పాలపిట్ట శుభాలకు, విజయాలకు చిహ్నం. విజయదశమి రోజున ఈ పిట్టను చూడగలగడాన్ని ఎంతో అదృష్టంగా, శుభ సూచకంగా ప్రజలు భావిస్తారు.
దసరా పండుగ వచ్చిందంటే జమ్మిచెట్టు ఎలా గుర్తుకు వస్తుందో పాలపిట్ట కూడా అలాగే గుర్తుకువస్తుంది. గుప్పెడంత ఉండే ఈ పాలపిట్ట చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. దసరా పండుగ వచ్చిందంటే పాలపిట్టను చూడాల్సిందే... దానికి మొక్కాల్సిందే. విజయదశమి రోజున ఈ పిట్టను చూస్తే అంతా శుభమే జరుగుతుందని, చేపట్టిన ప్రతి పనీ విజయవంతంగా పూర్తవుతుందని పలువురి నమ్మకం. ఇంతకూ ఈ పాలపిట్టను దసరా అప్పుడే ఎందుకు చూడాలి అంటారా? దీనికి చాలా సీరియస్ ‘పిట్ట’ కథే ఉంది. పాండవులు అరణ్య, అజ్ఞాతవాసాలను ముగించుకుని రాజ్యానికి తిరిగి వస్తుండగా ఈ పాలపిట్ట కనపడిందట. అప్పటి నుంచి వారికి విజయాలు సిద్ధించాయని జానపదుల నమ్మకం. అందుకే విజయదశమి రోజున పూర్వం తప్పనిసరిగా మగవాళ్లు అడవికి పోయి పాలపిట్టను చూసిగాని ఇంటికి వచ్చేవారు కాదట. ప్రజల మనస్సుల్లో ఈ పిట్టకు సాంస్కృతికంగా, పురాణాల పరంగా అంత ప్రాధాన్యం ఉంది కాబట్టే ఆంధ్ర రాష్ట్రంతో పాటు కర్నాటక, ఒడిస్సా, బీహార్‌ల రాష్ట్ర పక్షిగా ఇది వెలిగిపోతోంది. ఇప్పుడు ఈ పక్షి జాడ అపురూపమైపోయింది.
ఊళ్లల్లో ఇవి అక్కడక్కడ ఓ మెరుపు మెరుస్తున్నట్టు కనిపిస్తున్నా సిటీల్లో అయితే ఇవి మరీ అపురూపమైపోయాయి. అందుకే దసరా అప్పుడు కొందరు ఈ పాలపిట్టలను పట్టుకుని పంజరంలో ఉంచి చూపిస్తూ డబ్బులు వసూలు చేస్తుంటారు. ఇంకొందరు దసరా సమయంలో పాలపిట్టలను కొని వాటిని వూరి చివర్లో పొలాల మధ్య విడిచి పెడుతుంటారు. ఏదేమైనా దసరా పండుగ వచ్చిందంటే ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో మొక్కే పక్షి ఈ పాలపిట్ట. తెలంగాణాలో పాలపిట్టకు ఎంతో ప్రాధాన్యత ఉంది.
No comments:
Post a Comment