Sunday, 16 October 2016

వాల్మీకి మహర్షి జయంతి

 వాల్మీకి మహర్షి జయంతి


రామాయణంలోని ఉత్తరకాండలో మనకి వాల్మీకి పూర్వాశ్రమ జీవితం గురించి తెలుస్తుంది. ఆ కథనం ప్రకారం వాల్మీకి ఒక బందిపోటు దొంగ, అడవిలో నివసిస్తూ బాటసారులను చంపి, వారి సొత్తును దోచుకుని జీవితం గడిపేవాడు. నారద మహర్షిని కూడా దోచుకోబోగా, నారదుడు ఆ దొంగను ఒక ప్రశ్న అడుగుతాడు, కుటుంబం కోసం చేసే ఈ దోపిడి ద్వారా వచ్చే పాపాన్ని కుటుంబం కూడా పంచుకుంటుందా అని ఆదిగాడు. ఔను అని దొంగ అనగా, ఈ విషయాన్ని భార్య నుండి ధృవీకరించుకోమని నారదుడు అంటాడు. భార్యను అడుగగా, పాపాన్ని పంచుకోడానికి నిరాకరిస్తుంది. ఆ విధంగా ఆత్మసాక్షాత్కారం పొంది, నారదుడిని క్షమాపణ కోరి, జీవిత సత్యాన్ని గ్రహిస్తాడు. నారదుడు భగవత్ భక్తిని నేర్పటానికి ప్రయత్నిస్తాడు. రామ అని పలకమంటే ఆ దొంగ పలకలేకపోతాడు. చాలా సేపు ప్రయత్నించినా దొంగ ఆ పదాన్ని పలకలేకపోతాడు, అప్పుడు నారదుడు మరా అని పదే పదే చెప్పమని, ఆ విధంగా రామ మంత్రాన్ని వాల్మీకికి ఉపదేశిస్తాడు. ఉపదేశం పొందిన దొంగ, జపంచేస్తూ ఉన్న చోటనే తపస్సమాధిలోకి వెళ్ళిపోతాడు. చుట్టూ చీమలు పుట్టలు తయారు చేసుకున్నా చలించకుండా తపస్సు చేస్తాడు. చాలా కాలం తపస్సు చేసాక బ్రహ్మ తపస్సుకు మెచ్చి ఆకాశవాణి ద్వారా తపస్సంపన్నం గురించి తెలియపరుస్తూ వాల్మీకి అనే పేరును ఆ దొంగకు ఆపాదిస్తాడు.వల్మీకం అనగా పుట్ట అని అర్థం. వల్మీకం నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు.


వాల్మీకి తపస్సంపన్నత తరువాత ఆశ్రమవాసం చేయసాగారు. ఆశ్రమ ధర్మాలలో భాగంగా గంగానదీ తీరానికి సంధ్యకు రాగా. భరద్వాజుడనే శిష్యుడు అతని వస్త్రాలను తెస్తాడు. మార్గంలో తామస నది వద్దకు చేరుకుంటారు. తామస నది నిర్మలత్వాన్ని చూసి ఆ నదిలోనే స్నానం చేయాలని నిర్ణయించుకుంటాడు. స్నానానికి నదిలో దిగుతూ ఒక క్రౌంచ పక్షి జంటను సంగమించడం చూస్తాడు. చూసి పరవశానికి గురి అవుతాడు. అదే సమయంలో మగ పక్షి బాణంతో ఛెదింపబడి చనిపోతుంది. భర్త చావును తట్టుకోలేక ఆడ క్రౌంచ పక్షి గట్టిగా అరుస్తూ చనిపోతుంది. ఈ సంఘటనను చూసి వాల్మీకి మనసు కరిగి శోకానికి లోనవుతాడు. ఈ సంఘటనకు కారణం ఎవరా అని చుట్టూ చూస్తాడు. దగ్గరలో ఒక బోయవాడు ధనుర్బాణాలతో కనిపిస్తాడు. వాల్మీకికి కోపం వస్తుంది. ఆ శోకంతో కూడుకున్న కోపంలో ఆ బోయవాడిని శపిస్తూ ఈ మాటలు అంటాడు:

మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః॥
యత్క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితం॥

ఓ కిరాతుడా! నీవు శాశ్వతముగా అపకీర్తి పాలగుదువు.
ఎందుకంటే క్రౌంచ పక్షులజంటలో కామ పరవశమైయున్న ఒక (మగ) పక్షిని చంపితివి.

ఇది శ్రీమద్రామాయణమునకు మంగళాచరణ శ్లోకముగా (నాందిగా) పేర్కొనబడుచున్నది

ఈ విధంగా వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చినదే సంస్కృత సాహిత్యంలో వచ్చిన మొదటి శ్లోకం. అలా మొదలయినది రామాయణ కావ్యం సాంతం రాసేవరకూ సాగింది.
ఈ శ్లోకమునందు రామాయణమునందలి ఏడుకాండల కథాంశములు సూచించబడుచున్నట్లు - పండితులు విశ్లేషింతురు.
మా + నిషాద = లక్ష్మీదేవి అవతారమైన సీతాదేవిని చెట్టబట్టిన ఓ రామా! ఈ పదముద్వారా శ్రీ సీతారాముల కల్యాణఘట్టము (బాలకాండకథ) సూచితమగుచున్నది.
ప్రతిష్ఠాం, త్వం, అగమః = పితృవాక్య పరిపాలనమొనర్చి, నీవు జగద్విఖ్యాతిని పొందితివి. ఈ పదముద్వారా అయోధ్యాకాండ కథ వెల్లడియగుచున్నది.
శాశ్వతీః సమాః = ఆడిన మాట తప్పకుండుటకై (ఓ రామా! నీవు) పెక్కు సంవత్సరములు వనవాసమొనర్చితివి - ఈ పలుకులవలన అరణ్యకాండ వృత్తాంతము ప్రకటింపబడుచున్నది.
క్రౌంచమిథునాత్ = కుటిల (దుష్ట) ప్రవర్తనగల తారావాలిదంపతులలో వాలివధ - దీనివలన కిష్కింధకాండ కథ సూచితము.
ఏకమ్ = అసహాయశూరుడు, ఏకైక వీరుడు హనుమంతుడు - దీని వలన సుందరకాండ గాథ సూచితము.
అవధీః = లోకకంటకుడైన దుష్టరావణుని వధించితివి - దీనిద్వారా రావణవధ. అనగా యుద్ధకాండ సూచింపబడినది.
కామమోహితమ్ = పట్టాభిషేకానంతరము సీతాదేవియొక్క వనవిహార కుతూహలస్థితి - అనగా ఉత్తరకాండ వృత్తాంతము సూచితము.




No comments:

Post a Comment