ఏ పనిచేస్తున్నా- ‘ఇది నేను చేయటం లేదు, నాలోని జగన్మాత చేయిస్తున్నది’ అనే సంపూర్ణ శరణాగతి, నివేదన భావంతో మంచిపని చేస్తే అది జగజ్జనని ఆరాధన అవుతుంది. జీవితమంతా ఒక మహాసాధన. ఇందులో ఏ క్షణం కూడా మనది కాదు. దానిని వ్యర్థం చేసేందుకు మనకు అధికారం లేదు. అద్భుతమైన ఈ శరీర యంత్రాన్ని మనకు ప్రసాదించిన శ్రీమాతను స్మరిస్తూ, ఈ శరీరం మనకూడా ఉండగానే, ఇందులో అంతర్లీనంగా ఉన్న ఆనంద బిందువును ఆర్ద్రతతో, అప్రమత్తంగా, ఆప్యాయంగా అందుకోవాలి. అందుకు ఆధారం-త్రికాల సంధ్యా దేవత గాయత్రీమాత అనుగ్రహం.
గాయత్త్రీ వ్యాహృతి సంధ్యా అని గాయత్రీ మాతను కీర్తించాడు హయగ్రీవ మహర్షి. దీనినిబట్టి మనకర్థమయ్యేదేమిటంటే- సంధ్య ఎవరో గాదు- గాయత్త్రే. ఆ గాయత్రి కూడా ఎవరో కాదు- శ్రీలలితా పరదేవతే, మహాశక్తే. ఆ శక్తి కాలస్వరూపిణి. కాలమంటే కదిలేది. అచలమైన తత్త్వం నుండి చలించి వస్తుంది ఆ శక్తి. చలించి, పరా పశ్యంతి, మధ్యమా, వైఖరీ అని నాలుగు దశలలో కిందికి చలించి దిగి వచ్చింది. వచ్చి, అదే మనకు చివరకు వైఖరీ రూపమైన ఈ ప్రపంచంగా కనిపిస్తుంది. ఈ చరాచర ప్రపంచమే- నిరంతర భ్రమణశీలమైన ఆ గాయత్రీ శక్తి.
మన నాత్త్రాయతే ఇతి మన్త్రః మననం చేసే కొద్దీ మనలను కాపాడేదేదో అదీ మంత్రమంటే. మంత్రాణా మర్థస్తిరోహితో భవతి అని పెద్దలు చెప్తారు. మంత్రం పైకి కనిపిస్తున్నా మంత్రార్థమలా కనిపించదు. అందులో రహస్యంగా ఉంటుంది. మననం వల్లనే అది ప్రకటితమవుతుంది. ఆదిభౌతికం, ఆధ్యాత్మికం, ఆది దైవికమని మూడు భూమికలలో భావన చేయాలి. ఆది దైవికమైన స్థాయి నుంచే దిగి వచ్చిందది మనదాకా. దిగి వచ్చేటప్పుడది గాయత్త్రి.
గాయతి త్రాయతే ఇతి గాయత్త్రీ. ఎవరా మంత్రాన్ని గానం చేస్తుంటే వారిని కాపాడుతుంది కనుక గాయత్త్రి అయింది.
న గాయత్య్రాః పరం మంత్రం నమాతుః పరదైవతమ్ గాయత్రికి మించిన మంత్రము లేదు. తల్లిని మించిన దేవత లేదని దివ్య సూక్తి. ఏ మంత్రానుష్ఠానం చేసినా, ముందు గాయత్త్రీ మంత్రం చేస్తేనేగాని దాని ఫలితం మనకు రాదు. అదీ గాయత్త్రీ మంత్ర జప విశిష్టత. గాయత్రీ ఛందసామహమ్ అని ఋక్కులలో గాయత్రి మంత్రమును తానేనని భగవద్గీత పదవ అధ్యాయంలో గీతాచార్యుడు నొక్కి వక్కాణించటం- గాయత్రీ మంత్ర మహోదాత్తత విశదమవుతుంది. సద్బుద్ధి ప్రదాయిని గాయత్రి. దీర్ఘాయువు, సత్సంతానం, గోవులు, కీర్తి, ద్రవ్యము, బ్రహ్మ వర్చస్సులను ప్రసాదించి, అంత్యంలో బ్రహ్మమును అనుగ్రహించు కరుణామయి ‘గాయత్రి’ అని చెపుతోంది అధర్వణ వేదం.
గాయత్రీ మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలు వస్తాయి. వాటిని మూడు భాగాలుగా చేస్తే, ఒక్కొక్క భాగానికి ఎనిమిది అక్షరాలు వస్తాయి. ఈ మూడు ఖండాలు- సృష్టి స్థితి లయాలకు సూచితం. మొదటి ఖండం- ఋగ్వేదం; రెండవది-సామవేదం; మూడవది- యజుర్వేదం అవుతాయి. కనుక గాయత్రి వేదమాత.
గాయత్రీ మంత్రంలోని 24 బీజాక్షరాలకు, వాల్మీకి మహర్షి ఒక్కొక్క అక్షరానికి వెయ్యి శ్లోకాలతో, వెరసి ఇరవది నాలుగు వేల శ్లోకాలతో శ్రీమద్రామాయణ మహాకావ్యాన్ని రచించారు. కనుకనే, గాయత్రీ మంత్రాక్షర ఘటితమైన శ్రీమద్రామాయణము సర్వశక్తి సమన్వితమయింది. కాలచక్రాన్ని తన సంచారంతో నడిపించేవాడు సూర్యుడు. చండ మార్తాండ మండల మధ్యలో సూర్యునికి అధిష్ఠాత్రి అయి అతనికి కూడా సత్తా స్ఫూర్తులను కలిగించే చిన్మయ చైతన్య రూపిణి గాయత్రి.
ప్రాణశక్తి గాయత్రి..
సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్ళడానికి నెల రోజులు పడుతుంది. ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకతలుంటాయి. ప్రకృతిలో అనేక మార్పులొస్తాయి. అవి మానవ శరీరంపై, మనసుపై ప్రభావం చూపుతాయి. పుట్టినప్పుడు ఏ రాశిలో సూర్యుడున్నాడో అది ముఖ్యమైన ప్రాణశక్తి. ప్రాణం మన శరీరంలో నాభి దగ్గర ఉంటుంది. అందుకే సృష్టించే బ్రహ్మదేవుడు- స్థితి కారకుడైన విష్ణుమూర్తి నాభి కమలం లోంచి జన్మించాడు. గర్భస్థ శిశువు నాభి, తల్లి నాభి కలుస్తాయి. ఇదే గర్భస్థ శిశువులకు ప్రాణశక్తిని ఇచ్చేది. బయటకు వచ్చిన తర్వాత శిశువును వేరు చేస్తారు. అలా వేరవగానే సూర్యశక్తి- ప్రాణశక్తిగా పుట్టిన శిశువుకు సమకూరుతుంది. ఈ శక్తియే గాయత్రీ మాత. పిల్లలు ఎదిగినకొద్దీ వారికి ప్రాణశక్తిని ఎలా పొందాలనే విషయమై ప్రాణామాయ కుండలినీ శక్తి గురించి నేర్పాలి. రోజూ మూడుసార్లు త్రిసంధ్యలలో ప్రాణాయామం చేస్తే బుద్ధి వికసిస్తుంది, పరిపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. ఆ సంధ్యా దేవతే గాయత్రీమాత.
గాయత్రీ జప సుప్రీతాయై నమః- సూర్య సహస్ర నామావళి
మనకి కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. అందరికీ ఆరోగ్యాన్ని, జీవించటానికి ఆహారాన్ని ఇచ్చేవాడు. కనుకనే ఆదిత్యుణ్ణి- అన్నదాత, ఆరోగ్య ప్రదాత అన్నారు. తల్లి తన పిల్లలకు పాలిచ్చి పోషిస్తుంది. సూర్యభగవాడు సమస్త జీవరాశులకు, వృక్ష లతాదులకు, ప్రకృతిలోని అన్నింటికీ పోషకుడు. పంచభూతములకు (్భమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము) సూర్యుడు స్ఫూర్తిదాయకుడు, శక్తినిచ్చేవాడు. అందుకే సూర్యుణ్ణి ‘పూషణ్’ అన్నారు.
కాలభేదములు ఏర్పడటానికి సూర్యుడే కారకుడు. ఒక్క సెకన్ కూడా తేడా లేకుండా ఆయా ప్రదేశాలలో, ఆయా ఋతువులను అనుసరించి ఆయా తేదీలలో సూర్యోదయ, సూర్యాస్తమానాలు జరుగుతాయి. ఎన్ని సంవత్సరాలకైనా అదే సమయంలో జరుగుతుంది. కనుక కాల నియమం, సమయ పాలన, కాలప్రాముఖ్యతకు, సూర్యుడే ఆదర్శంగా నిలుస్తాడు. ఇది లేకపోతే జ్యోతిశ్శాస్తమ్రే లేదు. నిత్యానుష్ఠాన కర్మలే లేవు. సూర్యుడు రాకపోతే రోజు గడవదు. అతడు త్యాగమూర్తి, నిత్య కర్తవ్య పరిపాలకుడు. అందుకే మహర్షులు ‘‘మీరు కూడా సూర్యుని వలె ఉండండని, ఆత్మ తేజస్సుని వికసింపచేసుకోండి’’ అని చెప్పారు.
సూర్యుణ్ణి మనం దైవంగా భావించి, పరబ్రహ్మ స్వరూపంగా ఉఫాసిస్తాం, ఆరాధిస్తాం. సూర్యునిలోని సద్గుణ శక్తియే- గాయత్రి. సూర్యునికి, గాయత్రికి భేదం లేదు. మంత్రం సూర్య తేజస్సు పరంగా ఉంటుంది. సాకార రూపం- గాయత్రీమాత.
గాయత్రీ మంత్రం.. ఆధ్యాత్మికత
శ్రీ దేవీ నవరాత్రులలో శ్రీ దుర్గా సప్తశతి పారాయణ చేస్తారు. ఇది గాయత్రీ మంత్ర స్వరూప తత్త్వమే. గాయత్రీ మంత్రంలోని మూడు పాదములు శ్రీ దుర్గా సప్తశతిలోని మూడు చరిత్రలకు స్ఫూర్తి. గాయత్రీ మంత్రంలోని మొదటి చరమణమైన తత్స వితుర్వరేణ్యం దుర్గా సప్తశతిలోని ప్రథమ భాగం. దానికి అధిష్ఠాన దేవత మహాకాళి. కాళి-కాల స్వరూపం. సమస్తమూ కాలం లోంచి ప్రభవించి ప్రళయకాలంలో లయమవుతాయి. కనుక, ప్రథమ పాదాన్ని సంపూర్ణంగా తెలిసికొంటే ఆధ్యాత్మిక సూర్యోదయం కలిగి, ప్రతి ప్రభాతం ఒక సుప్రభాతం అవుతుంది.
గాయత్రీ మంత్రంలోని రెండవ పాదం- ‘్భర్గోదేవస్య ధీమహి’ అన్నదానికి శ్రీ దుర్గా సప్తశతిలో రెండవ చరిత్రలో ఉన్నది. దీనికి అధిష్ఠాత్రి శ్రీ మహాలక్ష్మి- స్థితికర్తయైన విష్ణుపత్ని. సాధకుడికి పోషణ సామర్థ్యం కలిగి, విజ్ఞానం, ఐశ్వర్యం, సత్వగుణం ప్రాప్తిస్తాయి. అనుదినం సుదినం అవుతుంది.
]
గాయత్రీ మంత్ర మూడవ చరణం- ధియోయోనః ప్రచోదయాత్- దీని వివరణ శ్రీదేవీ సప్తశతిలో మూడవ చరిత్రలో విశదీకరింపబడింది. దీనికి మహాసరస్వతి అధిష్ఠానదేవత. ‘నేనెవరు?’ అనేదానికి సంపూర్ణమైన అర్థాన్ని తెలుసుకోగలుగుతారు. ఇక సూర్యోదయం ఉండదు. ఎందుకంటే హృదయంలో సూర్యాస్తమయం ఉండదు గనుక. ఇది గాయత్రీ మంత్ర విశేషం.
నాభి హృత్కంఠ రసన నాసాదులయందు, ధర ఋక్యామాదులలో వర గాయత్రీ హృదయమున- అన్న త్యాగరాజ కీర్తనను మననం చేసుకొంటూ, సప్తస్వర సుందరులను భజించి, సంగీత సాధనలో గాయత్రీ మాతను ఆరాధిస్తారు నాదయోగి శిష్యపరంపర. సంధ్యాదేవీం, సావిత్రీం, వర గాయత్రీం, సరస్వతీ భజేహం అన్న దేవక్రియ రాగంలో ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తన గాయత్రీ తత్త్వానికి దర్పణం. దేవీ అనుగ్రహంతో సంప్రాప్తించిన శక్తిని లోక కల్యాణానికి ఉపకరించి తరించాలని ఉద్బోధిస్తోంది- సద్బుద్ధి ప్రదాయిని, సంధ్యాదేవత వేదమాత గాయత్రి.
No comments:
Post a Comment