Sunday 9 October 2016

దేవి నవరాత్రులలో తొమ్మిదవ రూపం మహిషాసురమర్ధిని దేవి





శ్రీ మహిషాసురమర్దినీదేవి :

“ మహిషమస్తక నృత్త వినోదిని స్ఫుటరణన్మణి నూపుర మేఖలా జననరక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిఘాదిని’’

దేవీ నవావతారాలలో అత్యుగ్రరూపం మహిషాసురమర్దినీ దేవి. ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున అమ్మ మహిషాసురమర్దినిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసింది. ధర్మ విజయానికి సంకేతంగా ఆశ్వయుజ శుద్ధనవమినే ‘ మహర్నవమి’ గా భక్తులు ఉత్సవం జరుపుకుంటారు. సింహ వాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన అమ్మ సకల దేవతల అంశాలతో మహాశక్తి రూపంతో ఈ రోజు దర్శనమిస్తుంది. మహిషాసురుడనే రాక్షసుడ్ని సంహరించిన అమ్మను మహిషాసురమర్దినీదేవిగా పూజిస్తే శత్రుభయం తొలగిపోయి సకల విజయాలు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. చిత్రాన్నం (పులిహోర), గారెలు, వడ పప్పు, పానకం నివేదన చెయ్యాలి.

దుర్గమ్మయొక్క బహురూపాలలో ఒకటి మహిషాసుర మర్దిని. పైగా ఏ రూపం చూపించినా అందులో సర్వ సంపూర్ణత ఉంటుంది. ఆవిడ శుంభనిశుంభులను సంహరించడానికి వచ్చిన రూపమూ దుర్గారూపమే. చండ ముండులను సంహరించినదీ దుర్గారూపమే. మధుకైటభులను సంహరించినదీ దుర్గారూపమే. అలాగే అరుణాసురుడు ఇత్యాదులందరినీ కూడా అమ్మవారు సంహరించినపుడు దుర్గారూపంతోనే గోచరించింది. అలాంటి దుర్గారూపాలు ఎన్ని ఉన్నప్పటికీ మహిషాసుర మర్దినీ ప్రత్యేకించి చెప్తున్నటువంటి ఈ స్వరూపం పద్దెనిమిది చేతులతో ప్రకాశిస్తున్నటువంటిది. అందుకే అమ్మవారి రూపాలలో దీనికొక ప్రత్యేకత చెప్పారు.

మధుకైటభ సంహారం తల్లిని మహాకాళి అంటే శుంభనిశుంభులని సంహారం చేసిన తల్లిని మహా సరస్వతి అని అంటే, మహాసుర్ద మర్దనం చేసిన తల్లిని మాత్రం మహాలక్ష్మి అని చెప్పారు. ఇక్కడ లక్ష్మీదేవి అని అంటే విష్ణుపత్నియైన లక్ష్మి అని అర్థం తీసుకోవడానికి లేదు. అలాగే అక్కడ కాళి అంటే మహాకాలుని పత్ని అని అర్థం తీసుకోవడానికి లేదు. మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి మూడుగా వచ్చింది ఒకే తల్లి. ఆ తల్లి ఎవరంటే దుర్గమ్మ. ఆవిడే గౌరీదేవి. ఇక్కడ మహాలక్ష్మీ శబ్దం దుర్గకు వాడుతూ చెప్పబడుతున్నది.
ఈ మహాలక్ష్మీ స్వరూపం ఎలా ఉంటుందో శాస్త్రం చెప్తున్నది.

అక్షస్రక్పరశుం గదేషు కలిశం పద్మం ధనుః కుండికాం!
దండం శక్తి మసిం చ చర్మ జలజం ఘంటాం సురాభాజనమ్
శూలం పాశ సుదర్శనేచ దధతీం హస్తైః ప్రవాళ ప్రభాం
సేవే సైరిభ మర్దినీ మిహ మహాలక్ష్మీం సరోజ స్థితాం!!

అని ధ్యానశ్లోకాన్ని చెప్తూన్నారు. మొత్తం పద్దెనిమిది చేతులలో ఆవిడ పట్టుకొనే ఆయుధాలు కూడా అక్షమాల, గండ్రగొడ్డలి, గద, బాణము, వజ్రాయుధము, పద్మము, ధనుస్సు, కలశము, దండము, శక్తి, ఖడ్గము, డాలు, శంఖము, ఘంట, మద్యపాత్ర – ఇది ఒక దివ్యమైన సురాపానము. మనం అనుకునే మద్యం కాదది. అదొక దివ్యమైన అమృత పానమది. శూలము, పాశము, సుదర్శన చక్రము, ధరించుతూ పగడపు కాంతులతో ప్రకాశించుచున్నటువంటి తల్లిగా ఈ మహిషాసురమర్దినిని ధ్యానించాలి.చండీ సప్తశతీ హోమము చేయవలెను.

No comments:

Post a Comment