Monday, 3 October 2016

దేవీ నవరాత్రులు మూడవ రోజు గాయత్రి దేవి , చంద్రఘంట







విజయవాడ లో అమ్మవారు మూడవ రోజున గాయత్రి దేవిగా దర్శనము ఇస్తుంది.
సకల వేద స్వరూపం గాయత్రి దేవి ! భారత దేశములో వేద కాలం నుండి ఆసేతు హిమాచల పర్యంతం, ఉపాశ్యా దైవం శ్రీ గాయత్రి పరదేవత. అన్ని మంత్రాలకు మూల శక్తి ఈ తల్లి ! ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖములతో , శంఖం ,చక్రం, గద, అంకుశం ధరించి దర్శన్మిస్తుంది. ఆది శంకరులు గాయత్రి దేవిని అనంత శక్తి స్వరూపిణి గా అర్చించారు.
ప్రాతః కాలంలో గాయత్రిగాను, మధ్యాన్న కాలంలో సావిత్రి గాను ఈమే ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది.
ఈమే వేదాలకు తల్లి కనుక వేదమాత అని, జగదంబికా అని, సర్వజనులకు సృష్టి, స్తిథి , సమ్హార కర్తలైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను గాయత్రి పరదేవతకు అవయవాలుగా వర్ణించారు. శృతి గాయత్రి స్వరూపాన్ని " అగ్నిర్ముఖం, బ్రహ్మ శిరః, విష్ణు హృదయం, రుద్రశికః" అని చిత్రించింది. ముఖం లో అగ్ని, శిరస్సు లో బ్రహ్మ , హృదయంలో విష్ణువు , శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.ఇట్టి మహిమాన్వితమైన , సర్వొత్కృష్టమైన దేవతను బ్రహ్మాది దేవతా శ్రేష్టులు, వేదాధిష్ఠాన దేవతలైన పురుషులను, ఈ అమ్మను త్రికాల సంధ్యలలో భక్తి తో ఉపాసిస్తు ఉంటారు అని చెప్తోంది దేవి భాగవతం.
గాయత్రి...అంటే ....ప్రాణ శక్తిని రక్షించేది...
లలిత సహస్రనామ స్తోత్రం లో.."గాయత్రి వ్యాహౄతి సంధ్యా నిజబృంద నిషేవితా..."
గాయత్రి అనగానే అందరు గాయత్రి మంత్రము అని అనుకుంటారు కాని అది శాస్త్రము పైన ఎక్కువ అవగాహన లేని వారి మాట...
అస్సలు గాయత్రి అంటే...సంధ్యా సమయములో ఆరధించే శక్తి పేరు గాయత్రి.....శాస్త్రం ప్రకారం సంధ్యా సమయములో మనము ఆరాధించే శక్తి పేరు గాయత్రి..ఇది ఇక్కడ ప్రధానము...శాస్త్రము ప్రతిపాదించిన జగదంబ శక్తిని త్రిసంధ్యలలో ఉపాసన చేస్తే అదే గాయత్రి !
అస్సలు మనము సంధ్యా సమయములో ఏ మంత్రము పఠిస్తే అదే గాయత్రి అవుతుంది...మంత్రోపదేశం జరిగిన వారు సంధ్యవేళలో ఆ మంత్రాన్ని జపిస్తే అదే గాయత్రి...మంత్రోపదేశం జరగని వారు....ఎదైన స్తోత్రము లలితా సహస్రనామం అలాంటివి చదివినా గాయత్రి అవుతుంది..అలాగ త్రిసంధ్యలలో చెయ్యాలి...అలాగే ఉపనయనం అయిన వారు తప్పనసరిగా గాయత్రి జపం త్రిసంధ్యలలో చేసి తీరాలి...

ఈ గాయత్రి మంత్రము మూడుపాదాలకు కలదై , ఇరవై నాలుగు అక్షరాలతో, ఇరవై నాలుగు తత్వాలకు సంకేతముగా భాసిస్తు జపధ్యానాదులతో తనని స్మరించే వారిని రక్షిస్తోంది.
గాయత్రి మంత్రంలోని మొదటి పాదం ఋగ్వేదం నుండి, రెండో పాదం యజుఋవేదం నుండి, మూడవ పాదం సామవేదం నుండి గ్రహించబడి ' ఓం ' కారంలోని అకార, ఉకార, మకారములకు ప్రతిరూపముగా భాసిస్తున్నాయి.
గాయత్రి అంటే ఙ్ఞానస్వరూపిణి....ఆవిడ వేద మాత.......విద్ అనే ధాతువు నుండి వేదము అనే శబ్దము వచ్చింది...అంటే ఙ్ఞానరూపిణి అయిన అమ్మవారిని ఆరధన చేస్తాము..గాయత్రి ఉపాసన లో ...మన శ్వాస తో ఆ మంత్రాన్ని ఉపాసించడం...అంటే మనలోని ప్రాణ శక్తిని ఉపాసన చెయ్యడము...సూర్యుడి మండలం లో శక్తిని ధ్యానిస్తు సాధన చెయ్యాలి..అదే గాయత్రి అవుతుంది..మౌనముగా జపించుకోవాలి ఇలాంటి మంత్రాలు...సబ్ద మంత్రాన్ని మౌనముగా జపిస్తేనె దాని ఫలితము...
ఈమెను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది . సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి.
బ్రహ్మ ఙ్ఞానము కలుగుతుంది. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజొవంతం అవుతుంది.
గాయత్రీ మంత్ర జపం చతుర్వేద పారయణ ఫలితాన్ని ఇస్తుంది.
 

దేవీ నవరాత్రులుమూడవ రోజు - 3. చంద్రఘంట

పిండజప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా ।
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ॥
దుర్గామాతయొక్క మూడవ శక్తి నామము ‘చంద్రఘంట’. నవరాత్రి ఉత్సవాలలో మూడవరోజున ఈమె విగ్రహానికే పూజాపురస్కారాలు జరుగుతాయి. ఈ స్వరూపము మిక్కిలి శాంతిప్రదము, కల్యాణ కారకము. ఈమె తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘాంటాకృతిలో ఉండటంవల్ల ఈమెకు ‘చంద్రఘంట’ అనే పేరు స్థిరపడింది. ఈమె శరీరకాంతి బంగారువన్నెలో మిలమిలలాడుతుటుంది. తన పది చేతులలో – ఖడ్గము మొదలయిన శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించి ఉంటుంది. సర్వదా సమరసన్నాహయై యుద్ధముద్రలో ఉండే దివ్య మంగళ స్వరూపం. ఈమె గంటనుండి వెలువడే భయంకర ధ్వనులను విన్నంతనే క్రూరులైన దుష్టులు గడగడలాడిపోతారు.
నవరాత్రి దుర్గాపూజలలో మూడవ రోజు సేవ మిక్కిలి మహిమోపేతమైనది. ఆ రోజు సాధకుని మనస్సు మణిపూరక చక్రాన్ని ప్రవేశిస్తుంది. చంద్రఘంటాదేవి కృపవలన ఉపాసకునికి దివ్య వస్తు సందర్శనం కలుగుతుందని చెబుతారు. దివ్య సుగంధ అనుభవము కూడా సిద్ధిస్తుంది. అలాగే వివిధాలైన దివ్యధ్వనులు కూడా వినిపిస్తాయి. ఈ దివ్యానుభవ అనుభూతికొరకు, సాధకుడు సావధానుడై ఉండాలి.
ఈ మాత కృపవలన సాధకుని సమస్త పాపాలూ, బాధలూ తొలగిపోతాయి. ఈమె ఆరాధన సద్యః ఫలదాయకము. ఈమె నిరంతరమూ యుద్దసన్నద్ధురాలై ఉన్నట్లు దర్శనమిస్తుంది కనుక భక్తుల కష్టాలను అతి శీఘ్రముగా నివారిస్తుంది. ఈ సింహవాహనను ఉపాసించేవారు సింహసదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉంటారు. ఈమె ఘాంటానాదము సంతతము భక్తులను భూతప్రేతాది బాధలనుండి కాపాడుతూ ఉంటుంది. ఈమెను సేవించినంతనే శరణాగతుల రక్షణకై అభయఘంట ధ్వనిస్తూ ఉంటుంది.
ఈ దేవీ స్వరూపము దుష్టులను అణచివేయటంలో, హతమార్చుటంలో అను క్షణమూ సన్నద్ధురాలై ఉండునదే; అయినప్పటికీ భక్తులకూ, ఉపాసకులకూ ఈమె స్వరూపము మిక్కిలి సౌమ్యముగానూ, ప్రశాంతముగానూ కనబడుతూ ఉంటుంది. ఈమెను ఆరాధించడంవల్ల సాధకులలో వీరత్వ నిర్భయత్వములతోపాటు సౌమ్యతా, వినమ్రతలు పెంపొందుతుంటాయి. వారి నేత్రాలలోని కాంతులు, ముఖవర్చస్సు, శరీర శోభలు ఇనుమడిస్తూ, సద్గుణములు వృద్ధిచెందుతుంటాయి. వారి కంఠస్వరములలో అలౌకికమైన దివ్యమాధుర్యము రాశిగా ఏర్పడుతుంది. చంద్రఘంటాదేవిని భజించేవారు, ఉపాసించేవారు ఎక్కడికి వెళ్ళినా వారిని దర్శించిన వారందరూ సుఖశాంతులను పొందుతారు.
ఇలాంటి ఉత్తమ సాధకుల శరీరాలనుండి దివ్యమూ, ప్రకాశవంతమూ అయిన తేజస్సు బహిర్గతము అవుతూ ఉంటుంది. ఈ దివ్య ప్రక్రియ సామాన్యులదృష్టికి గోచరించదు. కానీ ఉత్తమ సాధకులూ, వారి అనుయాయులు మాత్రము వీటిని గ్రహించి, అనుభూతిని పొందగలరు.మనము త్రికరణశుద్ధిగా విధ్యుక్తకర్మలను ఆచరిస్తూ, పవిత్రమైన అంతఃకరణ కలిగి చంద్రఘాంటాదేవిని శరణుజొచ్చి, ఆమెను ఉపాసించడానికీ, ఆరాధించడానికీ తత్పరులమై ఉండాలి. అలాంటి ఉపాసన ప్రభావము వల్ల, మనము సమస్త సాంసారిక కష్టములనుండి విముక్తులమై, సహజంగానే పరమపద ప్రాప్తికి అర్హులమవుతాము. నిరంతరమూ ఈ దేవి పవిత్రమూర్తిని ధ్యానిస్తూ మనము సాధనలో అగ్రగణ్యులమవ్వటానికి ప్రయత్నిస్తూ ఉండాలి. దేవి ధ్యానము మనకు ఇహపర లోకాలలో పరమ కల్యాణదాయకమై సద్గతులను ప్రాప్తింపజేస్తుంది.


సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


No comments:

Post a Comment