Thursday 6 October 2016

నవరాత్రులలో అమ్మవారి స్వరూపం శ్రీమహాలక్ష్మి



సిరులిచ్చే తల్లి.. శ్రీమహాలక్ష్మి



లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రెలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం
‘శ్రీ’కి పర్యాయ పదమే లక్ష్మి అనేమాట. ‘‘లక్షయ తీతి లక్ష్మీః’’ అని లక్ష్మీ శబ్దానికి వ్యుత్పత్త్యర్థం. లక్షింపజేసేదేదో అదే- లక్ష్మి. విభుని చూపేది లక్ష్మి. తద్వారా మన బుద్ధిని ప్రచోదనం చేసి జీవిత లక్ష్యాన్ని సిద్ధింపచేసేది లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి ఎవరో కాదు.. క్షీరసాగరం లాంటి ఈ సంసారంలో నుంచి ఆవిర్భవించినదే. శ్రీరంగధామమంటే- బ్రహ్మ విద్యకు యోగ్యమైన మానవుడి మనస్సు. అదే ఉన్నతమైన ఆ వృత్తికి నిలయం. అలాంటి బ్రహ్మకార వృత్తి మనసులో ఉదయిస్తే దేవతలందరూ అనుకూలిస్తారు. దేవతలెవారు.. ఈ సందర్భంలో..? చక్షురాదీంద్రియ వృత్తులు. అవన్నీ ఆ అఖండ వృత్తి చెప్పు చేతల్లో నడుచుకుంటాయి. లోకాలకన్నింటికీ కలిపి అది- దీపకాంతి, అఖండ చైతన్యం. చైతన్యమనే దీప్తి లేకుంటే జగత్తంతా అంధకార బంధురమే. అది మహాజ్ఞానం. మహాశక్తి. మిగతా అల్పజ్ఞానమూ, అల్పశక్తులూ అన్నీ అందులో చేరిపోతాయి. అలాంటి త్రైలోక్య కుటుంబిని ఆ మహాశక్తి. ఆ శక్తే- మహాలక్ష్మి.
అందరూ ఆ తల్లి సతానమే, ఆవిడ పరివారమే. కుటుంబిని ఆ పరదేవత. ఈ లోకాలావిడ సరసిజాలు. అలాంటి బ్రహ్మవిద్యారూపిణి అయిన మహాలక్ష్మీ దేవిని అనగా బ్రహ్మ విద్యారూపిణిని సంపూర్ణ శరణాగతిని పొందితే, అదే ముకుంద మోక్షాన్ని ప్రసాదిస్తుంది. మోక్షలక్ష్మీ కరుణాకటాక్షములచే అనుగ్రహింపబడితే కోరికలు తీర్చే వరలక్ష్మి, సిద్ధింపచేసే సిద్ధిలక్ష్మి, జయాన్ని చేకూర్చే జయలక్ష్మి, విద్యలన్నీ సాధింపచేసే విద్యాలక్ష్మి, ధనధాన్యాదిభోగాలను ప్రసాదించే శ్రీలక్ష్మీ అనుగ్రహం కూడా లభిస్తాయి. అందుకే వివేకవంతుడైన మానవుడు- మోక్షలక్ష్మినే ఆశ్రయిస్తాడు.
కరాగ్రే వర్తతే లక్ష్మీః కరమధ్యే సరస్వతి కరమూలేతు శర్వాణీ, ప్రభాతే కరదర్శనం- మన చేతివేళ్ళు ఐదు. ఈ అయిదు వేళ్ళలో పంచబ్రహ్మలు, పంచభూతములు, పంచతన్మాత్రలు, పంచేంద్రియాలు, నవగ్రహములు ప్రతినిహితమై ఉంటాయని పెద్దలు చెప్తారు. అరచేతిలో సరస్వతి, వేళ్ళలో మహాలక్ష్మి, ముంజేతిలో పార్వతి నివసిస్తారు. కనుక ఉదయానే్న నిద్రలేవగానే మన చేతులు చూసుకొని, జగన్మాతను తలుచుకొని రెండు చేతులూ కలిపి నమస్కరిస్తే- ఆ రోజంతా శుభంగా జరుగుతుందని త్రిమాతలే తమను కొలిచినారికి, తమ బిడ్డలకు రక్షణ ఇస్తారని పెద్దలు చెపుతారు.
మహాలక్ష్మీదేవి చిదానందమే ఆమె భక్తులకు ప్రేమామృతంగా భాసిల్లుతుంది. లక్ష్మీదేవి ప్రేమ స్వరూపిణి, చంద్ర సహోదరి. ఆమె కరుణా కటాక్షంతో అదృష్టం అర్ణవంలాగా పొంగిపోతుంది. సార హీనమైన ప్రపంచాన్ని అర్థవంతం చేసి, అర్థాన్ని ధర్మంతో అనుసంధానం చేస్తే మోక్షాన్ని ప్రసాదించే ముక్తిప్రదాయిని- మహాలక్ష్మి.
సూర్య తేజముగల లక్ష్మీదేవి తపస్సు ఫలితంగా- పుష్పించకుండానే ఫలించు మారేడు వృక్షం పుట్టింది. అంతరింద్రియ, బాహ్యేంద్రియముల భాగ్యాన్ని నశింపజేయు బిల్వ వృక్ష ఫలములు మహాలక్ష్మి దేవి అనుగ్రహమే. మన ఇంటి ఆవరణలో మారేడు చెట్టు ఉంటే అత్యంత శుభప్రదము. మొక్కలు నాటే పథకంలో మారేడు చెట్లను పెంచితే అన్ని దేశాలు సుభిక్షంగా, సుసంపన్నంగా ఉంటాయి. ఇది మహాలక్ష్మీ కటాక్షం.
చంద్రాం హిరణ్మరుూం లక్ష్మీం జాత వేదో మమావహ
సుర్యాం హిరణ్మరుూం లక్ష్మీం జాతవేదో మమావహ
జాత వేదః మమ ఆవహ! ఓ జాత వేదా నాకు ఇవ్వమని అడుగుతున్నాడు- మానవుడు. వేదమంటే జ్ఞానం. జాతమంటే- అది తనకు సహజంగానే ఉన్నవాడు. ఎవరు? అగ్నిదేవుడు. ఇంకా గంభీరంగా చింతిస్తే, ఆ ఉపాధిలో కనిపించే నిరాకార, నిరంజన తత్త్వం- పరమాత్మ. అగ్ని భౌతికంగా కనిపించేదయితే, అధిదేవత అగ్ని, దానికధిపతి-పరమాత్మ. ఆ పరమాత్మ శక్తే శ్రీ మహాలక్ష్మి. శ్రీసూక్తంలో చెప్పబడిన పైవిషయం, శ్రీమహాలక్ష్మి పూజకు స్ఫూర్తినిస్తుంది. అందుకే, చంద్రమహర్దశ నడుస్తున్నవాళ్ళు, మానసిక ఆందోళనకు గురవుతున్నవారు- లక్ష్మీ అష్టోతర్తంతో కుంకుమ పూజ చేసి ఆ కుంకుమను నొసటన పెట్టుకుంటే మనసు ప్రశాంతత చెందుతుంది.
శ్రీ మహాలక్ష్మి ‘ప్రకృతి’ తత్త్వం. అందుకే మహిళలందరూ రోజూ చెప్పుకునే లక్ష్మీ అష్టోత్తరంలో మొదటి నామము ‘ప్రకృత్యై నమః’. ‘ప్రకృతి’ అన్నమాటను పదిహేను తత్త్వములు గల శ్రీమాతగా భావించి, ఆధ్యాత్మిక సాధనతో ఆమెను ఉపాసించి, సిద్ధుడైన కారణజన్ములు- శ్రీ విద్యారణ్యస్వామి. విజయనగర సామ్రాజ్య ప్రజలు కాలవశాత్తూ మిక్కిలి దారిద్య్రాన్ని అనుభవించటాన్ని చూసి జాలి చెంది లక్ష్మీదేవిని ప్రార్థించి ఆయన ఉపాసన చేశారు. తల్లి కటాక్షంతో సువర్ణవృష్టి కురిసింది. శ్రీ లక్ష్మీ కటాక్ష సిద్ధిని, ప్రజాక్షేమానికి శ్రేయస్సుకూ ఉపకరించిన సద్గురువులు శ్రీ విద్యరణ్యస్వామి జీవితంలో ప్రధాన విషయం ఇది. ఆయన సంకల్పం- సర్వజన భాగ్యం. అది నిస్వార్థం. దానికి తన ఆశీస్సులు, సహకారం ఎల్లప్పుడూ ఉంటాయని నిరూపించింది లక్ష్మీదేవి. ఇది చరిత్ర చెప్పిన సత్యం.
శ్రీ మహాలక్ష్మి తన స్వామిని ఆశ్రయించి ఉంటుంది. అందుకనే ‘నిత్యానపాయిని’ అని చెప్పింది; విష్ణుపురాణం. ఆ విధంగానే పురుష సూక్తంలో ‘హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నా’ అని చెప్పబడింది. కనుకనే ‘మా జానకి చేబట్టగా మహారాజువైతివి’ అని త్యాగయ్య, ‘‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి’ అని రామదాసు- శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణియైన సీతమ్మను ప్రార్థించారు. కలియుగ దైవం- శ్రీవేంకటేశ్వరస్వామి స్వామి వక్షస్థలంలో నివాసముంది- శ్రీమహాలక్ష్మి. కనుకనే, ‘ఈశానాం జగతోస్య వేంకట పతేర్విష్ణోః పరాంప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసి రసికా... భగవతీం వందే జగన్మాతరమ్’ అని ‘శ్రీవేంకటేశ ప్రపత్తి’లో శ్రీలక్ష్మీదేవిని ప్రస్తావించి, శ్రీ వేంకటేశ్వర సుప్రభాత సేవలో ప్రార్థించారు. మహాలక్ష్మీకి, వేంకటేశ్వర స్వామికి భేదం లేదు. ఒకే శక్తికి రెండు రూపాలు. అందుకే ఆయన్ని ‘బాలాజీ’ అంటారు. శుక్రవారం అభిషేకిస్తారు. శరన్నవరాత్రి మహోత్సవములు జరిపే సమయంలోనే వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అనాదిగా జరగటంలోగల సామరస్యం ఇదే.
మహాభారతంలో శాంతి పర్వమునందు ధర్మరాజుకు భీష్మపితామహుడు చెప్పిన విషయములలో స్వధర్మాన్ని వదలకుండా అనుసరించేవారి యందు, చలించని ధైర్యం కలవారి యందు, తన తత్త్వాన్ని తెలిసికోగల్గిన జ్ఞానుల హృదయ పద్మములందు మహాలక్ష్మి ఉంటుందని చెప్పబడింది. సత్యము ధర్మము, శీలము లేనివారి వద్ద లక్ష్మీదేవి ఉండదని చెప్పబడింది. ఇది ద్వాపర యుగంలోని మహాభారతం మనకందించిన శ్రీ మహాలక్ష్మి తత్త్వం.
నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్య యుక్తా- అనే స్తోత్రాన్ని గుర్తుచేస్తూ శ్రీ భార్గవీం భద్రం యే దిశతు అనే కీర్తన వరలక్ష్మీ వ్రత కధలోని చారుమతీ వృత్తాంతాన్ని తెలియజేస్తూ శ్రావణ శుక్రవార విశిష్టతను వివరిస్తూ, సంపద, శుభములను ఒసగే రాగమైన శ్రీరాగంలో ‘శ్రీ వరలక్ష్మీ నమస్త్భ్యుం, వసుప్రదే శ్రీ సారస పదే, రసపదే, సపదే, పదే పదే’ అన్న ముత్తుస్వామి దీక్షితులవారి కీర్తనలు మహాలక్ష్మి పూజకు అత్యంత స్ఫూర్తినిస్తాయి. శ్రీనివాసుని పాదకమలములను, తన పద కవితలతో అర్చించిన అన్నమయ్య శ్రీ మహాలక్ష్మిని ఆర్ద్రతతో ‘కమలజు కన్నతల్లి కాముని గన్నతల్లి అమరుల గన్నతల్లి ఆదిమలక్ష్మి విమల పునీపతికి విన్నపము సేసి మమ్ము నెమకి యేలితి దయనీకే తగునమ్మా’ అని స్తోత్రించాడు. అర్థాన్ని (్ధనాన్ని) ధర్మవర్తనతో పొంది, మరలా ఆ అర్థాన్ని అర్థవంతం చేయటానికి ధర్మంతో కలిపి లోకకల్యాణార్థం, ధర్మ కార్యాచరణ చేసే నిస్వార్థపరులైన ‘్ధర్మికులే’ అసలైన ధనవంతులని, ఆ ధార్మిక శక్తిని పొందటానికి కృషి చేయాలని హెచ్చరిస్తోంది- శరణన్నవరాత్రి పూజా మహోత్సవములలో శ్రీ మ హాలక్ష్మి ఆరాధన.


జగదంబయే మహాలక్ష్మిగా లోకాన్ని అనుగ్రహిస్తున్నది. ఈ లక్ష్మీ దేవికి సంబంధించిన వృత్తాంతములు శాస్త్రములందు బహువిధములుగా చెప్పబడుతున్నాయి. ముఖ్యంగా లక్ష్మీదేవి అనగానే సంపదల తల్లి అనే భావం అందరికీ కలుగుతూ ఉంటుంది. అయితే సంపద అంటే ఏమిటి? అనేది చూడాలి. శుద్ధమైన, సౌమ్యమైన, కారుణ్యమయమైన స్వరూపమే లక్ష్మీదేవియొక్క తత్త్వము. అందుకు ఈ తల్లియొక్క స్వరూపము
శుద్ధ సత్త్వ స్వరూపాయా సా పద్మా పరమాత్మనః! అన్నారు. పరమాత్మయొక్క శుద్ధ సత్త్వ స్వరూపము యొక్క శక్తియే లక్ష్మి. శుద్ధ సత్త్వము అంటే రజోగుణం, తమో గుణం ఇసుమంత కూడా లేకుండా ఉండేటటువంటి శుద్ధమైన జ్ఞానానంద స్వరూపము. సత్త్వగుణ లక్షణము జ్ఞానము, ఆనందము. ఈ జ్ఞానందములు రజోగుణతమోగుణ దోషములు లేకుండా ఉంటే తను శుద్ధ స్వరూపము అని అన్నారు. అది ప్రధానంగా లక్ష్మీదేవిలో గమనించవలసిన అంశం. అందుకని ఎవరైతే సత్త్వగుణాన్ని పెంపొందించుకుంటారో వారు లక్ష్మీదేవియొక్క కటాక్షాన్ని మరింతగా పొందగలరు. లేదా లక్ష్మీ దేవిని ఆరాధిస్తూంటే వారిలో శుద్ధ సత్త్వగుణం పెరుగుతూ ఐశ్వర్యాదులు లభిస్తాయి.
సర్వ సంపత్స్వరూపా సా తదధిష్ఠాత్రు దేవతా!! అంటుంది దేవీ భాగవతం. సర్వ సంపత్తులయొక్క స్వరూపిణీ ఆ తల్లి. పైగా సంపదలకు అధిష్ఠాన దేవత.
కాంతాతి దాంతా శాంతా చ సుశీలా సర్వమంగళా!
లోభమోహ కామ రోష మదహంకార వర్జితా!!
కాంతా అతి దాంతా – కాంత అంటే కమనీయమైనటువంటి తేజస్స్వరూపము, దాంత అంటే నిగ్రహ స్వరూపిణి అని అర్థం. తేజస్సు, నిగ్రహము. ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము – ఈ రెండూ కూడా ఉత్తమ శక్తులు. ఉత్తమ శక్తులయొక్క స్వరూపిణియే ఆ తల్లి. సుశీల – చక్కని స్వభావమును కలిగి ఉన్నటువంటి తల్లి, సర్వ మంగళా – అన్నీ కూడా శుభమయమైనటువంటి లక్షణములే ఆ తల్లిలో ఉన్నాయి. లోభమోహ కామ రోష మదహంకార వర్జితా – లోభము, మోహము, కామము, రోశము, మదము, అహంకారము – ఇవి లేవుట ఆ తల్లి వద్ద. ఇవన్నీ కూడా చెప్పడం ఏమిటంటే లక్ష్మీ దేవి అంటే సృష్టిలో ఉన్న మేలిమి గుణాల రాశి ఆవిడ. అందుకు ఆ మంచి గుణాలయొక్క సాకార స్వరూపమైన లక్ష్మీ దేవిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి ఈ గుణాలు వర్ధిల్లుతూంటాయి. పైగా లక్ష్మీ ఆరాధన చేయాలి అంటే ఈ గుణాలు పెంపొందించుకోవాలి అని తెలియాలి. నారాయణుడు లక్ష్మీ ప్రియుడు. లక్ష్మీ దేవికి నారాయణుడే సర్వస్వము. దీని భావన అంటే ఇలాంటి సుగుణాలన్నీ ఎవరికి ఉంటాయో వారిపట్ల నారాయణుని ప్రీతి కలుగుతుంది అని భావం. అదేవిధంగా ఈ సుగుణాలు ఎవరికి ఉంటాయో వారు నారాయణుడే సర్వస్వం అని ఆరాధన చేసి ఆయన సామీప్యాన్ని పొందగలరు. అది తాత్త్వికంగా మనం తెలుసుకోవలసిన సంకేతం.






No comments:

Post a Comment