Monday 3 October 2016

దేవి నవరాత్రులలొ నాలుగవ రోజు అన్నపూర్ణ అలంకారం - కూష్మాండ రూపం



అన్నపూర్ణ అలంకారం

కనకదుర్గా ఆలయంలో నవరాత్రులలొ ఈ నాడు అమ్మవారిని అన్నపూర్ణ అలంకారంతో భావించి ఆరాధించడం సంప్రదాయంగా వస్తున్నది. అన్నపూర్ణ అన్నటువంటి భావనయే చాలా ఉత్కృష్టమైనది. అన్నపూర్ణ మంత్ర విశేషములు చాలా మనకి శాస్త్ర గ్రంథాలలో, ఆగమాలలో కనపడుతూన్నాయి. ఉపాసనా సంప్రదాయంలో అన్నపూర్ణ ఉపాసన ప్రత్యేకించి ఉన్నది. ఏవిధంగా అయితే శారదా ఉపాసన, లలితా ఉపాసన ఉన్నాయో అన్నపూర్ణ ఉపాసన ప్రత్యేకించి ఒకటి ఉన్నది. శ్రీవిద్యలో అయితే అమృత శక్తిగా ఈ తల్లిని చెప్తారు. అమృతేశ్వరీ దేవి, అన్నపూర్ణా దేవి – ఈ రెండు స్వరూపములు ఒకటే. ఈ అన్నపూర్ణ భావన మనకి క్షేత్రాలలో చూస్తే కాశీక్షేత్రంలో ప్రధానంగా కనపడుతున్నది. అదేవిధంగా ద్రవిడ దేశాలలో కొన్నిచోట్ల అన్నపూర్ణ క్షేత్రాలున్నాయి. అన్నపూర్ణ, విశాలాక్షి – ఈ రెండూ కూడా ఒకే తల్లియొక్క రెండు నామములు. అంతేకానీ విశాలాక్షి వేరు, అన్నపూర్ణ వేరూ కాదు. కాశీక్షేత్రంలో విశ్వనాథుడు తండ్రిగానూ, అన్నపూర్ణమ్మ తల్లిగానూ చెప్పబడుతూ సర్వజీవులనూ కూడా కాపాడుతున్న తల్లిదండ్రులు వారు అనే భావనతో
మాతాచ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః!
బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్!!
అని ప్రసిద్ధిచెందిన శ్లోకం ఉన్నది. ఆ పార్వతీ దేవి అమ్మ. అమ్మ అనడంలోనే అన్నపూర్ణత్వం అందులో కనపడుతోంది. ఈ అన్నపూర్ణ అన్న మాటలో ప్రతివారికీ ఆకలి బాధ లేకుండా చేసే తల్లి ఆవిడ. ఈ దృష్టితో చూస్తే విశ్వవ్యాపకమైన భగవచ్ఛక్తి సృష్టిలో అందరికీ ఆహారాన్నిస్తోంది. అన్నప్రదాయని ఆవిడ. అందుకే ఎవరైనా సరే అన్నం తినేటప్పుడు ఆ పెట్టినటువంటి తల్లిని జగన్మాతను ఒక్కసారి తలంచుకొని తింటే అంతవరకు అన్నపదార్థం అప్పుడు అన్న ప్రసాదం అవుతుంది. అందుకే ఎవరు ఏది తిన్నా జగన్మాత వడ్డిస్తున్నది అన్న భావనతో ఆరగించగలగాలి. అలా తిన్న అన్నము చిత్తశుద్ధిని కలిగించి జ్ఞాన వైరాగ్యాలు ఇస్తుంది. అందుకే
అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణ వల్లభే!
జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతీ!!
అనే ప్రసిద్ధ శ్లోకం ఉన్నది. అయితే దీని ప్రసిద్ధి ఎంతో తత్త్వం కూడా అంత గొప్పగా ఉంటుంది. ఆవిడ అన్నపూర్ణ. సమస్తములైన అన్నములు నిండుగా ఉన్నాయిట ఆవిడ దగ్గర. సృష్టిలో అనేకమంది జీవులు ఇప్పుడున్న వాళ్ళు, తరువాత వచ్చేవాళ్ళు, అందరికీ అన్నం పెడుతున్నప్పటికీ ఆమె దగ్గరున్న అన్న భాండాగారం తగ్గదు, తరగదు. అలాంటి అన్నపూర్ణ. పైగా ఎప్పుడూ అది నిండుగా ఉంటుంది కనుక సదాపూర్ణే. పైగా శంకర ప్రాణవల్లభే – శివునియొక్క ప్రాణప్రియ. ఇలా ఎప్పుడైనా అమ్మవారిని తలంచుకున్నప్పుడు అయ్యవారిని కూడా తలంచితే అది ఉత్కృష్టమైన ఫలితములనిస్తుంది. అది ఒక శివశక్త్యాత్మకమైన ఉపాసన ఇస్తుంది. అలాంటి తల్లి ఇచ్చిన అన్నాన్ని మనం తింటున్నాం. ఆ అమ్మ వడ్డించింది అన్న భావన కలిగితే మనస్సు పసితనమంత నిర్మలమౌతుంది. అందుకే తల్లీ! జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం – అమ్మ పెట్టిన ప్రసాదం వల్ల చిత్తం శుద్ధమై జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయి. జ్ఞాన వైరాగ్యం కలిగిందా అది మోక్షహేతువు అవుతుంది. అందుకు జ్ఞాన వైరాగ్యదాయకమైన అన్న ప్రసాదాన్ని ప్రసాదించవలసిందిగా అన్నపూర్ణమ్మను ప్రార్థిద్దాం.

నవరాత్రులలో నాలుగవ రోజు కూష్మాండ రూపం


'సురాసంపూర్ణ కలశం రుధిరాపుత్రమేవచ
దధనా హస్త పద్మాభ్యం కూష్మాండా శుభదాస్తుమ్ '
జ్ఞానరూపిణి,సరస్వతీశక్తిగా స్తుతించబడే కూష్మాండ రూపంతో అలరారే దేవీమాత అభయముద్రలను ధరించి భక్తులను కాపాడుతుంది. నమ్మిన భక్తులకు బహురూపాలుగా కనిపించి రక్షిస్తుంది. ఆయుష్యును, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.
సంసారమనే జగత్తు యొక్క అందాన్ని ఉదరాన ధరించే మాయారూపిణి .. ఈమె .

సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ ।
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ॥
దుర్గామాత నాలుగవ స్వరూప నామము ‘కూష్మాండ’. దరహాసముతో అంటే అవలీలగా బ్రహ్మాండమును సృజించుతుంది కాబట్టి ఈ దేవి ‘కూష్మాండ’ అనే పేరుతో విఖ్యాతి చెందింది.
ఈ జగత్తు సృష్టి జరుగక ముందు అంతటా గాఢాంధకారమే అలముకొని ఉండేది. అప్పుడు ఈ దేవి తన దరహాసమాత్రంతో ఈ బ్రహ్మాండాలను సృజించింది. కాబట్టి ఈ స్వరూపమే ఈ సృష్టికి ఆదిశక్తి. ఈ సృష్టిరచనకు పూర్వము బ్రహ్మాండమునకు అస్తిత్వమే లేదు.
ఈమె సూర్యమండలాంతర్వర్తిని. సూర్యమండలంలో నివసింపగల శక్తిసామర్థ్యములు ఈమెకే గలవు. ఈమె శరీరకాంతిచ్ఛటలు సూర్యకిరణ ప్రభలలాగా దేదీవ్యమానముగా వెలుగొందుతూ ఉంటాయి. ఈమె తేజస్సు నిరుపమానము. దానికి అదే సాటి. ఇతర దేవతాస్వరూపాలేవీ ఈమె తేజః ప్రభావములతో తులతూగలేవు. ఈమె తేజోమండల ప్రభావమే దశదిశలూ వెలుగొందుతూ ఉంటుంది. బ్రహ్మాండములోని అన్ని వస్తువులలో, ప్రాణులలో ఉన్న తేజస్సు కూష్మాండ ఛాయయే.
ఈ స్వరూపము ఎనిమిది భుజాలతో విరాజిల్లుతూ ఉంటుంది. అందువల్లనే ఈమె ‘అష్టభుజాదేవి’ అనే పేరుతో కూడా వాసిగాంచింది. ఈమె ఏడు చేతులలో వరుసగా కండలమూ, ధనుస్సూ, బాణమూ, కమలమూ, అమృతకలశమూ, చక్ర గదలు తేజరిల్లుతూ ఉంటాయి. ఎనిమిదవ చేతిలో సర్వ సిద్ధులనూ, నిధులనూ ప్రసాదించే జపమాల ఉంటుంది. సింహవాహన. సంస్కృతంలో ‘కూష్మాండము’ అంటే గుమ్మడికాయ. కూష్మాండబలి ఈమెకు అత్యంత ప్రీతికరము. ఇందువల్ల కూడా ఈమెను ‘కూష్మాండ’ అని పిలుస్తారు.
నవరాత్రి ఉత్సవాలలో నాల్గవరోజు కూష్మాండాదేవీ స్వరూపమే దుర్గామాత భక్తుల పూజలను అందుకొంటుంది. ఈనాడు సాధకుని మనస్సు అనాహత చక్రంలో స్థిరమవుతుంది. కాబట్టి ఈ రోజు ఉపాసకుడు పవిత్రమైన, నిశ్చలమైన మనస్సుతో కూష్మాండాదేవి స్వరూపాన్నే ధ్యానిస్తూ పూజలు చేయాలి. భక్తులు ఈ స్వరూపాన్ని చక్కగా ఉపాసించడంవల్ల పరితృప్తయై ఈమె వారి రోగాలనూ, శోకాలనూ రూపుమాపుతుంది. ఈమె భక్తులకు ఆయుర్యశోబలములూ, ఆరోగ్యభాగ్యములు వృద్ధి చెందుతాయి. సేవకుల కొద్దిపాటి భక్తికే ఈ దేవి ప్రసన్నురాలవుతుంది. మానవుడు నిర్మల హృదయంతో ఈమెను శరణుజొచ్చిన వెంటనే అతి సులభముగా పరమ పదము ప్రాప్తిస్తుంది.
శాస్త్రాలలో, పురాణాలలో పేర్కొనబడిన రీతిలో విధివిధానమును అనుసరించి మనము దుర్గాదేవిని ఉపాసిస్తూ అనవరతము భక్తి మార్గంలో అగ్రేసరులమై ఉండాలి. ఈ తల్లి భక్తిసేవా మార్గంలో కొద్దిపాటిగానైనా పురోగమించగలిగిన సాధకునికి ఆమె కృపానుభవము అవశ్యము కలిగి తీరుతుంది. దాని ఫలితంగా దుఃఖరూప సంసారమంతా భక్తునికి సుఖదాయకమూ, సుగమమూ అవుతుంది. మనిషి సహజంగా భవసాగరాన్ని తరించడనికి ఈ తల్లియొక్క ఉపాసన అతి సులభమైన, శ్రేయస్కరమైన మార్గం. మనిషి ఆదివ్యాధులనుండీ సర్వదా విముక్తుడవటానికీ, సుఖసమృద్ధిని పొందటానికీ, ఉన్నతిని పొందటానికీ కూష్మాండా దేవిని ఉపాసించటమనేది రాజమార్గం వంటిది. కాబట్టి లౌకిక, పారలౌకిక ఉన్నతిని కాంక్షించేవారు ఈ దేవీస్వరూపంయొక్క ఉపాసనలో సర్వదా తత్పరులై ఉండాలి.




ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371








No comments:

Post a Comment