Friday, 28 October 2016

నరకచతుర్దశి – నియమాలు!




శ్రీకృష్ణుడు, సత్యభామతో కలిసి నరకాసురుని సంహరించిన పుణ్యదినమే ఈ నరకచతుర్దశి. నిజానికి దీపావళి ప్రాముఖ్యత అంతా ఈ నరకచతుర్దశి రోజునే ఉంది. ఈ రోజున మన పెద్దలు సూచించిన నియమాలను, వాటి వెనుక ఉన్న శాస్త్రీయతను గమనిస్తే వారి మేధకు ఆశ్చర్యపోక తప్పదు!

అభ్యంగన స్నానం:



నరకచతుర్దశి రోజున సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం చేయమన్నారు మన పెద్దలు. అభ్యంగనం అంటే కేవలం తల మీద నాలుగు చెంబులు కుమ్మరించుకోవడం కాదు. ఒంటినిండా శుభ్రంగా నూనెను పట్టించి, దానిని శనగపిండితో రుద్దుకుంటూ రోజుల తరబడి ఒంటికి పేరుకున్న మకిలిని వదిలించడమే అభ్యంగనం! ఈ రోజున తప్పనిసరిగా అభ్యంగనాన్ని చేయాలని చెప్పడం వెనుక ఒక కారణం కనిపిస్తుంది. దీపావళి నాటి నుంచి ఇక చలికాలం మొదలైపోతుంది. ఒంట్లోని రక్తప్రసరణ వ్యవస్థ సరిగా లేకుంటే, వచ్చే చలికాలంలో ఇబ్బందులు తప్పవు. శరీరభాగాలు మొద్దుబారిపోవడం దగ్గరనుంచీ, గుండెపోటు వరకూ రక్తప్రసరణకి సంబంధించిన ఎన్నో రోగాలు చలికాలంలో విజృంభిస్తాయి. చలికి రక్తానాళాలు ముడుచుకుపోవడమే దీనికి కారణం! ఈ రోజు చేసే అభ్యంగనం మన రక్తప్రసరణలో కొంత చురుకుని పుట్టిస్తుంది. అందుకే ఈ రోజున నువ్వులనూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి ఉంటారని మన పెద్దలు చెప్పారు. అలాగైనా జనమంతా తప్పకుండా అభ్యంగనాన్ని ఆచరిస్తారని ఒక ఆలోచన కావచ్చు. నువ్వులనూనె సాంద్రత ఎక్కువగా ఉండి వేడి కలిగించే గుణంతో ఉంటుంది. ఇక శనగపిండికి చర్మానికి ఉండే స్వేదరంధ్రాలను శుభ్రపరిచే స్వభావం ఉంది. ఈ రెంటితో మన శరీరానికి చేసే మర్దనం, ఒంట్లోని రక్తనాశాలలో చురుకుని పుట్టిస్తుంది. ఇదీ స్థూలంగా ఈ రోజు అభ్యంగనం చేయడం వల్ల కలిగే లాభం!

దీపం:




నరకచతుర్దశినాటినుంచే మనం దీపాలను వెలిగిస్తాము. ఈ రోజు ఆలయాల్లో నువ్వులనూనెతో చేసిన దీపాలను విరివిగా పెడతారు. దీపం నుంచి వెలువడే పొగ, అది వాతావరణం మీదా, చుట్టూ ఉన్న మనుషుల మీదా చూపించే ప్రభావాన్ని బట్టి నువ్వులనూనె దీపారాధనకు శ్రేష్ఠమని మన పెద్దలు నిర్ణయించారు. పైగా చలికాలానికి ముసురుకునే క్రిమికీటకాదులను దూరంగా ఉంచే వెలుతురు, వేడిని ఈ దీపారాధన కలుగచేస్తుంది.
దక్షిణదీపం:


నరకచతుర్దశినాటి మునిమాపువేళ దక్షిణ దిక్కుకేసి ఒక దీపాన్ని వెలిగించాలని చెబుతున్నారు పెద్దలు. దక్షిణం యమస్థానం, కాబట్టి యమలోకం కూడా అటువైపే ఉందని చెబతారు. యమలోకంలో ఉన్న మన పితృదేవతలకు ఈ దీపం దారిని చూపిస్తుందని నమ్మకం. ఎవరైతే ఇలా దీపాలను వెలిగిస్తారో వారు తమ పితృదేవతలను నరకలోకం నుంచి స్వర్గాన్ని చేరవేర్చినవారవుతారు అని శాస్త్రం చెబుతోంది. అందుకనే ఈ రోజుకి `ప్రేతచతుర్దశి` అన్న పేరు కూడా ఉంది. సాధారణంగా పెద్దలను తల్చుకుని వారికి అభిమానపూర్వకంగా ఏదన్నా సమర్పించడానికి ఏదో ఒక క్రతువు ఉంటుంది. అలా ధనంతో కానీ, క్రతువులతో కానీ సంబంధం లేకుండా బీదాసాదా అందరూ తమ పితృదేవతలను మనస్ఫూర్తిగా తల్చుకుని కొల్చుకునే అవకాశమే ఈ దీపం! నిజానికి మొదట నరకచతుర్దశే ముఖ్యమైన పండుగగా ఉండేదనీ, నరక అన్న పదం నరకాసురుని కాకుండా నరకాన్ని సూచించేదనీ కొందరి వాదన కూడా!

ఇక నరకచతుర్దశినాడు చేసుకునే పిండివంటలలో నువ్వులు కూడా ఉండాలన్నది మరో నియమం. నువ్వుల శరీరంలో విపరీతమైన వేడిని పుట్టిస్తాయి. చలికాలం మొదలవుతున్న ఈ సమయంలో నువ్వులతో కూడిన ఆహారపదార్థాలు, శరీరాన్ని చలికి సిద్ధంగా ఉండే అవకాశాన్ని ఇస్తాయి. మొత్తానికి నువ్వుల నూనెతో అభ్యంగనం, నువ్వులతో పిండివంటలు, నువ్వులనూనెతో దీపం… ఇదీ నరకచతుర్దశినాటి నియమం!

No comments:

Post a Comment