలు కట్టారు. మన పూర్వులు కట్టిన లెక్కలూ, ఈ పరిశోధకులు కట్టిన లెక్కలూ, ఇంచుమించు సరిపోతున్నవి.

చతుర్యుగాలు డెబ్బది ఒకటి ఐతే ఒక మన్వంతరం. ప్రస్తుతం జరుగుతున్నది వైవస్వత మన్వంతరం. దానిలో ఇపుడు ఇరువదెనిమిదవ చతుర్యుగంలోకలియుగం జరుగుతున్నది. మనం రోజూ చెప్పుకొనే సంకల్పంలో ఇవన్నీ ఉన్నాయి. సంకల్పంలో కాలం, తిధీ, లగ్నం చెప్పిఉత్తరాలలో ఊరూపేరు వ్రాసుకొనే విధంగా దేశాన్ని గూర్చికూడా చెప్పుతాం.
'ప్రత్యక్షం జ్యోతిషంశాస్త్రం' జ్యోతిషమునకు సూర్య చంద్రులేసాక్షి. అది మనకు ఉపయోగకరమైన శాస్త్రమే. జ్యోతిషం నేర్చుకొంటాం; వేదాధ్యయనం కూడా చేస్తాం. అటుతర్వాత?
మన మనస్సుకు తోచే కార్యాలన్నీ మనం చేస్తూ ఉంటాం. వీనిలో ముప్పాతికపాళ్ళు స్వార్థం. ఇవన్నీ పాపం మూటకట్టిఇచ్చేవి పాపక్షాళనకు మరికొన్ని కార్యాలుచేయాలి. వానికి మంత్రాలవసరం. మంత్రాలొక్కటే చాలవు. గృహవసతిఉండాలి. ద్రవ్యసంచయం కావాలి. గృహనిర్మాణం ఏవిధంగా చేయాలో చెప్పడానికి వాస్తుశాస్త్రం ఏర్పడింది. నానావిధాలైన కర్మలు ఈవిధంగా ఏర్పడి జీవితంలో కర్మబాహుళ్యానికి దారితీసింది మనదేశంలో ఏవర్ణస్తులైనాసరే. వారివారి వర్ణాశ్రమకర్మలను చిత్తశుద్ధితో చేస్తూ పరమేశ్వరునికి అర్పించేవారని మనం పెద్దలనుండీ గ్రహించగలం. బ్రాహ్మణులు ఆలయాలలో అధ్యయనంచేసి ఈశ్వరునకు అర్పించేవారు. శిల్పి సుందరశిల్పాలను దేవాలయపు గోడలపై, కంబములపై చెక్కి, తనకళను ఈశ్వరార్పణ చేసేవాడు. విదేశీయ శాస్త్రాల తీరు వేరు. వాని ముఖ్యోద్దేశం ఇంద్రియ సుఖం. అందుచే వారిచర్యలు భగవచ్చింతనకు దూరములైనవి. మన కర్మలు అట్లుకాక భగవత్స్మరణ కల్గించునవై, చిత్తశుద్ధిదాయకములై ఉంటవి.

జ్యోతిషమునకు నయనమని ఒకపేరు. 'నయతి' అనునది నీఞ్ ధాతువునుండి కలిగినక్రియ. 'నయతి' అనగా పొందించుచున్నాడు. తీసికొనిపోవుచున్నాడు. అని అర్థము. అంధునికి త్రోవ తెలియదు. చూపు కల మరొకడా వానికి త్రోవ చూపుతాడు. అందుచేతనే నేత్రాన్ని సూచిస్తున్నది. కాబట్టి దానిని నయనం అన్నారు. ఈనయనసాహాయ్యంచేత సత్కార్యాలు మనం చేయాలి.
ఈవర్ణమువారు ఈ ఆశ్రమంలోనివారు, ఈ యీపనులు చేయవలెననిన్నీ; ఈ యీమంత్రములను, ఈ యీద్రవ్యాలను, ఈ యీదేవతలను ఏర్పాటు చేసుకొనవలసినదనిన్నీ; ఇంతమంది ఋత్విక్కులను నియమించుకొనవలయుననిన్నీ, ఇట్టి పాత్రలను వాడవలయుననిన్నీ చెప్పేది కల్పం. కల్పశాస్త్రమును పలువురు ఋషులు చేసివున్నారు. ఋగ్వేదమునకు ఆశ్వలాయనులు కల్పము వ్రాశారు. శుక్ల యజుర్వేదానికి రెండు శాఖలు. దానికిసూత్రకర్త కాత్యాయనుడు, కృష్ణయజుర్వేదానికి అపస్తంబ, బోధాయన, వైఖానస, సత్యాషాడ, భరద్వాజ, అగ్ని వేశులనే అరుగురుఋషులు సూత్రాలువ్రాశారు. సామవేదంలోని కైథుమశాఖకు ద్రాహ్యాయణులూ, తలవకారశాఖకు జైమినీ కల్పకర్తలు. ప్రతిశాఖకున్నూ గృహ్యశ్రౌతసూత్రాలు ఉన్నవి. గర్భమాది అంతయకర్మలవరకున్నూ కర్మలను గూర్చి తెల్పేవి గృహ్యసూత్రాలు, దహనక్రియయున్నూ ఒక హోమమే. దానిని అంత్యేష్టి అని అంటారు. ఇందు దేహమే ద్రవ్యం. అగ్నిహోత్రం ఆధారంగాగల ఏడు హవిర్యజ్ఞాలు, ఏడు సోమయజ్ఞాలు మొత్తం పదునాలుగింటిని తప్ప తక్కినవానిని గృహ్యసూత్రాలుచెపుతై. ఇంటిలోచేసేది అగ్నిహోత్రం. శాలవేసి చేసేది యజ్ఞం. నలుబది సంస్కారాలనూ, ఎనిమిది ఆత్మగుణాలనూ కల్పసూత్రాలు వివరిస్తయ్. హవిస్సోమయజ్ఞాలు కాక తక్కిన 26 సంస్కారాలు గృహ్యసూత్రాలలో పొందుపడ్డవి. అవి గర్భాధానము, పుంసవనము, సీమంతము, జాతకర్మ, నామకరణము, అన్నప్రాశనము, చౌలము, ఉపనయనము, వివాహము, అంత్యేష్టి మొదలైనవి. ఎనిమిది ఆత్మగుణాలు - దయ, క్షమ, అనసూయ, శుద్ధి, పిడివాదము చేయకుండటం, మనస్సు చల్లగాఉండటం, నిర్లోభత్వం, నిరాశ అనే ఇవియున్నూ సామాన్యధర్మాలలో చేరినవి. సాధారణంగామనం ఫలానాసూత్రానికి చెందినవారమని చెప్పేటప్పుడు అది శ్రౌతసూత్రాన్నే సూచిస్తుంది. దృష్టాంతానికి-సామవేదీయులు తాముద్రాహ్యాయణసూత్రానికి చెందినవారమని చెప్పుకొంటారు. ద్రాహ్యయణులు శ్రౌతసూత్రాలు చేశారు. మరొకరు గృహ్యసూత్రాలు చేశారు. అందుచేత పూర్వకాలంలో ప్రాముఖ్యం శ్రౌతసూత్రములకనియే తెలుసు. కాని మనం ఈకాలంలో గృహ్యకర్మలకే ప్రాముఖ్యం ఇస్తున్నాము. లఘువుగా చేయవలసిన ఈ కర్మలకు విశేషించి ఈ ద్రవ్యం వెచ్చపెట్టుతున్నాం, శ్రౌతకర్మలను బీదలు యాచించి చేస్తున్నారు. పూర్వకాలంలో 'ప్రతివసంత సోమయాజులు' అనే తెగవారుండేవారు. ఒక ఏడాది ఆదాయము మూడేండ్లకు సరివచ్చినచో (యస్య త్రయం) అట్టి ఆదాయము కలవారు ప్రతివసంతమూ యజ్ఞంచేయాలి. అవన్నీ ఈనాడు ఆచరణలో నుండి తొలగిపోయి స్మారకమాత్రాలైనవి. ఈకాలపు ధనికులకు సంవత్సరపు ఆదాయమునకు మూడుసంవత్సరాల ఖర్చు తయారుగా ఉంటుంది. వ్యాపార సరళియే మారిపోయి అందరికిన్నీ అమితనష్టం కలుగుతూంది. దేనియందైనాసరే మితి అవసరం అతి తగదు. కాని ఈకాలపు బుద్ధిసామర్థ్యాలన్నీ దారిద్ర్యానికి దారితీయటం విషాదకరం. ఎంతద్రవ్యం సంపాదించినా దానికి తగిన వెచ్చం వృద్ధిచేసికొంటున్నాం. వీనిని మితపరచి సత్కార్యాచరణకై అర్థం వినియోగపరచవలెను.
యజ్ఞయాగాదులకై వలసిన చయనముగూర్చి చెప్పడానికి శుల్బసూత్రము లేర్పడ్డవి. సోమయాగం మొదలుకొని అశ్వమేధయాగం వరకూ ఉన్న అన్నియాగాలకూ మూడు వేదాలలోని మంత్రాలూ ఉపయోగపడుతున్నవి. యజ్ఞంచేసేవాడు జయమానుడు. యజమాని అనే పదం యజ్ఞంచేయని వానియెడలగూడా ఇపుడు ప్రయోగింపబడుతూంది. దీనివల్ల పూర్వకాలంలో యజ్ఞంచేసే ఆసాములు ఎక్కువమంది ఉండేవారని గ్రహించవచ్చు. పూర్వంసామాన్యంగా అధికారంఉన్న ప్రతి ఆసామి యజ్ఞం చేసేవాడన్న మాట. ఋత్విక్కులుదక్షిణలను తీసికొనేవారు. వారిలో హోత, ఉద్గాత, ఆధ్వర్యుడు అనేవారు మూడు తెగలు. హోత ఋగ్వేదం. అధ్వర్యుడు యజుర్వేదం, ఉద్గాత సామవేదం పఠిస్తారు. నిత్యయజ్ఞాలు కొన్ని లోకాంతరఫలముల నుద్దేశించి ఆయాజాతులకు ఏర్పడిన యజ్ఞాలుకొన్ని ఉన్నవి. శుల్బసూత్రాలలో సామాన్యసూత్రాలు, విశేషసూత్రాలు అని రెండువిధాలు. 'హిరణ్యకేశు'లనేవారు శుల్బసూత్రాలు వ్రాశారు. ఈ కాలంలో శ్రౌతసూత్రాల ప్రాముఖ్యందాదాపుక్షీణించిపోయింది. జనులు గృహ్యసూత్రాలను మాత్రం కొంత అంటిపెట్టుకొని ఉన్నారు. దేశాంతర శాస్త్రాలకే అధిక ప్రాముఖ్యం. పరమార్థమే మనకు లక్ష్యమనీ, ఆత్మలాభార్థం అన్నికర్మలనూ ఈశ్వరార్పణంగా చేయాలనీ మన శాస్త్రాలన్నీ నిర్దేశిస్తూన్నవనే విషయం మనం విస్మరించగూడదు.                       


 సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment