Friday 28 October 2016

నరక చతుర్దశి




ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. ఈ నరక చతుర్దశి తర్వాతి రోజే దీపావళి. తెలుగు పండుగల్లో నరక చతుర్దశి, దీపావళి ప్రముఖమైనవి. మనం ఆచరించే  పండుగలలో ఒక రాక్షసుణ్ణి  మరణాన్ని  ఆనందంగా పండుగ చేసుకోవడం - నరక చతుర్దశి విశిష్టత. పండుగలకు - ఖగోళ  సంఘటనలకు సంబంధం ఉంది.  నరకాసుర వధ - చతుర్దశి నాడు (ఆశ్వయుజ బహుళం) ఆకాశంలో  రాసులస్తితిని  సూచించేది.  తులారాశి తూర్పు  క్షితిజం  మీద ఉదయిస్తుంటే పడమటి క్షితిజం మీద మేషరాశి అస్తమిస్తుంటుంది. నరకుడు భూదేవి కొడుకు. మేషం సహజంగా మంచిదే అయినా మూర్ఖత్వమూర్తి.  కనుక అతని పాలన అంధకారమయం! ఆ రోజు మేష రాశి సూర్యాస్తమయ  సమయంలో ఉదయిస్తుంది. అది అస్తమించే వరకు చీకటే! మేష రాశి అస్తమించే వేళకు తులారాశి తూర్పు దిక్కున క్షితిజం మీదికి వస్తుంది.  స్వాతి నక్షత్రానికి వాయువు దేవత.  దాన్ని అధిస్టించి నరకుని మీదికి బయలుదేరిన కృష్ణుడు - సూర్యుడు, సత్యభామ-చంద్రుడు. నరకుడు చనిపోగానే ఆకాశపు అంచులపై దీపచ్చాయాల్లో కన్యారాశి (కన్యల గుంపు) నరకుని బంధాలనుంచి విడివడి, తమను విడిపించిన సూర్యున్ని - కృష్ణున్ని నాయకునిగా చేసుకునింది. ఇలాంటి స్థితి నరక చతుర్దశి, దీపావళి రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో లేదు. నరక భావాలు అంటే దుర్భావాలను, కృష్ణభక్తి అనే చక్రాయుధంతో ఖండింప చేసి, జీవుడు భవద్దర్శన ప్రాప్తితో ఆనందించాలి అనేది ఇందులోని అంతరార్ధం. నరాకాసురవధ స్త్రీ స్వాతంత్ర్యానికి  నిదర్శనం.



నరక చతుర్దశి ఆచరణ వెనక ఉన్న గాథల్లో నరకాసురుడి గాథ ప్రధానమైంది.   హిరణ్యాక్షుడు లోకానికి ఉపద్రవంగా భూదేవిని చుట్టచుట్టి సముద్రంలో ముంచినప్పుడు విష్ణుమూర్తి వరాహావతారమెత్తి, ఆ రాక్షసుని సంహరించి భూదేవిని ఉద్ధరించాడు. ఆ సందర్భంగా భూదేవికి విష్ణుమూర్తి వరప్రసాదం వలన భీముడనే పుత్రుడు జన్మించాడు. అతనే దుర్మార్గుడైన నరకాసురునిగా పేరొందాడు. నరకుడు ప్రాగ్జోతిషపురం రాజధానిగా కాపరూప రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. భూమాత తన కుమారుని రాక్షసత్వానికి దూరంగానే పెంచింది. దురదృష్టవశాత్తు నరకుడు అసుర ప్రభావంలోపడి ఘోరతపస్సు చేసి అనేక వరాలు పొందాడు. తనకు తన తల్లి చేతిలో తప్ప మరణం సంభవించకూడదని కూడా వరం పొందాడు. స్వయాన తన తల్లే తనను చంపదని అతని ధీమా. ఆ వరగర్వంతో అతను కావించిన దుష్కార్యాలు పరాకాష్టకు చేరి దేవతలను తీవ్ర అశాంతికి గురి చేసాయి. విష్ణుద్వేషియై దేవతలను హింసించసాగాడు. దేవమాత అదితి కర్ణ్భారణాలను, వరుణ ఛత్రాన్ని అపహరిస్తే శ్రీకృష్ణుడు ఇతనిని ద్వందయుద్ధంలో ఓడించి, వాటిని తిరిగి అదితికి అందజేసాడు.



మరొకప్పుడు మదపుటేనుగు రూపంలో విశ్వకర్మ పుత్రికను చెరపట్టాడు. వీరూవారను విచక్షణ లేకుండా గంధర్వ, దేవ, మానవ కన్యలను బలవంతంగా అపహరించి, తన అంతఃపుర పంజరంలో బంధించడం ఇదనికొక వ్యసనం. ఇతని దౌర్జన్యాలు అంతటితో ఆగక చివరకు ఇంద్రునిపైకి కూడా దండెత్తి ఆయన అధికార ముద్రను అపహరించడంతో ఈ అసుర ప్రముఖుని దురంతం పరాకాష్టనందుకుంది.ఇంద్రుడు ఆపదరక్షకుడైన శ్రీకృష్ణుని శరణువేడగా గోపాలుడు నరుకునిపై దండెత్తాడు. అయితే నరకాసురుని విషపు బాణానికి శ్రీకృష్ణుడు ఒక క్షణంపాటు నిశ్చేష్టుడయ్యాడు. అది గమనించి ఆయనతో కూడానే ఉన్న ఆయన సతీమణి సత్యభామ ఉగ్రురాలై భయంకరమైన తన బాణాన్ని ప్రయోగించి సంహరించింది. ఆశ్వయుజ బహుళ చతుర్దశినాడు లోక కంటకుడైన నరకుని మరణం సంభవించింది. యాదృచ్ఛికంగా నరకాసుని మరణం సత్యభామ రూపంలో తన తల్లి భూదేవి చేతిలోనే సంభవించింది.



తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెరనుండి సాధుజనులు, పదహారువేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు, ధ్రర్మం సుప్రతిష్టమైంది. నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమవాస్య కావడంతో, చీకటిని పారద్రోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి, బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది.




ఈ చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని, అభ్యంగన స్నానం చేయాలి. ప్రత్యేకించి ఆ వేళ నువ్వులనూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు వివరిస్తున్నవి. యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు తినడంతోపాటు సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దానధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరకబాధ తొలగుతుందని భారతీయుల నమ్మకం. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాటి రాత్రి రెండో జాములో నరకాసుర సంహారం జరిగింది. కనుక మూడో జాములో అభ్యంగస్నానం చేసినవారికి నరక భయం తీరుతుందని శాస్త్ర వచనం. ఈ చతుర్దశినాడు నూనెలో లక్ష్మీదేవి, నీళ్లలో గంగాదేవి అధివసించి ఉంటారంటారు. కనుక నరక చతుర్దశినాడు సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేస్తే మంచిది. సాయంకాలం ఇంట్లోని దేవుడి మందిరంలోనూ, ఏదైనా దేవాలయంలోనూ దీపారాధన చేయటం శుభప్రదం.



    చతుర్దశ్యాం తు యే దీపాన్‌
    నరకాయ దదాతి చ|
    తేషాం పితృగణా స్సర్వే
    నరకాత్‌ స్వర్గ మాప్నుయుః ||
చతుర్దశినాడు దీపదానం చేస్తే పితృదేవతలందరికీ స్వర్గనివాసం కలుగుతుందని విశ్వసిస్తారు. ఇదేరోజున సాయం సమయంలో నూనెతో తడిపిన, రసాయన ద్రవ్యాలతో తయారుచేసిన కాగడాలను చేతబట్టుకొని తిరిగినట్లయితే పితృదేవతలకు దారి చూపినట్లవుతుందనీ పలువురు నమ్ముతారు.

No comments:

Post a Comment