Sunday, 16 October 2016

పంచసంఖ్యోపచారిణీ

పంచసంఖ్యోపచారిణీ



అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడి పుచ్చినయమ్మ తన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా యమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులయందుండి వారిచేత లోకాలను పాలిస్తున్న శక్తి జగజ్జనని. బ్రహ్మ సృష్టించాలన్నా, విష్ణువు పోషించాలన్నా, శివుడు లయం చేయాలన్నా పూర్తిగా అమ్మవారి శక్తిమీదే ఆధారం. ఆదిపరాశక్తి మూడుగా మారి మూడు అంశలతో త్రిమూర్తులను నడిపిస్తోంది. తద్వారా విశ్వాన్ని ప్రకాశింపజేస్తోంది. బ్రహ్మకి ముఖమునందుండి ఆయన నాలుకమీద నర్తిస్తూ సృష్టిచేసే అద్భుతమైన శక్తిని అమ్మవారే కల్పిస్తోంది. విష్ణువు హృదయంలో స్థిర నివాసం ఏర్పరచుకొని దయాస్వరూపిణియైదయార్ధ్ర హృదయంతో శ్రీమహావిష్ణువుకి లోకాలను పాలించే శక్తిని కలిగిస్తోందీ అమ్మవారే. శివుడి వామ భాగంలో కొలువై లయం చేయిస్తున్న శక్తి స్వరూపమూ ఆదిపరాశక్తే.
లోకాలను అనుగ్రహించే ఆదిపరాశక్తీ అమ్మవారే.. జీవుల్ని మాయామోహంలో ముంచెత్తే మహామాయా స్వరూపమూ అమ్మవారే. మహామాయ తొలగిపోతే పరమార్ధం బోధపడుతుంది. శక్తి స్వరూపం కళ్లకు కనిపిస్తుంది. మాయామోహాన్ని తొలగించి నన్ను నీలో ఐక్యం చేసుకోతల్లీ అని ఆర్తితో కోరినప్పుడే అమ్మలగన్నయమ్మకి మనపై కరుణ కలుగుతుంది. అందుకే అమ్మని మనందరమూ నిరంతరమూ అంచంచలమైన భక్తితో పూజించాలి. ఆర్తితో సేవించుకోవాలి. దానికి విధివిధానాలు ఏంటి అని ప్రశ్న ఉదయించినప్పుడు మహనీయులు చెప్పిన మార్గాన్ని అనుసరించడమే అన్న సమాధానంకూడా వెన్నంటే ఉంటుంది. లలితా సహస్రనామంలో అమ్మలగన్నయమ్మకి పంచ సంఖ్యోపచారిణీ అనే మహాద్భుతమైన నామం ఉంది. అమ్మవారిని సేవించుకోవడానికి కనీసం ఐదు ఉపచారాలు చేయాలి.

 అమ్మవారికి చేయాల్సిన పంచసంఖ్యోపచారాలు, వాటి విశిష్టతను గురించి కూలంకషంగా తెలుసుకుందాం.. ఈ ఉపచారాల్లో మొదటిది ధూపం. చక్కటి నాసికను ప్రసాదించి లోకంలో ఉన్న మంచి వాసనలన్నింటినీ ఆస్వాదించగలిగే ఘ్రాణ శక్తిని అనుగ్రహించిన తల్లీ నీకు నేను అగరువత్తులు వెలిగించి ధూపమనే ఉపచారాన్ని సమర్పించుకుంటున్నాను అన్న భావనతో అమ్మవారికి ధూపం చూపించాలి.


రెండవ ఉపచారం దీపం. మనకి చూడడానికి కళ్లిచ్చి ఉపకారం చేసినందుకు, కంటికి వెలుగునిచ్చినందుకు, రాత్రివేళ నిద్రపోయినప్పుడు తిరిగి తెల్లారి మళ్లీ చూడగలిగే శక్తినిచ్చినందుకు కృతజ్ఞతగా దీపమనే వెలుగును ఉపచారంగా అమ్మకి ఇవ్వాలి.అనంతమైన జ్ఞానాన్ని సంపాదించుకోగలిగిన శక్తిని చూపుద్వారా అమ్మ మనకి ప్రసాదించింది. కృతజ్ఞతగా అమ్మకి దీపాన్ని చూపించాలి.


మూడవ ఉపచారం నైవేద్యం. నాలుకను ప్రసాదించి, లోకోత్తరమైన రుచుల్ని ఆస్వాదించగలిగిన శక్తిని అనుగ్రహించిన మహాశక్తీ నీకు సాత్వికమైన పదార్ధాలను నైవేద్యంగా సమర్పిస్తున్నాను.. అన్న భావన సాధకుడికి కలగాలి. స్పర్శ జ్ఞానాన్ని ప్రసాదించి అనంతమైన ఆనందాన్ని, వాత్సల్యాన్ని అనుభవించగలిగేలా చేసినందుకు కృతజ్ఞతగా కరుణాంతరంగయైన కాత్యాయనికి చల్లటి చందనాన్ని అలదుతున్నాను అన్న భావన సాధకులకు కలగాలి.





లోకంలో విషయాలను విని తెలుసుకోవడానికి అమ్మ మనకు చెవులనిచ్చింది. పడకూడని మాట పడితే అన్నీ అనర్ధాలే.. పడాల్సిన మాట చెవిన పడితే కోటి జన్మల పాపాలు పటాపంచలైపోతాయ్.. శబ్దం స్వరూపంగా అమ్మవారికి భ్రమరీ స్వరూపాలైన పూలను సమర్పించుకోవాలి.


ఈ ఐదు ఉపచారాలనూ సాధకులు భక్తితో విశ్వజననికి సమర్పించుకోగలిగిననాడు ఆ అమ్మ దయతో పశువుని పాశం నుంచి విప్పినట్టు జీవిని అధర్మంనుంచి ధర్మం వైపుకి తిప్పుతుంది. అందుకనే పశుపాశ విమోచనీ అనే నామం ఆ దయాతరగిణికి సార్ధకమయ్యింది. అమ్మా.. జగజ్జననీ.. జగన్మాతా.. ఈ శరీరం నీవు ప్రసాదించిన వరం. ఈ సంసారం, భార్యా పిల్లలూ, సంపదా, ఆనందం.. అన్నీ నీ అనుగ్రహ కటాక్ష ప్రసాదాలే. నీవు ప్రసాదించిన దివ్యదేహాన్ని మంచి పనులకు మాత్రమే ఉపయోగిస్తాను. అందువల్ల నా చేతలన్నీ నీకు పూజలే. నా మాటలన్నీ నిన్ను పూజించే మంత్రాలే అన్న ఉదాత్తమైన భావన అంతర్గతంగా ప్రతిమనిషిలోనూ కలగాలి. అప్పుడు మన ప్రతి కదలికా, ప్రతి పలుకూ అమ్మలగన్నయమ్మకి ఉపచారాలుగా మారతాయి. నా చేతలన్నీ నీకు పూజలే, నా మాటలన్నీ నీకు వినిపించే మంత్రాలే అన్న భావన కలిగిన రోజున లోకకల్యాణ కారిణియైన ఆదిపరాశక్తి కర్మానుభవాన్ని అవలీలగా దాటించేసి, జన్మరాహిత్యాన్ని ప్రసాదించి జీవుల్ని తనలో ఐక్యం చేసుకుని కైవల్యాన్ని ప్రసాదిస్తుంది.
అమ్మలగన్నయమ్మయైన దుర్గమ్మను ఇలా పంచ ఉపచారాలతో సేవించుకుంటే ఇహంలో కవిత్వ, పటుత్వ, మహత్వ సంపదలు, సౌఖ్యాలతోపాటు పరంలో శివసాయుజ్యం వరంగా లభిస్తుంది.

No comments:

Post a Comment