రేపు తనకు జరగబోయే శుభాశుభాలను గురించి తెలుసుకోవటం, ఏవైనా బాధలుంటే వాటికి నివారణోపాయాలను వెతుక్కోవాలనుకోవటం, ప్రతిక్షణం సుఖసంతోషాలతో జీవించాలనుకోవటం మనిషి నైజం. ఆ సుఖవంతమైన జీవితం అన్వేషణలోనే ఎన్నో రకాల శాస్త్రవిషయాలను కనుక్కోవటం జరుగుతున్నది. అయినప్పటికి భవిష్యత్తును తెలుసుకోవాలన్నా, దానిని సుఖవంతముగా మార్చుకోవాలన్నా అది ఒకే ఒక శాస్త్రంతోనే సాధ్యమవుతుంది.
అదే జ్యోతిష శాస్త్రం.జ్యోతిష్య శాస్త్రం ద్వారా మనము జన్మించిన సమయానికి ఖగోళములోని గ్రహస్థితులను సూచిస్తూ వేయబడే చక్రాన్నే జాతకము అంటారు. దీనినే జాతకచక్రము, జన్మకుండలి, హోరోస్కోప్ ఇలా వివిధ రకాల పేర్లతో ఆయా ప్రాంతాలవారు సంబోధిస్తుంటారు. ఒక వ్యక్తి జన్మించిన సమయము, ప్రదేశము ఆధారముగా జాతకచక్రము గణించబడుతుంది. ఖగోళములోని గ్రహస్థితులను గణితాధారముగా లెక్కించి, ఆయా రాశి, నక్షత్ర, భావాలలో ఉన్న గ్రహాల ఆధారముగా భవిష్యత్తు చెప్పబడుతుంది.దీని గణనలో కాని, జన్మించిన సమయములో కాని తప్పు జరిగినట్లయితే అది ఆ నిర్దేశిత వ్యక్తి జాతకం కాక వేరే వారి జాతకం అవటమే కాకుండా, ఈ వ్యక్తికి చెప్పబడ్డ భవిష్య ఫలాలన్నీ తప్పే అవకాశం ఉంటుంది.కాబట్టి భవిష్యత్తు తెలుసుకోవలనుకుంటే జాతక చక్రము అత్యావశ్యమైనదిగా చెప్పబడింది.
జ్యోతిషమనే మహాసముద్రములో జాతకము ఒక నీటి బిందువులాంటిది. అటువంటి జాతకచక్రము వేయటానికి ముందు మన రాశి, నక్షత్రములను తెలుసుకోవటం ఎలాగో నేర్చుకుందాము. ఈ జ్యోతిషపాఠాలు క్రమం తప్పకుండా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఒక పాఠం చదవకపోయినా ఎంతో సమాచారాన్ని కోల్పోయినవారవుతారు.జన్మ రాశి - నక్షత్రం తెలుసుకునే విధానంమన రాశి, నక్షత్రం తెలుసుకోవాలంటే మనం పుట్టిన సంవత్సరానికి గణించబడ్డ దృగ్గణిత పంచాంగం మన వద్ద ఉండాలి.ఆ పంచాంగములో ప్రతి రోజు తిథి, వార, నక్షత్ర, యోగ మరియు కరణాల అంత్యసమయాలు ఇవ్వబడతాయి. మీకు ప్రస్తుతం చంద్రస్థితి తెలిస్తే సరిపోతుంది.
మీరు పుట్టిన రోజున చంద్రుడు ఏ రాశిలో ఉంటే అదే మీ జన్మరాశి అవుతుంది. ఉదా: తేది 27-11-1972 రోజున మధ్యాహ్నం 1 గంటలకు ఒకరు జన్మించారనుకోండి. ఆ రోజు పిడపర్తి వారి పంచాంగములో ఉదయం 06:58 వరకు కృత్తికా నక్షత్రం ఉన్నది. అంటే ఉదయం 07:58 నుంచి మఖ నక్షత్రం ఆరంభమవుతున్నది. అంటే చంద్రుడు ఆ రోజు మఖ నక్షత్రంలో, సింహ రాశిలో సంచరిస్తున్నాడని అర్థం. ఈ మఖ నక్షత్రం మరునాడు తెల్లవారి ఉదయం 10:01 ని. వరకు ఉన్నది. అంటే 27-11-1972 ఉదయం 07:58 నుంచి తెల్లవారి(28-11-1972) ఉదయం 10:01 మధ్యలో ఎవరు జన్మించినా వారి నక్షత్రం మఖ] అవుతుంది. చంద్రుడు సంచరిస్తున్న మఖ నక్షత్రం సింహ రాశిలో ఉంటుంది. కనుక ఈ రోజు ఎవరు జన్మించినా వారిది మఖనక్షత్రం, సింహరాశి అవుతుంది.మీరు జన్మించిన సంవత్సర పంచాంగంలో, మీరు పుట్టిన తేదీకి ఏ రాశి, నక్షత్రాలున్నాయో చూడండి. . మీకు ఈ జ్యోతిష పాఠాలకు సంబంధించి ఏవైనా సందేహాలున్నా, సలహాలు, సూచనలు ఇవ్వదలచిన కామెంట్ చెయ్యగలరు.
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
No comments:
Post a Comment