Friday 7 October 2016

దేవీ భాగవతం.. స్త్రీ వైభవం







సృష్టిలో అన్ని ప్రాణుల్లోనూ ఉన్న స్త్రీ, పురుష తత్వాల్లో ఏది ముఖ్యం అనేది సమాధానం లేని ప్రశ్న. మతాలు చాలావరకు దేవుడ్ని పురుష రూపంలోనే చెబుతాయి. మన సంస్కృతిలో విష్ణువే పరమాత్మ అని వైష్ణవులు, శివుడు పరమాత్మ అని శైవులు, గణపతి ముఖ్యమని గాణాపత్యులు ఇంకా విభిన్న సంప్రదాయాలున్నా అన్నీ కలసి మెలిసి ఉన్నాయి. అన్ని సంప్రదాయాల్లోని వారూ వేదాలనూ, ఉపనిషత్తుల్నీ అంగీకరించినవారే. ఉపనిషత్తుల్లో పరమాత్మకు చెప్పిన లక్షణాల్ని వారివారి సంప్రదాయంలోని దేవతకు సంబంధించినవిగా భావించారు. దాని ఆధారంగా పురాణాలు కూడా ఆయా దేవుళ్లపై వచ్చాయి. దేవీ భాగవతం అలాంటి పురాణమే. దేవీ నవరాత్రుల సమయంలో చాలామంది ఇళ్లలోనూ, దేవాలయాల్లోనూ పారాయణం చేసే పుస్తకం ఇది.
దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉత్సాహంగా ఆచరించుకునే పండుగ నవరాత్రులు. ఇందులో స్త్రీల పాత్ర కోలాహలంగా సాగుతుంది. వివిధ ప్రాంతాల్లో వివిధ ఆచారాలున్నా సీ్త్ర ప్రాధాన్యం అన్నిచోట్లా కనిపిస్తుంది. దీనికి కారణం బహుశా దేవీ భాగవత పురాణం అన్ని ప్రాంతాల్లో ప్రాచుర్యంలో ఉండటం కావచ్చు. లేదా ఇదివరకే ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆచారాల్ని పురాణ రచయిత ప్రచారం చేసి ఉండవచ్చు.
ఇందులో సిద్ధాంతాన్ని చూస్తే దేవియే ఉపనిషత్తుల్లో చెప్పే పరబ్రహ్మ. ఈమె శక్తి యొక్క అంశలే త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఈ శక్తి అంశలే త్రిమూర్తుల భార్యలు. ఈ శక్తియే సగుణ రూపంలో పూజించేవారికి దేవతా మూర్తిగానూ, నిర్గుణ రూపంలో ధ్యానించేవారికి పరమాత్మగానూ కనిపిస్తుంది. పుస్తకంలో సిద్ధాంతం భాగం కొంతే. సాంఘిక విషయాలే ఎక్కువ.
ఈ పురాణంలో సీ్త్ర ప్రాధాన్యాన్ని తెలిపే ఒక ముఖ్య అంశం కుమారీ పూజ. దీన్ని మూడో స్కంధం 26వ అధ్యాయంలో వర్ణించారు. రెండేళ్ల నుంచి పదేళ్ల వరకూ ఉన్న బాలికల్ని కుమారి అన్నారు. నవరాత్రుల్లోని తొమ్మిది రోజుల్లో ప్రతిరోజూ ఒక కుమారిని పూజించాలి. లేదా మొదట రెండేళ్ల బాలికతో ప్రారంభించి వరుసగా పదేళ్ల వరకూ ఉన్న బాలికల్ని తొమ్మిది రోజులూ వివిధ దేవీ రూపాలుగా భావించాలని చెప్పారు. దేవిని ఒక్కక్కరోజు ఒక్కొక్క రూపంలో పూజించినట్లే బాలికలకు కూడా చెప్పారు. రెండేళ్ల బాలికను కుమారీ అని, మూడేళ్ల బాలికను త్రిమూర్తి అని, నాలుగేళ్ల అమ్మాయిని కల్యాణి అని ఆ విధంగా తొమ్మిది రోజులు తొమ్మిది దేవీ రూపాల్లో ఆడపిల్లల్ని పూజించాలని చెప్పారు. మనిషి పలు కోరికలున్న జీవి. అందువల్ల కుమారి పూజను మన కోరికలతో ముడిపెట్టి విద్యార్థి, రాజ్యార్థి అయినవాడు కల్యాణి రూపంలో పూజించాలనీ, శత్రునాశనం కోరేవాడు కాళిక రూపంలోనూ, కేవలం మంచిని కోరేవాడు సుభద్ర రూపంలో పూజించాలని.. ఇలా ఒక్కొక్క కోరికను బట్టి ఒక్కో విధానం చెప్పారు. ఈ కుమారి పూజ ఉత్తరభారతంలో ఎక్కువగా ఉందట. ముఖ్యంగా క్షత్రియ కుటుంబాల్లో ఇది విధిగా చేస్తారు. మనప్రాంతంలోనూ ఈ ఆచారాన్ని కొందరు సంప్రదాయ నిష్ఠ ఉన్నవారు పాటించడం చూస్తాం.
మనస్తత్వ శాస్త్ర దృష్టితో చూస్తే ఈ సంప్రదాయం అద్భుతమైనది. చిన్న బాలిక తనను తాను దేవతా స్వరూపంగా భావిస్తూ పెరగడం వల్ల విపరీత ఆలోచనలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. కుటుంబంలోని వ్యక్తులు కూడా ఆడపిల్లను ఒక దేవీ స్వరూపంగా చూసేవాళ్ల ఎందరో ఉన్నారు. ప్రస్తుతం టీవీల్లో వచ్చే సినిమాల్లోని ఐటమ్‌ సాంగులకు చిన్నపిల్లలు డ్యాన్స్‌ చేయడం చూస్తుంటాం. దీనితో పోలిస్తే మన సంప్రదాయంలోని పై ఆచారం ఎంత విభిన్నంగా ఉందో చూడగలం. ఈనాటికీ కుటుంబ వ్యవస్థ గట్టిగా నిలిచి ఉండడానికీ, వ్యక్తుల మధ్య సంబంధాలు బలంగా ఉండటానికీ, సమాజాన్ని ఒక మంచి సంప్రదాయంలో ఉంచడానికి ఇలాంటి ఆచారాలు ఎంతో తోడ్పడ్డాయి.
దేవీ భాగవతంలో సదాచారాలకు సంబంధించిన అధ్యాయాలు చాలా ఉన్నాయి. వీటిలో కూడా సీ్త్రలకు సంబంధించిన అంశాలు ముఖ్యమైనవి. ఈ పండుగ రోజుల్లో సీ్త్రలు ఒకరి కాళ్లు మరొకరు కడిగి పసుపు రాయడం, తాంబూలాలు ఇచ్చుకోవడం చూస్తుంటాం. దీనివల్ల ఇరుగు పొరుగుల మధ్య సఖ్యవాతావరణం ఎంతో పెరుగుతుంది. మన తెలుగు రాషా్ట్రలు రెండింటి సంప్రదాయాల్లో కొంత తేడా ఉన్నా సీ్త్రల పాత్ర ప్రముఖంగా కనిపిస్తుంది. అందులోనూ బతుకమ్మ సంబరాల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఉత్సాహవంతమైన వాతావరణంలో గ్రామాల్లోని సీ్త్రలందరూ బతుకమ్మ వేడుకలో పాలుపంచుకోవడం ఊరిలో సుహృద్భావ వాతావరణాన్ని పెంచుతుంది.
ఈ సందర్భంలో మేధావులు ఏమనుకున్నా ప్రభుత్వంలో ఉన్నవారిని మనం అభినందించాలి. మహాభారతంలోని సభాపర్వం ఐదో అధ్యాయంలో ధర్మరాజు దగ్గరికి నారదుడు వెళ్లి అనేక ప్రశ్నలు వేస్తాడు. అందులో ఒక ప్రశ్న రాజదోషాలకు సంబంధించినది. నీతి శాస్త్రంలో చెప్పిన పద్నాలుగు రాజదోషాలు నీకు లేవుకదా అని ప్రశ్న. సోమరితనం, దీర్ఘసూత్రత (త్వరగా నిర్ణయం తీసుకోకపోవడం) మొదలైన రాజదోషాలతో పాటు నాస్తికత్వం, మంగళకరమైన కార్యక్రమాలు చేపట్టకుండా ఉండటం అనేవి కూడా రాజదోషాల కింద నీతిశాస్త్రంలో చెప్పారు. అలాకాకుండా ప్రభుత్వం బతుకమ్మ సంబరాల్ని రాష్ట్రంలో ఘనంగా జరగడానికి ప్రోత్సహించడంతో పాటు విదేశాల్లో కూడా సంబరంగా జరిగేలా చూడటం, అధికారంలో ఉన్న ప్రముఖులు వాటిలో పొల్గొనడం మొదలైనవి మన సంస్కృతిని రక్షించడానికి ఎంతగానో తోడ్పడతాయి. అక్కడి సీ్త్రలు, బాలికలు అక్కడి వాతావరణంతో ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది.
అమెరికాలో బతుకమ్మ సంబరాల గురించి వార్త వచ్చిన పేజీలోనే ఆ దేశ సంస్కృతిని తెలిపే ఒక వార్త కూడా ఉంది. ఇరవైనాలుగేళ్ల అమ్మాయి డేటింగ్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఒక ధనికుడ్ని పెళ్లి చేసుకుందట. పెళ్లి తర్వాత అతడి ఇంటిలో ఫొటోలను చూసి అతడు స్వయంగా తన తండ్రికి తండ్రి అని తెలిసిందట. అయినా ఫర్వాలేదని అనుకున్నారట. ఇట్లాంటి సంస్కృతి ప్రభావానికి లోనుకాకుండా భావితరాలను కూడా మన సంస్కృతిలో భాగంగా ఉండేట్టు మన సంప్రదాయ కార్యక్రమాల్ని చేయడం ఎంతో అభినందనీయం.
దేవి యొక్క అనేక అంశలే అనేక రూపాలుగా దేవీభాగవతంలో చూస్తాం. దక్షయజ్ఞంలో ప్రాణాలు కోల్పోయిన సతీదేవి శరీరం ముక్కలు ముక్కలుగా అనేక ప్రాంతాల్లో పడినట్లు, అవన్నీ పవిత్రమైన దేవీ పీఠాలుగా ప్రసిద్ధి పొందినట్లు ఇందులో చూస్తాం. వీటిలో దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలు చెప్పబడ్డాయి. దేశమంతటా ఒక ఉత్తమ సాంస్కృతిక వాతావరణం ఏర్పాటు చేయడానికి పురాణ రచయితల కృషి ఎంతుందో ఇందులో చూడగలం.
మన తెలుగు రాష్ట్రాలు రెండింటి సంప్రదాయాల్లో కొంత తేడా ఉన్నా స్త్రీల పాత్ర ప్రముఖంగా కనిపిస్తుంది. అందులోనూ బతుకమ్మ సంబరాల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఉత్సాహవంతమైన వాతావరణంలో గ్రామాల్లోని స్త్రీలు బతుకమ్మ వేడుకలో పాలుపంచుకోవడం ఊరిలో సుహృద్భావ వాతావరణాన్ని పెంచుతుంది.

No comments:

Post a Comment