Monday 3 October 2016

లోకపావని శాకంబరీ



పరమశాంతి స్వరూపిణిగా చిరు మందహాసంతో, ప్రశాంతతను కలిగించే ఆ దుర్గమ్మను ఒక్కసారి దర్శించి మనం మనసారా ధ్యానిస్తే చాలు, ఎన్నో జన్మల పాపాల నుండి మనకి విముక్తి లభిస్తుంది.
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి, వేద వేదాంత వనవాసినీ అయిన శ్రీ కనకదుర్గా అవతారమునకు పూర్వం జగన్మాత శాకాంబరీ దేవిగా అవతరించిందని దేవి భాగవతం, మార్కండేయ పురాణం, దుర్గా సప్తశతి పురాణాలలో విశేషంగా చెప్పబడింది.
శాకాంబరీ అంటే వివిధ శాకములనే ( అనగా రకరకాల కూరగాయలు మరియు ఆకు కూరలు) వస్త్రాభరణాలుగా ధరించిన తల్లి అని అర్ధం.
పూర్వం భూలోకంలో వర్షాలు లేక పంటలు పండక అనావృష్టి సంభవించింది. తాగడానికి చుక్క నీరు దొరకక ప్రజలు అల్లాడురున్న సమయంలో వారి బాధలను చూడలేని మునీశ్వరులు జగన్మాతను అనేక విధాలుగా స్తుతించగా, వారి కోరిక మేరకు జగదీశ్వరీ " ఓ మునులారా..నేను అయోనిజనై అవతరించి, నూరు కన్నులతో చల్లని చూపులు ప్రసరిస్తూ..ముల్లోకాలను కాపాడుతాను. అప్పుడు ఈ చరాచర సృష్టిలోని జనులు నన్ను " శతాక్షి దేవిగా" కొల్చుకుంటారు.
ఆ విధంగా నేను " శతాక్షి దేవిగా" కీర్తించబడుతాను. ఆ తరువాత నాదేహం నుండి శాకములను పుట్టించి, ప్రజల ఆకలిని తీరిస్తూ, మరలా వర్షాలు కురిపిస్తూ జగతిని సస్యశ్యామలంగా, సుభీక్షముగా మార్చి కాపాడుతాను" అని జగదంబ అభయమిచ్చింది.
దేవి యొక్క దేహాన్ని శాకములుగా మార్చింది. కనుక ఆ తల్లి "శాకంబరీ" నామంతో కీర్తి పొందింది.
లోక కల్యాణార్ధం ఆదిశక్తిగా, అన్నాన్ని ప్రసాదించే అన్నపూర్ణగా, శాకములను ( కాయగూరలను) ప్రసాదించే జగమునేలే ఆ జగన్మాతకే చెల్లింది.
శాకంబరీగా అవతరించిన తరువాత విశ్వకల్యాణార్ధం దుర్గముడు అనే రాక్షసుణ్ణి వధించడం వలన నేను " దుర్గా దేవిగా" మహిషాసురుణ్ణి సమ్హరించాక ఆ దుర్గా దేవి కీలుడి కిచ్చిన మాట ప్రకారం మహిషాసుర మర్ధినీ స్వరూపంతో ఇంద్ర కీలద్రి పై ఆవిర్భవించింది.
నీలమేఘ శ్యామంతో సుమనోహరంగా సర్వాంగ సుందరంగా అభయ, వరద హస్తంతో చిరుమందహాసంతో శోభిల్లుతూ పద్మంలో ఆశీనురాలై వివిధ ఫలపుష్పాదులతో పాటు, కూరగాయల సమూదాయాన్ని ధరించి అఖిల లోకాశ్చర్యమైన సౌందర్యంతో కోరిన వారికి కొంగు బంగారంగా, జీవుడికి ఆకలి, దప్పిక తీర్చే సకల సంపదలకూ మూలమైన శక్తులు ఆ చల్లని తల్లి కనుసైగల్లోనే సంచరిస్తాయని పురాణాలు ఘోషిస్తున్నాయి.
అందుకే శాకంబరీ దేవికి

అంత విశిష్టత ఏర్పడింది.

No comments:

Post a Comment