Monday 10 October 2016

విజయాలకు ప్రతీక విజయదశమి


సృష్టిలోని ఎనభై నాల్గులక్షల జీవుల్లో మానవజన్మ లభించడం చాలా కష్టం. అందుకే ఆదిశంకరులు ‘‘జంతూనామ్ నరజన్మ దుర్లభమ్’’- అని వక్కాణించారు. జీవుడు పరమాత్మను నవ విధ భక్తులద్వారా చేరుకోవడానికి అనువైన జన్మ మానవ జన్మ. ఆ జన్మకు సార్థకతను కల్గించి, తత్త్వజ్ఞానాన్ని, ధార్మిక చింతనను కల్గించేవే హిందువుల పర్వదినాలు. ప్రాపంచిక సుఖాలతోపాటు మోక్ష ప్రాప్తిని కల్గించడమే హైందవ సంస్కృతి ప్రత్యేకత.

ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుండి దశమి వరకు ఉన్న పవిత్ర దినాలే శరన్నవరాత్రులు. ఇవి నవ చైతన్యాన్ని ప్రబోధించి, మానవుల్లోని సాత్త్విక భావనల్ని జాగృతం చేసి, ధర్మకార్యాచరణ వైపు మార్గం చూపుతాయి. ఆశ్వీయుజ మాసం నుండి ఫాల్గుణ మాసం వరకు ఉన్న ఆరు మాసాల కాలంలో స్ర్తి రూపాత్మకమైందని ఆర్య ఋషులు చెప్పారు కదా! అందువల్ల శక్తిరూపిణియైన అమ్మవారి ఆరాధనలతో దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. అమ్మవారికి ప్రీతికరమైన నవరాత్రుల్లో శక్తి స్వరూపిణిని పూజించి 10వ రోజు విజయదశమి నాడు దసరా ఉత్సవాల్ని నిర్వహిస్తారు. ‘దసరా’ అన్నది ఈ పండుగకు అర్థవంతమైన నామం. ‘దహరా’ అనే పదంనుండి ‘దసరా’ వచ్చిందని చారిత్రకుల అభిప్రాయం. పదిరకాలైన పాపాల్ని నశింపజేసేది కనుక ‘దశ హరా’ అని మరొక అర్థం ఉంది.

శరన్నవరాత్రులు - దేవీ నవరాత్రులు

జ్ఞానానికి, విజ్ఞానానికి హేతువైనది శరదృతువు. మురికివానలతో నేలంతా బురదగా మారుతుంది. అంటే అజ్ఞానం నిండియుంటుంది. శరదృతువు రాకతో నేల పరిశుభ్రంగా మారుతుంది. అనగా మానవులలో నెలకొన్న అజ్ఞానం, మూర్ఖత్వం నశించి జ్ఞానం సంతరించుకుంటుంది. అరిషడ్వర్గాలతో సతమతమయ్యే మానవుడు విజ్ఞానంతో ద్విగుణీకృతమవుతాడు. దుర్గాదేవిని నవరాత్రుల్లో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. త్రిమూర్తుల అంశతో శక్తిగా ఆవిర్భవించి, మహిషాసుర సంహారం గావించి, జగత్తులో శాంతిని నెలకొల్పిన ఆ జగజ్జననిని నవరాత్రుల్లో ఒక్కోరోజు ఒక్కో అవతారంతో అలంకరిస్తారు.

మొదటిరోజు (పాడ్యమి)న శ్రీ బాలాత్రిపుర సుందరీదేవిగా అలంకరించి ఆవు నెయ్యితో పూజిస్తే సకల రోగాలు నశిస్తాయి.
రెండవ రోజు (విదియ)న శ్రీ మహాలక్ష్మిగా అలంకరించి చక్కెరను నివేదన చేయుటవల్ల ఆయుష్షు పెరుగుతుంది.
మూడవ రోజు (తదియ)న శ్రీ అన్నపూర్ణగా అలంకరించి పాలతో పూజించడంవల్ల దుఃఖాలు నశిస్తాయి.
నాల్గవ రోజు (చవితి)న శ్రీ గాయత్రీదేవిగా అలంకారం చేసి పిండి వంటల్ని నేవేద్యం చేస్తే సకల విఘ్నాలు నశిస్తాయి.
అయిదవరోజున (పంచమి) శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా అలంకరించి కదళీఫలాల (అరటిపండ్ల)ను నైవేద్యం సమర్పించడంతో బుద్ధి వికసిస్తుంది.
ఆరవ రోజున (షష్ఠి) శ్రీ కాళికాదేవిగా అలంకరించి తేనెను నివేదన చేస్తే బాధలు నశిస్తాయి.
ఏడవరోజున (సప్తమి) శ్రీ సరస్వతీదేవిగా అలంకరించి బెల్లం నైవేద్యం చేయుటవల్ల దుఃఖాలు నశిస్తాయి. విశేషించి ఈరోజున మూలా నక్షత్రం కలసి యుంటుంది.
ఎనిమిదవరోజు (అష్టమి)న శ్రీ కనకదుర్గాదేవిగా అలంకరించి కొబ్బరికాయలు నైవేద్యం చేస్తే సంతాపాలు దూ రమవుతాయ.
తొమ్మిద రోజున (నవమి) శ్రీ మహిషాసుర మర్దినీ దేవిగా అలంకరించి పేలాలు సమర్పిస్తే సుఖసంతోషాలు కల్గుతాయి.
పదవరోజున (దశమి) శ్రీ రాజరాజేశ్వరిదేవిగా అలంకరించి నల్లనువ్వులు నైవేద్యం చేయుట వల్ల భయశోకాలు నశిస్తాయి.

నవరాత్రి తొమ్మిదిరోజుల్లో పాడ్యమినాడు కలశ స్థాపన చేసి దేవిని ఆవాహనం చేసి నవమి వరకూ పూజలు చేస్తారు. ఈ తొమ్మిదిరోజులు తరుణులు దేవి ప్రతిరూపాలుగా సుమంగళి పూజలు నిర్వహిస్తారు. మూలానక్షత్రం నాడు చదువులరాణి సరస్వతీపూజను, అష్టమినాడు దుర్గాపూజను, నవమినాడు ఆయుధ పూజతో చండీమాతను ఆరాధిస్తారు. ఈ పూజలు విద్యా విజ రతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీ పండుగా ఓ వేదిక. ప్రతీ పండుగా ఓ సరదా.. ఓ ఆనందానురాగాల పరదా.. ‘అంతా కలసి రండి పండుగ చేసుకుందామ’ని పెద్దలు ఆహ్వానించే ఓ వేదిక. అటువంటి వేళలో మనుషుల మధ్య అనురాగం, ఆప్యాయతలు తెలియవస్తాయి. ఇటువంటి గొప్ప పండుగల్లో తొమ్మిది రోజులపాటు ‘శక్తి’ని కొలుచుకునే పండుగ దసరా. నవవరాత్రులు శోభాయమానంగా జరుపుకునే సంతోషకరమైన సమయం. ‘ఆశ్వీయుజం’ ఓ అందమైన మాసం. ఆ తల్లిని 9 రోజుల్లో 9 ఆకారాలలో కొలుచుకుంటే ఇహపరాలు సార్ధకమవుతాయి.

నవరాత్రులంటే..?

‘నవ’ అనే శబ్దానికి క్రొత్తది, తొమ్మిది అనే అర్ధాలున్నాయి. నవరాత్రులు అనగా 9 రాత్రులు. శరదృతువులో వచ్చేవి కనుక ‘శరన్నవరాత్రులు’. ఆశ్వయుజ మాసంలోని పాడ్యమి నుంచి నవమి వరకు గల తొమ్మిది దినాలు శరన్నవరాత్రులు. వీటినే దేవీ నవరాత్రులు అని కూడా అంటారు. పూజలందుకునేది ‘దేవి’ కనుక ఆ పేరు. విజయదశమితో కలుపుకుని ‘దశరాత్రులు’. ‘దశ పాపహరా’-దశ విధాల దోషాలను హరించునది’ దుర్దశలను తొలగించి శుభం చేకూర్చేది అని అర్ధం. ఇందుకు ప్రామాణ్యం ఉంది...అది...

ఆశ్వినస్యసితే పక్షే ప్రతిపత్సు శుభే దినే
శుద్ధే తిథే ప్రకర్తవ్యం ప్రతి పచ్చోర్ధ్వగామినీ॥

నవరాత్రులలో దుర్గాపూజ ప్రశస్తమైనది. ‘దుర్గముడు’ అనే రాక్షసుణ్ణి సంహరించడం వలన ‘దేవి’ని ‘దుర్గ’ అంటారు. ‘యస్సాఃపరతరం నాస్తి సైషా దుర్గా ప్రకీర్తితా’ అంటుంది దేవీ భాగవతం. అనగా దేవిని మించినదేదీ లేదు. శక్తి ఉపాసన మిక్కిలి శక్తివంతమైనది. శంకర భగవత్పాదులవారు తన ‘సౌందర్య లహరి’ మొదటి శ్లోకంలో ఇలా చెబుతారు - ‘శివుడు శక్తితో కూడియున్నప్పుడే ఏమైనా చేయగలడు. త్రిమూర్తులు సైతం శక్తిని ఆరాధిస్తారు.
ఈ ఉత్సవాలలో కలశ స్థాపనాది కార్యక్రమాలు ఆగమోక్త పద్ధతిలో నిర్వహించి శక్తిని పూజించడం ఉత్తమపక్షం. దేవి ప్రతిమ దక్షిణాభిముఖంగా ఉంచితే శుభం. తూర్పు ముఖమైతే జయం. పశ్చిమ ముఖమైనా పర్వాలేదు. కానీ ఉత్తరాభిముఖంగా ఉంచరాదు. దేవిని రాజరాజేశ్వరి, త్రిపురేశ్వరి, త్రిపుర సుందరి, కామేశ్వరి ఇత్యాది నామాలతో పిలుస్తారు. నామ భేదమే తప్పా ‘నామి’ భేదం లేదని గమనించాలి. దేవిని నవదుర్గలుగా భావించి రోజుకొక రూ పంలో కొలుస్తారు. 1.శైలపుత్రి 2.బ్రహ్మచారిణి 3.చంద్రఘంట 4.కూష్మాండ 5.స్కందమాత 6.కాత్యాయిని 7.కాళరాత్రి 8.మహాగౌరి 9.సిద్ధిరాత్రి అని నవదుర్గల పేర్లు.

దేవతలు హోమం చేస్తుండగా అగ్నిగుండం నుంచి లలితాదేవి ఆవిర్భవించింది. అందుకే ఆమెను ‘చిదగ్ని కుండ సంభూత’ అంటారు. నవరాత్రులలోనే కాక ఇతర సమయంలో కూడా లలితా సహస్రనామ పారాయణం మంచిదని దేవిభాగవతం ఉవాచ. పాండవులకు దేవిస్తోత్ర పఠనం విజయహేతువైందనీ, శ్రీరాముడు దేవీపూజ చేసి రావణాసురుణ్ణి సంహరించాడనీ కథలున్నాయి. సరస్వతీ రూపంలో అమ్మవారిని పూజించడం విద్యార్థులకు అవశ్య కర్తవ్యం.
నవరాత్రి అనంతరం వచ్చే దశమి ‘విజయదశమి’. ఏ పనిలోనైనా విజయాన్ని కాంక్షించే వారు ఆరోజున తమ ప్రయత్నం ప్రారంభిస్తారు. ఈ పదాన్ని ‘విజయద- శమీ’ అని విడదీస్తారు. దశమినాడు జమ్మిచెట్టును దేవతలతో కలిపి పూజిస్తారు. విడిగా చెట్టును మాత్రమే పూజించే విధానం కూడా ఉంది.

జమ్మి చెట్టు పాపాన్ని శమింపచేస్తుంది. శత్రువులను నశింప చేస్తుంది. అజ్ఞాతవాస కాలంలో అర్జునుడు తన ఆయుధాలను జమ్మిచెట్టుపైనే భద్రపరిచాడు. విజయ యాత్రలో వచ్చే విఘ్నాలను తొలగిస్తుంది. రావణునిపై సమరం చేసినపుడు శ్రీరామునికి జయం చేకూర్చింది. వ్రతాంగంగా చేయవలసిన పారణ దశమినాడే చేయాలి. విజయదశమి రోజున త్రిగుణాత్మకంగా పూజాది కర్మలను నిర్వహించి గణేశ్ నవరాత్రులలోవలే దేవి ప్రతిమలను జల నిమజ్జనం చేయాలి.

పండుగలు అందరినీ ఒకచోట చేర్చి... అందాలను, ఆనందాలను పంచుకోమంటాయి. పండగలు మనుషుల మనసులలోని మాలిన్యాలను కడిగేస్తాయి. సర్వమానవ సౌభ్రాతృత్వములను పెంపుచేస్తాయి. చెడుపై మంచి జయం సాధిస్తుందనే సత్యం నిరూపణ అయ్యేది పండుగలలోనే. పండగల నేపథ్యం గమనించిన ఎవరికైనా ఈ వాస్తవం అవగతమవుతుంది. అందుకే పండుగలను ‘కలిసి’ చేసుకుందాం. అందరికీ విజయాలను ప్రసాదించాలని ఆ దేవిని మనసారా ప్రార్ధిద్దాం.

మహిషాసుర వృత్తాంతం

జగన్మాత అయిన కనకదుర్గమ్మ లోక కంటకుడైన మహిషుని దేవతల ప్రార్థనల ఫలితంగా సంహారం కావించింది. మహిషాసుర సంహారం వెనుక కొన్ని పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి.
పూర్వం దితి సంతతిని దేవేంద్రుడు సంహరించడంతో తిరిగి సంతానం పొందేందుకు దితి సుపార్శ్యుండను ముని ఆశ్రమం తపస్సు చేసింది. ఈమె తపస్సు వేడిమికి ఆగలేక సుపార్శ్వుడు- ‘నీకు మహిషము పుట్టుగాక’ అని శపించాడు. దితి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ‘పుట్టబోయే కుమారుని ముఖము మాత్రం మహిషంగా ఉండి మిగిలిన దేహం నరదేహంలా ఉంటుందని’ వరమిచ్చాడు. తనకు మరణం లేకుండా వరాలు పొందాలని మహిషుడు శివుని గూర్చి ఘోర తపస్సు చేశాడు. ప్రతి జీవికీ మరణం తప్పదని శివుడు చెప్పి, వేరే వరాన్ని కోరుకొమ్మన్నాడు. దాంతో మహిషుడు స్ర్తివల్ల మాత్రమే తనకు మరణం కలగాలని కోరుకొన్నాడు. ఈ వరగర్వంతో తమను హింసిస్తున్న మహిషుని బారి నుంచి తమను కాపాడాలని దేవతలంతా ఒకచోట చేరి ప్రార్థించగా అపుడు దేవీమాత ఆవిర్భవించింది. ఈమెకు దేవతలు తమ తమ ఆయుధాలిచ్చారు. ఈమె సింహవాహనాన్ని అధిష్ఠించి మహిషుని సంహరించింది.

దేవీ భాగవతంలో మహిషాసురుని వృత్తాంతం మరొక విధంగా ఉంది. రంభుడను రాక్షసుడు తపస్సు చేయగా అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవతలను గెలిచే పుత్రుడు తనకు కావలెనని రంభుడు కోరాడు. ‘నీవు ఏ జంతువుతో రమింతువో అట్టి పుత్రుడు నీకు కల్గున’ని అగ్ని చెప్పాడు. మహిషముతో రంభుడు రమించిన ఫలితంగా మహిషాసురుడు జన్మించాడు. మహిషాసురుడు స్ర్తిరూపధారియైన కాత్యాయన మహర్షి శిష్యుణ్ణి బాధిస్తుండగా ఆ మహర్షి ఉగ్రరూపుడై- ‘నీకు స్ర్తి మూర్తి చేతిలో మరణం తథ్యం’ అని శపిస్తాడు. మహిషుడు నిత్యం దేవతలను, మహర్షులను, స్ర్తిలను వేధిస్తూంటాడు. ఆ సమయాన దేవతలంతా కలిసి ఆదిశక్తిని వేడుకుంటారు. అప్పుడు ఆ జగన్మాత ‘ఉగ్రచండి’ రూపంలో ఆవిర్భవించి మహిషాసురుణ్ని సంహరించి జగతికి శాంతిని ప్రసాదించింది. ఆ తర్వాత రెండవ జన్మలోనూ మహిషాసురుడు రంభుడి పుత్రునిగా జన్మించి రాక్షస ప్రవృత్తితో అందరినీ పీడించగా- శక్తి ‘్భద్రకాళి’గా అవతరించి మహిషాసురుణ్ణి సంహరించింది. మరలా మూడో జన్మలో కూడా మహిషుడు రంభుని పుత్రునిగా జన్మించి బ్రహ్మదేవుడిచ్చిన వరాలతో విర్రవీగుతాడు. భద్రకాళిని గూర్చి తపస్సు చేయగా, ఆమె ప్రత్యక్షమై వరాలు కోరుకొమ్మని మహిషుని అడుగుతుంది. ‘‘నాకు జనన మరణాలనేవి లేకుండా, నీ యజ్ఞ భాగార్హత కలుగజేయాలని’’ మహిషుడు ఆమెను వరం అడుగుతాడు. అందుకు భద్రకాళి- ‘‘ఓ మహిషా! నాకు వాహనం కావడానికి బ్రహ్మ నిన్ను సృష్టించాడు. ఇక నుంచి నువ్వు నా వాహనంగా మారి నేను నిలచిన చోట పాదాక్రాంత శరీరుడవై సదా నా సన్నిధిలో నిలచి ఉంటావు’’ అని పల్కుతుంది. ఆ వరం పొందిన మహిషాసురుడు మళ్లీ విజృంభించి అందరినీ హింసిస్తాడు. దేవతలు ప్రార్థించగా దేవీమాత ‘కనకదుర్గ’గా అవతరించి, మహిషుణ్ణి సంహరించి శాంతిని ప్రసాదిస్తుంది. ఇలా మూడు జన్మలోనూ మహిషుడు రంభుని పుత్రునిగానే అవతరించి కనకదుర్గ చేతిలో హతుడైనాడు.

శమీ పూజలో ఆయుర్వేద రహస్యాలు
ఆశ్వయుజ శుక్లపక్ష దశమి శ్రవణానక్షత్రం సాయంత్రం వేళ శమీవృక్షం (జమ్మిచెట్టు)ను ధూపదీప నైవేద్య మంగళహారతులతో పూజిస్తారు. ఈ వృక్షం అనేక పాపాల్ని పోగొడుతుంది, శత్రువుల్ని నాశనం చేస్తుంది. విజయాన్ని చేకూరుస్తుంది. ఇన్ని భావాలు కల శమీవృక్షాన్ని భారతీయులు విజయదశమి రోజున పూజిస్తారు. జమ్మి చెట్టులో కెరోబిన్, కెరోబిక్ ఆసిడ్, కేరోబోన్ అనే రసాయనిక ద్రవ్యాలున్నాయి. కొమ్మలో శర్కర సదృశ పదార్థముంది. విత్తులో పీతరంజక ద్రవం ఉంది. ఈ చెట్టుపై బెరడు, ఆకులు, పువ్వులు, కాయలు, విత్తులు, మందుల్లోకి ఉపయోగపడతాయి. జమ్మి గొప్ప ఔషధీ వృక్షమని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. జమ్మికారం చేదు, వగరు రుచుల్ని కల్గియుంటుంది. చలువ చేసే గుణం కలదు. కఫ, పైత్యాలను నివారిస్తుంది. శ్వాస (ఆస్త్మా) కాన (కాఫ్), ఆర్మస్సు (పైల్స్) అతిసారం (డైయేరియా), కుష్టువు (లెప్రసి), రక్తపిత్తం మొదలైన వ్యాధుల నివారణానికి జమ్మి పనిచేస్తుందని ఆయుర్వేద భిషగ్వరులు చెబుతున్నారు. శమీవృక్షం సమ్మోహన వశ్య ప్రభావం కల వృక్షమని దత్తాత్రేయాది తంత్రాల్లో వివరించారు. నీచలోహాల్ని ఉన్నత లోహాలుగా మార్చే ప్రయత్నంలో శమీవృక్షాన్ని ఉపయోగించినట్లుగా పెద్దల వల్ల తెలుస్తోంది. శమీవృక్షం మానవాళి వ్యాధుల్ని నివారించి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఉదాత్త ప్రయోజనం కలదియై కల్పతరువుగా పూజలందుకొంటోంది.

సంస్కృతి, చరిత్రల మేలు కలయికగా దసరా (విజయదశమి) పండగ మానవతా దృక్పథాన్ని కల్గిస్తుంది. మనల్ని పునీతుల్ని చేసే పరమార్థ దృష్టిగల విజయానికి పతాకయై విరాజిల్లిన మన తెలుగు సంస్కృతి ప్రపంచానికి మార్గదర్శకమైంది. మానవులంతా ఆ దేవి ప్రసన్నానికి పాత్రులై మానవత్త్వపు మహిమను చాటి చెప్పి విజయదశమితో లోక కల్యాణానికి కారకులైనపుడు జగమంతా స్వర్గ్ధామవుతుంది.

No comments:

Post a Comment